close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓటేద్దాం రండి..!

ఎవరికేస్తారో మీ ఇష్టం. కానీ ఓటెయ్యండి. మీరు ఓటేసిన అభ్యర్థి గెలవవచ్చు, గెలవకపోవచ్చు. అయినా ఓటెయ్యండి. మార్పుకైనా తీర్పుకైనా ఒకటే దారి... ఓటు!

ఓటు హక్కుకు దూరంగా ఉండే పౌరులకు ఒకటే శిక్ష. అవినీతి, అధర్మ పాలనలో ఐదేళ్లూ మగ్గిపోవాల్సిరావడం!

* * *

గుడ్లురిమి చూస్తారు. కళ్లెర్రజేస్తారు. వేలెత్తి బెదిరిస్తారు. ఒళ్లెలా ఉందని రంకెలేస్తారు. అమ్మను వదలరు. జేజెమ్మను వదలరు. ఛీఛీ...వీశ్లా మన ప్రతినిధులు? అసలు, వీళ్లకెందుకు ఓటెయ్యాలి?
...ఇదేనా మీ సందేహం. ఇందుకేగా మీకంత అసహ్యం.
అయినా సరే, ఓటెయ్యాలి. పోలింగ్‌రోజు పొద్దున్నే వెళ్లి ఓటెయ్యాలి.
ఆ ఓటు వాళ్లను గెలిపించడానికి కాదు. చిత్తుగా ఓడించడానికి.
ఓటు ఓ ఆయుధం. ప్రభుత్వాల్నిమారుస్తుంది.
ఓటు ఓ ఆగ్రహం. దుష్టనేతల్ని దునుమాడుతుంది.
ఓటు ఓ వ్యక్తీకరణ. మన ప్రాథమ్యాలేమిటో, మనకెలాంటి పాలన కావాలో పాలకులకు అర్థమయ్యేలా చెబుతుంది.
ఓటు ఓ బాధ్యత. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్లంతా పాల్గొనితీరాల్సిన పవిత్ర ఉద్యమం.
రాజకీయాల్ని అసహ్యించుకుని ఒకరు, అవినీతికి రగిలిపోయి ఒకరు, అభ్యర్థి చరిత్ర తెలిశాక కడుపులో దేవినట్టనిపించి ఒకరు, మొత్తం వ్యవస్థంటేనే విరక్తి వచ్చి ఒకరు... ఆలోచించేవాళ్లూ ఆలోచించగలిగేవాళ్లూ కాస్తోకూస్తో బాధ్యతగా ఉండేవాళ్లంతా ఒక్కొక్కరే పోలింగ్‌కు దూరమైపోతే, ఓటేసేదెవరు?
పచ్చనోటు కోసమో, పావు సీసా మద్యం కోసమో హక్కును అమ్ముకునే కిరాయి మనుషులే. ఆ ఓట్లే, దుశ్శాసన సంతతికి శాసనసభ మెట్లవుతాయి.
ఆ ఉత్పాతం ఆగాలంటే, మనం నిర్లిప్తత వీడాలి. ప్రస్తుత ఎంపీల్లో చాలామంది యాభైశాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైన నియోజకవర్గాల నుంచి గెలిచినవారే. మహా అయితే ఏ పదిశాతం ఓట్లో తెచ్చుకున్నవారే. కచ్చితంగా చెప్పాలంటే, పాతికశాతం ప్రజలకు కూడా వాళ్లు ప్రతినిధులు కాదు.
జనామోదం లేనివాళ్లూ జనానికి మంచి చేయాలన్న ఆలోచనే లేనివాళ్లు చట్టసభలకెళ్తే, చేసేదెంత? మేసేదెంత?
ఆలోచించగలిగేవాళ్లు ఓటు వేయకపోతే, చట్టసభలు ఆలోచనలేనివాళ్లతో నిండిపోతాయి. జరుగుతున్నదదే.
ఈసారైనా స్తబ్దత వీడకుంటే, జరగబోయేదీ అదే.

* * *

పురాణాల్లో రక్తబీజుడి కథ ఉంది. ఆ రాక్షసుడి ఒంట్లోంచి నేలరాలిన ప్రతి రక్తపుబొట్టూ ఓ రక్తబీజుడు అవుతుంది. వేలమంది లక్షలమంది రాక్షసులు పుట్టుకొస్తారు. విష్ణుపరమాత్మ మహా లౌక్యంగా చంపేస్తాడా రాక్షసుడిని. మనం కూడా అంత లౌక్యంగా వ్యవహరించాల్సిన సమయమొచ్చింది.
ఎన్నికల్లో అవినీతిపరుడు పోటీచేస్తాడు. ఖూనీకోరు పోటీచేస్తాడు. కబ్జాదారు పోటీచేస్తాడు. రౌడీషీటర్‌ పోటీచేస్తాడు. ఒకే అభ్యర్థిలో ఈ దుర్లక్షణాలన్నీ ఉన్నా ఉండొచ్చు. అయినా మనం స్పందించం. షరామామూలే అన్నట్టు, ఓటెయ్యకుండా మిన్నకుండిపోతాం. దుష్టశక్తులన్నీ ధారపోసి అతనే గెలుస్తాడు. చట్టసభలకెశ్తాడు. చేతినిండా అధికారం. చెప్పేదేముంది? రక్తం పారిస్తాడు. పుర్రెలు తూకమేస్తాడు. శాతాలతో గోతాలు నింపుకుంటాడు. రాక్షస సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటాడు. వీధికో అనుచరుణ్ని తయారుచేసుకుంటాడు. ఐదేళ్లలో ఆ దండు దండిగా అవుతుంది.
ఆరోజే ఓటు హక్కుతో తుక్కుతుక్కుగా ఓడించి ఉంటే, కథ ఇంతదాకా వచ్చేది కాదు. అంతమంది రాజకీయ రక్తబీజులుపుట్టుకొచ్చేవారు కాదు.
దుష్టరాజకీయాలు గంజాయి మొక్కలాంటివి. అనుమానం రాగానే ఏరిపారేయాలి. లేదంటే, వనమంతా విస్తరిస్తాయి. అసలు పంటకే ఎసరుపెడతాయి.

* * *

నేను... నా భార్యాపిల్లలు...
నా సంపాదన... నా ఇల్లు...

ఇదే ప్రపంచమనుకుంటారు.
ఎన్నికలంటే, తమకసలు సంబంధం లేని వ్యవహారమనుకుంటారు. పోలింగ్‌బూత్‌ దాకా వెళ్లడమంటే, కాలాన్ని వృథా చేసుకోవడమేనని భావిస్తారు. ఎవరు గెలిస్తే ఏమిటన్న నిర్లక్ష్యమొకటి.
నిజమే, ఆ గంటో అరగంటో పిల్లలతో కబుర్లు చెప్పుకోవచ్చు. శ్రీమతికి వంటింట్లో సాయంచేయొచ్చు. టీవీలో సీరియళ్లు చూడొచ్చు. దినపత్రిక చదువుకోవచ్చు.
అదృష్టంకొద్దీ క్రికెట్‌ మ్యాచుంటే, బోలెడంత వినోదం.
కానీ, ఒక్కమాట.
మన జీవితాలకూ ఎన్నికలకూ అసలు సంబంధమే లేదనీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పెద్దగా ఒరిగేది లేదనీ అనుకుంటే మాత్రం పొరపాటే!
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్నీ ప్రజా జీవితాన్నీ వేరుచేసి చూడలేం. ఒకదానిపై ఒకటి తప్పక ప్రభావం చూపిస్తుంది.
మీరు ఇంట్లో కులాసాగా కాలక్షేపం చేస్తున్న సమయంలో, పోలింగ్‌బూత్‌లో ఓ ప్రజాప్రతినిధి ప్రాణం పోసుకుంటాడు. అతనే గనుక అసమర్థుడో అవినీతిపరుడో అయితే, ఆ దెబ్బ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుటుంబం మొత్తంమీదా పడుతుంది.
పిల్ల పెళ్లికి పనికొస్తుందని, శివార్లలో కొన్న ప్లాటునెవరో దర్జాగా కబ్జా చేస్తారు. ఆ పాపం ఎవరిదో సుస్పష్టం.
అబ్బాయి ఉద్యోగ ప్రయత్నానికి అడ్డగోలు సిఫార్సులు అడ్డుగా నిలుస్తాయి. ఆ ఒత్తిడి ఎవరిదో ఇంకా స్పష్టం.
వ్యాపారంలో మామూళ్లూ మామూలైపోతాయి. సర్కారీ ఆఫీసుల్లో పైరవీలు పెచ్చుపెరుగుతాయి. వ్యాపారికి లాభం లేదు. ఉద్యోగికి మనశ్శాంతి లేదు. శాంతికి భద్రత కరవవుతుంది. ఇల్లు దాటాలన్నా భయమే. ఒక్కసారిగా జీవితం సంక్షోభంలో పడిపోతుంది.
దీనికంతా కారణం ఎవరు? ఆ అసమర్థ ప్రతినిధో, అతని అనుచరులో కాదు. మనమే. అవును, మనమే! పోలింగ్‌బూత్‌కెళ్లి మంచి అభ్యర్థికి ఓటేసి ఉంటే, ఈ కష్టం తప్పేది.
ఎండిపోతుందేమో అన్న సందేహమొస్తే, కప్ప కూడా బావి దాటుతుంది.
మనం గడప దాటలేమా?

* * *

‘రోడ్లు చండాలంగా తయారయ్యాయి’
‘సచివాలయంలో ఒక్కపనీ జరగడం లేదు. లంచమో సిఫార్సో ఉండాల్సిందే’
‘ట్రాఫిక్‌ భయంకరంగా పెరిగిపోయింది’
‘అరె...డ్రైనేజీ ఇళ్లలోకి వచ్చేస్తోంది’
‘రోజూ నీళ్లన్నారు. రోజువిడిచి రోజు కూడా రావటం లేదు’
‘ఆ ఆకురౌడీ ఆగడాలు ఎక్కువయ్యాయి’
...చాలా ఫిర్యాదులున్నాయే!
ఇంతకీ మీరు గత ఎన్నికల్లో ఓటేశారా?
ఓటు బాధ్యత నెరవేర్చనివారికి నిలదీసే హక్కు లేదు. ఫిర్యాదు చేసే హక్కు లేదు. విమర్శించే హక్కు లేదు.
ఐదు నిమిషాల బద్ధకం, ఐదేళ్లపాటూ దేశ భవిష్యత్తును నిర్దేశించే సదవకాశాన్ని దూరం చేస్తుంది.

* * *

‘ఓటా, అంత తీరికెక్కడిది?’
...అని మాత్రం అనకండి. మీకంటే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్లూ మీకంటే పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్నవాళ్లూ మీకంటే ఎక్కువ బాధ్యతలు మోస్తున్నవాళ్లూ ఓపిగ్గా వరుసలో నిలబడి, తమ వంతు రాగానే ఓటేసి వస్తున్నారు. రాజస్థాన్‌లోని బర్మల్‌ గ్రామ ప్రజలు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వెశ్లాలంటే ఓ రోజు ముందే బయల్దేరాలి. ఎడారుల్లో ప్రయాణం చేయాలి. అయినా లెక్కచేయరు. అంతదూరమెళ్లి ఓటేసి వస్తారు. ఎవరో ఒకరు సాయం చేస్తే తప్ప కాలుకదపలేని అంధులూ వికలాంగులూ వయోధికులు కూడా పట్టుదలతో పోలింగ్‌ కేంద్రందాకా వెళ్తున్నారు. ఎప్పుడు ఏ ఉగ్రవాదులు తెగబడతారో తెలియనంత అనిశ్చితి ఉన్నా, అడుగడుగునా తుపాకులు
భయపెడుతున్నా...కాశ్మీరీలు గత ఎన్నికల్లో ధైర్యంగా ఓటేసివచ్చారు.
ఆ స్ఫూర్తి అందర్లోనూ రావాలి.
ఓటంటే నచ్చిన అభ్యర్థిని గెలిపించడం, నచ్చని అభ్యర్థిని ఓడించడం ఒక్కటే కాదు...ఓ వ్యవస్థలో పాలుపంచుకోవడం.
అమర్‌ కృష్ణమూర్తి, ఆదిత్య చల్లా, సురేంద్ర శ్రీవాత్సవ...వీళ్లంతా మనలాంటి మామూలు మనుషులే. కానీ ప్రజాస్వామ్యం మీద మనకంటే ఎక్కువ నమ్మకం, ఎనలేని గౌరవం. అందుకే లక్షణమైన ఉద్యోగాల్ని కాదనుకుని ‘జాగోరే’ వంటి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆ యువకుల్లా కెరీర్‌ను త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓటేసి వస్తే చాలు, కోటి సత్కార్యాలు చేసినంత ఫలం.

* * *

ప్రియమైన యువతా...
మీరు స్పీడో మీటరుకు ముచ్చెమటలు పట్టించగలరు. నెక్లెస్‌రోడ్డు మీద కట్స్‌ కొట్టి కాలర్‌ ఎగరేయగలరు. వీకెండ్‌ పార్టీలిచ్చి హీరో అయిపోగలరు.       క్యాంపస్‌ ఫెస్టివల్లో ప్రైజులు సాధించి శభాష్‌ అనిపించుకోగలరు. చదువైపోగానే ప్లేస్‌మెంట్‌ తెచ్చుకోగలరు.
వీటన్నిటికంటే తృప్తినిచ్చే విషయం ఇంకొకటుంది... ఓటు హక్కును వినియోగించుకోవడం.
ఒక్కసారి ఊహించుకోండి, ఓటు ఎన్ని ‘ఎడ్వెంచర్లు’ చేస్తుందో!
మీరు గెలిపించే అభ్యర్థి భవిష్యత్తులో మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు.
మీరు తిరస్కరించే వ్యక్తి, కుబేరుడైనా తలపండిన రాజకీయ యోధుడైనా తలవంచుకు వెశ్లాల్సిందే. అదే ప్రజాస్వామ్యంలోని అద్భుతం! ఆ ‘థ్రిల్‌’కు దూరం కాకండి.
అభ్యర్థుల మంచిచెడులను విశ్లేషించిన అనుభవం...కెరీర్‌లోనూ పనికొస్తుంది. నాయకత్వ లక్షణానికి పునాది అవుతుంది.
అందులోనూ ప్రస్తుత ఎన్నికల్లో మీ ఓట్లే కీలకం. అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది పద్దెనిమిదేళ్ల నుంచి పాతికేళ్ల మధ్య కుర్రాళ్లే. యువతరం వాటా... పాతికశాతం!
ఏదో ఒకరోజు మీరంతా పెద్దపెద్ద సంస్థలకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అధినేతలే కావచ్చు. అవన్నీ ఓటరు హోదా ముందు దిగదుడుపే. ‘ప్రపంచంలో ఏ పదవీ ఓటరు బాధ్యతకంటే గొప్పది కాదు’ అంటారు ఫెలిక్స్‌ ఫ్రాంక్‌ఫర్టర్‌ అనే పెద్దమనిషి.
రాక్‌ ద ఓట్‌!

రావోయి ఓటరన్నా.

కారణం ఏదైతేనేం, ప్రజల్లో ఓటెయ్యాలన్న ఉత్సాహం తగ్గుతోంది. వరుసలో నిలబడే ఓపిక నశిస్తోంది. అసలు ఓటర్ల జాబితాలో పేరు నమోదు గురించి ఆలోచించేవారే లేరు. దీంతో ఏటికేడాదీ ఓటింగ్‌శాతం పడిపోతోంది. కానీ పోటీచేసేవారు మాత్రం ఎక్కువైపోతున్నారు. దీంతో ఎన్నోకొన్ని ఓట్లు పోలయినా...అవీ అభ్యర్థులవారీగా చీలిపోతున్నాయి. మొత్తం ఓట్లలో ఇరవై శాతమొచ్చినా చాలు, అభ్యర్థి గట్టెక్కే పరిస్థితులున్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది 3,000లోపు ఆధిక్యంతో గట్టెక్కారు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఐదు వేలలోపు మెజారిటీతో ఊపిరిపీల్చుకున్నవారు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 45మంది దాకా ఉన్నారు. ఆ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైకాపా అభ్యర్థి మెజారిటీ 12 ఓట్లు! ఇక, 1989 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి మెజారిటీ అక్షరాలా తొమ్మిది ఓట్లు! 2007 మేలో ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గోవింద్‌నగర్‌ నియోజకవర్గంలోని 2.42 లక్షల ఓటర్లలో...లక్షా పదివేలమంది మాత్రమే ఓటేశారు. సుమారు ముప్ఫై వేల ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలిచాడు. అంటే, మొత్తం ఓట్లలో దాదాపు 12శాతం. సగానికి సగం మంది ఓటర్లు పోలింగ్‌బూత్‌ మొహమే చూడనప్పుడు, ఇంతకంటే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయి?

తప్పదు...వేయాల్సిందే!

బద్ధకిస్తే బడితపూజే. సాకులు చెబితే వాతలే. ఆ దేశాల్లో ఓటెయ్యకపోతే జరిమానా విధిస్తారు. కట్టకపోతే, జైలు శిక్ష తప్పకపోవచ్చు. బెల్జియం, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, అర్జెంటీనా, ఆస్ట్రియా, సైప్రస్‌, పెరు, గ్రీస్‌, బొలీవియా...ఆ కోవలోకే వస్తాయి. 1892లోనే బెల్జియం ఓటును తప్పనిసరి చేసింది. 1924లో ఆస్ట్రేలియా కూడా ఆ దార్లోనే నడిచింది. అక్కడ ఓటెయ్యకపోతే, 20 నుంచి 50 డాలర్ల జరిమానా తప్పదు. లేదంటే జైలుకెశ్లాలి. జరిమానాలకూ జైలు శిక్షలకూ మాటవినకపోతే, మళ్లీమళ్లీ డుమ్మా కొడితే ఏకంగా ఓటర్ల జాబితాలోంచి పేరు తీసేస్తారు. సింగపూర్‌లోనూ దాదాపుగా ఇదే పద్ధతి. బొలీవియాలో అయితే, ఏకంగా జీతంలో కోత విధిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్సూ పాస్‌పోర్టూ రద్దు చేసే దేశాలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఓటును తప్పనిసరి చేయాలంటూ జాతీయ రాజ్యాంగ పనితీరు సమీక్ష సంఘం సిఫార్సు చేసింది.

ఒక్క ఓటే...

‘నేనోక్కడినే ఓటు వేయకపోతే ఏమౌతుంది? ఒక్క ఓటుతో అభ్యర్థి గెలుస్తాడా? ప్రభుత్వాలు మారతాయా?’ అని వాదిస్తూ ఓటు బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూసేవారూ ఉన్నారు. అందరూ అలానే అనుకుంటే, పరిస్థితి రాజుగారి కథలా మారిపోతుంది. పాల పాత్రలన్నీ నీళ్లతో నిండిపోతాయి. చట్టసభల్లో అయితే ఆ ఒక్క ఓటే కీలకమైన సందర్భాలు లెక్కలేనన్ని. 2008లో జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సి.పి జోషి ఒక్క ఓటు తేడాతో భాజపా అభ్యర్థి కళ్యాణ్‌ చౌహాన్‌ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే సి.పి జోషి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా వచ్చి ఉండేది. కానీ ఒక్క ఓటు తేడాతో అంతా తారుమారైంది. ‘లెక్కింపులో తేడా వచ్చిందేమో’ అన్న ఆయన సందేహాన్ని తీర్చేందుకు ఎన్నికల కమిషన్‌ రెండోసారి కూడా లెక్కించింది. అయినా తేడా రాలేదు. తీర్పు మారలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన భార్య, తల్లి, వ్యక్తిగత డ్రైవర్‌ ఆ ఎన్నికల్లో ఓటు వెయ్యకపోవడం. ఆరోజు జోషీ భార్య, తల్లి ఓటెయ్యడం మాని ఆయన గెలుపుకోసం ప్రార్థనలు చేసేందుకు గుడికి వెళ్లారట. అందుకే, ఎన్నికల కమిషన్‌ తర్వాతి ఎన్నికల్లో ఆయన విషయాన్ని ఉదాహరణగా చెప్పి ప్రతి ఓటూ విలువైందే అంటూ హితబోధ చేయడం మొదలుపెట్టింది.
2004లో కర్ణాటకలోని సంతెమారహళ్లి నియోజకవర్గం నుంచి జనతాదళ్‌ తరఫున పోటీ చేసిన ఏఆర్‌ కృష్ణమూర్తి కూడా ప్రత్యర్థి ఆర్‌.ధృవనారాయణ కన్నా ఒక్కఓటు తక్కువ రావడంతో ఎమ్మెల్యే అయ్యే అధికారాన్ని కోల్పోయాడు. విచిత్రం ఏంటంటే తన డ్రైవర్‌ ఓటు వేసొస్తానంటే కృష్ణమూర్తి సమయం లేదంటూ అడ్డుకున్నారట.
1999లో అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చడానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం మారిపోయింది.
ఒక్క ఓటు ఆధిక్యంతోనే జాన్‌క్విన్సీ ఆడమ్‌ అమెరికా ఆరో అధ్యక్షుడయ్యాడు. ఒక్క ఓటే ఫ్రాన్స్‌ని రాచరికం నుంచి గణతంత్ర దేశంగా మార్చింది.

* * *

బెంగుళూరులో ఐదారేళ్ల చిన్నారులు చిల్డ్రన్స్‌ మూమెంట్‌ ఫర్‌ సివిక్‌ అవేర్‌నెస్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ‘మా కోసమైనా ఓటేయండి’...అంటూ నినాదాలు చేస్తుంటే పెద్దలంతా విడ్డూరంగా చూశారు.
‘పసిపిల్లలకు రాజకీయాలేమి’టని గొణుక్కున్నవారూ ఉన్నారు.
దురదృష్టం ఏమిటంటే, మన దృష్టిలో ‘రాజకీయం’ అంటరానిదిగానో ఆటంబాంబుగానో మారిపోయింది.
ఉచ్ఛరించకూడని మాటగా మారిపోయింది. తలుచుకోడానికీ పనికిరానంత అపవిత్రమైపోయింది. పాల్గొనడానికి వీల్లేనంత చండాలమైపోయింది.
కానీ, మనల్ని పాలించేది రాజకీయం. ఖజానాలోని మన డబ్బుతో ఏం చేయాలో నిర్ణయించేది రాజకీయం. మన ఉద్యోగాలు ఉండాలో ఊడాలో నిర్ణయించేది రాజకీయం. మనమెక్కే రైలు నడవాలో వద్దో నిర్ణయించేది రాజకీయం. మనం తినాలో పస్తులుండాలో నిర్ణయించేది రాజకీయం. మొత్తంగా, రాజకీయమే మన జీవితాల్ని నడిపిస్తోంది. అలాంటప్పుడు, రాజకీయాల గురించి ఆలోచించకపోతే ఎలా? ఆందోళన పడకపోతే ఎలా?
నిజంగా, వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే, ముందు రాజకీయాలతోనే మొదలుపెట్టాలి.
ఓటు వేయడంతో పని ప్రారంభించాలి.
‘యూత్‌ ఫర్‌ ఛేంజ్‌’ కుర్రాళ్లు చెప్పినట్టు...
‘ఓట్‌ తో కరో... బద్లేగా హిందుస్థాన్‌!’
నిజమే. చర్చలూ వాదనలూ విజన్లూ విశ్లేషణలూ తర్వాత... ముందు,

ఓటేద్దాం పదండి!

(పునర్ముద్రితం)

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.