close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బొట్టెట్టి

- చంద్రలత

ఇంటికొచ్చి బొట్టెట్టి పిలవాలా ఏంటి?’’ రమణి ముక్కు విరిచి మరీ నవ్వేది, ‘‘పుట్టింటారి మాట మాత్రం చాలదా?’’
‘‘చాలు. కానీ, వాళ్ళు మాటవరసకి పిలిచారనే అనుకుందాం. అన్ని తంటాలు పడి మరీ వెళ్ళాలా- పిలిచిన ప్రతిసారీ? వీలుంటే వెళతాం, లేనప్పుడు మానుకోవాలి కానీ, వీలు కల్పించుకుని పొలోమంటూ పరిగెత్తాలా? బాగున్న రోజుంటది, బాలేని రోజుంటది. మీ పుట్టింటాళ్ళేగా, ఆ మాత్రం అర్థంచేసుకోరూ?’’ కాస్త ఎత్తిపొడుస్తూ కాస్త చింతిస్తూ వాపోయేవాడు రమణీపతి, మురళి.
ఇద్దరి మాటల్లోనూ నిజాయతీ ఉంది. కానీ, ఈమధ్యన నాకు తెలియకుండానే, మురళి వైపు మొగ్గసాగాను. ఎందుకంటే, రానురాను రమణి వ్యవహారం ముదిరి పాకానపడుతోంది. ఇది ఇవ్వాళ్టి తంతుకాదు, మూడుదశాబ్దాల వ్యవహారం.
రమణి పుట్టింటి చుట్టాలంతా నడిగడ్డ నుంచి భాగ్యనగరందాకా విస్తరించి ఉన్నారు. తలా ఒక ఇల్లు చిన్నదో పెద్దదో నగరాన ఉండటంతో, ఏదో ఒక సందర్భాన వారందరూ తరచూ కలిసేవారు. ఆ ఉత్తరాదినుండి మూడు దశాబ్దాల క్రితం ఈ దక్షిణకోస్తాకి కోడలిగా వచ్చిన రమణికి, చాన్నాళ్ళపాటు ఉత్తరాలు రాసుకోవడమూ ఎప్పుడో ఒకప్పుడు ట్రంక్‌ కాల్స్‌ చేసుకోవడమూ తప్ప, రాకపోకలు విరివిగా సాధ్యపడేవికావు. అయినప్పటికీ పుట్టింటి తరఫున ఏదైనా ఆహ్వానం రావడం ఆలస్యం... రమణి ప్రయాణం కట్టాలని సంకల్పించేది.
అప్పట్లో ‘నడిగడ్డ’కు ఒకే ఒక బస్సు. వెలికొండల మధ్యలోనుంచి అడవి దారి. అక్కడక్కడా తారూ కంకరా పోసినా ఒంటి బాట మట్టిరోడ్డు అది. దుమ్మూ ధూళీ నిండి, ఒళ్ళు హూనమైతేగానీ గమ్యం చేరే వీలులేదు. పైనుంచి దారిదోపిళ్ళు నిత్యం వినబడుతూనే ఉండేవి - నిండా ప్రయాణీకులున్నా - బందోబస్తు ఉన్నప్పటికీ - భయంగానే ఉండేది.
మురళి పనుల్లో వెసులుబాటు కల్పించుకునేవాడు కాడు. అటునుంచి వెంట తోడ్కొని వెళ్ళడానికి ఎవరూ వచ్చేవారు కాదు. రమణి ఒంటరిగానే కిందా మీదా పడుతూ లేస్తూ తంటాలుపడుతూ ప్రయాణం చేసేది. అసౌకర్యం గురించి ప్రస్తావిస్తే తననూ వెళ్ళొద్దని మురళి ఎక్కడ ఆపేస్తాడో అని ఆ ఊసే ఎత్తేది కాదు.
ఇంతలో రమణికి చిట్టి తోడయింది. వేవిళ్ళకాలంలో ఎవరూ వచ్చి చూసిందిలేదు. ప్రసవానికి అన్న వచ్చి వెంటపెట్టుకు వెళితే, పురుడుపోశాక అమ్మ వచ్చి వదిలివెళ్ళింది. చిట్టికి స్నానపానాలు ఎలాచేయాలో రమణికి నేర్పించి వెళ్ళిన అమ్మ- మళ్ళీ మూడేళ్ళకి పురిటిబిడ్డ బుజ్జిగాడిని వదలడానికే రావడం.
వెళితే రమణి వెళ్ళినట్లూ లేకపోతే ఇక అంతే!
పసిపిల్లతో ప్రయాణాలు తేలికా? ఒక అల్లినబుట్టలో పొడిబట్టలూ లంగోటీలూ... తడిచిన బట్టలు వేయను మరో కర్రలసంచీ. పాలసీసాలూ సున్నిపిండి నుంచి సాంబ్రాణిపొడీ కాటుకచాదూ గిలక్కాయ వరకూ అన్నీ సర్దుకు వెళ్ళాల్సిందే. అయినా, రమణి ఠంచనుగా అన్ని శుభాశుభాలకూ హాజరు అయ్యేది- పసిబిడ్డతో సహా.
ఒకసారి నడి వేసవిలో నడిగడ్డపల్లెలో పెద్దబాబాయి చిన్నకూతురి పెళ్ళి.
అసలే ఎండాకాలం. ఆపై ఎడతెరపి లేని కరెంటుకోతలు. కాలవలు నిలిచిపోయి, చెరువులు ఎండుగట్టి, నల్లరేగడి ఇనుపముద్దల్లా కణకణమని మండేకాలం. వేడిని తట్టుకోవడం పెద్దవాళ్ళకే సాధ్యంకాక, ఉసురుసురుమంటున్న కాలం. ఆర్నెల్ల పసిబిడ్డ ఎలా తట్టుకోగలదు?
చిట్టి ఒళ్ళంతా పేలిపోయి, నోరంతా పొక్కి పొంగిపోయింది. నాలుకా అంగిలీ గొంతూ అంతా పొక్కిపోయి, పెదాలు ఎర్రగా కందిపోయాయి. నోరంతా పచ్చిపుండయింది. ఆ పాలుతాగే పసిబిడ్డ, నోట్లో తల్లిరొమ్మునైనా పెట్టనిచ్చిందా? గుక్కబెట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినంత పనయింది.
ముహూర్తం అవ్వడం ఆలస్యం... ఎట్లా కర్నూలు చేరుకున్నారో ఎట్లా రైల్లో వచ్చిపడ్డారో! అడపాదడపా వచ్చే రైల్లో, పెళ్ళిళ్ళ ఒత్తిడి వల్ల ఎక్కడలేని రద్దీ. కిక్కిరిసిన రైల్లో అతి కష్టం మీద జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో దూరి, గుక్కతిప్పక ఏడుస్తోన్న బిడ్డను అరచేతుల్లో పెట్టుకుని నిలువుకాళ్ళ మీద ప్రయాణించి రేణిగుంటలో ఎట్లా దిగారో! అందిన బస్సు పట్టుకుని ఎలాగో ఇంటికొచ్చిపడింది.
మురళి లబోదిబోమని మొత్తుకుని, చిట్టిని భుజానవేసుకొని ఆసుపత్రికి పరిగెత్తాడు. చిట్టి డీహైడ్రేషన్‌ తగ్గి, నోరంతా మళ్ళీ మామూలై ఆటల్లో పడడానికి వారం పది రోజులయింది.
తరవాత, మూడేళ్ళ చిట్టితల్లికి బుజ్జిగాడు తోడయ్యాడు. ఇక, ముగ్గురి ప్రయాణాలపర్వం మొదలయింది. ఒళ్ళో బిడ్డ, పక్కన బిడ్డ. కాస్త ఏమారితే, చిట్టి చుట్టుపక్కల వారితో పెత్తనాలు వెలగబెడుతూనో రైలుపెట్టెలో విహారాలకో వెళ్ళేది. లేదా అక్కా తమ్ముడూ ఆడుకుంటూ ఆడుకుంటూ రైలుపెట్టెనంతా రణరంగంగా మార్చేసేవారు. ఇంతలో ఏ బొమ్మలో పిప్పెరమెంట్లో అమ్మకానికి వచ్చేవి. ఇక, చిట్టి రచ్చ రవద్దుళ్ళు మొదలు.
బిడ్డకు పాలివ్వాలన్నా తడిబట్టలు మార్చాలన్నా ఎంత ఇబ్బందో. బుట్టా తట్టా సూట్‌కేసులూ పక్క బట్టలూ నీళ్లసీసాలూ తినుబండారాలూ ఆట వస్తువులూ... పిల్లలతో ప్రయాణాలు మామూలా!
ఒకసారి కదులుతున్న రైల్లో పిల్లల్ని ఎక్కించబోయి, రమణి జారి పట్టాలమీద పడబోయినంత పనయింది. పక్కనున్నవాళ్ళు తల్లినీ పిల్లల్నీ రెక్కలు పట్టి పెట్టెలోకి లాగేశారు. లేకపోతేనా..!?
ఒకసారి వెళ్ళే రైలనుకొని వచ్చే రైలు ఎక్కారు. సరిగ్గా రైలు కదిలే సమయానికి ఆ పొరపాటును గ్రహించారు.
ఆ తొందరపాటులో పిల్లాడిని అమాంతం ప్లాట్‌ఫారమ్‌ మీదికి విసిరేశారు సామానుతో సహా. ఎవరో చైను లాగి, రైలును ఆపబట్టిగానీ, ఆ పూట ప్లాట్‌ఫారమ్‌ మీద బోర్లాపడ్డ పిల్లవాడు ఏమయ్యేవాడో. మోకాళ్ళూ మోచేతులూ దోక్కుపోయిన గాయాలతో పోయింది. తల పగలాల్సింది కాదూ? ఎంత ప్రమాదం తృటిలో తప్పిందో! బుజ్జిగాడు ఆ దడుపు నుంచి తేరుకోనేలేదు చాన్నాళ్ళు.
మరోసారి - బుట్టబొమ్మలా ఉంటుందిగా చిట్టి. పక్కన కూర్చున్నతను ఎవరో ఆడిస్తూ ఆడిస్తూ, చిట్టిని భుజాన ఎత్తుకుని రైలు విజయవాడ జంక్షన్లో ఆగగానే, చిట్టితో సహా దిగేశాడంట. అర్ధరాత్రి- జనం రద్దీ రద్దీనే. రమణి గుండెలను అరచేతుల్లో పెట్టుకుని, అతని జులపాలజుట్టూ బ్యాగీప్యాంటూ గుర్తుకొచ్చి వణికిపోతూ, ప్లాట్‌ఫారమ్‌ మీద వెతుకుతూ ఉంటే, సరిగ్గా రైలు కదిలే సమయానికి, చిట్టికి బిస్కట్లు తినిపిస్తూ తీసుకొచ్చాడంట. అంతే, ఇక అప్పటినుంచీ రైలు ప్రయాణం అంటే, రమణికి కంటిమీద కునుకులేని నిలువుకాళ్ళ బేరమే.
ఈ విషయం తెలిస్తే ‘ఇక ప్రయాణాలు కట్టిపెట్టు’ అని మురళి ఎక్కడ అంటాడో అని ఒక్క ఇబ్బందినీ చెప్పేది కాదు. చెప్పకుండానే గ్రహించగలిగితే, అదొక అందం. కానీ, చెప్పే అవకాశం లేని కట్టడిచేస్తే, నోరు నొక్కుకోక చేసేది ఏముంది? ఎప్పుడో మాటల సందర్భాన తనతో పంచుకునేది. పిల్లలను ఎత్తుకుని వెళ్ళే వాళ్ళ కథలు ఎన్నెన్ని గుర్తొచ్చి వణికిపోయిందో తనతో చెప్పి వాపోయేది. ‘మురళికి తెలిస్తే, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమంటాడు. ఆయన తెముల్చుకోడు. ఏ శుభాశుభ కార్యానికీ రాడు. అయినవాళ్ళ మంచీ చెడుకి అట్లా తొంగైనా చూడకపోతే ఎలా?’ అని బాధపడేది.
ఏమైనా అత్తారింటి శుభకార్యాలు కదా... ఒకదానికి కాకపోతే మరోదానికి మురళి వెళితే మర్యాదగానూ ఉంటుంది, రమణికీ సంతృప్తిగానూ ఉంటుంది. తన తోటివారందరూ జంటలుగా వస్తారుగా. ప్రతిసారీ ఒంటరిగానే వెళ్ళాలంటే ఎవరికైనా మనసు చివుక్కుమనదూ? మురళితో ప్రస్తావించబోతే విరుచుకుపడ్డాడు ‘ఇక అదొక్కటే తక్కువ!’ అంటూ. నాతోనే ఇలా స్పందిస్తే, మరి రమణితోనో! ఆపై నేను ఆ ప్రస్తావన మురళితో తేలేదిక.
బుజ్జిగాడి అయిదో ఏట మురళికి యాక్సిడెంట్‌ అయింది. కాలు విరగడంతో మంచాన గడపవలసి వచ్చింది. రమణి పుట్టింటాళ్ళెవరూ వచ్చి పరామర్శించినట్లో సాయంగా తోడున్నట్లో గుర్తులేదు.
కానీ, మురళి కాస్త తెరిపినపడ్డాడో లేదో, రమణి పెదనాన్న చిన్నమనవరాలి పెళ్ళికి ఆహ్వానం అందింది.
రమణి అన్నీ అమర్చి, మనుషుల్ని ఏర్పాటుచేసి, ఎనిమిదేళ్ళ కూతురు చిట్టికి అప్పగింతలు పెట్టి, తండ్రికి తోడుగా ఉంచి, బుజ్జిగాడిని వెంటబెట్టుకొని వెళ్ళింది. ఆ ఒక్కరోజు భాగ్యానికి చిట్టిని బడిమానిపించి, మురళికి పెట్టాల్సిన భోజనం దగ్గర్నుంచీ బీరువా తాళాలదాకా అప్పగించి ఆదరాబాదరాగా వెళ్ళింది.
తండ్రీ కూతుళ్ళిద్దరూ నింపాదిగా వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ కాలక్షేపం చేస్తే, ఈ వెళ్ళిన పెద్దమనిషి ఏమైనా శాంతిగా ఉందా అంటే అదీ లేదు. ఏం జరుగుతుందో ఎట్లా ఉందో అని బెంగ ఒకవైపు. అక్కను వదిలిరానని బుజ్జిగాడి మంకుపట్టు చికాకులు మరోవైపు. మాటిమాటికీ చిట్టిని ఆరా తీస్తూ మంచీ చెడూ అడుగుతూ, అక్కమీద బెంగటిల్లి గునుస్తున్న పిల్లాడిని సావధానం చేసుకుంటూ, ఆ అర్థరాత్రిన అడవిదారినబడి, ఆదరాబాదరాగా ఇంటికి తిరిగివచ్చింది. దొంగల భయమంతా ఎటు పోయిందో! వెళ్ళినమనిషి క్రికెట్‌ మ్యాచ్‌ అయ్యేలోగా తిరిగొచ్చినా మురళి అలిగికూర్చున్నాడు.
అలా అలా పిల్లలిద్దరూ ఎడ్డెమంటే తెడ్డెమనే వయసుల్లో పడ్డారు. చిట్టిచేతిలో పుస్తకంబట్టి, చెవుల్లో వాక్‌మ్యానూ ఇయర్‌ఫోన్లూ దూరిస్తే, బుజ్జి తనే గేమ్‌బాయ్‌లోకి దూరిపోయేవాడు. చిట్టికి పులిహోరా బుజ్జిగాడికి పూరీకూరా. ఆమె అవునంటే ఈయన ఖచ్చితంగా కాదనడం. టామ్‌ అండ్‌  జెర్రీ తరహా వ్యవహారాలు. తల దూర్చామా- మన తల బొప్పికట్టడం ఖాయం.

కాలంపాటికి కాలం కదులుతుందిగా. రమణి శరీరం మెల్లిగా మొరాయించడం ప్రారంభించింది. మయొమెక్టమీ ఆపరేషన్‌ నుంచి తేరుకొనేక్రమంలో విపరీతమైన వెన్నునొప్పికి లోనయింది. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. నడుం వంచి ఏ పనీ చేయలేనంత నొప్పి. ఎలక్ట్రిక్‌ షాక్‌ లాగా అలలుఅలలుగా నొప్పి. కటిభాగం నుంచి వెన్నులోంచి నరనరాన విస్తరించే నొప్పి. ఆఫీసు పనులకు కుర్చీలో కూర్చోవడానికే అల్లాడిపోతూ, ఫిజియోథెరపీకీ విశ్రాంతికీ నడుమ రమణి కాలం నెట్టుకొస్తున్న సమయం అది.
సరిగ్గా అప్పుడే రమణి పుట్టింట రెండువారాల వ్యవధిలో రెండు పెళ్ళిళ్ళు. ఆ పరిస్థితిలో అయినా, మంచాన పడుకుని విశ్రాంతి తీసుకుంటుందని అనుకున్నా. కానీ, రమణి ఠంచనుగా పెళ్ళిళ్ళకు హాజరయింది. ఒక్కో పెళ్ళి ఒక్కో చోట. నొప్పినంతా ఎట్లా అణుచుకుందో ఎన్నెన్ని మాత్రలు మింగిందో!
పదమూడేళ్ళ చిట్టి చేయి పట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళింది. ఎగుడుదిగుడు రోడ్లమీద చేసిన దూరప్రయాణాలు మిగిల్చిన స్మారకాలివి. ఆ దెబ్బ దెబ్బ రమణి తేరుకోవడానికి రెండుమూడేళ్ళు పట్టింది.
ఈ కాలం అంతా మురళి తిట్టినతిట్టు తిట్టకుండా తిడతానే ఉన్నాడు- నజరానాగా. అతని మాటల సారాంశం ఒకటే- ‘‘అంత రిస్క్‌ తీసుకొని ఎవరెళ్ళమన్నాడు?’’
‘‘ఆయన అట్లాగే అంటారు. పుట్టింట శుభకార్యాలు... వెళ్ళకపోతే నొచ్చుకోరూ? అయినా రేపొద్దున మనింట్లో శుభకార్యానికి అందరూ నడుంకట్టి నిలబడరూ?’’ మురళి పక్కకు వెళ్ళగానే రమణి అనేది.
ఆ ఒక్కొక్క పుట్టింటి ప్రయాణం కోసం ఎంత నొప్పినీ బాధనీ రమణి ఓర్చుకుంటుందో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. నొప్పన్నదే లేనట్టు ముఖమంతా నవ్వు పులుముకొని ఉంటుంది.
మురళి నన్నేమీ అడగలేదు కానీ నాకు తెలియకుండానే మురళి వైపు మొగ్గసాగాను- నెమ్మదినెమ్మదిగా. ఏ వ్యవహారమైనా ఇచ్చిపుచ్చుకుంటేనే అందం చందం. ఇటు నుంచి అటే కానీ, అటు నుంచి ఇటు రాకపోకలు మాటమాత్రం చూడలేదు.
చూసిచూసి ఒకసారి రమణివాళ్ళ అత్తగారు అననే అంది- ‘‘అమ్మ నగలకోసం వస్తోందనీ నాన్న ఆస్తిపాస్తులు రాసిస్తాడని వస్తోందనీ వాళ్ళింటి కోడళ్ళు వదరుతున్నారంట. తగుదునమ్మా అని చీటికీమాటికీ వెళ్ళడం దేనికి? వాళ్ళతో వీళ్ళతో మాటలుపడ్డం దేనికి?’’
రమణివాళ్ళ ఆడపడుచు ఇంకొంచెం గట్టిగానే అంది. ‘‘మా ఇంటి పరువుపోతోంది. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడే మాటలకు తలకొట్టేసినట్లుంది. మా తమ్ముడి పరువు తీయడానికి కాకపోతే- ఎందుకీవిడకీ పెళ్ళిళ్లూ పేరంటాలూ గమ్మున ఇంట్లో కూర్చోక?’’
రమణి అన్నట్లు శుభకార్యానికి వచ్చి నిలబడతారో లేదో కానీ... అశుభవేళ అందరూ వచ్చి, మురళి అంతిమసంస్కారాలన్నీ దగ్గరుండి చేయించి వెళ్ళారు. చూడటానికి మురళి లేకుండాపోయాడు.
మురళి తదనంతరం రమణికి వైధవ్యం రూపేణా కొత్తహోదా వచ్చిపడింది.
ఇంత తపనపడి, తాపత్రయంతో వెళుతోందన్న మాటేకానీ అక్కడికి వెళ్ళాక జరిగే తంతు వేరు. మేనకోడలి పెళ్ళిలో ఎంతగా ఒక పక్కగా వొదిగి కూర్చున్నా, అపశకునంలా పెళ్ళికూతురికి ఎదురొచ్చావని, చేయిపట్టి మరీ పక్కకు లాగిపడేశారు ఆ పెళ్లికూతురి అమ్మమ్మగారు. కానుకలు తీసుకుంటారు. రమణి చేత్తో కాదు, చిట్టో బుజ్జో ఇవ్వాలట. అదట ఇదట. ఈ కొత్త హోదాని శిలువలా మోస్తూ కూడా, రమణి వ్యవహారంలో మార్పేమీ లేదు.
ఆర్ధికంగానూ సామాజికంగానూ కొత్త సమస్యల చిట్టా విచ్చుకొంది. కలిమిలో కడివెడు కానుకలు గుప్పించిన రమణికి, కడుపు కాలే లేమిలో కన్నవారు తోడుంటారని అనుకోవడంలో తప్పేమిలేదు కదా.’ క్షణం క్షణం కూడదీసుకొంటూ, పైసా పైసా కూడబెడుతూ, రమణి తను నిలబడుతూ పిల్లల్ని నిలబెట్టే ప్రయత్నంచేసే సమయం అది. ఎవరూ ఈ పక్క తొంగిచూసిన అజాపజా లేదు మరి. అయినా, రమణికి పుట్టింటి మీద ఉన్న ఆపేక్ష తెలిసి, చిట్టి పెళ్ళినాటికి ఒంటరి తల్లి అయిన రమణిని అలా కూర్చోబెట్టి పుట్టింటివారే అన్ని సాంగ్యాలు జరిపిస్తారని మాబోటివాళ్ళం అనుకోవడం సహజమే కదా.
ఒక వాట్సాప్‌ మెసేజ్‌లో ఆహ్వానాలు పంపితే సాగిపోయే ఈరోజుల్లో... రమణి ఒక్కొక్కరి ఇంటికీ వెళ్ళి పేరుపేరునా పిలిచి వచ్చింది. రమణి పక్కనే తనూ బొట్టెడుతూ.
చివరాఖరికి, చిట్టి పెళ్ళికి చుట్టుపక్కలవాళ్ళూ స్నేహితులే బంధువులయ్యారు. పసుపుకొట్టడం నుంచి అప్పగింతలదాకా అన్నింటావారే అయి నిర్వహించారు. ఇకనైనా, రమణి ధోరణిలో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకున్నా.
అందులోనూ రమణి ఆరోగ్యం అంతంతమాత్రంగా తయారయ్యింది. కాలం తెచ్చే అనివార్యమైన మార్పులు మెల్లిమెల్లిగా నిస్సత్తువను నింపే ప్రయత్నం చేస్తున్నాయి. మురళి లేని లోటు కలిగించే దిగులు ఒకపక్క, పిల్లలను స్థిరపరిచే క్రమంలో ఒంటిచేతి వ్యవహారాల ఒత్తిళ్ళు మరొకపక్క. దాయాదులతో వైరివివాదాలు ఇంకోపక్క. వీటన్నిటికీ పెద్దన్న ఆర్ధికలేమి. సరిగ్గా ఇలాంటి కష్టసమయంలోనే తీవ్ర రక్తస్రావాలతో తన ఉనికిని ప్రకటించుకునే శరీర ధర్మాలు. క్రమంతప్పిన నెలసరికి తోడు గర్భసంచిలో పుండు. ఆఫీసు పనులకూ ఆసుపత్రి చికిత్సలకూ మధ్య జీవితం గడిచే క్రమంలో ఇక రమణి తనపట్ల తను శ్రద్ధ పెట్టుకుంటుందని అనుకున్నాం.
రమణి మళ్ళీ తయారు. చిట్టి పెళ్ళి సమయాన వారంతటి మర్యాద పాటించిన తరవాత కూడా రమణికి పుట్టింటివారి మీద రవ్వంతకూడా ఆపేక్ష తగ్గలేదు. మరింత పెరిగిందని నా అనుమానం. ఆపసోపాలుపడి, అప్పూ సొప్పూ చేసి మరీ వెళ్ళి వచ్చింది ఈమధ్యనే. మానని పచ్చిపుండులాంటి ఒంట్లో ఆ శక్తి ఎలా వస్తుందో! మళ్లీ వెళ్ళింది పెద్దమేనత్త చిన్న కూతురి షష్టిపూర్తని. మొన్నీ మధ్యనే ఆపరేషన్‌ అయింది. మందులతో కాలం నెట్టుకొస్తోంది. ఇప్పటికైనా ఒక అవగాహనతో మెలగమని చెప్పాలి.
నచ్చచెప్పమని చిట్టి, బుజ్జి తనతో మొరబెట్టుకుంటున్నారు. చూసి చూసి, వాదించి వాదించి, నా సహనం కూడా నశిస్తోంది.
ఇన్నాళ్ళూ ఉన్నమాటంటే రమణి నొచ్చుకుంటుందని ఊరుకున్నా ఈమారు రమణి తిరిగి రాగానే, చెడామడా కడిగేయాలని నిర్ణయించేసుకున్నాను.
‘నీ రాకకోసం అక్కడ ఎవరూ ఎదురుచూడడం లేదు. నీ రాకపట్ల ఎలాంటి గౌరవం లేదు. నీవంటే ఆపేక్ష లేదు. నీ స్థితిగతులపట్ల సానుభూతి లేదు. సహానుభూతి లేదు. ఇంత రిస్క్‌ తీసుకుని ఎందుకు వెళతావ్‌?’ ఇలా ప్రశ్నలచిట్టాలు నా తలలో గిర్రున తిరుగుతున్నాయి.
ప్రశ్నల్లోంచి ప్రశ్నలు పుడుతుండగానే రమణి తిరిగొచ్చింది. అలసట అలసటే. రాగానే మంచానికి అడ్డంగా పడిపోయి, ప్రయాణ బడలిక నుంచి ఎప్పటికో తేరుకొని మరీ బయటకు వచ్చింది. అలసిసొలసిన శరీరంపాటికి శరీరం, నీరసాన్ని తోసిరాజంటూ, రమణిముఖాన వెలుగుల చిరునవ్వు పరుచుకొనివుంది.
‘‘ఇదేమన్నా బావుందా?’’ అంటూ, నా మనసులోని మాటలన్నీ గబగబా కక్కేశాను. ఇదే ఆఖరిసారి మాట్లాడడం అన్నట్లుగా.

‘‘బాగోగుల సంగతి అటుంచి, నీవన్నది నిజమే. నా ఒంట్లో బావుండటం లేదు. ఇక జాగ్రత్త పడతాలే’’ అలా అంటూనే వెళ్లి ఒక వంకాయరంగు స్లింగ్‌ బ్యాగును తెచ్చింది. దానిలో నుంచి రమణి చిన్న స్టీలుడబ్బా మూతతీసి నాముందుకు తోసింది. చలిమిడి- కమ్మటి నెయ్యి గుబాళింపూ కొబ్బరి ముక్కలూ జీడిపప్పూ నోరూరిస్తూ. వాడినా పరిమళం తగ్గని కొబ్బరిపుల్లకు వరసగా గుచ్చిన పొగడపూలు. వెలుగులు చిమ్మే అరచేయంత ముద్దబంతి పువ్వు ఒకటి. కొన్ని కారంబంతులు. మిలమిలలాడుతున్న ఏటిరాళ్ళు. నవనవలాడే సొరకాయ. ఇదేదో మాంత్రికుడి సంచిలాగా ఉంది. రమణి తీస్తున్న కొద్దీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి.
ఒక పసుపు తిరిగిన శరత్‌ నవల. ఒక పాళీ విరిగిన రత్నంకలం. పండుబారిన రాతి ఉసిరికాయలు. ‘ఇవన్నీ ఏంటని’ నేను రమణిని అడగకపోయినా, లోతైనభావన ఏదో మెల్లిమెల్లిగా స్ఫురించసాగింది.
రమణి ఎడతెరపి లేకుండా మాట్లాడసాగింది.
‘‘సుధా, ఈ చలిమిడి కాస్త రుచిచూడు. మా ఆమ్మ చేసినట్లు ఎవరూ చేయలేరసలు. ఈ పొగడపూలు కొబ్బరినూనెలో వేసుకో. ఎవరైనా దగ్గరికి వస్తే ఘుమఘుమలాడిపోతుంది. మా నాన్న స్వయానా నాటిన పొగడచెట్టు ఇది. ఇదుగో ఈ రత్నంకలం నాన్న రాజమండ్రి నుంచి తెప్పించుకున్నారు. ఇంకా సిరా పొడికట్టే ఉంది. ఇది అమ్మ పదేపదే చదివిన శరత్‌ నవల. నాన్న దేశికవితామండలి నుంచి తెప్పించి అమ్మకు పెళ్ళి కానుగ్గా ఇచ్చారట’’ రమణి అనర్గళంగా చెపుతోంది.
సముద్రపు ఒడ్డున తడి ఇసుకలో అదాటున దొరికిన గవ్వ మీది రంగులు చూసి మురిసిపోయే పసితనం రమణి ముఖాన ప్రతిఫలిస్తోంది.
‘‘ఈ రాతి ఉసిరికాయల చెట్టుందే... ఇది మా నాయనమ్మ పుట్టింటి నుంచి తెచ్చి నాటిందట. ఇంకా కాయలు కాస్తోంది. ఈ ఉసిరికాయలు కోయబోయినపుడే, చిగురుకొమ్మ అనుకుని మొదటిసారి పసిరిక పాముని పట్టుకున్నా.’’
సన్నని పాలతుంపరలు ఎగిసెగిసిపడే జలపాతపు వడి ఆ మాటల్లో. ఆ తడిలో నిలువెల్లా తడుస్తోన్న చిగురు పచ్చదనపు కమ్మదనం నింపుకున్న రమణి ముఖాన వేయి పాలపుంతలు ఒలికినంత వెలుగు.
రమణిని నేనెలా ఆపగలను? నేనెందుకు ఆపాలి అసలు?
ఆ పుట్టింటి గంపెడు చుట్టాలు రమణిముఖాన కదలాడుతోన్న ఆ ఆపేక్షనూ ఆప్యాయతనూ ఏనాడైనా కళ్ళారా చూశారా? వాళ్ళమీద అంతులేని జాలికలిగింది. వాళ్ళ ఇంటి ఆడపిల్లకు అపరిమిత ఆనందాన్నిచ్చే మంత్రదండం వాళ్ల వద్ద ఉంది. వాళ్ళల్లోనే కాదు, వాళ్ళచుట్టూ పరుచుకొని ఉంది. చెట్టూ చేమా పుట్టా గట్టూ... ఎక్కడెక్కడని ఆ ఇంద్రజాల మహిమను వెతుక్కోగలం?
‘‘మేం ఈతకాయలు మాగేసుకున్న గడ్డివాములు ఇప్పుడు లేవు. మా చుట్టాలే అక్కడ ఇళ్ళస్థలాల లే-అవుట్లు వేసేశారు. దడిలా పెంచిన సీమచింత చెట్లవరుసను కొట్టేసి గోడ కట్టేశారు. మా అమ్మమ్మ వడికిన రాట్నం, మా అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకుందిగా, అదింకా మచ్చుమీదే ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు అడిగి తెచ్చుకుంటా.’’
అన్ని తంటాలుపడీ అన్ని తిప్పలుపడీ అన్ని అవస్థలుపడీ మండువేసవి వడగాడ్పుల్లో ఎడతెరిపిలేని వానల్లో ముంచెత్తిన వరదల్లో వణికించే శీతాకాలపు పొగమంచుల్లో రమణి చేసిన ప్రయాణాల పరమార్థం నాకు క్రమక్రమంగా అవగతం కాసాగింది.
‘‘ఇదుగో సుధా, మా వదిన పట్టిన వంకాయ నిలవ పచ్చడి. మా వదినలా మా ఊళ్ళో ఎవ్వరూ వంకాయ పచ్చడి పట్టలేరు తెలుసా! కావాలంటే తిని చూడు’’ నా కోసం చిన్నసీసాలోకి మారుస్తూ అంటోంది రమణి.
‘‘చీరలూ సారెలూ నగలూ నాణ్యాలూ ఏమేమి ఇచ్చి పంపినారమ్మా నీ పుట్టినింటివారు’’ అని అడగడానికి నా నోరెలా పెగులుతుంది పుట్టింటి సర్వసంపదలూ రమణిముఖాన వెలుగుల్లా పరుచుకొని ఉంటే. రమణికి దక్కిన, రమణి దక్కించుకున్న పుట్టింటి వారసత్వవాటా ఏమిటన్నది ఒక్కొక్కరికీ బొట్టెట్టి చెప్పాలా ఏంటి?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.