close
ఇది కప్‌కేక్‌ టవర్‌!

కప్‌కేక్‌... పేరు వినగానే ఒక ముక్కయినా రుచి చూడాలపిస్తుంది కదూ. కానీ, చెన్నైలోని ప్రీతీ కిచెన్‌ అప్లయెన్సెస్‌ వారికి మాత్రం వాటితో ఒక పెద్ద టవర్‌ కట్టాలనిపించిందట. అనుకున్నదే తడవుగా దానికి ఒక ముహూర్తాన్ని కూడా పెట్టేశారు. తమ సంస్థ 40వ వార్షికోత్సవం రోజున 18818 కప్‌కేకులను అక్కడికి అక్కడే తయారు చేసి, వాటితో సుమారు 42 అడుగుల ఎత్తున్న పిరమిడ్‌ టవర్‌ను నిర్మించారు. దీనికోసం షెఫ్‌లూ, వాలంటీర్లు మొత్తం ఓ అరవైమంది నాలుగు షిఫ్టుల్లో పనిచేసి ఈ టవర్‌ని ఏర్పాటుచేశారు. ఫుడ్‌ కాన్సులేట్‌ సహాయంతో చెన్నైలోని విజయా ఫోరమ్‌ మాల్‌లో కట్టిన ఈ కప్‌కేక్‌ టవర్‌కి ప్రపంచంలోనే అతి పెద్ద కప్‌కేక్‌ టవర్‌గా గిన్నిస్‌ రికార్డూ వచ్చింది. రికార్డు సాధించిన అనంతరంఈ కేకులను అనాథ పిల్లలకు పంచిపెట్టారు.


మేకనే మేయర్‌!

అతి చిన్న వయసులో మేయర్‌ అయ్యాడన్న వార్తలు వినుంటాం. కానీ ఓ దగ్గరైతే మేక మేయర్‌గా ఎన్నికయ్యింది. నిజమండీ బాబూ, అమెరికాలోని ఫెయిర్‌ హెవెన్‌లో మేయర్‌ పదవి కోసం ఓ మేక కుక్కలూ, పిల్లులతో పోటీపడి మరీ 13 ఓట్ల తేడాతో మేయర్‌ పదవిని దక్కించుకుంది. అసలు విషయం ఏంటంటే... సుమారు 2500 జనాభా ఉన్న ఫెయిర్‌ హెవెన్‌ నగరానికి మేయర్‌ లేడు. ఈ పట్టణ బాధ్యతలన్నీ జోసెఫ్‌ గంటర్‌ అనే మేనేజరే చూసుకుంటున్నాడు. అయితే ఆ టౌన్‌లో ఒక ప్లేగ్రౌండ్‌ కట్టడానికి ఫండింగ్‌ కోసం జోసెఫ్‌ ఈ వింత మేయర్‌ ఎన్నికను నిర్వహించాడు. ఎన్నికలో ఏ జంతువైనా పోటీ చేయాలంటే దాని యజమాని కొంత సొమ్మును చెల్లించాలి అన్న షరతు పెట్టాడు. ఇది విని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. కానీ ఫండ్స్‌ కోసమే ఈ ఎన్నికలని చెప్పడంతో అందరూ తమ పెంపుడు జంతువులను ఎన్నికల్లో నిలబెట్టారు. అలా ఓ టీచర్‌ లింకన్‌ అనే మేకని పోటీలోకి దింపాడు. ఈ ఎన్నికలో సుమారు 15 పెంపుడు జంతువులతో పోటీపడిన మేక చివరికి విజయం సాధించింది. మేయర్‌గా ఎన్నికైన లింకన్‌ ఏడాది పాటు ఆ పదవిలో ఉంటుంది.


రోబో యాంకర్‌!

టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న చైనా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలోనూ తనదైన ముద్రవేసింది. ఇప్పటి వరకూ రోబో సోఫియా ఒక సంచలనం అనుకుంటే దానికి దీటుగా మహిళా రోబో న్యూస్‌ యాంకర్‌ని సృష్టించి మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చైనా అధికారిక న్యూస్‌ ఛానల్‌ జిన్హువా ప్రపంచంలోనే తొలిసారిగా రోబో మహిళా న్యూస్‌ రీడర్‌తో వార్తలు చదివించింది. ఈ రోబోకు జిన్‌ జియామెంట్‌ అని పేరు పెట్టారు. మనిషిలాగే హావభావాలూ కదలికలతో భావోద్వేగాలను వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత. ఈ న్యూస్‌ యాంకర్‌ ఎలాంటి అలసట లేకుండా 24 గంటలూ, 365 రోజులూ చైనా, ఆంగ్ల భాషల్లో వార్తలు చదివేలా సాంకేతికతను సిద్ధం చేస్తున్నారట అక్కడి శాస్త్రవేత్తలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం.


షార్క్‌తో ఈత!

సింహంతో ఫొటో దిగాలంటే అది బోన్లో ఉన్నప్పుడైతే ఏదో కొంచెం ప్రయత్నిస్తాం కానీ ఫొటో కోసం ఏకంగా సింహాన్ని బయటకు తీసుకురాం కదా. కానీ కింబర్లీ జెఫ్రీస్‌ అనే ఫొటోగ్రాఫర్‌ అలాంటి సాహసమే చేసింది. అదీ సముద్రం లోపల అందులోనూ అతిపెద్ద గ్రేట్‌ వైట్‌ షార్క్‌తో. హవాయిలోని ఓహూ తీరంలో చనిపోయిన తిమింగలం కళేబరాన్ని సముద్రంలో పడేసి, షార్క్‌ను బయటకు రప్పించి ఫొటోలు తీసుకోవాలనుకుందట. కానీ తిమింగలాన్ని తినడానికి ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్‌ల్లో ఒకటైన గ్రేట్‌ వైట్‌ అనే షార్క్‌ వస్తుందని అస్సలు ఊహించలేదంటోది కింబర్లీ. జిరాఫీలా భారీ పరిమాణంలో ఉన్న గ్రేట్‌ వైట్‌ రావడాన్ని చూసిన తనకి మొదట గుండె ఆగినంత పనైందట. కాసేపటికి తేరుకుని దాంతో పాటు ఈతకొడుతూ వివిధ యాంగిల్స్‌లో దాని ఫొటోలు తీసి ఔరా అనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.