close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మధురమైన మరువం!

మల్లెపూల మాలలో గుబాళించే మరువం పరిమళం సుపరిచితమే. అయితే అది కేవలం వాసన మొక్కగానే మనందరికీ తెలుసు. కానీ ఇది అద్భుతమైన ఔషధ సుగంధం. అందుకే దీన్ని తాజాగానూ ఎండబెట్టి పొడి చేసీ వంటల్లో వాడితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుందనీ, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు తగ్గుతాయనీ చైనా వైద్యం పేర్కొంటోంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల వ్యాకోచానికీ తోడ్పడతాయి.
* మరువాన్ని వాసన చూసినా తలలో పెట్టుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిది అంటారు. దీన్ని వాసన చూడటంవల్ల  డిప్రెషన్‌, ఆందోళన తగ్గుతాయి. నిద్ర పడుతుంది. అదేసమయంలో రక్తనాళాలు వ్యాకోచించడంవల్ల బీపీ తగ్గి, గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. మధుమేహం కూడా తగ్గుతుంది.
* నెలసరి సరిగ్గా రాని మహిళలూ మెనోపాజ్‌తో ఇబ్బందిపడేవాళ్లూ ఎండబెట్టిన పొడిని కొద్దిగా వంటల్లో వేసుకోవడం లేదా కాసిని ఆకుల్ని ఓ కప్పు నీళ్లలో వేసి మరిగించి తాగినా అవన్నీ సరవుతాయి. గర్భిణీలకి పాలు పడతాయి. పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌తో బాధపడేవాళ్లు దీంతో కాచిన టీ తాగడంవల్ల ఫలితం ఉంటుంది. మూత్ర సమస్యలూ తగ్గుతాయి. ఆకుల్నీ లేదా దీన్నుంచి తీసిన గాఢతైలాన్ని కొద్దిగా తీసుకుని వాసన చూడటంవల్ల గొంతులో శ్లేష్మం తగ్గుతుంది.
* మరువం నుంచి తీసిన తైలం చర్మానికీ మంచిదే. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీర ముడతల్నీ తగ్గిస్తాయి. అందుకే క్రీములూ లోషన్లూ సోపుల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. రెండుమూడు చుక్కల గాఢతైలాన్ని ఇతర నూనెల్లో కలిపి తలకి పట్టించి షాంపూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.


పెంపుడు కుక్కతో గుండె పదిలం!

జంతువుల్ని పెంచుకోవడం వల్ల మనకు ఓ తోడు ఉండటమే కాదు, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటివి తగ్గి మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని ఇప్పటికే అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. అయితే పెంపుడు జంతువు అదీ కుక్కను పెంచుకునేవాళ్లలో బీపీ, కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ శాతం తగ్గడంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గుండెసమస్యలు ఉన్నవాళ్లు కుక్కను పెంచుకోవడం వల్ల పెంచుకోనివాళ్లకన్నా ఎక్కువకాలం జీవిస్తారనేది సదరు పరిశోధకులు చేసిన అధ్యయనంలోనూ తేలిందట.


నిద్రలో గురక... గుండెకు చేటు!

కొంతమంది నిద్రలో బాగా గురకపెడుతుంటారు. దీనివల్ల మాటిమాటికీ నిద్రలో మెలకువ వచ్చేయడంతో నిద్రలేమికి గురవుతుంటారు. తద్వారా తలనొప్పి, మత్తుగా ఉండటం, ఏకాగ్రత లోపించడంతోబాటు బీపీ కూడా పెరిగితే వెంటనే జాగ్రత్తపడాలనీ లేదంటే వాళ్లలో హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువనీ అమెరికన్‌ థొరాసిక్‌ సొసైటీకి చెందిన పరిశోధక బృందం పేర్కొంటోంది. వీళ్లు నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లను ఎంపికచేసి అధ్యయనం చేయగా వాళ్లలో సగానికి సగంమంది గురక కారణంగానే బీపీ బారిన పడినట్లు తేలింది. అదేసమయంలో చాలామందిలో హృద్రోగాలూ బయటపడ్డాయట. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు- ఊపిరి సమస్యలవల్ల రక్తనాళాల్లో ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండటంతో గుండెకి సరిగ్గా రక్తం అందదు. అంతేకాదు, గాలి సరిగ్గా అందకపోవడంవల్ల గురక వచ్చి, మాటిమాటికీ నిద్రలో మెలకువ వచ్చేస్తుంది. ఫలితం... బీపీ పెరిగి హృద్రోగానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ముందుగానే సమస్యను గుర్తించి, హాయిగా నిద్రపోయేలా చూసుకుంటే అన్నివిధాలా మేలు అంటున్నారు.


టూకీగా...

నిద్రపోయే సమయం లేనప్పుడు ధ్యానం, యోగా వంటివి చేస్తే కొంత ఫలితం ఉంటుంది అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. కళ్లుమూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల దీర్ఘకాలిక నొప్పులు, ఒత్తిడి కూడా తగ్గుతాయట.
* ఊబకాయులు తినకుండా ఉండలేకపోవడానికి కారణం యాస్ప్రోసిన్‌ అనే హార్మోన్‌ నాడీకణాలను ప్రేరేపించడమేనని గుర్తించారు ఆంటారియోలోని వెస్ట్రన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.


పుట్టగొడుగా మజాకానా!

పుట్టగొడుగుల్లోని పోషకగనుల గురించి తెలిసిందే. వీటిల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు కణ రక్షణకీ తోడ్పడతాయి. అయితే క్రమం తప్పక పుట్టుగొడుగుల్ని ఆహారంలో భాగంగా తినేవాళ్లలో మెదడు పనితీరు బాగుంటుందనీ ఆలోచనాశక్తి తగ్గకుండా ఉంటుందనీ ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌ వచ్చే అవకాశం తక్కువనీ సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు కొందరు వృద్ధుల్ని ఎంపికచేసి వాళ్ల ఆహారపుటలవాట్లనీ, మానసిక, శారీరక ఆరోగ్యాన్నీ కూలంకషంగా పరిశీలించారట. అందులో ఆహారంలో పుట్టగొడుగుల్ని ఎక్కువగా తీసుకునేవాళ్లలో మెదడు పనితీరు బాగున్నట్లు గుర్తించారు. అంతేకాదు, వాళ్లలో ఐక్యూ శాతం కూడా ఎక్కువగా ఉందట. దీన్నిబట్టి వారానికి రెండుసార్లయినా పుట్టుగొడుగుల్ని తినడంవల్ల వృద్ధాప్యంలో మతిమరపు, ఆల్జీమర్స్‌... వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవడంతోబాటు చురుకుగా ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.