close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆలివ్‌... జుట్టుకి టానిక్‌..!

చిన్నవయసులోనే జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం చాలామందిలో చూస్తుంటాం. మనదేశంలో అయితే యాభై శాతం మంది మహిళల్లో ఈ సమస్య ఉందట. అయితే ఈ సమస్యని ఆలివ్‌ నూనెతో చాలావరకూ తగ్గించుకోవచ్చు అంటున్నారు సౌందర్యనిపుణులు. ఎందుకంటే ఆలివ్‌ నూనెలో ఉండే విటమిన్‌-ఇ, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దాంతో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతోబాటు కుదుళ్లు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. ముఖ్యంగా చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల మంచి పలితం ఉంటుంది. అలాగే ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల ఎండవేడిమి కారణంగా ఆగిపోయిన మెలనిన్‌ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తికావడంతో జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటుంది. అంతేకాదు, రకరకాల షాంపూల్లోని రసాయనాలవల్ల దెబ్బతిన్న జుట్టుని కూడా కాపాడుతుంది. కాబట్టి ఆలివ్‌నూనెని పట్టించి, బాగా మర్దన చేశాక పలుచని బట్ట లేదా షవర్‌ క్యాప్‌ పెట్టి సుమారు అరగంటసేపు ఉంచాక షాంపూ చేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.


కాలుష్యంతో డయాబెటిస్‌!

వయసుతో సంబంధం లేదు. లింగ భేదం లేదు. ఎవరిని కదిలించినా మాకు షుగర్‌ ఉంది అంటే మాకుంది అనేవాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి ఆనువంశికతతోబాటు జీవనశైలిలో వచ్చిన మార్పులే చాలావరకూ కారణమని ఇంతకాలం భావిస్తూ వచ్చారు. అయితే గత పదకొండేళ్లుగా ఐక్యరాజ్యసమితికి చెందిన పర్యావరణ బృందమూ చైనా కాలుష్య నియంత్రణమండలీ కలిసి నిర్వహించిన అధ్యయనంలో- దీర్ఘకాలంపాటు వాతావరణ కాలుష్యానికి గురయినవాళ్లలో అత్యధికశాతం మంది మధుమేహం బారిన పడుతున్నట్లు గుర్తించారు. గాలిలో క్యూబిక్‌మీటరుకి 10 మైక్రోగ్రాముల కలుషిత వాయువులు ఉన్నట్లయితే-మధ్యవయస్కులూ స్త్రీలూ, బరువు తక్కువగా ఉన్నవాళ్లూ మధుమేహానికి గురయ్యే ప్రమాదం ఉందని తేలిందట. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికశాతం మధుమేహులు చైనాలోనే ఉన్నారు. అది కూడా వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న బీజింగ్‌వంటి నగరాల్లోనే ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో అత్యధికశాతం మంది మధుమేహం బారినపడుతుండటానికి కారణం వాయుకాలుష్యమే కావచ్చని సదరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


నిద్రలేమి ఆనువంశికమేనా?!

చాలామందికి మంచి నిద్ర ఓ సమస్యే. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఓ పట్టాన నిద్ర పట్టదు. ఆహారపుటలవాట్లు మార్చుకున్నా పెద్దగా ఫలితం ఉండదు. అయితే అలా ఎవరైనా నిద్ర పట్టని సమస్యతో బాధపడుతుంటే వాళ్ల వంశచరిత్రని తిరగేస్తే- అలాంటి సమస్య తప్పక కనిపించే అవకాశం ఉందని వర్జీనియా కామన్వెల్త్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే నిద్రలేమి అనేది మహిళల్లో అయితే
59 శాతం, పురుషుల్లో 38 శాతం ఆనువంశికంగా వచ్చే అవకాశం ఉందని వాళ్ల పరిశీలనలో తేలింది. ముఖ్యంగా జీవగడియారాన్ని ప్రభావితం చేసే జన్యువులే నిద్రకీ కారణమవుతున్నాయనీ కాబట్టి అవి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందనీ చెప్పుకొస్తున్నారు. అయితే అదేసమయంలో ఒత్తిడి కూడా జన్యువుల్ని ప్రభావితం చేస్తుందనీ ఫలితంగా వాటిల్లో మార్పులు చోటుచేసుకుని నిద్రలేమికి దారితీసే అవకాశం కూడా ఉందనీ అంటున్నారు.


కర్బూజ తింటున్నారా?

వేసవి రాగానే మార్కెట్లో పుచ్చకాయలతో పాటు కనిపించే మరో పండు కర్బూజ. చప్పగా ఉంటుందన్న కారణంతో దీనివైపు చాలామంది చూడరుకానీ ఇది ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో... కర్జూజపండ్లలో విటమిన్‌-సి ఎక్కువగా ఉండటంతో ఇది తెల్లరక్తకణాలను పెంచడంతోబాటు, ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించడం ద్వారా వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పీచు అధికంగా ఉండటంతో జీర్ణక్రియ బాగుంటుంది. అదేసమయంలో కాస్త తినగానే పొట్ట నిండినట్లుగా అయిపోతుంది. పైగా క్యాలరీలు తక్కువ. దాంతో బరువూ పెరగకుండా ఉంటారు.

* విటమిన్‌-ఎతోబాటు ఇతర కెరోటినాయిడ్లూ పుష్కలంగా ఉండటంతో కంటి కండరాలు క్షీణించకుండా చూస్తుంది.
* ఇందులో పుష్కలంగా ఉండే ఫోలేట్లు గర్భిణీలకి ఎంతో మేలు చేస్తాయి. పైగా ఈ ఫోలేట్లు క్యాన్సర్ల బారినపడకుండానూ రక్షిస్తాయి.

* ఇందులోని పొటాషియం రక్త సరఫరాకి తోడ్పడటంతో హృద్రోగాలు రాకుండా ఉంటాయి. బీపీ కూడా రాదు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా మధుమేహాన్నీ నియంత్రిస్తుంది. మూత్రపిండాల
పనితీరునీ పెంపొందిస్తుంది.

* కర్బూజలో నీటిశాతం అధికంగా ఉండటంతో చర్మం పొడిబారిపోకుండా చూస్తుంది. ఇంకా ఇందులోని పోషకాలు శరీరంలోని టాక్సిన్లు బయటకు పోయేందుకు తోడ్పడటంతోబాటు ముడతల్నీ తగ్గిస్తాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.