close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఐడియా ఉంటే పోటీకి రండి!

వ్యాపారంలో అడుగు పెట్టడానికి వయసు అడ్డంకి కానేకాదు. అందుకే అనుభవజ్ఞులకే కాకుండా కాలేజీ విద్యార్థులకూ ప్రత్యేక పోటీలుపెట్టి వాళ్లలో యువ వ్యాపారుల్ని అన్వేషిస్తున్నాయి కొన్ని సంస్థలు. లక్షల రూపాయల నగదు బహుమతులతోపాటు అమూల్యమైన అనుభవ జ్ఞానాన్ని పంచుతూ టీనేజ్‌లోనే వారి ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకొచ్చే అవకాశం కల్పిస్తున్నాయి. 


తెలుగు విద్యార్థులకు...

నేటి విద్యార్థులు వ్యాపార ఆలోచనల్లోనూ చురుగ్గా ఉండటాన్ని గమనించిన ‘ది ఇండస్‌ ఆంత్రప్రెన్యూర్స్‌(టై)’... వారి కలల్ని నిజం చేసుకోవడంలో సాయపడుతోంది. దీనికోసం తెలుగు రాష్ట్రాల్లో ‘టై హైదరాబాద్‌’ ప్రత్యేక పోటీల్ని నిర్వహిస్తోంది. ‘టై గ్రాడ్‌ బిజినెస్‌ ఐడియా టోర్నమెంట్’ గా పిలిచే ఈ పోటీలకు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మేనేజ్‌మెంట్‌... చదువుతున్న విద్యార్థులు అర్హులు. పోటీల దశలోనూ ‘టై’ సభ్యుడొకరు విద్యార్థి బృందానికి మార్గనిర్దేశం చేస్తారు. విజేతలకు రూ.20 లక్షల వరకూ నగదు బహుమతులు అందించడంతోపాటు సంస్థ ఏర్పాటుకు నిధులు సమకూర్చడం, మార్గనిర్దేశం చేయడం, నమూనా ఉత్పత్తిని తేవడంలో ‘టై’ సాయపడుతుంది. 2017లో నిర్వహించిన మొదటి విడత పోటీల్లో ‘విండో క్లీనింగ్‌ బోట్‌’ ఆలోచనతో బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థి ఉజ్వల్‌ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో విడతలో ఆసుపత్రుల్ని శుభ్రం చేసేందుకు ఉపయోగించే రోబోని అభివృద్ధిచేసిన బిట్స్‌ హైదరాబాద్‌, సౌర విద్యుత్‌ ఫలకాల్ని శుభ్రంచేసే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘విష్ణు కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ భీమవరం విద్యార్థులకు సంయుక్తంగా మొదటి బహుమతి ఇచ్చారు. ‘టై’తో ప్రత్యేక ఒప్పందం ఉన్న కళాశాలల విద్యార్థులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్‌లో మూడో విడత పోటీలకు దరఖాస్తుల స్వీకరణ (hyderabad.tie.org) మొదలవుతుంది.


మార్పు ఆలోచనలు...

మనలాంటి అభివృధ్ధి చెందుతున్న దేశాల్లో సేవా దృక్పథంతో పనిచేసే సంస్థల అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రత్యేకంగా ఇలాంటి సంస్థల్ని ప్రారంభించేవాళ్లని ప్రోత్సహిస్తోంది టాటా సంస్థ. ఐఐఎమ్‌ కలకత్తాతో కలిసి ‘టాటా సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఛాలెంజ్‌’ పేరుతో సేవా దృక్పథం ఉన్న  సంస్థలకు పోటీ పెడుతోంది. వ్యాపార సంస్థ ఆలోచన దశలో ఉన్నా, ప్రారంభించి మూడేళ్లలోపు ఉన్నా ఈ పోటీకి అర్హులు. ఈ జాతీయస్థాయి పోటీల్ని ఏటా నిర్వహిస్తుంటారు. అత్యుత్తమ 100 ఆలోచనలకు ప్రాంతీయ పోటీ పెడతారు. వాటినుంచి 10, అందులోంచి అత్యుత్తమమైన మూడు సంస్థల్ని ఎంపికచేస్తారు. మొదటి స్థానంలో నిలిచే సంస్థకు రూ.2.5లక్షలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచే సంస్థలకు రూ.2 లక్షలు, రూ.1.5 లక్షల నగదు బహుమతి ఉంటుంది. తుది జాబితాలోని పది సంస్థలకు ఐఐఎమ్‌ కలకత్తా ప్రాంగణంలోని ఇన్నోవేషన్‌ పార్క్‌లో ఇంక్యుబేషన్‌కు అవకాశం ఇస్తారు. ఆ సమయంలో  పెట్టుబడిదారులతో పరిచయంచేసి సంస్థ ప్రారంభానికి అవసరమైన ఆర్థిక సహకారం అందేలా చూస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన... లాంటి రంగాల్లో వినూత్న ఆలోచన, సాంకేతిక పరికరాలతో మార్పు తెచ్చే సంస్థలకు ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. ఎనిమిదో విడత పోటీలకు దరఖాస్తుల్ని (tatasechallenge.org) స్వీకరిస్తున్నారు. 


బహుమతి... రూ.25 లక్షలు

జాతీయస్థాయిలో జరిగే పోటీల్లో ‘ఇండియా ఇన్నోవేషన్‌ గ్రోత్‌ ప్రోగ్రామ్‌’ ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని శాస్త్ర సాంకేతిక విభాగం... లాక్‌హీడ్‌ మార్టిన్‌, టాటా ట్రస్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తోన్న పోటీ ఇది. 2007 నుంచీ ఈ పోటీల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో ఐఐఎమ్‌ అహ్మదాబాద్‌, ఐఐటీ బోంబే కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులకూ(యూనివర్సిటీ ఛాలెంజ్‌), ఇతరులకూ(ఓపెన్‌ ఛాలెంజ్‌) వేర్వేరుగా పోటీలు ఉంటాయి. ప్రాథమిక వడపోత తర్వాత విద్యార్థుల విభాగంలో టాప్‌-30, ఓపెన్‌ విభాగంలో టాప్‌-50 సంస్థలకు బూట్‌ క్యాంప్‌ నిర్వహిస్తారు. ఇక్కడ వారికి వ్యాపార నమూనా తయారీలో, ధరలు నిర్ణయించడంలో మార్గనిర్దేశం, వస్తువు డిజైన్‌, పెట్టుబడిదారుల్ని ఆకర్షించడంపైన శిక్షణ ఉంటుంది. ఏటా విద్యార్థుల విభాగంలో నాలుగు, ఓపెన్‌ విభాగంలో 16 సంస్థలకు అవార్డులు అందిస్తారు. విజేతలైన విద్యార్థి బృందానికి రూ.10లక్షలూ, ఇతర బృందాలకు రూ.25 లక్షలు అందిస్తారు. విజేతలు మసాచ్యుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని సందర్శించే అవకాశమూ ఉంటుంది. 2019-20 పోటీలకుగానూ దరఖాస్తు చేయడానికి (indiainnovates.in) ఆఖరితేదీ ఏప్రిల్‌ 21. ఆలోచన ఉంటే ఆలస్యం చేయకండి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.