close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముద్దు... ముచ్చట్లు!

ముద్దంటే... శృంగార భావన మాత్రమే అనుకుంటే పొరబాటే. ఎక్కడ కందిపోతుందోనని భయపడుతూనే పట్టలేని మమకారంతో పొత్తిళ్లలోని పాపాయికి అమ్మ ఇచ్చే తొలి కానుక ముద్దే. క్లాసులో ఫస్ట్‌ ర్యాంక్‌ రాగానే నాన్న ఇచ్చే మెచ్చుకోలు ముద్దే. ప్రేయసికి ప్రియుడు అందించే తియ్యని బహుమతి ముద్దే. పట్టలేని ఆనందం కలిగినప్పుడు స్నేహితులు ఇచ్చే ఉద్వేగపూరితమైన కానుకా ముద్దే. అందుకే ముద్దంటే... బంధాలను కలిపి ఉంచే నులివెచ్చని స్పర్శ... పులకించిన మనసుకి ప్రతీక... ఓ చక్కని పలకరింత కూడా. ఏప్రిల్‌ 13 ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా ముద్దుల ముచ్చట్లు..!

ముద్దిమ్మందీ ఓ చామంతీ..., ముద్దు కావాలా..., ముక్కుపై ముద్దు పెట్టు, అమ్మాయి ముద్దు పెట్టందే... అంటూ బాణీలు కట్టి ముద్దుమీద ప్రేమజల్లుల్ని ఎడాపెడా కురిపించేశారు సినీకవులు. కానీ పుట్టినప్పటి నుంచీ ఆడామగా ఎవరైనాగానీ కుటుంబసభ్యులూ ఆత్మీయుల నుంచి భిన్న సందర్భాల్లో ముద్దుల్ని ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. అయితే ఒక్క ప్రేయసీప్రియుల మధ్య తప్ప మిగిలినవాళ్లంతా నుదుటిమీదో బుగ్గలమీదో చేతులమీదో ముద్దాడడమే కనిపిస్తుంది.

ముద్దు పరిణామం!
పక్షులు ముక్కులు రాసుకుంటూ ముచ్చట్లాడతాయి. పశువులు మూతులు రాసుకుంటూ ఊసులాడుతుంటాయి. ముక్కూమూతులతో అవి చేసే ప్రేమపూర్వకమైన చర్యలే మనిషీ నేర్చుకుని ఉండొచ్చు. బిడ్డకు పాలిచ్చినట్లే నమిలిన ఆహారాన్ని తన నోటి నుంచి బిడ్డ నోటికి అందించడం ద్వారా ముద్దు మొదలై, ప్రేమతో బిడ్డను ముద్దాడే దిశగా మారి ఉండొచ్చు అన్నది మానవపరిణామ శాస్త్రజ్ఞుల భావన. అయితే ముద్దు గురించిన తొలి ప్రస్తావన వేదకాలంలోనే జరిగిందట. అధర చుంబనం గురించి మొదట వర్ణించింది మహాభారతమే. అంటే చుంబన శాస్త్రానికి నాంది భారతదేశమే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి కారణం మాత్రం అలెగ్జాండరని కొందరంటారు. ఇద్దరు పెద్దవాళ్లు తమ మధ్య ఉన్న ప్రేమనూ ఆప్యాయతనూ ముద్దు ద్వారా ప్రకటించడం అనేది ఆరో శతాబ్దంలో మొదలైందనేది మరో వాదన. మొత్తమ్మీద 20వ శతాబ్దం నాటి ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల ద్వారా ముద్దూ ఆలింగనం అనేవి సామాజిక సంప్రదాయంగా ఆవిర్భవించాయి.

ముద్దుల సంస్కృతి!
దేశాలూ, ప్రాంతాలూ, సంస్కృతులను బట్టి ముద్దు తనదైన గౌరవాన్నీ హోదానీ సంతరించుకుంది. రోమన్‌ చక్రవర్తిని ప్రముఖులు చెంపలమీదా కిందిస్థాయివాళ్లు చేతులమీదా దిగువస్థాయివాళ్లు పాదాలమీదా ముద్దు పెట్టుకునేవారట. కొన్ని మతాల్లో పవిత్ర గ్రంథాలనీ ఆలయాల్లోని నేలనీ ముద్దు పెట్టుకోవడం ద్వారా దేవుడిమీద భక్తిని కనబరిస్తే; యుద్ధాల్లో ఆటల్లో ఉద్వేగాలకు లోనయినప్పుడు సైనికులూ క్రీడాకారులూ నేలను ముద్దాడి తమ దేశభక్తిని చాటుకుంటారు.

అధర చుంబనం!
ప్రేమికులు పెదాలమీద ముద్దు పెట్టుకోవడం అనేది ఫ్రాన్స్‌లో మొదలవ్వడంతో అది ఫ్రెంచ్‌ కిస్‌గా స్థిరపడిపోయింది. దీన్నే ఫ్లోరెంటీన్‌ కిస్‌ అనేవారట. అప్పట్లో అక్కడి నృత్యరీతుల్లో ఈ రకమైన కిస్‌ ఎక్కువగా కనిపించేది. క్రమంగా ఐరోపా పెళ్లి వేడుకల్లో పెదాలమీద ముద్దు ఓ సంప్రదాయంగా మారింది. అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోలూ, అందాల ప్రదర్శనలూ, టీవీ షోలూ సోషల్‌మీడియాల ద్వారా మనదేశానికీ ఈ ముద్దుల సంస్కృతి సోకింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అన్న తేడా లేకుండా సినీవేడుకలూ సోషల్‌పార్టీల్లో నమస్కారాలూ షేక్‌హ్యాండ్‌లకు బదులు ముద్దులూ ఆలింగనాల పలకరింపులు ఎక్కువయ్యాయి.

మొదట్లో మర్యాదకోసం ఒక బుగ్గమీదా, తరవాత రెండు బుగ్గలూ ముద్దాడే పద్ధతి కాస్తా ఈమధ్య పెదాలమీదకీ పాకింది. అదేమంటే షేక్‌హ్యాండ్‌కన్నా ముద్దే ఆప్యాయతతో కూడిన పలకరింత అంటున్నారు కొందరు సోషలైట్‌లు. కాలేజీల్లోనూ బుగ్గలమీద ముద్దుల హాయ్‌లు కామనైపోయాయి. ‘ఛీ ఛీ ఇదేం గోల’ అంటూ సనాతనవాదులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా... ముద్దులో తప్పేముందీ.. అదీ ఓ పలకరింతేగా అంటోన్న ఆధునికుల సంఖ్యా పెరుగుతోంది మరి.

ముద్దుమాటలు

ప్రతివ్యక్తీ తన జీవితకాలంలో కనీసం రెండువారాలపాటు ముద్దులవానలో తడిసిముద్దవుతాడట.
* ముద్దుశాస్త్రాన్ని ఫిలమెటాలజీ అంటారు.
* దొండపండులాంటి పెదవులు అని మనవాళ్లు ఊరికే వర్ణించలేదు మరి, సన్న పెదాలతో పోలిస్తే లావు పెదాలే ముద్దొస్తాయట.
* గాఢమైన రొమాంటిక్‌ కిస్‌ల వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయట.
* రొమాంటిక్‌ కిస్‌ పెట్టుకునేటప్పుడు- తమ తలల్ని ఎడమవైపుకన్నా కుడివైపు వంచే వారి సంఖ్య ఎక్కువన్నది ఓ పరిశీలన.
* గుండెలనిండా సంకోచంతో అదిరే పెదవులతో పెట్టుకునే తొలిముద్దు ఎప్పటికీ గుర్తుండిపోతుందట.
* ఓ నిమిషం గాఢంగా ముద్దుపెట్టుకుంటే 2 క్యాలరీలు ఖర్చవుతాయి. ముద్దుపెట్టుకునేటప్పుడు ముఖంలోని 34 కండరాలు పనిచేస్తాయి మరి. 
* ముద్దు చేదు కాకున్నా భాగస్వామితో అధర చుంబనంవల్ల 300 రకాల బ్యాక్టీరియా, సుమారుగా 8 కోట్ల సూక్ష్మజీవులు ఒకరినుంచి ఒకరికి సరఫరా అవుతాయట. దాంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
* థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట దాదాపు 58 గంటల 35 నిమిషాల 58 సెకన్లపాటు ముద్దాడి గిన్నిస్‌ రికార్డు సృష్టించారట.
* సూడాన్‌లోని కొన్ని తెగలు ముద్దు ద్వారా ఆత్మని సంగ్రహిస్తారని భయపడతారట.

తొలిముద్దు!

తొలిముద్దు తియ్యగా ఉంటుందనే సంగతెలా ఉన్నా దానివల్ల మెదడులో డోపమైన్‌ శాతం పెరిగిపోయి, ఆ అనుభూతి మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. దాంతో నిద్రలేమి, ఆకలి లేకపోవడం... వంటివి చోటుచేసుకుంటాయట. అయితే ఆ ప్రేమబంధం దీర్ఘకాలికంగా కొనసాగినప్పుడు- క్రమేణా డోపమైన్‌ శాతం తగ్గి, ఆక్సీటోసిన్‌ విడుదలవుతుంటుంది. మొత్తమ్మీద ముద్దు వల్ల పిట్యూటరీ, హైపోథెలామస్‌ గ్రంథుల నుంచి ఎండార్ఫిన్లు విడుదలై ఆనందాన్నీ ప్రేమభావనల్నీ కలిగించడంతోబాటు బంధం బలపడేలా చేస్తాయి. 
* ముద్దుపెట్టుకునేటప్పుడు అడ్రినల్‌ గ్రంథి నుంచి ఎపినెఫ్రీన్‌, నొరెపినెఫ్రీన్‌ వంటి హార్మోన్ల శాతం పెరిగి గుండెరేటుని పెంచుతాయి. ఫలితంగా మెదడుకి ఆక్సిజన్‌ సరఫరా పెరిగి నొప్పులు తగ్గుతాయి. బీపీ కూడా తగ్గుతుంది. ముద్దువల్ల ఒత్తిడికి కారణమైన కార్టిసాల్‌ శాతం కూడా తగ్గుతుంది.

సినీ ముద్దులు!

పూర్వం నటీనటులు కళ్లతోనే కోటి భావాల్ని పలికించేవారు. ఒకవేళ ప్రేమ సన్నివేశాల్లో భాగంగా ముద్దు దృశ్యాన్ని చిత్రీకరించాలన్నా పమిటకొంగు మాటునో చెట్టుచాటునో దాగేవారు. కానీ 1933లోనే జె.ఎల్‌.ఫ్రీర్‌ హంట్‌ అనే దర్శకుడు ‘కర్మ’ అనే బాలీవుడ్‌ మూవీలో దేవికా రాణి, హిమాంశురాయ్‌లమీద ముద్దు దృశ్యాన్ని చిత్రించి పెద్ద సాహసం చేశాడనే చెప్పాలి. బహుశా సినిమాల్లో అదే తొలి ముద్దు కావచ్చు. ఆ తరవాత చాలాకాలానికి బాలీవుడ్‌ ముద్దుసీన్లకు ఆజ్యం పోసింది రాజ్‌కపూర్‌. ‘బాబీ’ సినిమాలో రిషికపూర్‌, డింపుల్‌కపాడియాల మీద ఆయన చిత్రీకరించిన ముద్దు సన్నివేశం ప్రేక్షకుల కళ్లముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉంది. ఇక ఇటీవలి దర్శకులు తెరమీద నేరుగా ముద్దుసీన్లను చిత్రీకరించేస్తుంటే, నటీనటులూ నిస్సంకోచంగా నటించేస్తున్నారు. సెక్స్‌బాంబ్‌ మల్లికా షెరావత్‌ అయితే క్వాహిష్‌ సినిమాలో హిమాంశుని ఏకంగా 17 సార్లు ముద్దుపెట్టుకుని పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక ఇమ్రాన్‌హష్మీ ముద్దుల హీరోగా పేరొందిన సంగతి తెలిసిందే. వీళ్లే కాదు, ఐష్‌, హృతిక్‌, దీపిక, రణ్‌బీర్‌, రణ్‌వీర్‌, కరీనా, షాహిద్‌, జాన్‌ అబ్రహం, బిపాసా... ఇలా అందరూ ఏదో ఒక సందర్భంలో ముద్దు సీన్లని బ్రహ్మాండంగా రక్తి కట్టించినవారే. తెలుగులోనూ ముద్దుల సన్నివేశాలు అడపాదడపా కనిపించినా ఈమధ్య వచ్చిన అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100... వంటి సినిమాలతో టాలీవుడ్‌ సైతం సుదీర్ఘ ముద్దుసీన్లకి సై అంటోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.