close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అష్టాచమ్మా... ఆడేద్దామా!

వేసవి చల్లని తాటి ముంజెల్నీ తీయని మామిడి పండ్లనే కాదు, చిన్ననాటి ఆటల్నీ గుర్తుకు తెస్తుంది. ఇద్దరు కలిస్తే చాలు నేలమీదే సుద్దముక్కతో గళ్లు గీసేసి ఏ అష్టాచెమ్మానో పులీ మేకో ఆడుకున్న రోజులు గుర్తొస్తాయి.  ఆ తరం వారి జ్ఞాపకాల్లోమాత్రమే మిగిలి, మరుగునపడిపోతున్న ఆ ఆటల ఆనందాన్ని ఈ తరానికీ అందించే ప్రయత్నం చేస్తోంది హైదరాబాద్‌కి చెందిన ఓ సంస్థ.

ఎంబ్రాయిడరీ చేసిన పచ్చీసు బోర్డు, కలంకారీ అద్దకంతో తీర్చిదిద్దిన అష్టాచెమ్మా, పావులుగా పెట్టుకోడానికి చిలకలూ, పులీ మేకా బొమ్మలూ... ఆకర్షణీయంగా కన్పించే ఈ ఆటబొమ్మల్ని హైదరాబాద్‌కి చెందిన ‘గుడ్‌ ఓల్డ్‌ గేమ్స్‌’ అనే సంస్థ తయారుచేయించి విక్రయిస్తోంది. అర్చన, సంగీత ఇద్దరూ స్నేహితులు. కలుసుకున్నప్పుడల్లా చిన్ననాటి జ్ఞాపకాల్ని కలబోసుకునేవారు. తాము ఆడుకున్న ఆటలు ఎంతో బాగుండేవనీ, ఇప్పటి పిల్లలు అవన్నీ మిస్సవుతున్నారనీ అనుకునేవారు. పిల్లలకోసం బహుమతులు కొనాలన్నా ప్లాస్టిక్‌ బొమ్మలే కొనాల్సివస్తోందని బాధపడేవాళ్లు. కలిసి ఏదైనా వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా ఉన్న ఆ స్నేహితురాళ్ల మాటల మధ్య ఓరోజు అనుకోకుండా ఆటల గురించిన చర్చ చాలా దూరం తీసుకెళ్లింది. పాత ఆటల్ని పునరుద్ధరించకపోతే కొన్నేళ్లకు మరుగునపడిపోతాయనీ ఆ పనేదో తామే చేయాలనీ వారిద్దరూ నిర్ణయించుకుని మొదలుపెట్టిందే ‘గుడ్‌ ఓల్డ్‌ గేమ్స్‌’ సంస్థ.

అర్చనా సంగీతా కలిసి ముందుగా తమకు తెలిసిన, బంధువులూ స్నేహితులూ చెప్పిన ఆటలతో ఒక జాబితా తయారుచేశారు. గ్రామాలకు వెళ్లి వృద్ధుల్ని పలకరించి వారు చిన్నప్పుడు ఆడుకున్న ఆటల గురించి తెలుసుకునేవారు. అలా రెండేళ్లు కష్టపడి సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌... ఇలా పలు ప్రాంతాల్లో ఉన్న కళాకారుల్ని కలిసి ఆ ఆటలకు కావలసిన సరంజామాను తయారుచేయించారు. రెండున్నరేళ్ల కృషి తర్వాత ఆటలన్నిటికీ అందమైన రూపాలు తయారయ్యాయి. అన్నీ చేత్తో తీర్చిదిద్దినవే. వాటికి వాడిందీ ఏ మాత్రం హానిచేయని సహజ రంగులే. ఇక వాటితో ప్రదర్శన పెట్టడం మొదలెట్టారు. గత మూడేళ్లుగా ఏటా దసరా, వేసవి సెలవుల్లో పెట్టే ఈ ప్రదర్శనలకు మంచి స్పందన వస్తోందని చెబుతారు అర్చన. అలా స్నేహితురాళ్లిద్దరూ మొత్తం 101 ఆటల్ని పునరుద్ధరించి అభిమానుల ముందుకు తెస్తున్నారు. హైదరాబాదులోనే ఒక షాపునీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

జ్ఞాపకాలకే పరిమితమైన చిన్ననాటి ఆటలను మళ్లీ చూసుకుని, పిల్లలకూ నేర్పించుకునే అవకాశాన్ని ఇస్తున్న వీరి ప్రయత్నం అభినందనీయం కదా!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.