close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మా! మారవా

- రమాదేవి బుక్కపట్నం

సుమకు గత వారంరోజుల నుండి సరిగా నిద్రపట్టడం లేదు. ఒకటే ఎడతెరిపిలేని ఆలోచనలు వస్తున్నాయి. గాభరా గాభరాగా ఉంటోంది. ‘పెళ్ళి చేసుకోబోయే అందరు అమ్మాయిలకూ ఇలాగే ఉంటుందా లేక తనకు మాత్రమే ఇలా ఉందా’ అనుకుంది. వచ్చే నెలలో ఈపాటికి తన పెళ్ళి అయిపోయుంటుంది. కొత్త వాతావరణమూ కొత్త ఇల్లూ కొత్త మనుషుల మధ్య ఎలా ఇమడగలనో అన్న ఆలోచన కొంత భయాన్ని కూడా కలుగజేస్తోంది. రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది.

* * * * *                     * * * * *                     * * * * *

సుమ ఇంజినీరింగ్‌ చదివి ఒక పేరుమోసిన కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెతోపాటు పనిచేసే సాయిచరణ్‌ మొదటినుండీ తనను ప్రత్యేకంగా గమనిస్తూ ఉండటాన్ని గ్రహించింది. తన తల్లిదండ్రుల గురించీ చదువు గురించీ ఇష్టాయిష్టాల గురించీ సమయస్ఫూర్తితో అడిగి తెలుసుకుంటున్నాడని అనిపిస్తూ ఉండేది. అందగాడూ గుణవంతుడూ అయిన సాయిచరణ్‌ సుమకు ఎంతగానో నచ్చాడు. చక్కగా మాట్లాడుతూ జోక్స్‌ వేస్తూ నవ్వుతూ చుట్టూ ఉన్నవారిని నవ్విస్తూ ఉండే సాయి అంటే ఎంతో అభిమానం కలిగింది. కానీ, ఆ అభిమానాన్ని ప్రేమగా మార్చుకునే ధైర్యం చేయలేకపోయింది. కారణం తమ కులాలు ఒకటే అయినా ఆర్థిక అంతరం చాలా ఉంది. మధ్యతరగతి అమ్మాయి అయిన తను వారితో సరితూగలేమన్న భయంతో ‘మనసా తుళ్ళిపడకే... అతిగా ఆశపడకే’ అన్న జానకి పాటను దృష్టిలో పెట్టుకుని ప్రేమను మనసులోనే అణచివేసుకుంది.
ఒకరోజు సాయిచరణ్‌ ఉరుములేని వర్షంలా సుమ దగ్గరికి వచ్చి సున్నితంగా తన ప్రేమను వ్యక్తంచేశాడు. మొహమాటం లేకుండా ముక్కు సూటిగా తన మనసులోని మాటను చెప్పాడు.
‘‘మీరు కూడా మీ అభిప్రాయం తెలిపితే మా అమ్మానాన్నలను మీ ఇంటికి పంపించి మీ పెద్ద వారితో మాట్లాడిస్తాను’’ అన్నాడు సాయిచరణ్‌.
ఊహించని ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయింది సుమ. మనసు ఆనందడోలికల్లో ఊగిపోతుండగా తన అంగీకారాన్ని కళ్ళతోనే తెలియజేసింది. ఆ తరవాత సాయి తల్లిదండ్రులు సుమ ఇంటికి వెళ్ళడమూ అన్నీ మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడమూ చకచకా జరిగిపోయాయి.
‘‘మీ సుమ చాలా అదృష్టవంతురాలు లక్ష్మీ. బంగారం లాంటి సంబంధం కుదిరింది. దేనికైనా పెట్టి పుట్టాలమ్మా’’ అని పక్కింటివారు ఎన్నో రకాలుగా పొగుడుతుంటే ఎనలేని సంతోషం ఒకవైపూ... కొత్త ఇంటిలో ఎలా ఉండగలనో అన్న భయం ఒకవైపూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి సుమను. అయినా ప్రతి ఆడపిల్లకూ జీవితంలో ఇది తప్పదు కదా అనుకుని తనను తాను సముదాయించుకుంది.
నెల రోజుల సమయం ఇట్టే గడిచిపోవడమూ పెళ్ళి జరిగిపోవడమూ సుమ అత్తారింటికి వెళ్ళడమూ వెంటవెంటనే జరిగిపోయాయి.

* * * * *                     * * * * *                     * * * * *

‘‘ఆగండాగండి... అన్నయ్యా వదినా. మీ పేర్లు చెప్పి ఆడపడుచు కట్నం ఇచ్చాకే లోపలికి రావాలి’’ ఆడపడుచు శ్వేత అడ్డగింపు. ఎంత చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా అంతమందిలో భర్త పేరు చెప్పాలంటే చాలా సిగ్గుపడిపోయింది సుమ. దానికితోడు సాయి ఓరచూపులూ కొంటెనవ్వులూ.
‘‘వందనమ్మా, అదృష్టవంతురాలివమ్మా. చక్కని కోడల్ని తెచ్చుకున్నావు. ఈడూ జోడూ బాగా కుదిరింది’’ అని అందరూ పొగుడుతుంటే అత్తగారి ముఖంలో ఒక సంతృప్తితో నిండిన చిరునవ్వు సుమ దృష్టిని దాటిపోలేదు.
‘‘అందరూ కలిసి అమ్మాయిని కంగారుపెట్టకండి’’ అంటూ మామయ్యగారి మెత్తని మందలింపు.
‘‘మా చెల్లిని ఏమీ అనకండి. తనకు తోడుగా ఈ అన్నయ్య ఉన్నాడు’’ అంటూ మా ఆడపడుచు భర్త సపోర్టు. ఆరోజు సరదాగా గడిచిపోయింది.
ప్రేమగా చూసే చరణ్‌, అభిమానించే అత్తగారూ మామగారూ ఆడపడుచుల మధ్య మూడు నెలలు ఎంతో హాయిగా గడచిపోయాయి. తన స్నేహితురాళ్ళు రాధ, మైత్రి, అరుణ, అర్పిత అందరూ కూడా ఏదో ఒక రకంగా తాము అత్తగారింట్లో బాధలుపడ్డామనే చెప్పారు. కానీ తనుమాత్రం అత్తగారి వల్ల ఎప్పుడూ బాధపడ లేదు. వచ్చినరోజే వంట ఇల్లు అప్పచెప్పకుండా ఆవిడే వంట చేసేవారు. తనకు ఏమేమి ఇష్టమో కనుక్కునేవారు. తనకై తనే వంటకు సహాయం చేస్తానని వెళ్తే వద్దనేవారు. చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇంటి ఆచార వ్యవహారాలనూ ఇంట్లోవారి అలవాట్లనూ గురించి చెప్పేవారు. ఈ ఇంట్లో నువ్వూ ఒక ముఖ్య సభ్యురాలివే సుమా అన్నట్లు మాట్లాడేవారు.
అసలు సుమ ఈ వాతావరణాన్ని ఊహించ లేదు. తన స్నేహితురాళ్ళ అత్తగారిళ్ళను గురించి విన్నప్పుడు తను కూడా అత్తగారింటికి వెళ్ళి నపుడు ఏ పనీ చేయకూడదనీ, ఏ విధంగానూ వారెవ్వరికీ సహకరించకూడదనీ గట్టిగా అనుకుని వచ్చింది. కానీ ఇక్కడ వాతావరణం అలా లేదు. తనను పని చెయ్యమని కానీ ఇలా ఉండాలీ అలా ఉండాలని కానీ ఎవరూ చెప్పడం లేదు. అందరూ తనను గౌరవిస్తూ అభిమానించడంవల్ల తనకే ఊరికే కూర్చోవ
డానికి మనసొప్పడం లేదు. మనస్ఫూర్తిగా ఇష్టంగా అన్నీ చేయాలనిపిస్తోంది. అందరు ఆడపిల్లల అత్తగారిళ్ళూ ఇలా ఉంటే ఎంత బాగుండునో కదా అన్పిస్తోంది సుమకు.
ఈ మూడు నెలల్లో ఒక్కసారి కూడా సుమ అత్తగారింటిలో బాధపడటంగానీ చిన్నబుచ్చు కోవడంగానీ జరగలేదు. తనకు కూడా ఆ ఇల్లూ ఇంట్లోని మనుషులూ అంటే మెల్లగా అభిమానం కలుగసాగింది. అత్తగారింట్లో తన వంతు బాధ్యతను ఎంతో బాగా నిర్వహించా లని అనుకుంది. ‘ఒకవేళ వీళ్ళంతా కొత్తగా పెళ్ళయినందున ఇప్పుడు తనను అభిమానిస్తు న్నట్లు నటించి, రానురాను నిజస్వరూపం చూపిస్తారా’ అన్న అనుమానం కూడా సుమకు కలగకపోలేదు. కానీ, అంతలోనే ‘ఛీ ఛీ, తను ఎంత నీచంగా ఆలోచిస్తోంది? వీళ్ళలో ఎక్కడా నటన అన్నది కనిపించడం లేదు. అందరూ నిజంగానే మంచివారు. దురదృష్టంకొద్దీ తన అనుమానమే నిజమయ్యే పరిస్థితి వస్తే తను చదువుకున్నది కాబట్టి ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలదు’ అని కూడా అనుకుంది.
‘‘సుమా, ఈరోజు అబ్బాయి త్వరగా వస్తాననీ సినిమాకు వెళ్ళాలనీ నిన్ను రెడీగా ఉండమనీ చెప్పాడు కదా. లేమ్మా, లేచి రెడీ అవ్వు. రాత్రికి వంట ఏం చేయాలో నేను చూసుకుంటాన్లే. మీరు వెళ్ళిరండి’’ అంటూ అత్తగారు గుర్తుచేసేసరికి ఇంతసేపూ తను వారిపైన అనుమానపడినందుకూ తప్పుగా ఆలోచించినందుకూ సిగ్గువేసింది.
సుమ అత్తగారింట్లో అన్ని రకాలుగా ఆనందంగా సంతృప్తిగా ఉంది. కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి. ఈ సంతోషాన్నీ హాయినీ ఎందుకు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానూ అనుకుంది.
వెంటనే సుమకు వదిన స్వాతి గుర్తుకు వచ్చింది. అన్నయ్య పెళ్ళి అయి రెండు సంవత్సరాలు అయినా వదిన ఏరోజూ సంతోషంగా లేదు.
పెళ్ళి అయిన మొదటిరోజు సుమ కూడా అన్నావదినలను పేర్లు చెప్పమంటూ వాకిట్లోనే ఆపేసింది.
‘‘ఆఁ కొత్తగా ఏం చెబుతారులే. రోజుకు వందసార్లు పేర్లుపెట్టి పిలుచుకుంటారు. ఇంకా ఎందుకు ఈ సంబడం’’ అని తల్లి అనడంతో వదిన చిన్నబుచ్చుకోవడమూ అన్నయ్య కళ్ళతోనే సముదాయించడమూ సుమ గమనించింది. వదినపట్ల తనకున్న అసంతృప్తిని వీలు దొరికినప్పుడల్లా బయటపెడుతూ వచ్చింది తల్లి. ప్రేమగా చూస్తే కోడళ్ళు చెప్పుచేతల్లో ఉండరన్నది సుమ తల్లి అభిప్రాయం. ‘పాతతరం మనిషి కాబట్టి అమ్మ అలా అనుకుని ఉండొచ్చు. స్వతహాగా సౌమ్యురాలైన అమ్మ మనసులోని ఈ చెడు భావాన్ని నేనే పోగొట్టాలి. అందుకు నేనేం చెయ్యాలి? అక్కడ వదిన కూడా సంతోషంగా ఉండేటట్లు ఎలా చెయ్యాలి?’ చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన సుమ తల్లికి ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.

* * * * *                     * * * * *                     * * * * *

ప్రియమైన అమ్మకు,
సుమ వ్రాయునది. అక్కడ మీరందరూ క్షేమమని తలుస్తాను. ఇక్కడ నేను బాగున్నాను... కాదు కాదు చాలా చాలా బాగున్నానమ్మా.
మీ అల్లుడుగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మా అత్తగారూ మామగారైతే కన్నకూతురితో సమానంగా అభిమానిస్తూ గౌరవిస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయినా మూడు క్షణాలుగా గడిచిపోయింది.
మా ఆడపడుచూ ఆమె భర్తా వారానికి ఒకసారి మా ఇంటికి వస్తారు. తను ఒక స్నేహితురాలిలా నాతో కలిసిపోయింది. నేను ఇక్కడికి వచ్చేముందు కొంచెం భయపడ్డాను కానీ ఇక్కడ అందరినీ చూశాక అన్ని భయాలూ అనుమానాలూ పోయి స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాను.
అమ్మా, మా అత్తగారు మా ఇంటికి వచ్చిన ప్రతివారికీ ‘నా కోడలు సుమ, చాలా మంచిపిల్ల’ అని పరిచయం చేస్తారు. మా మామగారేమో ‘ఈ అమ్మాయి మనింటికి కొత్తగా పెళ్ళయి వచ్చింది. వాళ్ళింట్లో ఆచారాలేమో వ్యవహారాలేమో మనకు తెలియదు. అమ్మాయిని బెదరకొట్టకుండా మాట్లాడుతూ మన ఇంటిలో ఇమిడిపోయేలా చూడండి’ అంటూ అందరికీ చెప్పారు.

అమ్మా, మొన్న ఏమైందో తెలుసా...
మా అత్తగారి ఆడపడుచు కొడుకూ కోడలూ వచ్చారు. వాళ్ళకు నా గురించి చెబుతూ
‘నా ఇంటికి నా కోడలు వచ్చిందనుకోవడం లేదు. నాకు మరొక కూతురు వచ్చిందనిపిస్తుంది. చాలా అణకువగలిగిన పిల్ల. మా ఇంటిని సరిదిద్దుకుని అందరినీ బాగా చూసుకోగలదన్న నమ్మకం నాకుంది. ఇక నాకు ఏ దిగులూ లేదు’ అన్నారు. నాకు ఎంతో సిగ్గుగా గర్వంగా అనిపించింది.
మా అత్తగారింట్లో అందరూ నాపైన చూపిస్తున్న అభిమానమూ ఆదరణా నాకు ఎంతో మానసిక బలాన్నిస్తున్నాయి. కొత్త ఇల్లూ కొత్త మనుషులూ కొత్త వాతావరణమూ అన్న భయం ఎప్పుడో పోయింది. కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలు ఎప్పుడెప్పుడు పుట్టింటికి వెళ్దామా అని ఎదురుచూస్తారట. కానీ, నాకేమనిపిస్తుందో తెలుసా అమ్మా... ఇప్పుడొద్దులే, తర్వాతెప్పుడైనా వెళ్ళొచ్చులే అనిపిస్తోంది.
అమ్మా, ఇప్పటిదాకా నా గురించి నీకు చెప్పాను. నేను నీ కడుపున పుట్టిన కూతుర్ని. అనుభవంలో నీకన్నా ఎంతో చిన్నదాన్ని. నువ్వు మరోలా భావించకపోతే నేను ఒక విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను.
అమ్మా, నువ్వు మారాలి. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించు. నేనూ అన్నయ్యా చిన్నపిల్లలుగా ఉన్నపుడే నాన్నగారు చనిపోయారు కదా. అప్పుడు నువ్వు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. అన్నయ్యనూ నన్నూ చదివించి, పెళ్ళిళ్ళు చేసి మాకు మంచి జీవితాల నందించావు. అందుకు మేము ఎంతో గర్వ పడుతున్నాం. ఒక తల్లిగా నువ్వు గెలిచావు కానీ, ఒక అత్తగారిగా ఎందుకమ్మా ఓడి పోతున్నావు? కోడల్ని మెచ్చుకోవడం, ప్రేమగా చూడటం సరికాదనే నీ అభిప్రాయం తప్పమ్మా. అందుకే నువ్వు వదినను మన ఇంట్లోకి సంతోషంగా స్వాగతించలేకపోయావు. నీ కూతురు భర్తతో సంతోషంగా ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావో నీ కొడుకు కూడా భార్యతో అంత సంతోషంగానూ ఉండాలని అనుకోవాలి కదమ్మా.
వదిన కూడా నాలాగే అమ్మానాన్నలను వదిలిపెట్టి వచ్చిన ఆడపిల్లే కదా. కానీ తను నాలాగా ఏరోజూ సంతోషంగా లేదు.
నీ సూటిపోటి మాటలకు తిరిగి సమాధానం చెప్పలేకా తన తల్లిదండ్రులతో చెప్పుకోలేకా వదిన ఎన్నోసార్లు చాటుగా కంటతడి పెట్టుకోవడమూ అన్నయ్య సముదాయించడమూ నా కళ్ళారా చూశాను.
చిన్నపుడు అన్నయ్య నన్ను సరదాగా ఏడిపిస్తుంటే ‘ఆడపిల్లను ఏడిపించకూడదు, ఇంటికి మంచిది కాదు’ అని ఎన్నోసార్లు అన్నయ్యను మందలించావు. వదిన కూడా
ఒక ఇంటి ఆడపిల్లే కదమ్మా. తన కంటనీరు రాకుండా చూసుకునే బాధ్యత నీదే కదా.
అమ్మా, ఇవన్నీ నీకు తెలియదని కాదు.
నీకు ఒక విషయం చెప్పనా... ఈ ఇంట్లో నేను చాలా స్వేచ్ఛగా సౌకర్యంగా సంతోషంగా ఉన్నాను. కానీ, ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను. ఆ సమయంలో నాకు వదిన గుర్తుకువస్తోంది.
చివరగా ఒక మాటమ్మా. మా జనరేషన్‌ గురించి నీకు తెలియదని కాదు. స్వతంత్రభావాలు కాస్త ఎక్కువగా ఉన్న ఆడపిల్లలం. మరీ ఒద్దికగా ఉంటూ అత్తగారింట్లో మీ కాలంలో వారిలాగా సర్దుకుపోవడం కాస్త తక్కువనే చెప్పాలి. కానీ వదిన మా అంత గట్టిది కూడా కాదమ్మా, చాలా సౌమ్యురాలు. మన ఇంటికి తగిన కోడలు. తను కూడా సంతోషంగా ఉండేటట్లు చూడమ్మా, ప్లీజ్‌. ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమిస్తావు కదూ!

ఇట్లు

నీ కూతురు

సుమ

కూతురు రాసిన సుదీర్ఘమైన ఉత్తరం చదివిన లక్ష్మి - నీళ్ళు నిండిన కళ్ళను తడుచుకుంది. పశ్చాత్తాపంతో ఒక నిర్ణయానికి వచ్చినదానిలా లేచి తన కోడలు స్వాతి ఉన్న గదివైపుగా నడిచింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.