close

బిర్యానీ ప్రియుల ‘ప్యారడైజ్‌’

చార్మినార్‌, గోల్కొండ, హుస్సేన్‌ సాగర్‌... ఎన్ని ప్రదేశాలు చుట్టొచ్చినా ప్యారడైజ్‌లో బిర్యానీ రుచిచూడనిదే హైదరాబాద్‌ పర్యటన పూర్తయినట్లు కాదు.  ఒకసారి అక్కడికి వెళ్లొచ్చాక ఎక్కడ బిర్యానీ తిన్నా దాన్ని ప్యారడైజ్‌ బిర్యానీతో పోల్చిచూడకుండా ఉండలేరెవరూ... ఆ రుచి అలాంటిది మరి! అసలీ ప్యారడైజ్‌ ఏమిటో, ఆ బిర్యానీ ఏమిటో, దానికి ఆ రుచీ గుర్తింపూ ఎలా వచ్చిందో... మనతో పంచుకుంటున్నారు ‘ప్యారడైజ్‌’ యజమాని అలీ హేమతి...

హైదరాబాద్‌కు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్యారడైజ్‌ బిర్యానీ మూలాలు ముంబయిలో ఉన్నాయి. అది... జులై, 1953. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కి దగ్గర్లో ప్యారడైజ్‌ పేరుతో సినిమా థియేటర్‌ నిర్మిస్తున్నారు. అదే సమయంలో నాన్న హుసేన్‌ హేమతి, మామయ్య. గులామ్‌ హుసేన్‌ ముంబయి నుంచి హైదరాబాద్‌ వలస వచ్చారు. ఇక్కడ హోటల్‌ పెట్టాలనుకున్నారు. ఇద్దరూ వెళ్లి థియేటర్‌ యజమాని అంజయ్యని కలిసి... మీరు అనుమతిస్తే ప్యారడైజ్‌ పేరుతోనే సినిమా హాల్‌లో క్యాంటీన్‌ను ఏర్పాటుచేస్తామన్నారు. అందుకు ఆయన అంగీకరించారు. బదులుగా నెలవారీ అద్దె చెల్లించాలన్నది ఒప్పందం. సెప్టెంబరు 1న ‘ప్యారడైజ్‌ కేఫ్‌’ను ప్రారంభించారు. కొద్దినెలల తర్వాత దాన్ని బిర్యానీ హోటల్‌గానూ మార్చారు. ప్రారంభం నుంచీ హోటల్‌కి మంచి గిరాకీ ఉండేది. హోటల్‌కు వస్తోన్న ఆదరణను చూసిన కొందరు వ్యాపారులూ, అంజయ్య సన్నిహితులూ తమకు క్యాంటిన్‌ అప్పగిస్తే అద్దె మాకంటే ఎక్కువ ఇస్తామని అడగడం మొదలుపెట్టారు. ‘వాళ్లకి మాట ఇచ్చాను. మాట తప్పలేను’ అని బదులిచ్చారట అంజయ్య. ఆయన చనిపోయాక వారి వారసుల నుంచి మావాళ్లు కేఫ్‌ ఉన్నవరకూ స్థలాన్ని కొన్నారు. తర్వాత కొన్నేళ్లకు మా నాన్న ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్యారడైజ్‌ కేఫ్‌ను ఆయనకి వదిలేసి సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఎదురుగా ‘ఆల్ఫా కేఫ్‌’ హోటల్‌ని ప్రారంభించారు మామయ్య. అంజయ్య మంచితనమే ప్యారడైజ్‌ విజయంలో తొలిమెట్టుగా నాన్నా, మామయ్యా నాకు చెప్పేవారు.

పైలట్‌ కోర్సు చేసి...
ప్యారడైజ్‌ కేఫ్‌ కాస్తా బిర్యానీ హోటల్‌గా మారి వినియోగదారులు ఎక్కువగా వస్తుండటంతో మా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. పిల్లల్ని బాగా చదివించారు. డిగ్రీ పూర్తిచేసిన నేను ‘తర్వాత ఏంటి’ అన్న ఆలోచనలో ఉన్నపుడు నా స్నేహితుడు పైలట్‌ శిక్షణ తీసుకుందామని సూచించాడు. నేనూ సరేనన్నాను. హైదరాబాద్‌లోనే పైలట్‌ కోర్సు చేశాం. శిక్షణ పూర్తయ్యాక ఎయిర్‌ ఇండియాలో పైలట్‌ ఉద్యోగానికి నేనూ, నా స్నేహితుడూ దరఖాస్తు చేసుకున్నాం. నేలమీద ఉంటున్నా నా ఆలోచనలూ, చూపులన్నీ ఆకాశంవైపే ఉండేవి. విమానాల్ని ఎలా నడపాలి, కొత్త ప్రాంతాలకు వెళ్లినపుడు ఇంటికి ఏం తీసుకురావాలి... లాంటి ఆలోచనలు వచ్చేవి. ఇలా ఊహల్లో ఉండగా ఓరోజు మా మామయ్య పిలిచి ‘ఉద్యోగాలు మనకు వద్దు, హోటల్‌ నిర్వహణ చూడు’ అన్నారు. అప్పటికి నాకు పాతికేళ్లు. అయితే నా మనసు అర్థం చేసుకున్నారేమో ‘ఒక పనిచెయ్‌... మూడు నెలలు మాత్రమే హోటల్‌ బాధ్యతలు తీసుకో... ఒకవేళ నచ్చకపోతే పైలట్‌గానే వెళ్లు’ అన్నారు. కాకతాళీయమో, విధి నిర్ణయమో తెలీదుగానీ, ప్యారడైజ్‌ రెస్టరెంట్‌ను ప్రారంభించిన రోజే (సెప్టెంబరు 1, 1953) నేను పుట్టడంతో ‘నువ్వు పుట్టాకే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయ’ని నాన్న నన్ను తెగ ముద్దుచేసేవారు. కాలేజీకి వచ్చాక సెలవుల్లో హోటల్‌కు రమ్మని చెప్పేవారు. నాకు ఇష్టంలేదని చెప్పినా.. ‘హోటల్‌కు వచ్చి నువ్వు గమనించిన విషయాలన్నీ నాకు చెప్పు చాలు’ అనేవారు. ఏదో మొక్కుబడిగా ఒకట్రెండు విషయాల్ని చెప్పేవాడిని. అలాంటి నాకు, హోటల్‌ బాధ్యతలు తీసుకున్న రెండో రోజే నా భవిష్యత్తు ఇక్కడేనని అర్థమైంది. ఆ మాట మామయ్యకి చెప్పి నాకు కొన్నాళ్లు మార్గనిర్దేశం చేయమని అడిగాను. మూడు నెలల తర్వాత హోటల్‌ బాధ్యతల్ని పూర్తిగా తీసుకున్నాను.

కుటుంబాలకు ఆహ్వానం..
ప్యారడైజ్‌ థియేటర్‌ను అంజయ్య వారసులు బాగా అభివృద్ధి చేశారు. 1983 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఏసీ థియేటర్‌గా ఆధునికీకరించారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు హోటల్‌కి విపరీతమైన రద్దీ ఉండేది. వారం తర్వాత గిరాకీ తగ్గిపోయేది. భోజన ప్రియులను హోటల్‌కు ఎలా రప్పించాలని ఆలోచిస్తుండగా... ఒకరోజు మా మామయ్య వచ్చారు. ‘థియేటర్‌’ వైపు దృష్టి కేంద్రీకరిస్తే వారం రోజులు మాత్రమే గిరాకీ ఉంటుంది.. సికింద్రాబాద్‌, ప్రధాన రహదారిపైన దృష్టి సారిస్తే.. రోజూ హోటల్‌కు వినియోగదారులు వస్తారు. వారిని ఎలా హోటల్‌కు రప్పించాలన్నది నీ పనితీరుకు పరీక్ష’ అన్నారు. నాలుగైదు రోజులు ఆలోచించాక... ప్యారడైజ్‌ హోటల్‌ పేరును ‘ఫ్యామిలీ రెస్టరెంట్‌’గా మార్చాం. 100 మంది కూర్చోడానికి చోటున్న హోటల్‌పైన ఒక అంతస్తు వేసి 300 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లుచేశాం. ఇక అప్పట్నుంచి మేం వెనుదిరిగి చూసుకోలేదు. హైదరాబాదీయుల ఆదరణతో అగ్రస్థానానికి దూసుకెళ్లాం..

ప్యారడైజ్‌లో బిర్యానీ రుచి గొప్పతనం గురించి క్రమంగా నగరమంతా వ్యాపించింది. సామాన్యులతోపాటు ప్రభుత్వ అధికారులూ, వ్యాపారులూ, నగరంలోని ప్రముఖులూ తరచూ వచ్చేవారు. ఈ క్రమంలో ఓరోజు బిర్యానీ తినేందుకు వచ్చిన ప్రముఖ నటి దియామీర్జా తండ్రి ఫ్రాంక్‌ హెన్రిక్‌ భోంచేశాక నన్ను కలిశారు. జర్మనీకి చెందిన హెన్రిక్‌ ఆర్కిటెక్ట్‌గా అప్పటికే అద్భుత కట్టడాలకు డిజైన్లు ఇచ్చారు. ప్యారడైజ్‌ హోటల్‌కు ఓ కొత్తరూపు ఇస్తానంటే నేనూ అంగీకరించాను. ఏడాదిన్నర వ్యవధిలో ప్యారడైజ్‌ హోటల్‌ రూపురేఖలే మారిపోయాయి. రెండు అంతస్తుల్లో ఆ కూడలిలోనే ఆకర్షణీయ భవనంగా నిలిచింది. ఆ తర్వాత నుంచి రద్దీకి తగ్గట్టు సేవలు అందించగలిగాం. బిర్యానీ తినేందుకు వచ్చేవారి సంఖ్య వేలల్లోనే ఉండేది. మా పక్కనే హోటల్‌ నిర్వహిస్తున్న అబ్దుల్లా... తాను హోటల్‌ను నిర్వహించలేనంటూ తన హోటల్‌ను 1997లో మాకు అప్పగించాడు. ఆ హోటల్‌నూ కలుపుకున్న తర్వాత హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్కిటెక్టులతో ప్యారడైజ్‌ హోటల్‌ను మరోసారి నవీకరించాం. ఎంత రుచిగా ఉన్నాకూడా బిర్యానీని రోజూ ఎవరూ తినలేరు. కానీ వినియోగదారుల్ని తరచూ రప్పించలేకపోతే మా వ్యాపారం లాభసాటి కాదు. ఒక్కసారి ప్యారడైజ్‌ బిర్యానీ తింటే మళ్లీ మళ్లీ రావాలని అనుకోవాలి. అందుకే బిర్యానీని రుచికరంగా తయారు చేసేందుకు నిత్యం ప్రయోగాలు చేస్తున్నాం. బిర్యానీ రుచిగా ఉండాలంటే దినుసులు, బాస్మతి బియ్యం, ఉప్పు, కారం, మసాలా సరైన పాళ్లలో కుదరాలి. మారుతున్న భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా- మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీతోపాటు కబాబ్‌లూ వెజ్‌ బిర్యానీ...ఇలా ప్రతిపూట 270 రకాలు వండుతుంటాం. మా హోటల్‌లో ప్రతి వంటకానికీ మాదైన ఫార్ములా ఉంటుంది.

సెలెబ్రిటీలు... మధుర జ్ఞాపకాలు!
ప్యారడైజ్‌ బిర్యానీ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతో సెలెబ్రిటీలూ మా హోటల్‌కు రావడం మొదలైంది. బిర్యానీ, కబాబ్స్‌ తిని ‘భోజనం చాలాబాగుంది భాయ్‌...’ అనేవారు. సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్‌ గాంధీ, అమీర్‌ఖాన్‌, సునీల్‌ షెట్టి... ఇలా ఎందరో ప్రముఖులు మా హోటల్‌కి వచ్చారు. ప్యారడైజ్‌ హోటల్‌తో చాలామంది వినియోగదారులు అనుబంధాన్ని పెంచుకున్నారు. మా హోటల్‌కు 30ఏళ్ల క్రితం వచ్చినవాళ్లు ఇప్పటికీ వస్తున్నారు. వాళ్లలో కొందరైతే తాతలయ్యారు. వారి మనవళ్లతో వచ్చి... ‘ఈ హోటల్‌కు నేనూ, మీనాన్నా వచ్చేవాళ్లం’ అని వాళ్లకి చెబుతుంటారు. ఆ విషయాలు నాతోనూ పంచుకుంటారు కొందరు. అలా మాతో ఉన్న అనుబంధాన్ని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది.

ప్యారడైజ్‌ థియేటర్‌ తర్వాత కాలంలో సరిగ్గా నడవలేదు. దాంతో ఆ స్థలాన్ని అమ్మేశారు. అక్కడ ప్రస్తుతం ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌ నడుస్తోంది. కానీ ప్యారడైజ్‌ పేరు మాతోపాటు ఉండిపోయింది. మా హోటల్‌ను అభివృద్ది చేయడం, పక్కనున్న హోటల్‌ని కూడా ప్యారడైజ్‌ కేఫ్‌గా మార్చడంతో ఇటు హోటల్‌, అటు కేఫ్‌... రెంటికీ వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగడం మొదలయ్యింది. హైదరాబాద్‌లో ఐటీరంగంతోపాటు ఇతర రంగాల్లోనూ ఉపాథి అవకాశాలు పెరగడంతో మా హోటల్‌కు వచ్చేవారి సంఖ్యా పెరిగింది. ఒకేసారి 1500 మందికి ఇక్కడ సేవలు అందించగలం. అయినా 2004 తర్వాత భోజనం చేసేందుకు వచ్చి వేచిచూసే వారి సంఖ్య బాగా పెరిగింది. మొదట్నుంచీ ప్యారడైజ్‌ హోటల్‌ ఒక్కటే ఉండాలని అనుకునేవాణ్ని. కానీ హోటల్‌కి వచ్చేవారిలో చాలామంది గంటకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి రావడంతో నగరంలో శాఖలు ఏర్పాటుచేయాలన్న నిర్ణయానికి వచ్చాను. మాసాబ్‌ట్యాంక్‌లో పదేళ్ల క్రితం ‘ప్యారడైజ్‌ టేక్‌ అవే’ పేరుతో పార్శిళ్లు మాత్రమే అందించే విభాగాన్ని ప్రారంభించాం. 2013లో శిల్పారామం పక్కన ప్యారడైజ్‌ హోటల్‌ను ఆరంభించాం. ఆ రెండు చోట్లా మంచి డిమాండ్‌ ఉంటుంది. తర్వాత నగరంతోపాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించుకుంటూ పోయాం. ప్రస్తుతం మాకు 36చోట్ల బ్రాంచీలు ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, వైజాగ్‌, చెన్నై, బెంగళూరు, దిల్లీ... ఇలా దేశం నలుమూలలా, దుబాయిలోనూ శాఖల్ని తెరిచాం.

శ్రమతోనే విజయం...
హైదరాబాద్‌లో ప్యారడైజ్‌తోపాటు బిర్యానీ అందించే హోటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ప్యారడైజ్‌కు మాత్రమే ప్రత్యేకమైన పేరుందంటే అందుకు ప్రధాన కారణం నిరంతర శ్రమ. రోజుకు 18 గంటలు పనిచేస్తాను. బిర్యానీతోపాటు చాయ్‌, బిస్కెట్‌, ఇతర బేకరీ ఉత్పత్తులూ తయారుచేయడానికి దాదాపు మూడున్నరవేల మంది శ్రమిస్తున్నారు. ఏడాదికి రూ.360 కోట్ల టర్నోవర్‌ ఉంది. మిగతా వారితో పోల్చితే తక్కువ ధరలో ఆహారాన్ని రుచితో, శుచితో అందించడం మా లక్ష్యంగా
నిర్దేశించుకున్నాం. ప్యారడైజ్‌ హోటల్‌కు అనుబంధంగా బార్‌ ఏర్పాటు చేయాలంటూ నా మిత్రులూ, శ్రేయోభిలాషులూ ఒత్తిడి తీసుకువచ్చారు. వారందరికీ ఒకే సమాధానం చెప్పాను. అదేంటంటే.. మాది కుటుంబ హోటల్‌ (ఫ్యామిలీ రెస్టరెంట్‌) మద్యం సరఫరా చేయం. బార్‌ లేకపోయినా ప్యారడైజ్‌ హోటల్‌కు ఇంటిల్లిపాదీ వస్తున్నారు. భవిష్యత్తులోనూ మాపై ఇదే ఆదరణ ఉంటుందని విశ్వసిస్తున్నా. ఒక ఏడాది(2017)లో అత్యధికంగా 70,44,289 బిర్యానీలు అమ్మి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాం. హైదరాబాదీయులూ, తెలుగురాష్ట్రాల ప్రజల అభిమానంతో త్వరలో ఆ సంఖ్యని లక్షకు చేర్చి గిన్నీస్‌ రికార్డ్‌ను సృష్టించబోతున్నాం. నా లక్ష్యం ఒక్కటే, హైదరాబాద్‌ అంటే చార్మినార్‌ గుర్తొచ్చినట్టు... బిర్యానీ అంటే ప్యారడైజ్‌ గుర్తురావాలి. ఆ లక్ష్యంతోనే ప్రతి ఉదయాన్నీ ప్రారంభిస్తాను.

- బి.సునీల్‌కుమార్‌ ఈనాడు హైదరాబాద్‌
ఫొటోలు: రఘు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.