close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రామబాణంలో రామ చరితం!

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ।।
రాముడి గురించిన ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామంతోపాటు శివ సహస్రనామ పారాయణం ఫలితం కూడా లభిస్తుందట. ఇది సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పిన మాట.
రామనామం జపిస్తేనే అంతటి పుణ్యం కలుగుతుందంటే రాముడి చరితను కళ్లారా చూడటం ఇంకెంతటి మహద్భాగ్యమో. ఆ అదృష్టాన్ని కల్పిస్తున్నదే రామబాణం ఆకృతిలో నిర్మించిన ‘రామనారాయణం’ ఆలయం.

శ్రీరామాయణం సంపూర్ణ మానవ జీవన దర్పణం. అందులోని ప్రతి పాత్రా ప్రతి సంఘటనా మనకు నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది. మనిషిగా పుట్టి మానవ జీవిత పరమార్థాన్ని లోకానికి తెలియజేసిన పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు. నేటి తరానికీ భావి తరాలకూ ఆ రామ తత్వం అర్థమవ్వాలి, ఆదర్శం కావాలి... అనే ఉద్దేశంతో నిర్మించిందే ‘రామనారాయణం శ్రీమద్రామాయణ ప్రాంగణం’. విజయనగరం పట్టణానికి సమీపంలోని కోరుకొండ రహదారిలో పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణాన్ని పైనుంచి చూస్తే రామబాణం ఆకృతిలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రవేశ ద్వారం దగ్గరే విఘ్న నివారకుడు వినాయకుడి మందిరం ఉంటుంది. ఆయనకు మొక్కి లోపలికి ప్రవేశిస్తే దివ్య ఔషధ వృక్షాలు పచ్చదనంతో పలకరిస్తాయి. రామనారాయణం ప్రాంగణం రెండు అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో ధనుస్సుకు ఒక చివర శ్రీరామాలయమూ మరో చివర విష్ణుమూర్తి ఆలయమూ ఉంటాయి. విష్ణువే రాముడిగా అవతరించాడని చెప్పేందుకే ఇలా నిర్మించారు. ఈ రెండింటినీ కలుపుతూ నిర్మించిన కారిడార్‌ లోపలకి వెళ్తే రామాయణగాథని సుందర దృశ్యాలుగా మలుస్తూ చెక్కిన 72 శిల్పాలు దర్శనమిస్తాయి. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం, శివధనుర్భంగం, సీతారామ కల్యాణం,  రామరావణ యుద్ధం, సీతామాత అగ్ని ప్రవేశం, శ్రీరామపట్టాభిషేకం... ఇలా ఆ శిల్పాలు రామాయణం మొత్తాన్నీ కళ్లకు కడుతూ భక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాయి.

శోభాయమానం ఈ క్షేత్రం
రామనారాయణంలో ధనుస్సుకి మధ్యలో నెలకొల్పిన 60 అడుగుల ఆంజనేయుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కింద నుంచి ఈ విగ్రహం దగ్గరికి వెళ్లే మెట్లకు ఇరువైపులా పదహారు అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మీ సరస్వతీ అమ్మవార్ల విగ్రహాలు వాటర్‌ ఫౌంటెయిన్ల మధ్య శోభాయమానంగా దర్శనమిస్తాయి. ఇక్కడే అనంతధ్యాన మందిరం, శ్రీసీతారామకల్యాణమండపం, శబరి అన్న ప్రసాదశాల, సుగ్రీవ గోశాలలు నెలకొల్పారు. విష్ణుమూర్తి, శ్రీరాముడు, వినాయకుడు, ఆంజనేయుడి ఆలయాల్లో నెలకోసారి స్వామివారి నక్షత్రం రోజున ప్రత్యేక అభిషేకాలు, రామాలయంలో సీతారాముల కల్యాణం చేయడం ఇక్కడి విశేషం. భక్తులకోసం ఆలయంలో ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
భారతీయ గ్రంథాల్లో ప్రస్తావించిన రకరకాల పవిత్రమైన మొక్కల్ని దేశంలో ఎక్కడెక్కడి నుంచో వెతికి మరీ తీసుకొచ్చి నారాయణవనం, పంచవటివనం, పంచభూతవనం, సప్తర్షివనం, రాశివనం... ఇలా రకరకాల పేర్లతో ఆలయ ఆవరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఇక, రాత్రివేళల్లో విద్యుత్‌ దీపాలంకరణలతో ముస్తాబయ్యే ఆలయం ఇంద్రధనుస్సు రంగుల్లో తళుకులీనుతూ కనిపిస్తుంది. అందుకే, ఏటా ఈ ఆలయాన్ని 10 లక్షల మందికి పైగానే దర్శించుకుంటున్నారు. సందర్శకుల్ని ఉచితంగా బ్యాటరీ కారుల్లో లోపలివరకూ తీసుకెళతారు. వృద్ధుల్ని ఆలయ సేవకులే వీల్‌ఛైర్‌లో ఆలయం మొత్తం తిప్పి చూపిస్తారు.

ఓ రామభక్తుడి సంకల్పం
రామనారాయణం ఆలయం కార్యరూపం దాల్చడానికి కారణం విజయనగరానికి చెందిన నారాయణం నర్సింహమూర్తి సంకల్పమే. నర్సింహమూర్తి తండ్రి శ్రీరాముడికి పరమ భక్తుడు. ఆయన 108 సీతారాముల కల్యాణాలు జరిపించిన తరువాత చేసే మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయించారని ప్రతీతి. తండ్రి నుంచి ఆ భక్తి నర్సింహమూర్తికీ వచ్చింది. కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు, భార్య, తమ్ముడు ఎలా ఉండాలన్నది రామాయణంలోనే ఉందనీ, దాన్ని ఆచరిస్తే అంతా సుఖసంతోషాలతో ఉంటారన్నది ఆయన నమ్మకం. అందుకే రామాయణంలోని నైతిక విలువల్ని నేటితరం పిల్లలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రామనారాయణం నిర్మాణానికి సంకల్పించారు. రూపాయి కూడా ఎవరి నుంచీ తీసుకోకుండా సొంత స్థలంలోనే 2004-05 సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. మూడేళ్లకు ఆలయం పనులు సగంలో ఉండగా 80 ఏళ్ల వయసులో నర్సింహమూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. తరవాత ఆయన వారసులు తండ్రి కలను నెరవేర్చడానికి పూనుకున్నారు. నిధుల ఇబ్బందులొస్తే కొంత స్థలం అమ్మి మరీ అడుగు ముందుకేశారు. అలా దాదాపు రూ.15 కోట్ల వ్యయంతో 2014 నాటికి గుడి నిర్మాణం పూర్తైంది.

అతి పెద్ద వేదపాఠశాల
రామనారాయణం ఆలయ ప్రాంగణంలోనే రెండెకరాల విస్తీర్ణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే వేదపాఠశాల ఉంది. ఇక్కడ 60 మందికి పైగా విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు. విద్యార్థులందరికీ ఉచిత విద్య, భోజనంతో పాటు పాఠశాలలో చేరినప్పుడే రూ.3 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. దేశంలోనే అతి పెద్ద వేదపాఠశాలగా పేరుగాంచిన ఈ ప్రాంగణంలో ఉచిత యోగ, ధనుర్విద్య, మెడిటేషన్‌, శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ వ్యక్తిత్వ వికాస తరగతులు సైతం నిర్వహిస్తున్నారు.
రామనారాయణానికి వెళ్లొద్దామా మరి!

- జి.వి.వి.సత్యనారాయణరెడ్డి, ఈనాడు, విజయనగరం
ఫొటోలు: సీహెచ్‌ సత్యనారాయణ

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.