close
ఈ అరలు అతుక్కుపోతాయ్‌!

అయస్కాంతం దగ్గర పెడితే చాలు, ఇనుము చటుక్కున అతుక్కుపోతుంది. అలాగే అరలు కూడా మనం ఎలా అంటిస్తే అలా గోడకు అంటుకుపోతే... ఎంచక్కా ఎప్పటికపుడు వాటిని మన అవసరానికీ మూడ్‌కీ తగినట్లూ రకరకాల డిజైన్లలో అంటించుకోవచ్చు. అందుకోసమే మార్కెట్లోకి మ్యాగ్నటిక్‌ షెల్ఫ్‌ సిస్టమ్‌లు వస్తున్నాయి.

ఇల్లు కట్టించేటపుడే గోడకి అరల్ని కూడా కట్టించేస్తాం. అంతే, అవి జీవితాంతం అలానే ఉంటాయి. ఇంట్లోకి ఎన్ని కొత్తరకాల వస్తువులొచ్చినా అరల డిజైన్లు మాత్రం మారవు. దాంతో చూసీ చూసీ మనకి బోర్‌ కొట్టేస్తుంది. అంతేకాదు, అమర్చే వస్తువులకు తగ్గట్లు అరలుంటే సర్దుకోవడానికీ చూడ్డానిక్కూడా బాగుంటుంది. లేదంటే ఉన్న అందం పోతుంది. కానీ అలా ఎప్పటికపుడు మనక్కావల్సినట్లూ సిమెంటుతో చెక్కతో కట్టిన అరల్ని మార్చాలంటే పెద్దపని, ఖర్చు కూడా. ఇటలీకి చెందిన రోండా డిజైన్‌ కంపెనీ రూపొందించే ‘మ్యాగ్నటికా సిస్టమ్‌’ అరలతో అయితే ఈ సమస్యలేవీ ఉండవు. అయస్కాంత ఫలకాలూ వాటికి అంటుకుపోయేలా చిన్నచిన్న డబ్బాల్లాంటి ఇనుప అరల్నీ తయారుచేస్తుంది ఈ కంపెనీ. పలుచని ఈ ఫలకాలను గోడకు అమరిస్తే చాలు, ఎల్‌, యూ, వై, టీ, హెచ్‌ ఆకారాల్లో వచ్చే అరల్ని మన ఇష్టం వచ్చినట్లూ దానిమీద అంటించుకోవచ్చు. కాస్త తెలివిగా ఆలోచిస్తే రెండు అరలమధ్య వచ్చే ఖాళీని మరో అరగా ఉపయోగించుకునేలానూ అమర్చుకోవచ్చు. కొన్ని రోజులకు ఆ డిజైన్‌ నచ్చకపోతే అరలన్నిటినీ ఇంకోలానూ మార్చేయొచ్చు. అంతేకాదు, ఈ అయస్కాంత ప్యానెళ్లకు కీ చెయిన్లూ ఇనుప ఫ్లవర్‌ వేజులూ అద్దాల్లాంటి వాటిని కూడా అంటించొచ్చు.

అరల్లో సామాను పెడితే బరువెక్కువై అరలు ఊడి పడిపోవా... అని సందేహించాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే మ్యాగ్నటికా ఫలకాల అయస్కాంత శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అది బరువైన వస్తువుల్ని కూడా దాని అయస్కాంత బంధం నుంచి పడిపోనివ్వదు. ఈ ఫలకాల్లో దీర్ఘచతురస్రాకారంలో ఉన్నవే కాదు, ఆకు ఆకారంలోనూ గుండ్రంగానూ ఉన్నవీ ఉంటాయి. ఇతర కంపెనీల్లో కూడా మ్యాగ్నటిక్‌ అరలు దొరుకుతున్నాయి. వీటిలో గోడకు సమాంతరంగా అంటించే ఫలకాలే కాకుండా నలభై యాభై సెంటీమీటర్ల వెడల్పుతో అరలా గోడకు అమర్చే అయస్కాంత ఫలకాలూ ఉంటాయి. వీటికి కిందా పైనా కూడా డబ్బాల్లాంటి అరల్ని అంటించేయొచ్చు. చెక్కతో చేసిన అరలకి పైభాగంలో ఇనుపరేకుల్ని కొట్టించి వాటినీ ఈ అయస్కాంత ప్యానెళ్లకు అంటించేస్తున్నారు. లివింగ్‌రూమ్‌లో అలంకరణ సామగ్రికీ రీడింగ్‌ రూమ్‌లో పుస్తకాలు పెట్టుకునేందుకూ వంటగదిలో సామాన్లని పెట్టేందుకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. మీకూ నచ్చాయా..?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.