close
కోర్కెలు తీర్చే కాల్వనరసింహుడు!

చుట్టూ దట్టమైన అటవీప్రాంతంలో ఉగ్రనారసింహుడు శాంతమూర్తిగా కొలువైన క్షేత్రం నిర్మల్‌ జిల్లాలోని కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. కాకతీయులు నిర్మించిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టు నుంచి కోనేటి వరకూ ప్రతిదీ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోందనడంలో సందేహంలేదు. శివకేశవులకు భేదం లేదని చాటుతూ మహాశివరాత్రి రోజున లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలూ అభిషేకాలూ చేయడం విశేషం.

పొడవాటి కోరమీసాలతో, నిప్పులు కురిపించే కళ్లతో, నరమృగ శరీరంతో స్తంభంలోంచి ఉద్భవిస్తాడు నరసింహస్వామి. హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి ఇలా కుదరదూ అలా కుదరదంటూ ఎన్నో నియంత్రణలు ఉన్నా తన భక్తుడిని కాపాడటం కోసం వీటన్నింటినీ మించిన మరో ఉపాయం ఉందంటూ నరమృగ శరీరంతో వచ్చి రాక్షస సంహారం చేశాడు ఉగ్రనరసింహుడు. అవతార లక్ష్యం నెరవేరిన అనంతరం తన భక్తుల కోసం శాంత రూపుడై లక్ష్మీదేవి సమేతంగా పూజలందుకుంటున్నాడు. వాటిల్లో ముఖ్యమైందీ అత్యంత పురాతనమైందీ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో కొలువైన కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయం.

ఇదీ చరిత్ర
13వ శతాబ్దంలో కాకతీయ రాజులు కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే కొద్ది రోజుల తర్వాత ఆలయం వెనకభాగంలో ఉన్న కొండమీద స్వామివారు సింహరూపంలో స్వయంభూగా వెలశాడని చెబుతారు. దానికి నిదర్శనంగానే ఇప్పటికీ గర్భాలయంలోని నరసింహస్వామిని దర్శించిన అనంతరం భక్తులు కొండమీదకు వెళ్లి పూజలు చేస్తారు. అయితే ఔరంగజేబు ఈ ప్రాంతంమీద దాడిచేసినప్పుడు ఆలయంలోని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడంతో 1985వ సంవత్సరం వరకూ గర్భాలయంలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉండేవని స్థానికులు చెబుతున్నారు. తర్వాతి కాలంలో నిర్మల్‌కు చెందిన తెలివారి రాజేశ్వర్‌ అనే భక్తుడి సహకారంతో ఊరిప్రజలంతా కలిసి మూలవిరాట్టు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ ఏటా ఆయా తేదీల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఆలయం ముందుభాగంలోని కోనేరులో అన్ని కాలాల్లో నీరు ఉండటం విశేషం. అంతేకాదు ఆ కోనేటి నీటిని తీసుకెళ్లి పంటపొలాల్లో చల్లుకుంటే చీడపీడలు సోకకుండా పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఏ పంటవేయాలన్నా ముందుగా ఈ కోనేటి నీటిని తీసుకెళ్లి పొలంలో చల్లడం అనేది ఇక్కడ ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.

విశేష అర్చనలు
ఏటా వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున నరసింహుడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజులు సాగే ఈ ఉత్సవాల్లో అఖండ దీపార్చన, అంకురార్పణ, ధ్వజారోహణం, స్వామివారి కల్యాణం, రథోత్సవం, చక్రస్నానం మొదలైన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం కోసం వచ్చే భక్తులు స్వామివారి గరుడ ముద్దలను ప్రసాదంగా అందించే ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన దంపతులకు తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందులో పాలుపంచుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.
సాధారణంగా మహాశివరాత్రి రోజున శివాలయాలు భక్తులతో రద్దీగా దర్శనమిస్తాయి. కానీ, విష్ణుమూర్తి అంశగా పూజలందుకునే కాల్వ నరసింహస్వామి ఆలయంలోనూ శివరాత్రిరోజున ప్రత్యేక పూజలు
జరగడం విశేషం. పిల్లాపాపలతో ఇంటిల్లిపాదిగా తరలి వచ్చిన భక్తులు ఈ ఆలయంలోనే జాగరణ చేస్తారు.

ఇలా చేరుకోవచ్చు
నిర్మల్‌ పట్టణానికి పదకొండు కిలోమీటర్లు, ఆదిలాబాద్‌కి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్‌స్టాండ్‌ల నుంచి నిర్మల్‌కి బస్సు సదుపాయం ఉంది. నిర్మల్‌ నుంచి భైంసాకు వెళ్లే దారిలో సిర్గాపూర్‌, కొత్తలోలం గ్రామాల మీదుగా ప్రయాణించి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారి బ్రహ్మోత్సవాలూ, కల్యాణం మొదలైన పర్వదినాల్లో నిర్మల్‌ నుంచి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రైలు మార్గంలో వచ్చేవారు ఆదిలాబాద్‌, బాసర రైల్వే స్టేషన్లలో దిగి, రోడ్డు మార్గంలో ఇక్కడికి వెళ్లొచ్చు.

- చాట్ల రమేష్‌, న్యూస్‌టుడే, దిలావర్‌పూర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.