close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దిల్లీ దాహం తీరుస్తున్నాడు!

రోజంతా బయట తిరుగుతూ ఉపాధి పొందేవాళ్లకి అన్నిచోట్లా తాగునీరు దొరకదు. డబ్బు పెట్టి కొనాలంటే నీళ్లకే 50 రూపాయలు అవుతుంది. చిరుద్యోగులూ, కూలీనాలీ చేసుకునేవాళ్లకి అది చాలా పెద్దమొత్తమే. అందుకే ఉచితంగా మంచినీటిని అందిస్తూ అలాంటివారి దాహార్తిని తీర్చుతున్నాడు దిల్లీకి చెందిన నటరాజన్‌.

పల్లెలూ, పట్టణాల్లోనే నీటి కొరతను చూస్తున్నాం. అలాంటిది దిల్లీ లాంటి మహా నగరంలో నీటి కష్టాలు ఇంకెంతలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాయకష్టం చేసుకుని బతికే భవన నిర్మాణ కార్మికులూ, సైకిళ్లూ, తోపుడు బళ్లమీద తిరుగుతూ అమ్ముకునేవాళ్లు, పారిశుద్ధ్య కార్మికులూ... నీళ్లకోసం ప్రతిసారీ డబ్బు ఖర్చుచేయలేరు. ఎక్కడైనా మంచి నీళ్లు దొరకవా అని నోరు పిడచగట్టుకుపోయేవరకూ వేచిచూస్తుంటారు. అలాంటివారి కోసం దక్షిణ దిల్లీ ప్రాంతంలో కుండల్లో మంచినీటిని నింపి పెడుతున్నాడు 70 ఏళ్ల అళగరత్నం నటరాజన్‌.

మట్కా మ్యాన్‌...
బెంగళూరులో పుట్టిపెరిగిన నటరాజన్‌. పాతికేళ్ల వయసులో లండన్‌ వెళ్లి వ్యాపారిగా స్థిరపడ్డాడు. అక్కడున్నపుడే పేగు క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. శేష జీవితాన్ని సేవకోసం కేటాయించాలని పదేళ్ల కిందట స్వదేశం వచ్చాడు. కొన్నాళ్లు దిల్లీలోని ఒక అనాథాశ్రమంలో వలంటీరుగా పనిచేశాడు. అక్కడ వృద్ధులకు సేవలు చేయడంతోపాటు, అనాథ శవాలకు దహన సంస్కరణల్నీ చేపట్టేవాడు. దిల్లీలో నటరాజన్‌ ఉండే ప్రాంతంలో చాలామంది కష్టజీవులు తాగునీటి కోసం కష్టాలు పడటం చూశాడు. అలాంటి వాళ్లకోసం తన ఇంటి ముందు వాటర్‌ కూలర్‌ను ఏర్పాటుచేశాడు. దాంట్లో చల్లని నీరు దొరుకుతుండటంతో వచ్చిపోయేవాళ్లంతా దాహార్తిని తీర్చుకునేవాళ్లు. క్రమంగా అక్కడికి వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతుండటాన్ని గమనించి తన సేవల్ని విస్తరించాలనుకున్నాడు నటరాజన్‌. కానీ అన్నిచోట్లా కూలర్లను ఏర్పాటుచేయడమంటే ఖర్చుతోపాటు, నిర్వహణ కూడా కష్టమని, మట్టి కుండల్ని ఏర్పాటుచేయడం మొదలుపెట్టాడు. తానుండే దక్షిణ దిల్లీ ప్రాంతంలో బస్టాపులూ, ప్రధాన కూడళ్ల దగ్గర వీటిని పెట్టాడు. వాటికోసం ప్రత్యేకంగా ఇనుప స్టాండ్‌లు తయారుచేయించాడు. కుండల్లోని నీటిని తాగడానికి వీలుగా స్టీలు జగ్గునీ ఉంచుతాడు. రద్దీనిబట్టి కొన్నిచోట్ల మూడు, నాలుగు కుండల్ని పెడతాడు. దాదాపు 30 చోట్ల ఆయన 80 వరకూ మంచినీటి కుండల్ని ఏర్పాటుచేశాడు. స్థానికంగా వీటిని మట్కాలు అంటారు. అందుకే నటరాజన్‌కు మట్కామ్యాన్‌గా గుర్తింపు వచ్చింది.

కారు... నీళ్ల ట్యాంకర్‌గా!
కుండల్లో నీటిని నింపడానికి వీలుగా ఒక కారుని కొని అందులో ట్యాంకర్‌ని ఏర్పాటుచేశాడు. అది 800 లీటర్లు పడుతుంది. అందులోని నీటిని తోడటానికి ఒక పంపింగ్‌ మిషన్‌నీ, జనరేటర్‌నీ అమర్చాడు. నీటిని శుద్ధి చేసే యంత్రాల్నీ ఏర్పాటుచేశాడు. వీటికోసమే రూ.15 లక్షలు ఖర్చుచేశాడు. రోజూ ఉదయం అయిదింటికే నిద్రలేచి, ఆరింటికే వెళ్లి కుండల్ని శుభ్రం చేసి, వాటిలో నీటిని నింపుతాడు.
కొన్నిప్రాంతాలకు రోజులో రెండుసార్లు వెళ్తాడు. వేసవిలో అయితే కుండల్లో నాలుగైదు సార్లు నీళ్లు నింపుతాడు.
ఎక్కడైనా నీళ్లు అయిపోతే తనకు తెలియపర్చడానికి వీలుగా తన ఫోన్‌ నంబరుని కుండలు పెట్టిన స్టాండ్‌మీద రాసిపెడతాడు. సాధారణ రోజుల్లో 600 లీటర్లు, వేసవిలో 2000 లీటర్ల నీటిని వీటిలో నింపుతాడు. విద్యార్థులూ, చిరుద్యోగులూ, ఆటో డ్రైవర్లూ, క్యాబ్‌ డ్రైవర్లూ ఈ కుండల్లోని నీరు తాగడమే కాకుండా తమ బాటిళ్లలో నింపుకుంటారు కూడా.
తన ఇంట్లోని నీటితోపాటు ఒక స్కూల్‌ ప్రాంగణం, మరో ఇద్దరు వ్యక్తుల ఇళ్ల నుంచి ఇందుకు అవసరమైన నీళ్లను సేకరిస్తాడు నటరాజన్‌. ఎవరైనా తమ ప్రాంతంలో కుండల్ని పెడితే వాటిలో నీటిని నింపే బాధ్యతనీ తీసుకుంటాడు. పని పెరుగుతుండటం, వయోభారం కారణంగా ఒక సహాయకుణ్ని పెట్టుకున్నాడు.

దాహం తీర్చడమే కాకుండా పేదలకు తనకు తోచిన సాయం కూడా చేస్తుంటాడు. వారంలో రెండ్రోజులు పండ్లూ బిస్కెట్లూ మిఠాయిలూ లస్సీ లాంటివీ పంచుతుంటాడు. నిరుపేదలకు స్టీల్‌ టిఫిన్‌ బాక్సులూ ఇస్తుంటాడు. తోపుడు బళ్లమీదా సైకిళ్లమీదా తిరిగేవారు టైర్లలో గాలికొట్టుకోవడానికి వీలుగా వివిధ ప్రాంతాల్లో వందకుపైగా పంపుల్ని పెట్టాడు. వీటిలో కొన్నింటిని దుకాణాల దగ్గరా మరికొన్నింటిని నీళ్ల కుండల దగ్గరా పెట్టాడు. ఏటా తన సేవా కార్యక్రమాలకు రూ.10-12 లక్షలు ఖర్చుచేస్తుంటాడు నటరాజన్‌. ఇందుకోసం ఎవరి నుంచీ విరాళాలు తీసుకోడు. ఎవరైనా విరాళాలు ఇస్తామంటే వారినే మరో కొత్త ప్రదేశంలో కుండల్ని ఏర్పాటుచేయమనీ నీళ్లు నింపే బాధ్యత తాను తీసుకుంటాననీ చెబుతాడు. తనను క్యాన్సర్‌ పలకరించి సమాజం గురించి ఆలోచించేలా చేసిందని చెప్పే నటరాజన్‌... లేనివాళ్లకి చేయూతనివ్వడం సేవ కాదు, బాధ్యత అంటాడు. తనను చూసి ఎవరైనా తమ ప్రాంతంలో ఏదో ఒక విధంగా తోటివారికి సాయపడితే అంతకంటే సంతోషం వేరే ఉండదనీ చెబుతాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.