close
మా సేవలు మీ భాషలోనే!

భారత్‌ ఉపఖండం అనేందుకు మనదేశంలోని భిన్న భాషలూ ఓ ఉదాహరణ.  అందుకే ఇప్పుడు చాలా అంకుర సంస్థలు ఇంగ్లిష్‌ అనే కాకుండా భారతీయ భాషల్లోనూ సేవలు అందిస్తూ అసలైన దేశీ సంస్థలుగా పేరు సంపాదిస్తున్నాయి.  ఈ సంస్థల్ని చూస్తే మీరూ ‘అవును నిజం’ అంటారు..!

మినీ గూగుల్‌

మాచారం కోసం ఇంటర్నెట్‌ ఉపయోగించాలంటే కొద్దోగొప్పో ఇంగ్లిష్‌ రావాల్సిందే. భారత్‌లో 40 కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారులుంటే, వారిలో 25కోట్ల మందికి ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లేదు. అందుకే, ‘మీ భాషలోనే ప్రశ్నలు అడిగి సందేహాల్ని తీర్చుకోండి’ అంటోంది ‘వోకల్‌’ ఆప్‌. ఈ ఆప్‌లో ప్రశ్నల్ని హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ... మొదలైన 12 భారతీయ భాషల్లో టైప్‌ చేసిగానీ వాయిస్‌ రూపంలోగానీ అడగొచ్చు. ప్రశ్న అడిగిన కొన్ని నిమిషాల్లోనే సంబంధిత రంగానికి చెందిన నిపుణులు జవాబిస్తారు. రాజకీయాలూ, డబ్బూ, పోటీ పరీక్షలూ, ప్రేమానుబంధాలూ, వినోదం, అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం... లాంటి పలు అంశాలపైన ప్రశ్నలు అడగొచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థని అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్‌ బిదవాటక స్థాపించారు. ‘ప్రాంతీయ భాషల్లో సమాచారం, విజ్ఞానాన్ని పంచడమే మా ప్రధాన ఉద్దేశం. భారత్‌లో 90 శాతం ప్రజలకి ఇంగ్లిష్‌ పెద్దగా తెలియదు. కానీ వాళ్ల చేతిలో స్మార్ట్‌ఫోన్‌, దాన్లో ఇంటర్నెట్‌ ఉంటోంది. తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్లకి భాష ఎందుకు అడ్డంకి కావాలి’ అంటారు రాధాకృష్ణ. మనకు నచ్చిన రంగాల్ని ఎంపిక  చేసుకుంటే దానికి సంబంధించి ఇతరులు అడిగిన ప్రశ్నలకు అప్‌డేట్‌లూ కనిపిస్తాయి. వోకల్‌లో సందేహాల్ని తీర్చడానికి ప్రత్యేకించి ఆ సంస్థ ఆమోదం పొందిన విషయ నిపుణులు ఉంటారు. వాళ్లు లైవ్‌ వీడియో సెషన్లు కూడా ఇస్తారు. 2016లో ప్రారంభమైన ఈ ఆప్‌కి 20 లక్షల వినియోగదారులున్నారు.

రొపోసో... ప్రజల టీవీ!

యాంక్‌, అవినాష్‌, కౌశల్‌... ఐఐటీ పూర్వ విద్యార్థులు. వీళ్లు ప్రారంభించిందే రొపోసో. దిల్లీ కేంద్రంగా 2012లో ఫ్యాషన్‌ విభాగంలో సోషల్‌ నెట్‌వర్క్‌గా మొదలైన రొపోసో, ఇప్పుడు స్వల్ప నిడివి ఉండే వీడియోల షేరింగ్‌ ఆప్‌గా మారింది. దీన్ని ప్రజల టీవీగా అభివర్ణిస్తున్నారు వ్యవస్థాపకులు. ఎందుకంటే దీన్లోని వీడియోల్ని ప్రజలే సృష్టించి పెడుతుంటారు. రొపోసో ఆప్‌లో మొదట యూజర్లు తాము ఫాలో అవుతున్న ఫ్యాషన్ల గురించి మాట్లాడేవారు. వాటికి సంబందించిన ఫొటోలూ, వీడియోల్ని పెట్టేవారు. తర్వాత తర్వాత పర్యాటకం, ఆహారం, జీవనశైలి... ఇలా పలు అంశాలకు సంబంధించిన ఫొటోలూ, వీడియోల్నీ షేర్‌ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఏం చేయాలో వ్యవస్థాపకులకు కొన్నిరోజులు అర్థంకాలేదు. కానీ చివరకు ప్రజల అభీష్టం మేరకే అన్ని రకాల వీడియోల్నీ షేర్‌ చేసుకునే వేదికగా రొపోసోని మార్చడమే సబబని 2017లో ఆ దిశగా అడుగులు వేశారు. అప్పుడే ఇంగ్లిష్‌ భాషకి పరిమితం కాకుండా ప్రాంతీయ భాషల్లోకీ వెళ్లాలనుకున్నారు. ఇప్పుడు 10 ప్రధాన భారతీయ భాషల్లో... క్రీడలు, సంగీతం, పర్యాటకం, ఆధ్యాత్మికం, ఆహారం, హాస్యం, వినోదం... ఇలా 25 విభాగాల్లో వీడియోల్ని ఈ ఆప్‌లో చూడొచ్చు. ఈ ఆప్‌ని 1.6 కోట్లమంది డౌన్‌లోడ్‌ చేసుకోగా, వారిలో 30 శాతం వీడియోల్ని రూపొందిస్తున్నారు. సగటున రోజూ రెండున్నర లక్షల వీడియోలు అప్‌లోడ్‌ అవుతుంటాయి.

ఫోన్లో వంట మాస్టారు

బెటర్‌బటర్‌ వంటల ఆప్‌ వ్యవస్థాపకులు... నియాజ్‌ లయిక్‌, సుఖ్‌మణి బేడి. దిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ వంటలకు సంబంధించిన సోషల్‌ నెట్‌వర్క్‌. ఇంటి వంటలకు సంబంధించిన సమాచార కేంద్రంగా దీన్ని ప్రారంభించారు. ఇంట్లో కొత్త వంటకం ఏదైనా చేయాలనుకున్నపుడు గృహిణులకు ఈ ఆప్‌ అక్కరకు వస్తుంది. వంటల తయారీని రాత పూర్వకంగా, వీడియోల రూపంలో దీంట్లో చూడొచ్చు. ఇక్కడి వివరాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొచ్చు. అలాగే, ఎవరికైనా వంటల తయారీలో సందేహాలుంటే అడగొచ్చు. ఇంగ్లిష్‌, హిందీతోపాటు తెలుగు, తమిళం, మరాఠీ, గుజరాతీ భాషల్లో బెటర్‌బటర్‌ అందుబాటులో ఉంది. మరి కొన్ని భాషల్లోకీ వెళ్లనున్నారు. వెబ్‌సైట్‌/ఆప్‌ రూపంలో ఉండటం దీని ప్రత్యేకత. ఆప్‌లో ఎంపికచేసుకున్న వంటకాల్ని  ఆఫ్‌లైన్లోనూ చూసుకోవచ్చు. ఇక్కడ వంటకాల్ని చూసి ఆ పదార్థాల్ని ఇంట్లో చేశాక, ఫొటో తీసి దీన్లో పెట్టొచ్చు. తెలుగు వంటకాలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వంటకాల్నీ చూడొచ్చు. స్వీట్‌, స్నాక్‌్్స, ఉత్తరాది వంటకాలు, దక్షణాది వంటకాలు... లాంటి విభాగాల్లో పోటీలు కూడా పెడతారు. ఆప్‌ ద్వారా వంటతయారీ వీడియోల్ని పెట్టొచ్చు. రాగిముద్ద, పావ్‌ భాజీ, వెజ్‌ మంచూరియా... ఇలా లక్షకుపైగా వంటల తయారీ గురించి దీన్లో సమాచారం ఉంది. పిల్లలకు పౌష్టికాహారం, ఉద్యోగినులకు వేగంగా పూర్తయ్యే వంటకాలు, కొత్తవాళ్లకు సులభంగా చేసుకోగలిగే వంటకాలు... అన్నీ ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.