close
గాల్లో ఎగిరే గొడుగు!

మండుటెండలో బయటకు వెళ్లాలన్నా, వర్షంలో తడవకుండా ఇల్లు చేరాలన్నా చేతిలో గొడుగు ఉండాల్సిందే. అయితే ఒకవైపు బ్యాగులూ వస్తువులూ చేత్తో మోస్తూనే మరోవైపు గొడుగు పట్టుకోవాలంటే కాస్త కష్టమైన పనే. ఇకమీద మీకా బాధ ఉండదులెండి. ఎందుకంటే మనం ఏమాత్రం పట్టుకోవాల్సిన అవసరం లేకుండా నీడలా మనతోపాటూ కదిలే ‘సెల్ఫ్‌ ఫ్లయింగ్‌ అంబరిల్లా’ లేదా ‘డ్రోన్‌అంబరిల్లా’లు మార్కెలోకి వస్తున్నాయి మరి. ప్రత్యేకమైన సెన్సార్‌లను అమర్చి రూపొందించిన ఈ గొడుగులను ఆప్‌ సహాయంతో మన ఫోన్‌లో నుంచే నచ్చినట్టు ఆపరేట్‌ చేయొచ్చు. ఏది ఏమైనా పట్టుకునే అవసరంలేకుండా గొడుగు మనవెంట వస్తే ఆ హాయే వేరబ్బా. ఏమంటారు?


గురి తప్పని కత్తెర

దుస్తులనైనా జుట్టునైనా కత్తిరించేటప్పుడు ఎంత చేయి తిరిగిన వ్యక్తికైనా అప్పుడప్పుడు గురి కుదరక ఒకింత వంకరటింకరగా కత్తిరించడం సాధారణమైన విషయమే. అయితే దుస్తులో కాగితమో అయితే కాస్త అటూఇటూ అయినా పర్వాలేదు కానీ జుట్టు కత్తిరించే విషయంలో ఎగుడుదిగుడులు ఉంటే చూడ్డానికి అస్సలు బాగోదు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టడానికి వస్తున్నవే ‘లేజర్‌ గైడ్‌ సిజర్స్‌’. కత్తెర పై భాగంలో అమర్చిన లేజర్‌ బల్బు ఆధారంగా మనం కత్తిరించాల్సిన చోట ఈ లైట్‌ ఒక లైన్‌లా పడుతుంది. ఆ లైన్‌ ఆధారంగా కత్తిరించుకుంటూ వెళ్లిపోతే సరి. కొంచెం కూడా ఎక్కువా తక్కువా కాకుండా కొలతల ప్రకారం ఇట్టే కత్తిరించేయొచ్చు. నిజంగా గురి తప్పని ఐడియా కదూ!


ఒకటి కొంటే మూడు ఉచితం

వేసిన డ్రస్‌ వేయడమన్నా పెట్టుకున్న వస్తువులు మళ్లీ పెట్టుకోవడమన్నా యువతకి అస్సలు నచ్చని విషయాలు. అలాగని రోజుకో రకంగా ముస్తాబవ్వాలంటే బడ్జెట్‌ కూడా సహకరించాలి. మన బడ్జెట్‌లోనే ఉంటూ ఉదయం ఒక రంగులో మధ్యాహ్నం మరో రంగులో సాయంత్రం ఇంకో రంగులో కనువిందు చేసే వాచీ ఒకటి మనదగ్గరుంటే ఎంత బాగుంటుందో అని అనుకోని వారుండరు. అలాంటి వారి ఊహలను నిజం చేస్తూ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నవే ‘సోలార్‌ కలర్‌ ఛేంజింగ్‌ వాచెస్‌’. సూర్యకాంతి ఆధారంగా రకరకాల రంగుల్లోకి మారడమే ఈ వాచీల ప్రత్యేకత. అంటే మామూలు సమయంలో తెల్లటి డయల్‌, బెల్ట్‌తో ఉండే ఈ వాచీని పెట్టుకుని ఎండలోకి వెళ్లామంటే వెంటనే లేత నీలం రంగులోకి మారిపోతుంది. ఎండ మరీ ఎక్కువగా ఉంటే ఊదా రంగులో, సాయంత్రంవేళ గులాబీ రంగులో కనువిందుచేస్తూ చూసేవారికి ఇన్ని వాచీలు ఎప్పుడు మార్చారబ్బా అన్న అనుమానం వచ్చేలా చేస్తాయి. అంటే ఇలాంటి వాచీ ఒక్కటి కొంటే మూడు వాచీలు ఉచితం అన్నట్టే.


చల్లని ప్యాడ్‌ పాపాయి కోసం

ఎండ వేడిమికి భయపడి పెద్దవాళ్లే పగటివేళల్లో బయటకి వెళ్లలేకపోతుంటారు. అలాంటిది చంటిపిల్లల విషయం ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని బయటకు తీసుకెళ్లాలంటే కాస్త కష్టమైన విషయమే. ఎంత ఎండ తగలకుండా స్ట్రోలర్‌లో కూర్చోబెట్టినా ఉక్కపోతకు పిల్లలకు ఒళ్లంతా చెమటలు పట్టేసి చికాకు పెట్టేస్తుంటారు. ఈ ఇబ్బందిని దూరం చేయడానికి కూల్‌ ప్యాడ్‌లను తయారుచేస్తున్నాయి వివిధ కంపెనీలు. ‘బేబీ స్ట్రోలర్‌ కూలింగ్‌ జెల్‌ లైనర్‌’ పేరుతో వస్తున్న ఈ ప్యాడ్‌లలో ఒక ప్రత్యేకమైన సిలికాన్‌ జెల్‌ ఉంటుంది. ఈ ప్యాడ్‌ను స్ట్రోలర్‌కి అమర్చడం వల్ల అందులో కూర్చోబెట్టిన పాపాయి ఒంటివేడిని సిలికాన్‌ జెల్‌ గ్రహించి చల్లని అనుభూతినిస్తుంది. ఈ ప్యాడ్‌లు మీ చిన్నారికీ కావాలంటే వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చేయండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.