close

వసంత కోయిల

- డేగల అనితాసూరి

ల్లెలూ జాజులూ నందివర్ధనాలూ గులాబీలూ చివరికి వేపపూత కూడా తెల్లగానే పూసింది. వాటిని కప్పుకున్న మంచు కూడా తెల్లవారుతోందన్న సంకేతానికి గుర్తుగా ఉదయిస్తున్న సూర్యకిరణాల వెండి వెలుగుల్లో మెరుస్తోంది.
‘‘ఎంతసేపే తల్లీ వాకిట్లో ముగ్గేయటం?’’ ఇంట్లోంచి తల్లి త్రివేణి గొంతు మేఘ గర్జనలా వినిపించింది.

‘‘ఆ... వస్తున్నా’’ లోపలికెళ్తూ తనేసిన ముగ్గువంక మరోసారి చూసి అనుకుంది ‘ముగ్గుపిండి కూడా తెలుపే కదా!’ అని.
తల్లి స్నానం, పూజా ముగించి వచ్చేలోపు తండ్రి విశ్వనాథానికి తెల్లని మెత్తని ఇడ్లీలు కొబ్బరిచట్నీతో వడ్డించి, తనకోసం టిఫిన్‌ డబ్బా సర్దుకునే పనిలో నిమగ్నమైంది
ఇరవై ఏడేళ్ళ నర్మద.
ఆఫీసుకు బయలుదేరుతూ తన ముద్దుల బొచ్చు కుక్కపిల్ల వెన్నెలకు బౌల్‌ నిండా పాలు పోసి అది ఆత్రంగా తాగుతుంటే మురిపెంగా ముద్దిచ్చి అప్పుడు తన గదిలోని అద్దం ముందు నిలబడి నుదుటి మీది చిన్న స్టిక్కర్‌ సరిచేసుకుంటూ తనలో తనే చిన్నగా నవ్వుకుంది నర్మద. చక్కని తెల్లని పలువరుస అందంగా మెరిసింది.

కూతురు వీధి మలుపు తిరిగేదాకా చూసొచ్చి అప్పటికే ఫలహారం చేసి న్యూస్‌పేపరులో తల ఇరికించేసిన భర్తతో ‘‘బాగుంది వరస... మీకసలు కాస్తయినా బాధ్యత ఉందా?’’ అని నిష్ఠూరంగా చూసింది త్రివేణి.

‘‘అయ్యో రామా, నేను బాధ్యతగానే హెడ్మాస్టర్‌ గిరీ పూర్తిచేసి, పదవీ విరమణ పొంది, మన ఏకైక పుత్రికను చక్కగా చదివించి బాధ్యతగల పౌరుడిగా పేపరు చూస్తుంటే పుసుక్కున అంత మాట అనేశావేంటి?’’
‘‘అంతటితో బాధ్యత తీరిపోయిందనుకుంటే ఎలా? ఏళ్ళొచ్చిన పిల్ల మగరాయుడిలా ఉద్యోగం చేస్తూ, ఇంకా పెళ్ళీ పెటాకులూ లేకుండా తిరుగుతుంటే మీకు చీమకుట్టినట్టయినా ఉందాని?’’ ఈసారి ఉరిమినట్టే వచ్చాయి ఆమె గొంతులోంచి కించిత్‌ బాధా ఆవేదనా కలగలిసిన మాటలు.

‘‘ఆ విషయం నాకు తెలియదా చెప్పు... కంప్యూటర్‌ పెట్టె పట్టుకుని ఆ సుందరం సాయంత్రం వస్తానన్నాడు కదా!’’ అన్నాడు పేరయ్య గురించి.
‘‘ఆ వస్తూనే ఉన్నాడు నాలుగేళ్ళుగా. ఒక్కటీ కుదిరే సంబంధం తెచ్చిందిలేదుగానీ, ఆయనకిచ్చిన కాఫీ టీలూ టిఫిన్లూ భోజనాల ఖర్చుతో రెండు పెళ్ళిళ్ళు చేసుండవచ్చనిపిస్తోంది’’ తన ఫలహారం కానిచ్చి వంటింట్లోకెళ్తూ నిరసనగా అంది త్రివేణి.

* * *

‘‘మీ నానమ్మేమో నీ పెళ్ళి చూడాలంటోంది, నువ్వేమో నానమ్మకు ఆరోగ్యం
బాగవనీ అంటావ్‌. ఎలా చావన్రా జీవన్‌ నీతో’’ తల పట్టుకుంటూ అమెరికాలోని కొడుకుతో వాట్సాప్‌ కాల్‌ మాట్లాడుతూ అంది సుభద్ర.
‘‘నా పెళ్ళికేం తొందరొచ్చిందిప్పుడు? అయినా, నువ్వేమీ అంత సంబరపడిపోకు. నీకప్పుడే అత్తగారి పోరు తప్పిపోయే ఛాన్సే లేదులే. త్వరలోనే నానమ్మ లేచి తిరుగుతుంది. నిన్ను మునుపట్లా మళ్ళీ సాధిస్తుంది చూస్కో’’ నవ్వుతూ అన్నాడు అటునుంచి జీవన్‌.

‘‘నీకూ మీ నాన్నకూ చాలా ఆశలున్నాయిలే కానీ నానమ్మ వయసెంతనుకుంటున్నారూ? అయినా ఏమోలే, ఒక విధంగా చూస్తే ఆవిడ నిజంగానే లేచి పెత్తనం చేసేలాగే ఉంది’’ అంది సుభద్ర.
‘‘మరి... తనని చూసుకోవడానికి నాన్న పెట్టిన ప్రైవేట్‌ నర్సు నీలాగ ‘ఛీఛీ...ఛఛ...’ అంటూ మనుషులను ఈసడించుకునే రకం కాదుగా’’ అన్నాడు చేతిలోని ప్యాకెట్‌లోంచి చిప్స్‌ తీసుకుని తింటూ.
‘‘నిజమేరా... అత్తగారి మీద జోక్‌గా అన్నాగానీ మీ నానమ్మ అలా పెత్తనం చేస్తూ పద్దెనిమిది నిండీనిండగానే కోడలిగా

ఇంటికొచ్చిన నాతో అన్ని బాధ్యతలూ గద్దించి నేర్పబట్టే నేనింత చక్కగా నలుగురు ఆడపడుచులున్న ఇంటిని నెగ్గుకురాగలిగాను తెలుసా?’’ అంది నిజం ఒప్పుకుంటూ.

‘‘తెలుసు తల్లీ తెలుసు... తన ఒక్కగానొక్క కొడుక్కి తెల్లటి అమ్మాయే కావాలని పట్టుబట్టి పేదరికంలో ఉన్నా దూరపు బంధువుల్లోని నిన్ను కోరి కోడల్ని చేసుకుందని తెలుసు. ఆమె కోప్పడినా నీమీద ప్రేమతోనే, నువ్వు విసుక్కున్నా ఆమెమీది అభిమానంతోనే... సరేనా?’’ అన్నాడు లెంపలేసుకుంటున్నట్లు యాక్ట్‌ చేస్తూ.

‘‘నిజమేరా. కానీ, ఎంత బాగా చూసుకుందామన్నా వండిపెట్టడం, మందులేయటం వరకూ ఫరవాలేదు గానీ... బెడ్డుమీదే ఆమెకు అన్ని సపర్యలూ ఓపిగ్గా చేయలేకపోతున్నారా. పోనీ, నేనంటే కోడల్ననుకో,

మీ నలుగురత్తలు సొంత తల్లనయినా చూడటం లేదు. ఎంత ఖర్చయినా ఫర్లేదు మనిషిని పెట్టేద్దాం అంటారుగానీ, ఒక్కరు కూడా శుభ్రంగా ఉంటే తప్ప ఆమె దగ్గరికెళ్ళడానికి కూడా ఇష్టపడటం లేదు తెలుసా?’’ చెప్పింది సుభద్ర కూతుళ్ళకన్నా గొప్పగానే కోడలి బాధ్యత నిర్వహిస్తున్నట్టు కొడుకు భావించాలని.
‘‘సర్లే అమ్మా, వాళ్ళ సంగతి మనకెందుకు. నీకు నానమ్మ మీద ఎంత ప్రేమో నాకు తెలియదా?’’ అన్నాడు తల్లిని బాధపడనివ్వకుండా.

‘‘సర్లే, మరి నువ్వెప్పుడొస్తున్నట్టు? కరెక్టుగా చెప్పు, మంచి సంబంధం చూసిపెట్టుకోవాలి కదా?’’ అడిగింది సుభద్ర.
‘‘నెక్స్ట్‌మంత్‌ తప్పకుండా వస్తున్నా అమ్మా. నువ్వేం తొందరపడకు. నేనొచ్చాకే అమ్మాయిల్ని వేటాడ్డం, సరేనా?’’

‘‘వేటేంట్రా... నీ ముఖం. నా కాబోయే కోడలేమైనా జంతువా?’’ చిరుకోపంగా అంది.
‘‘అబ్బో, ఇంకా ఎక్కడుందో తెలియని కోడలిపైన ఇంత ప్రేమా? వేటంటే అమ్మాయిలోని మంచితనాన్ని వెదకటం గురించి అన్నాన్లే’’ అనేసి తన సంభాషణ అంతటితో ముగించాడు జీవన్‌.

* * *

‘‘వేణీ... సుందరమొచ్చాడు’’ లోపలికి చూస్తూ కేకవేశాడు విశ్వనాథం.
‘‘రండి సుందరంగారూ, ఇవాళైనా మా అమ్మాయికి కుదిరే సంబంధమే తెచ్చారా?’’ చాలా రోజులుగా భరిస్తున్న చిరాకు కట్టలు తెంచుకుని మాటలుగా వచ్చింది త్రివేణి గొంతులోంచి.
‘‘ఏం చేయనమ్మా, పెద్ద పెద్ద సంబంధాలకు మీరు ఎక్కువ కట్నం ఇవ్వలేరు. అమ్మాయి చేస్తున్నదేమో నర్సు ఉద్యోగం. కొందరికి ఆ విషయమూ రుచించదాయె’’ అన్నాడు చంకలోని లాప్‌టాప్‌ దించి ఓపెన్‌ చేస్తూ.

‘‘ఏం... మాయరోగాలొచ్చి ఇంటివాళ్ళయినా దూరంగా ఉంటే సేవ చేసేది ఆ నర్సులేకదయ్యా? తను కావాలని సేవాభావంతో చేస్తోంది ఆ ఉద్యోగం తెలుసా?’’ అన్నాడు విశ్వనాథం కూతుర్ని కించిత్తు మాటైనా అంటే భరించలేని కోపంతో.
‘‘ఇద్దరికిద్దరూ అంతే. ముందునుంచీ నాకు ఇష్టంలేదు. ఏ టీచరో, క్లర్కో అవమంటే విన్నారు కాదు’’ తన అయిష్టాన్ని సమయం వచ్చినప్పుడు వెళ్ళగక్కుతూనే ఉంటుంది త్రివేణి.
‘‘అన్నిటికన్నా ముఖ్యం... ఇక ముఖ్యమైన విషయం ఉండనే ఉంది అమ్మాయి
చామనఛాయైనా కాదు. నల్లటి నలుపు కూడాను’’ అన్నాడు సుందరం విశ్వనాథం కోప్పడటంతో ఫీలైపోతూ.

‘‘ఏమిటోనండీ, మా ఇంట్లో అందరూ తెల్లటి తెలుపు. ఇదొక్కటీ అటూ ఇటూ ఏడుతరాల్లో ఎవరుండెనో కానీ ఇంత నలుపొచ్చింది’’ ఇక ఎలాగూ తప్పదని కాఫీ పట్టుకొచ్చి ముందుపెడుతూ అంది త్రివేణి.
‘‘అలా అంటే నేనొప్పుకోను.
‘నలుపు నారాయణుడు మెచ్చు’ అన్నారు.
నా బంగారుతల్లి నలుపైనా ఎంత కళగల ముఖమని?’’ తండ్రి ప్రేమ తొణికిసలాడింది విశ్వనాథం గొంతులో.
తరువాతో అరగంటపాటూ కొన్ని సంబంధాల గురించి పరిశీలించీ పరిశోధించీ తమకు తగ్గదని భావించినవి ఎన్నుకుని అందులో రెండు నచ్చి, ఎప్పుడు వచ్చి చూసివెళ్తారో కనుక్కొమ్మని పురమాయించారు త్రివేణీ, విశ్వనాథంలు.

* * *

‘‘అమ్మా... ఇప్పుడేమైందని? నాకంటే వయసెక్కువైనవాళ్ళు కూడా ఇప్పుడే పెళ్ళొద్దంటున్నారు- తెల్లగా ఉండి, ధనానికి కొదవలేకున్నా కూడా. నేను అబ్బాయైతే ఇంట్లోంచి ఇలా పంపేసేవాళ్ళా? నాకు పెళ్ళయి వెళ్ళిపోతే మీరిద్దరూ దిగులుపడిపోరూ? అందుకే లేటవుతోందనుకోవచ్చు కద నాన్నా?’’ అంది నర్మద నవ్వుతూ.

‘‘అనండే... ఇద్దరూ నన్నే అనండి. ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే నలుగురూ ఏమనుకుంటారు... కూతురు సంపాదిస్తోంది కాబట్టి పెళ్ళి చేసే ఉద్దేశం లేదనుకోరూ? మాకేమైంది... బాగానే తిరగగలుగుతున్నాం. వచ్చే పెన్షనూ మేడమీది వాటాకొచ్చే అద్దెతో హాయిగానే ఉంటాం. అదేంటో మనింట్లో అందరికీ తెల్లటి ఛాయొస్తే నువ్వొక్కదానివీ నల్లగా పుట్టావు’’ అంటూ బాధపడింది త్రివేణి.

‘‘నారు పోసినవాడు నీరు పోస్తాడుగానీ నువ్విక ఊరుకుంటావా?’’ అన్నాడు విశ్వనాథం.
‘‘అమ్మా... నా పిచ్చి అమ్మా, నల్లగా పుట్టిన నాకేలేని దిగులు నీకెందుకు చెప్పు? రంగు గురించే నువ్వు చూస్తున్నావుగానీ, అన్ని అవయవాలూ సరిగాలేనివారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అలా చూస్తే నేనెంత అదృష్టవంతురాలినో కదా! అయినా, మనింట్లో అందర్లోకి నేను యునిక్‌ అని సంతోషించక బాధపడతావేం... చూడరా వెన్నెలా?’’ అంది తన కాళ్ళ దగ్గరకు తోకూపుతూ వచ్చిన తెల్లని బొచ్చు కుక్కపిల్లని ముద్దుచేసి ఎత్తుకుంటూ.
‘‘నీకున్నంత మెచ్యూరిటీ దానికి లేదమ్మా. ఎందుకంటే అది అమ్మ కదా? నీ బదులు కూడా అదే దిగులుపడుతోంది’’ చెప్పాడు విశ్వనాథం- కూతుర్నీ భార్యనీ సరిగ్గా అర్థంచేసుకున్నందువల్ల.

* * *

జీవన్‌ పెళ్ళిలో ముందు వరుసలో కూర్చుని ఉంది- ఎనభైఆరేళ్ళ ద్రాక్షాయణి కదల్లేకపోయినా కోడలికీ కొడుక్కీ కూతుళ్ళకూ పనులు పురమాయిస్తూ.

పెళ్ళికొచ్చిన వాళ్ళంతా గుసగుసలు పోతున్నారు ‘అమెరికాలో ఉద్యోగం కదా... అక్కడే ఏ తెల్లతోలు పిల్లనో కట్టుకున్నాడనుకున్నాం తెలుసా?’ అని ఒకరంటే, ‘అబ్బే, నేనైతే ఆస్తీ అంతస్తులు బాగా వెతుకుతున్నందువల్ల వాడికి ముప్ఫై ఏళ్ళొచ్చినా ఇంకా లేటు చేశారనుకున్నా’ బుగ్గలు నొక్కుకున్నారు మరొకరు.

మరికొందరైతే సుభద్ర ముఖమ్మీదే ‘ఏమైనాగానీ, మీ కొడుకూ, కోడలి జంట నువ్వుల్లో పచ్చిబియ్యమున్నట్టుందనుకో’ అనేశారు కూడా.

అప్పగింతలరోజు రానే వచ్చింది. ‘‘నేను జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం కనిపించట్లేదు వదినగారూ- మీతో అమ్మాయిని పంపుతుంటే. మీ అంతస్తుకూ మీరు తీసుకున్న నిర్ణయానికీ పెళ్ళిచూపులకని మీరు మా ఇంటిగడప
తొక్కిన్నాడే అర్థంచేసుకున్నాను’’ అంది మనసునిండిన ఆనందంతో త్రివేణి.

‘‘నిజం చెప్పాలంటే మా ఇంట్లోనే రెండేళ్ళుగా మా అత్తగారికి అంత ఓపికతో విసుక్కోకుండా నవ్విస్తూ సేవలుచేస్తూ
తిరుగుతున్న పిల్లను గమనించకుండా మేమూ ఊళ్ళన్నీ తిరిగాం వదినగారూ. అంతదూరాన ఉండి కూడా వాడికి వచ్చిన మంచి ఆలోచన మాకు రాలేదు. పైగా వాడి మనసులోని మాట చెప్పినప్పుడు కోప్పడ్డాం కూడా’’ అంది సుభద్ర కోడలి వంక ప్రేమగా చూస్తూ.

‘‘ఇంతకాలం పెళ్ళి పెళ్ళని వేధించావు... ఇప్పుడు చూశావా, నా చిట్టితల్లికి ఇంత మంచి కుటుంబం దొరికింది. నా అల్లుడు బంగారం’’ మనస్ఫూర్తిగా అల్లుడ్ని కావలించుకుని చెప్పాడు విశ్వనాథం.

‘‘నేను కాదు... మీ అమ్మాయే ముందు మా నానమ్మ మనసూ ఆనక నా మనసూ దోచుకుంది. మా అమ్మయినా నానమ్మను చూసుకోలేక ఎప్పుడైనా కాస్త విసుక్కొని ఉండొచ్చుకానీ, మీ అమ్మాయి ఎంత ఓపికగా మరెంత ప్రేమగా నానమ్మను చూసుకుంది! ఇందరు కాదనలేని మంచితనంతో మమ్మల్ని గెల్చుకున్న మీ అమ్మాయే మాకు దొరికిన వెలలేని వజ్రం మామయ్యగారూ’’ అన్నాడు జీవన్‌ ప్రశంసాపూర్వకంగా నర్మదను చూస్తూ.

‘‘చాల్చాలు... నన్ను అనవసరంగా మునగచెట్టు ఎక్కిస్తున్నారు. మీ అందరిలో మంచితనం ఉండబట్టే, నా రూపాన్ని కాకుండా సేవాగుణాన్ని చూశారు. మా అమ్మానాన్నలతో కూడా ‘అనారోగ్యమైతేనేం మరో కారణమైతేనేం- మీకు ఎప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు మా దగ్గరికొచ్చేయాల’ని ఆదరంగా అనగలిగారు’’ అంటూ హాయిగా నవ్వింది నర్మద.

ఆమె నవ్వుతో తల్లోని మల్లెలు పోటీపడ్డాయి. పచ్చని కొమ్మల్లో కోయిల మార్దవంగా కూసింది- పక్క కొమ్మమీది అందాల రామచిలుక కూడా ఈర్ష్యపడేలా.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.