close
బీపీనా... ఇవి తినండి!

రక్తపోటు ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పక తీసుకుంటే దీర్ఘకాలంలో సమస్య తగ్గడంతోబాటు దాని కారణంగా హృద్రోగాలూ పక్షవాతం, మూత్రపిండ వ్యాధులూ రాకుండా ఉంటాయి.
* భోజనానంతరం బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలను స్నాక్స్‌లా తింటే అందులో ఉండే ఆంథోసైనిన్లవల్ల బీపీ తగ్గే అవకాశం ఉంది.
* అరటిపండ్లలోని పొటాషియం ఎంతో మేలుచేస్తుంది. చిలగడదుంపలు, కొబ్బరినీళ్లు, పుట్టగొడుగులు, కర్బూజాల్లో కూడా పొటాషియం లభ్యమవుతుంది.
* బీపీ రోగులకి బీట్‌రూట్‌ మంచి మందు. రోజూ పావులీటరు బీట్‌రూట్‌ రసం తాగితే నాలుగు వారాలకే బీపీ అదుపులో ఉంటుంది.
* పుచ్చలోని సిట్రులీన్‌ అనే అమైనోఆమ్లం నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తప్రసరణ వేగాన్ని పెంచి బీపీని తగ్గిస్తుంది.
* బీపీ రోగులు భోజనంలో భాగంగా ఏదో ఒకపూట ఓట్స్‌ తీసుకున్నా మంచిదే. అందులో పీచు రూపంలో ఉండే బీటాగ్లూకాన్‌ రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతంతోబాటు బీపీనీ తగ్గిస్తుందట
* నైట్రేట్లు అధికశాతంలో ఉండే పాలకూర, క్యాబేజీ, మెంతికూర, ఆవకూర... కూడా బీపీరోగులకి ఎంతో మేలు చేస్తాయి.
* సహజ యాంటీబయోటిక్‌ అయిన వెల్లుల్లి నైట్రిక్‌ ఆక్సైడ్‌ను పెంచడం ద్వారా బీపీని అదుపులో ఉంచుతుంది. కాబట్టి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బల్ని తిన్నా ఫలితం ఉంటుంది.
* యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మరసాన్ని రోజూ ఓ కప్పు తాగినా మేలే. పిస్తా, బాదం కూడా బీపీరోగులకి మంచి ఆహారం. సో, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉప్పు, కెఫీన్‌... వంటి వాటిని తగ్గిస్తే బీపీని నియంత్రించడం పెద్ద కష్టమేం కాదు.


ఒంటరితనమూ మంచిదే!

కొన్ని సందర్భాల్లో టీనేజీ పిల్లలు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. అలా ఉన్నంత మాత్రాన అదేదో వాళ్లు సమాజానికి దూరమయిపోయారనో డిప్రెషన్‌లో ఉన్నారనో అనుకోవడం పొరబాటు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకి చెందిన పరిశోధకులు. కావాలని కుటుంబసభ్యులుగానీ స్నేహితులుగానీ వాళ్లను ఒంటరి చేస్తే సమస్యగానీ, వాళ్లంతట వాళ్లే కొంతకాలం ఒంటరిగా గడపాలని కోరుకుంటే మాత్రం అది వాళ్ల అభివృద్ధికి సంకేతంగానే భావించాలట. ఆ సమయంలో వాళ్లు తమ శక్తిసామర్థ్యాలేమిటో తెలుసుకోవాలనీ తాము ఏ రంగంలోకి వెళ్లాలీ అన్నది నిర్ణయించుకునే దిశలో కూడా కొందరు పిల్లలు అలా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని పేర్కొంటున్నారు. అందుకే  ఒంటరితనాన్ని కోరుకోవడానికీ ఒంటరిగా ఫీలవడానికీ తేడా ఉందని గుర్తించాలి అని చెబుతున్నారు.


కసరత్తులతో మధుమేహం దూరం!

చాలామంది కండలు పెంచేందుకు బరువులు ఎత్తుతూ కసరత్తులు చేస్తుంటారు. అమ్మాయిలైతే అందమైన శరీరాకృతి కోసమో లేదా ఫిట్‌గా ఉండేందుకో రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. కారణమేదయినా ఈ రకమైన కసరత్తుల వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది అంటున్నారు మేయో క్లినిక్‌ పరిశోధకులు. ఇందుకోసం కొందరు వ్యక్తుల్ని ఎంపిక చేసి వాళ్ల వ్యాయామ ఫలితాలను పరిశీలించినప్పుడు- బరువు తగ్గడంతోబాటు క్లోమగ్రంథి పనితీరూ మెరుగయినట్లు గుర్తించారు. అంటే రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు పేరుకోకుండా ఉండటంతోబాటు కొవ్వు కూడా కరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది అని వివరిస్తున్నారు. అంతేకాదు, ఈ రకమైన వ్యాయామాల వల్ల ఛాతీ చుట్టుకొలత కూడా తగ్గుతుందట.


చెమట పొక్కులు తగ్గేదెలా?

వేసవిలో కొందరికి- ముఖ్యంగా చిన్నపిల్లలకి చెమట పొక్కులు రావడం చూస్తుంటాం. చర్మంమీద ఉండే రంధ్రాలు పూడుకుపోవడం, చర్మం రాపిడికి గురవడం... వంటి కారణాల వల్ల ఇవి వస్తుంటాయి. కొన్ని చిట్కాల ద్వారా వాటిని సులభంగా తగ్గించవచ్చు. అవేమంటే..
* గంధంచెక్కను సానమీద అరగదీసి దాన్ని ఆ పొక్కులమీద పూయడం వల్ల క్రమంగా తగ్గిపోతాయి.
* శుభ్రమైన బట్టను చల్లని నీళ్లలో ముంచి ఆయా భాగాల్లో ఉంచి ఓ నిమిషం తరవాత తీసేయాలి. ఇలా రోజుకి రెండుమూడుసార్లు చేయాలి.
* కీరాదోసముక్కల్ని మెత్తని ముద్దలా చేసి ర్యాష్‌ వచ్చిన భాగంలో రాసి పది నిమిషాల తరవాత కడిగేయాలి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు చేస్తే కీరాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలవల్ల అవి త్వరగా తగ్గుతాయి.
* రోజుకోసారి తాజా అలోవెరా రసాన్ని ఆయా భాగాలకు పట్టించి ఓ పావుగంట తరవాత కడిగేసినా అవి త్వరగా తగ్గుతాయి. ఇవి చేయడంతోబాటు పిల్లల్ని సాధ్యమైనంతవరకూ ఎండలోకి తీసుకెళ్లకపోవడం, మెడల కిందా చంకల్లోనూ చల్లని నీళ్లతో తుడవడం, గాలి ఆడేలా పలుచని దుస్తులు వేయడం, చిక్కని లోషన్లూ క్రీములూ రాయకపోవడం... వంటి జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో చెమట పొక్కులు రాకుండా ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.