close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది తరతరాల చిత్రం!

తెలివిగలాయన దేవుడిని ‘మునిమనవడికి బంగారపుటుయ్యాల చేయించేలా చూడు స్వామీ!’ అని మొక్కుకున్నాడట. ఎంత ఆశ, నాలుగు తరాలు చూడటమే కాదు, అప్పటికి బంగారపు ఉయ్యాల కొనిచ్చేంత భాగ్యవంతుడిగానూ, ఆరోగ్యవంతుడిగానూ ఉండాలనేది ఆ కోరికలో ఉన్న అర్థం. కానీ నేటి తరం మాత్రం నేను కూడా నా ముని మనవడితో జనరేషన్‌ ఫొటో దిగేలా చూడు స్వామీ అని కోరుకుంటారేమో... ఎందుకంటే ఇప్పుడందరూ తాతలూ బామ్మలతో ఫొటోలు దిగి నెట్లో సందడి చేస్తున్నారు మరి!

గారాబం చేయాలంటే తాతా నానమ్మలు ఉండాల్సిందే. వీడు చిన్నప్పుడు ఏం చేశాడంటే... ఇది ఇంతున్నప్పుడు ఎంత అల్లరి చేసేదంటే... అంటూ ఊహతెలియని వయసునాటి కబుర్లు వినాలంటే అమ్మమ్మా తాతయ్యల పక్కన చేరాల్సిందే. అసలు కన్నా వడ్డీ ముద్దు అనే సామెత ఎలా పుట్టిందో వీళ్లను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. మనం ఎంత పెద్దయినా వాళ్లకు చిన్నపిల్లలమే. అమ్మో, నాన్నో కోపంతో ఒక్కమాట అన్నారంటే... ‘పాపం పసిపిల్ల ఏదో తెలీక చేసి ఉంటుందిలే పోనీయండర్రా...’ అంటూ మాట అడ్డేసి, ఆ గండం నుంచి చటుక్కున గట్టెక్కించేస్తారు. ఇక ముత్తాతలూ అవ్వలూ ఉంటే ఆ అదృష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనకెంతో ఇష్టమైన వీళ్లతో ఓ అందమైన ఫొటో దిగితే... మన పిల్లలనూ అందులో చేరిస్తే... ఎంత బాగుంటుందో కదూ! ఆ అనుభూతిని అద్భుతంగా, పదికాలాల పాటు పదిలంగా దాచుకునే జ్ఞాపకంగా మలుస్తోంది ‘జనరేషన్‌ ఫ్రేమ్‌ ఫొటోగ్రఫీ’. నాలుగు లేదా అయిదు తరాల వాళ్లూ తమ తర్వాతి తరం వారి ఫొటో ఫ్రేమ్‌ను చేతిలో పట్టుకున్నట్టు ఉండటం ఈ ఫొటోగ్రఫీ ప్రత్యేకత. తాతలు-మనవళ్లూ ముని మనవళ్లతోనూ, బామ్మలు-కూతుళ్లూ మనవరాళ్లతోనూ ఇలా ఫొటోలు దిగుతున్నారు. వీటిని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల్లాంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే ఆలస్యం బోలెడు లైకులూ కామెంట్లూ వెల్లువెత్తుతున్నాయి. దీంతో అవకాశం ఉన్న చాలామంది ఈ తరహా ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫొటోషాప్‌ టెక్నాలజీ ఈ ఫొటోలను చేయడానికి సాయపడుతోంది. సాధారణంగా ఈ తరహా ఫొటో దిగాలనుకున్న వాళ్లంతా ఒక చోట చేరతారు. చివరి ఫొటోలో ఉన్న వాళ్లు తప్ప మిగతా అందరూ ఒక ఫొటో ఫ్రేమ్‌ను తమ చేతిలో పట్టుకుని ఒకే బ్యాక్‌గ్రౌండ్‌ వచ్చేలా ఫొటోలు దిగుతారు. తర్వాత ఫొటోషాప్‌ ద్వారా వాటిని కత్తిరించి బామ్మ పట్టుకున్న ఫొటో ఫ్రేమ్‌లో అమ్మమ్మ ఫొటోనూ, అమ్మమ్మ పట్టుకున్న దాంట్లో అమ్మ ఫొటోనూ, అమ్మ ఫొటోలో అమ్మాయి ఫొటోనూ... ఇలా అమర్చుతూ వెళతారు. ఎవరైనా సమయానికి లేకపోయినా వాళ్ల ఫొటోనూ ఫొటో షాప్‌ సాయంతో ఇందులో చేర్చుతున్నారు. ఆ మధ్య అభిషేక్‌ బచ్చన్‌ కూడా ఇదే తరహాలో తాత హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌, తండ్రి
అమితాబ్‌లతో పాటు తనూ తన కూతురు ఆరాధ్యలతో కలిపి ఉన్న చిత్రాన్ని ఫోర్‌ జనరేషన్‌ ఫొటో అంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. మొత్తానికి కుటుంబమంతా కలిసి దిగే ఫ్యామిలీ ఫొటోల ట్రెండు ఇప్పుడు ఇలా జనరేషన్‌ ఫొటోగ్రఫీవైపు మళ్లిందన్నమాట!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.