close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దీర్ఘాయుష్షుకి కారణమేంటంటే...

ప్రపంచ దేశాల్లో జపాన్‌వాసులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తారన్నది తెలిసిందే. అషిటబా (గైనురా ప్రొకంబెన్స్‌) అనే ఒకరకం పాలకూర మొక్కే వాళ్ల ఆరోగ్యానికి కారణమనీ అదే వాళ్లు ఎక్కువ చురుగ్గా ఉండేలా చేస్తుందనీ అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా వయసైపోయి పనికిరాని కణాలు శరీరం నుంచి వాటంతటవే బయటకు పోతాయి. ఈ ప్రక్రియనే ఆటోఫాగీ అంటారు. ఒకవేళ అలా పోకుండా పోగుబడి, శరీరంలో మృతకణాల సంఖ్య పెరిగిపోతే అవి హానికరంగా మారి, ఆరోగ్యకరమైన కణాలమీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా రకరకాల వ్యాధులకి ఆస్కారం కలుగుతుంది. అషిటబా మొక్కలోని పదార్థాలు శరీరంలోని కణాల విచ్ఛిన్నతనీ చెత్త పోగుపడటాన్నీ అడ్డుకుంటాయట. ఈ మొక్కలోని 4,4-డైమెథాక్సీచాల్కోన్‌ అనే ఫ్లేవొనాయిడ్‌, ఆటోఫాగీని ప్రేరేపించి ఆరోగ్యకణాలు దెబ్బతినకుండా చేస్తుంది. పైగా వయసుతోపాటు పెరిగే సమస్యల్నీ అడ్డుకుంటుందనీ గుర్తించారు. కాబట్టి మున్ముందు ఈ మొక్కకి బాగా డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందన్నమాట.


కునుకుతో బీపీకి చెక్‌!

బీపీతో బాధపడుతున్నారా... అయితే కచ్చితంగా మధ్యాహ్నం ఓ గంట లేదంటే కనీసం పది నిమిషాలయినా కునుకు తీయండి అంటున్నారు న్యూ ఓర్లియాన్స్‌లోని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు. రోజూ పగటివేళలో ఓ కునుకు తీయడం వల్ల శరీరం పునరుత్తేజాన్ని పొందడంతో మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదే సమయంలో బీపీ కూడా తగ్గే అవకాశం ఉందట. ఇందుకోసం వీళ్లు 60 సంవత్సరాలకు పైబడి, పగటివేళలో నిద్రపోయే 200 మంది బీపీ రోగుల్ని ఎంపికచేసి పరీక్షించి చూడగా వాళ్లలో నిద్ర కారణంగా బ్లడ్‌ ప్రెషర్‌ రీడింగ్స్‌లో తేడా స్పష్టంగా కనిపించింది. అంతేకాదు, దీనివల్ల హృద్రోగాలు వచ్చే సమస్య కూడా తగ్గుతుందట.


ఓట్స్‌తో అందమెంతో..!

ఈమధ్య కాలంలో ఉదయమో సాయంత్రమో అల్పాహారంగా చాలామంది ఓట్స్‌ తీసుకుంటున్నారు. అయితే అవే ఓట్స్‌తో చర్మాన్నీ శిరోజాల్నీ కూడా మెరిపించవచ్చు. పైగా ఓట్స్‌లోని పోషకాలు చర్మానికి చల్లదనాన్నీ అందిస్తాయి అంటున్నారు సౌందర్య నిపుణులు.
* కాసిని ఓట్స్‌ని గోరువెచ్చని నీళ్లతో కలిపి మెత్తగా చేసి ఒంటికి పట్టించి, మృదువుగా మర్దన చేసి, ఓ అరగంట తరవాత కడిగేయడం వల్ల చర్మంమీద ఉన్న మృతకణాలు తొలగిపోవడంతోబాటు రక్తప్రసరణ మెరుగవుతుంది. ఓట్స్‌లోని జింక్‌ కారణంగా మొటిమలూ వాటి కారణంగా ఏర్పడే మచ్చలూ తొలగిపోతాయి.
* రెండు కప్పుల ఓట్స్‌ పొడిలో కప్పు పాలు, టేబుల్‌స్పూను తేనె వేసి బాగా కలిపి ఒంటికి పట్టించి పావుగంట తరవాత చల్లని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా అందంగా మెరుస్తుంది.
* ఓట్స్‌ పొడిలో కాసిని నీళ్లు పోసి నానబెడితే పాలలా అవుతాయి. వాటిల్లో దూదిని ముంచి చర్మంమీద అద్దుతూ శుభ్రం చేస్తే సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది.
* కప్పు ఓట్స్‌లో రెండు కప్పుల మరిగించిన నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బి అందులో టేబుల్‌స్పూను నిమ్మరసం, టీస్పూను ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌, టేబుల్‌స్పూను ఆలివ్‌ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి రెండు నిమిషాలాగి కడిగేయాలి. దీనివల్ల చుండ్రు తగ్గుతుంది.
అరకప్పు పాలల్లో 3 టేబుల్‌స్పూన్ల ఓట్స్‌ పొడి, టేబుల్‌స్పూను కొబ్బరినూనె వేసి బాగా కలిపి జుట్టుకి మాస్క్‌లా వేసి అరగంట తరవాత షాంపూ చేసినా జుట్టు చక్కగా మెరుస్తుంది.


డి-విటమిన్‌తో ఆస్తమా నిర్మూలన!

వాయు కాలుష్యం, ధూమపానం, పొగ, ధూళి, పుప్పొడి... వంటివి ఆస్తమాను ప్రేరేపిస్తాయన్నది తెలిసిందే. ముఖ్యంగా వాయుకాలుష్యంతో నిండిన పరిసరాల్లో నివసించడం వల్ల కూడా పిల్లల్లో ఆస్తమా కనిపించే అవకాశం ఎక్కువ. అయితే శరీరంలో విటమిన్‌-డి సమృద్ధిగా ఉంటే, వాయుకాలుష్యం ఉన్నప్పటికీ ఆస్తమా పెద్దగా బాధించదు అంటున్నారు మౌంట్‌ సినాయ్‌లోని ఆయెకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కి చెందిన పరిశోధకులు. విటమిన్‌-డి అనేది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి డి-విటమిన్‌ పుష్కలంగా ఉన్నవాళ్లలో శ్వాసకోశ సంబంధ సమస్యలు తక్కువని చెబుతున్నారు. ఇందుకోసం వీళ్లు ఆస్తమా ఉన్న 120 మంది పిల్లల్ని ఎంపికచేసి పరీక్షించి చూడగా విటమిన్‌-డి శాతం ఎక్కువగా ఉన్నవాళ్లు ఆస్తమాకి గురయ్యే సందర్భాలు తక్కువని తేలింది. దీన్నిబట్టి వాయుకాలుష్యంతో నిండిన పరిసరాల్లో జీవించేవాళ్లు డి-విటమిన్‌ ఎక్కువగా లభించే పుట్టగొడుగులు, చేపలు, కమలాపండ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.