close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేటగాళ్లను వేటాడేస్తుంది!

తప్పుచేసి కళ్లుగప్పి తప్పించుకునే నేరస్థుల్ని జాగిలం సాయంతో పోలీసులు పట్టుకోవడాన్ని చూశాం. ఇప్పుడు అటవీశాఖ సైతం  జాగిలం సాయంతో వేటగాళ్ల ఆటకట్టిస్తోంది. తెలంగాణలోని కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో ఇటీవల విధుల్లో చేరిన ఓ జాగిలం... కలప స్మగ్లర్లకే కాదు, వేటగాళ్లూ వన్యప్రాణి హంతకుల పాలిట సింహస్వప్నంగా మారింది.

పెద్దపులి నివాసం ఉండాలంటే దట్టమైన అడవి ఉండాలి. అంటే చెట్లు బాగా ఉండాలి. అంతే కాకుండా పులికి కావలసిన ఆహారం సైతం అడవిలో లభించాలి. పెద్దపులి వన్యప్రాణుల్ని వేటాడి తింటుంది కదా మరి. కానీ ఆ చెట్లను స్మగ్లర్లు నరికేస్తున్నారు. ఆ వన్యప్రాణుల్ని మనుషులే వేటాడుతున్నారు. కలప స్మగ్లర్లకీ, వన్యప్రాణుల వేటగాళ్లకీ అడ్డుకట్ట వేయగలిగితేనే పెద్దపులి బతుకుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా- ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ సంస్థకు అనుబంధంగా పనిచేసే ‘ట్రాఫిక్‌ ఇండియా’ దేశవ్యాప్తంగా ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల్లోని పెద్దపులులూ, చిరుతలూ, తదితర వన్యప్రాణుల్ని కాపాడటం కోసం అటవీశాఖకు జాగిలాలను అప్పగిస్తోంది. చిన్నకూనలుగా ఉన్నప్పుడే వాటికి గ్వాలియర్‌లోని బీఎస్‌ఎఫ్‌ జాగిలాల శిక్షణ కేంద్రంలో పూర్తిస్థాయి తర్ఫీదునిస్తోంది. జాగిలంతోపాటు పులుల సంరక్షణ కేంద్రం నుంచి ఇద్దరు బీట్‌ అధికారులకు ఈ శిక్షణ ఇస్తారు. కవ్వాల్‌ అటవీ ప్రాంతంలోని జన్నారం డివిజన్‌ నుంచి
గతేడాది శ్రీనివాస్‌, సత్యనారాయణ తొమ్మిది నెలల పాటు జర్మన్‌ షెపర్డ్‌ రకానికి చెందిన జాగిలం ‘చీతా’తోపాటు శిక్షణ పొందారు.

ఐదు రకాల శిక్షణ...
ఈ డాగ్‌స్క్వాడ్‌ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి అయిదింటికల్లా జాగిలంతోపాటు బీట్‌ అధికారులు గ్రౌండ్‌కు చేరుకోవాలి. ముందుగా ప్రేమతో మెలగుతూ ఆ జాగిలానికి దగ్గరవుతారు. అది తమ మాట వినేలా మచ్చిక చేసుకుంటారు. అది మాట వినని సందర్భాలూ ఉంటాయి. అయినా కోపగించుకోకుండా ఎంతో సహనంతో శిక్షణ ఇస్తారు. చీతాకు మొత్తం ఐదు రకాలుగా శిక్షణ ఇచ్చారు. ఇది- వేటాడిన లేదా కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన వ్యక్తుల్ని వాసనపట్టి నేరుగా సదరు వ్యక్తి ఉండే చోటుకే అధికారుల్ని తీసుకెళ్తుంది. భూమిలోపల దాచిపెట్టిన వస్తువుల్నీ వెలికి తీస్తుంది. మత్తుమందుల్నీ గుర్తిస్తుంది. పెద్ద భవనాల్లో దాచిన దొంగ సొత్తు(కలప)నూ పట్టుకోగలదు. అంటే, ఎవరైనా వన్యప్రాణి మాంసాన్నిగానీ, కలపను గానీ ఇంట్లో దాచి ఉంచి అధికారులను బుకాయించడం కుదరదన్నమాట. ఇంకా వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న కలపనూ ఇతర అటవీ సంపదలనూ సైతం పట్టుకునే నైపుణ్యం దీని సొంతం. దీని సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అధికారులు. ప్రభుత్వం ప్రతి నెలా దీనికోసం రూ.12,500 ఖర్చు చేస్తోంది. రోజూ ఉదయం అర లీటరు పాలు, ఒక కోడిగుడ్డు, 240 గ్రాముల అన్నం ఇస్తారు. అలాగే సాయంత్రం 350 గ్రాముల మాంసం, 240 గ్రాముల అన్నం ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు పశువైద్యాధికారితో ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటారు.

‘చీతా’ పట్టుకుంటోంది!
కవ్వాల్‌ ప్రాంతంలో ఎక్కడ అటవీ నేరం జరిగినా ముందుగా స్థానిక అధికారులే నేరస్థుల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. నిందితులు తప్పించుకొని తిరుగుతున్న సమయంలో అధికారులు డాగ్‌స్క్వాడ్‌కి సమాచారం ఇస్తారు. తర్వాత ఇద్దరు బీట్‌ అధికారులు జాగిలాన్ని తీసుకొని సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతంలో ముందుగా జాగిలానికి వాసన చూపించి దాని వెంట వెళ్తుంటారు. ఒక్కోసారి బీట్‌ అధికారులు తమకు అనుమానం ఉన్నవైపు జాగిలాన్ని తీసుకువెళ్తారు. గత నాలుగు నెలలుగా కవ్వాల్‌లో విధులు నిర్వహిస్తోన్న ‘చీతా’... జనవరి మూడున బొమ్మెన గ్రామంలో అటవీ జంతువును వేటాడి కూర వండుకున్న ఇద్దరు వేటగాళ్లను పట్టించింది. ఇంటికి దూరంగా కొట్టంలో మాంసాన్ని దాచి ఉంచారు వాళ్లు. కానీ ‘చీతా’ ఆ మాంసాన్ని పసిగట్టి వేటగాళ్లను పట్టించగలిగింది. జనవరి ఆరున పెంబీ అటవీ ప్రాంతంలోనూ పెద్దపులిని చంపిన కేసులో అటవీశాఖ అధికారులు చీతా సాయంతో నేరస్థుల్ని పట్టుకున్నారు. అదే నెల తొమ్మిదిన చింతగూడ గ్రామంలోని పంట పొలాల్లో దాచి ఉంచిన రూ.54 వేల విలువైన కలపను పట్టుకోవడంలోనూ చీతా చాకచక్యంగా వ్యవహరించింది. ముందస్తు సమాచారం మేరకు చింతగూడ గ్రామానికి వెళ్లిన అటవీశాఖ అధికారులకు అక్కడ ఏమీ లభించలేదు. దీంతో జాగిలానికి పని చెప్పడంతో సుమారు 200 మీటర్ల దూరంలోని పంట పొలంలో మూడు చోట్ల దాచిన పూర్తి కలపను అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. నిజామాబాద్‌ జిల్లాలో చిరుతను చంపిన వేటగాళ్లనూ, మంచిర్యాల జిల్లాలో చిరుతపులిని ఉచ్చులో పడేసి చంపిన హంతకులనూ ‘చీతా’నే పట్టించగలిగింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాకుండా కవ్వాల్‌ అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న ఇతర జిల్లాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ స్మగ్లర్లూ, వేటగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది చీతా!

- పూదరి సత్యనారాయణ, న్యూస్‌టుడే, జన్నారం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.