close
పుచ్చ ఫ్యాషన్‌ అదరహో!

ఎండలు మండే వేళ చల్లటి పుచ్చకాయను హెల్మెట్‌లా చేసి తలకు పెట్టేసుకుంటే... చిన్న చిన్న పుచ్చ ముక్కల్ని కోసి చెవులకు లోలాకుల్లా వేలాడేస్తే... ఒంటిమీద బట్టలూ వాటర్‌ మెలన్‌లా మారిపోతే... ఇంటి అలంకరణలోనూ అడుగడుగునా పుచ్చకాయలే దర్శనమిస్తే... అబ్బ ఎంత చల్లగా ఇంకెంత అందంగా ఉంటుందో కదూ...  ఇవి వేసవిలో చల్లదనం కోసం సగటు మానవుడు కనే కలలు అనుకుంటున్నారేమో... కానే కాదు. వేసవి ఫ్యాషన్‌గా వస్తోన్న పుచ్చకాయ ప్రింట్లూ డిజైన్ల గురించి చెప్పే కబుర్లు.

వేసవిలో దాహం తీర్చేందుకూ ఎండలకు నిస్సత్తువ ఆవరించిన శరీరానికి ఉత్తేజం ఇచ్చేందుకూ పుచ్చకాయను మించిన పండు లేదు. ఏమాటకామాట... చల్లటి ఆ పుచ్చకాయ ముక్కల్ని చూస్తేనే కనులకు చలువ కళ్లద్దాలు పెట్టినంత హాయిగా ఉంటుంది. ఇక, ఆకర్షణీయమైన రంగుల మేళవింపుతో చూడచక్కగా ఉండే పుచ్చకాయ వేసవి ఫ్యాషన్‌గా ప్రాచుర్యం పొందడంలో ఆశ్చర్యం ఏముందీ...
వేసవి రావడం ఆలస్యం... చల్లగా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు జనం. అలా కొందరు సరదాగా పుచ్చకాయ లోపలి గుజ్జుని తీసి పై డొప్పని హెల్మెట్‌లా పిల్లల తలకి పెడితే, ‘అబ్బ పుచ్చకాయల్ని బట్టలుగా ధరిస్తే ఇంకెంత బాగుంటుందో’ అంటూ పుచ్చకాయ ముక్కల్ని స్కర్టులాగా ఫ్రాక్‌లా వేసుకున్నట్లూ ఫొటో ట్రిక్కులు చేసేవారు మరికొందరు. ఇవన్నీ ఎప్పట్నుంచో సోషల్‌ మీడియాలో బాగానే ప్రాచుర్యం పొందాయి. అయితే, సరదాగా చేసిన ఆ చిత్రాలే ఫ్యాషన్‌ డిజైనర్లకు స్ఫూర్తినిచ్చాయి. రకరకాల పండ్లూ పువ్వులూ అంటూ ఇంతకాలం ఏవేవో డిజైన్లను బట్టలూ యాక్సెసరీల్లో చొప్పించిన ఫ్యాషన్‌ గురూలు ఇంత అందమైన పుచ్చకాయను మాత్రం ఎందుకో మర్చిపోయారు మరి.
నిజానికి పుచ్చకాయ మొత్తంగా ఓ అందమైన డిజైన్‌. పైన ఆకుపచ్చ చారల డిజైనూ, తర్వాత కాస్త తెలుపు, ఆ కింద నిగనిగలాడే ఎరుపు... ఆ రంగు మధ్యలో నలుపూ తెలుపు చుక్కల్లా అనిపించే గింజలూ... ఇంత అందమైన ప్రకృతి డిజైన్‌ ఇంకెక్కడ దొరుకుతుంది..?
మిగిలిన పండ్లలో చాలా వరకూ పైన రూపమే అందంగా ఉంటుంది. కానీ పుచ్చకాయలో పైన కంటే లోపలే ఎక్కువ ఆకట్టుకుంటుంది. ఇక, దాన్లోని మూడు రంగులూ కలిస్తే మరింత మైమరచిపోయేలా ఉంటుంది. ఇంత అందం దాగుంది కాబట్టే, ఒకప్పుడు వేసవి అనగానే తెరమీదికొచ్చే రకరకాల పండ్లూ పువ్వుల ప్రింట్లను కాదని ఈమధ్య అందరిచూపూ పుచ్చకాయమీదికే మళ్లింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో కూడా ఈ ప్రింట్లకోసం వెతుకులాట విపరీతంగా పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి.

ఎన్నోరకాలుగా...
ఆపిల్‌, నారింజ, ద్రాక్ష... ఇలా దాదాపు అన్ని పండ్లనూ వాటి పూర్తి రూపంలోనే ప్రింట్లుగా బట్టల మీదా యాక్సెసరీలమీదా వాడతారు. దాంతో డిజైన్లలో పెద్దగా మార్పుండదు. కానీ వాటర్‌మెలన్‌తో బోలెడు రకాల
డిజైన్లను సృష్టించొచ్చు. పుచ్చలోని ఎరుపూ తెలుపూ ఆకుపచ్చ రంగుల మిశ్రమంగానూ కేవలం ఎరుపు రంగు ఉండి మధ్యలో గింజల డిజైన్లతోనూ కేవలం ఆకుపచ్చ చారలతోనూ ఇలా ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నించొచ్చు. పైగా పుచ్చకాయ లోపలి భాగం రంగు కూడా కొన్నింటిలో ఎరుపు ఉంటే మరికొన్నిటిలో గులాబీ ఉంటుంది. పైన తొక్క రంగులూ ముదురు ఆకుపచ్చ నుంచి లేతాకుపచ్చ వరకూ మారుతుంటాయి కాబట్టి వన్నెలూ ఎక్కువే. అంతేకాదు, సగం కోసిన పుచ్చకాయ ముక్కల్లానూ త్రికోణాకృతిలో కోసిన ముక్కల రూపంలో వేసిన పుచ్చ ప్రింట్లు కూడా చూడముచ్చటగా ఉంటాయి.

పెద్దలకూ పిల్లలకూ...
పుచ్చకాయ ప్రింట్లకున్న మరో ప్రత్యేకత ఏంటంటే అమ్మాయిలూ అబ్బాయిలకు ఇవి ఎంత ఫ్యాషన్‌గా కనిపిస్తాయో పిల్లలకు అంత ముద్దుగా ఉంటాయి. అందుకే, షర్టులూ స్కర్టుల నుంచి స్కార్ఫ్‌లూ టాప్‌లూ గౌన్లూ లెగ్గింగ్‌ల వరకూ అన్నింటా పుచ్చ ఫ్యాషన్‌ రాజ్యమేలుతోంది. పిల్లల డ్రెస్సుల్లో పుచ్చ ప్రింట్లతో పాటు పైనుంచి కిందికి పుచ్చకాయను తొడిగినట్లుండే ఫ్యాన్సీ డ్రెస్సులూ వస్తున్నాయి. అన్నట్లూ ఈమధ్య ఏ ప్రింట్లు వేసినా అన్నా చెల్లెళ్లూ ఫ్యామిలీ ఫ్యాషన్లు తెరమీదకు వస్తున్నాయి కదా... వాటర్‌మెలన్‌ ప్రింట్లలోనూ అలా అమ్మానాన్నా అక్కాతమ్ముళ్లకు ఒకేలా డిజైన్‌ చేసిన డ్రెస్‌లు తయారవుతున్నాయి.

ఇవేకాదు, బ్యాగులూ చెప్పులూ వాచ్‌లూ గొడుగులూ హెల్మెట్లూ ఫోన్‌ కవర్లూ ఇలా అన్నింట్లోనూ పుచ్చకాయ ప్రింట్లు అందంగా అమరిపోతున్నాయి. ఆఖరికి అంత పెద్ద పుచ్చ గోటిమీద నెయిల్‌ ప్రింట్‌లానూ అతుక్కుపోతోంది. ఇక, రాళ్ల నగల్లో వచ్చే పుచ్చకాయ డిజైన్లను చూస్తే అమ్మాయిలెవరైనా మనసు పారేసుకోవాల్సిందే. దుప్పట్లూ కర్టెన్లూ డోర్‌ మ్యాట్లలోనూ ఇమిడిపోయిన ఇవి ఇంటి అలంకరణలోనూ భాగం అవుతున్నాయి.
కళ్లు మూసుకుని ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని వర్షం శబ్దం వింటే బయట మండుటెండ ఉన్నా ‘మనచుట్టూ నిజంగానే వర్షం పడుతుందా...’ అన్న అనుభూతి కలుగుతుంది. అలాగే పుచ్చకాయ ముక్కల ప్రింట్లు ఒంటిమీదా ఇంట్లోనూ కంటికెదురుగా కనిపిస్తే మండే ఎండల్లో కాస్తైనా చల్లటి అనుభూతి కలుగుతుందనడం అతిశయోక్తి కాదు. అందుకే, పుచ్చకాయ వేసవిలో చలచల్లటి చూడచక్కటి ఫ్యాషన్‌గా వచ్చేస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.