close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళల కోసం... మహిళల చేత... కుటుంబశ్రీ

స్త్రీ చదువుకుంటే కుటుంబమంతా చదువుకున్నట్లేనన్నారు పెద్దలు. నూటికి 94 మంది చదువుకున్నవాళ్లే ఉన్న చోట ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి- స్త్రీ సంపాదిస్తే కుటుంబం అంతా బాగుపడుతుందని చెప్పుకోవాలేమో. ఎందుకంటే అదే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ పథకం ఇప్పుడు దేశంలోనూ బయటా కూడా ప్రశంసలందుకుంటోంది. మహిళా సాధికారత ద్వారా పేదరికాన్ని తరిమేయాలన్న ఆశయంతో కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కుటుంబశ్రీ’ పథకం ఆశయం నుంచీ ఆచరణ వరకూ అంతా వినూత్నమే, ఆడవారి సమర్థతకు నిలువెత్తు నిదర్శనమే!

‘మా అమ్మాయికి తిరువనంతపురంలో ఉద్యోగం వచ్చింది. కుటుంబశ్రీ వెబ్‌సైట్‌లో చూసి హాస్టల్‌లో సీటు బుక్‌ చేసుకుని వెళ్లింది’
‘మా నాన్నగారిని వారం వారం ఆస్పత్రికి తీసుకెళ్లాలి. నేను సెలవు పెట్టడం కుదరదని కుటుంబశ్రీ ట్రావెల్స్‌లో కారు మాట్లాడాను. లేడీ డ్రైవర్‌ జాగ్రత్తగా తీసుకెళ్లి దగ్గరుండి చూపించి తీసుకొస్తోంది. నేను టెన్షన్‌ లేకుండా పనిచేసుకోగలుగుతున్నా’
‘ప్లాస్టిక్‌ సంచులు వాడవద్దంటున్నారు కలెక్టర్‌. జ్యూట్‌ బ్యాగులు తయారుచేసే కుటుంబశ్రీ యూనిట్‌కి మన ఆఫీసులో వాళ్లందరికోసం లంచ్‌ బ్యాగుల్ని ఆర్డరిచ్చాను’
‘ఆకలిగా ఉంది. దగ్గర్లో కుటుంబశ్రీ రెస్టరెంట్‌ ఉందా..?’
‘వరదబాధితులకోసం ‘ఈనాడు’ సేకరించిన విరాళాలతో ఇళ్లు కట్టే బాధ్యతను కుటుంబశ్రీకే ఇచ్చారట...’

ఇలా, ఇప్పుడు కేరళలో ఎవరిని పలకరించినా ఒకటే మాట... కుటుంబశ్రీ.
మనుషులే కాదు, దేవుడి దగ్గర కూడా. పండగ రోజుల్లో గురువాయూరప్ప నైవేద్యానికి ప్రత్యేకమైన అరటిపళ్లను ఒకప్పుడు తమిళనాడునుంచి తెప్పించేవారు. ఇప్పుడు కుటుంబశ్రీ సభ్యులే వాటిని పండిస్తున్నారు. అయ్యప్ప భక్తులకోసం వస్త్రంతో కుట్టిన సంచులూ వారే తయారుచేస్తున్నారు! అసలేమిటీ కుటుంబశ్రీ? ఎక్కడుంది? ఇలా అన్నిరంగాల్లోకీ ఎలా విస్తరించగలిగింది?
పాతికేళ్లక్రితం అలప్పుళ మున్సిపాలిటీలో గోపీనాథ్‌ అనే ప్రభుత్వోద్యోగి చొరవతో వంద మహిళాబృందాలు ఏర్పడ్డాయి. వాళ్లందరితో పొదుపు చేయిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడటానికి వీలుగా ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పించారాయన. దానికి మంచి ఫలితాలు రావడం చూసి మలప్పురంలో ప్రభుత్వ పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు అధికారులు. అక్కడ దాదాపు 4వేల గ్రూపులు సిద్ధమయ్యాయి. అందరూ పొదుపు చేస్తూనే ఇళ్ల దగ్గరే కోళ్లూ, పాడిపశువుల పెంపకం, పచ్చళ్లతయారీ లాంటి చిన్న చిన్న పనులే చేసేవారు. అదే సమయంలో జిల్లా కలెక్టరుగా వచ్చిన జేమ్స్‌ వర్గీస్‌ ఈ పథకం పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతూ మహిళాసంఘాలతో స్వయంగా సమావేశమై కొత్త కొత్త పనులను చేపట్టాల్సిందిగా ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డ్వాక్రా ఉద్యమం ఊపందుకుంటున్న రోజులవి. అయితే కేరళ ప్రభుత్వం దాన్ని మామూలు పొదుపు ఉద్యమంగా చూడలేదు. పేదరికాన్ని నిర్మూలించడానికీ, మహిళా సాధికారతకీ ఆయుధంగా మలచుకోవాలనుకుంది. మహిళల్నీ, కుటుంబాలనీ, గ్రామ పాలననీ ఒక్కతాటి మీదికి తెస్తూ దానికి తగ్గట్టుగా పక్కా ప్రణాళికతో ‘కుటుంబశ్రీ మిషన్‌’ను రూపొందించి 1998లో అప్పటి ప్రధాని వాజపేయీ చేతులమీదుగా ప్రారంభించింది. సంస్థకు తొలి సారథిగా జేమ్స్‌ వర్గీస్‌ని నియమించింది. అలా మొదలైన కుటుంబశ్రీ ఇప్పుడు ఇంటింటా విన్పించే మాటైంది. దాంతో అనుబంధం అనేది మహిళలకు ఒక గౌరవప్రదమైన గుర్తింపుగా మారింది.

అవసరాలను కనిపెడుతూ...
2002లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒక్కసారిగా డిజిటలైజేషన్‌ బాటపట్టాయి. దాంతో పెరుగుతున్న డేటాఎంట్రీ ఆపరేటర్ల అవసరాన్ని గుర్తించిన అధికారులు వెంటనే కుటుంబశ్రీ సభ్యుల్లో చదువుకున్న యువతులకు శిక్షణ ఇప్పించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా చేశారు. సాధారణంగా ప్రభుత్వ పథకాలు కొన్నాళ్లకు మరుగునపడిపోతుంటాయి.
కుటుంబశ్రీ మాత్రం రెండు దశాబ్దాలైనా గొప్ప పథకంగా ప్రశంసలందుకోవటానికి కారణం ఇలా అవసరానికి తగినట్లుగా మారుతూ వచ్చిన దాని కార్యక్రమాలే. ఎప్పటికప్పుడు సమాజానికి అవసరం ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధికల్పించుకునేలా మహిళలను ప్రోత్సహించడంతో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంతో మొదలెట్టి పుట్టగొడుగులూ తేనెటీగల పెంపకం వరకూ, టైలరింగ్‌ నుంచి కేటరింగ్‌ యూనిట్ల వరకూ, ఇళ్లల్లో చెత్త సేకరణ నుంచీ ట్రావెల్స్‌
నిర్వహణ వరకూ, డేకేర్‌ సెంటర్ల నుంచీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వరకూ... కుటుంబశ్రీ మహిళలు చేయని పని లేదు. రాష్ట్రం మొత్తంమీద దాదాపు 45 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు.

పేదరికమే అర్హత
కుటుంబశ్రీలో చేరడానికి పేదరికమే ప్రధాన అర్హత. ఒక్కో పొరుగు సంఘం (నైబర్‌హుడ్‌ గ్రూప్‌)లో 20-45 సభ్యులుంటారు. 10-15 పొరుగు సంఘాలు కలిసి ఏరియా డెవలప్‌మెంట్‌ సొసైటీలుగా, కొన్ని ఏడీఎస్‌లు కలిసి కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీలుగా ఏర్పడతాయి. వీరికి అన్ని స్థాయుల్లోనూ రాష్ట్రప్రభుత్వ అధికారులు మార్గదర్శకత్వం వహిస్తారు. బ్యాంకు అధికారులూ సహకరిస్తారు. పొరుగుసంఘాలు వారం వారం సమావేశమవుతాయి. మహిళలు కనీసం పదిరూపాయలతో మొదలుపెట్టి తాము పొదుపు చేసిన సొమ్ము తెచ్చి జమచేస్తారు. ప్రభుత్వ అధికారి ఒకరు వివిధ పథకాల గురించి చెప్పి వాటి నుంచి ఎలా లబ్ధి పొందవచ్చో సభ్యులకు వివరిస్తారు. ఒక్కో సంఘం నుంచి ఐదుగురిని వలంటీర్లుగా ఎంపికచేసి వేర్వేరు బాధ్యతలు అప్పగిస్తారు. ‘కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌’ గ్రూపు సభ్యుల కుటుంబాల ఆరోగ్య విషయాలు చూసుకుంటే, ‘ఇన్‌కమ్‌ జనరేషన్‌ యాక్టివిటీ వలంటీర్‌’ సభ్యులు ఆదాయం పెంచుకోవటానికి ఎలాంటి పనుల్లో శిక్షణ పొందితే బాగుంటుందో చెప్పి ఆ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపడతారు. ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వలంటీర్‌’ తమ వీధిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి మౌలిక వసతులు కల్పించడానికి స్థానిక పంచాయతీ అధికారులతో కలిసి పనిచేస్తారు. వీరు కాకుండా అధ్యక్ష, కార్యదర్శులు బృందాన్ని ముందుకు నడిపిస్తుంటారు. సభ్యులందరికీ ఓటుహక్కు ఉంటుంది. మూడేళ్లకోసారి కోఆర్డినేటర్లను నేరుగా ఎన్నుకుంటారు. దళిత, ఆదివాసి మహిళలనూ కలుపుకుని ముందుకు సాగుతున్నాయి ఈ బృందాలు.

ఎన్నెన్నో కార్యక్రమాలు!
కుటుంబశ్రీ కింద కేరళ మహిళలు చేపడుతున్న కార్యక్రమాలకు లెక్కేలేదు. వ్యక్తిగతంగా ఉపాధి కల్పించేవీ, సామాజికంగా అందరికీ ఉపయోగపడేవీ... ఇలా పలు కార్యక్రమాలున్నాయి. టీకొట్ల నుంచీ భవన నిర్మాణ పనులదాకా అన్ని పనులూ చేస్తున్నారు. ఒకప్పుడు మహిళలు అసలు పొలం పనులకు వెళ్లేవారు కాదు. అలాంటిది ‘సమగ్ర’ సామూహిక వ్యవసాయ పథకం ద్వారా చాలామంది మహిళలు రైతులు అయ్యారు. వృథాగా పడివున్న బీడుభూములు సాగు భూములయ్యాయి.
* నేంద్రన్‌ బనానా ప్రాజెక్టు కింద తిరువనంతపురంలో 30వేల మంది మహిళలు అరటి తోటల్లో పనిచేస్తున్నారు.
* హరితశ్రీ పథకంలో భాగంగా కూరగాయల సాగుతో ఏడాది పొడుగునా వేలాది మహిళలు ఉపాధి పొందుతున్నారు.
* పత్తనంతిట్ట జిల్లాలో మధురం ప్రాజెక్టు కింద తేనెటీగల పెంపకంలో పదివేల మంది మహిళలకు ఉపాధి దొరుకుతోంది.
* కొట్టాయం జిల్లాలో కోటిన్నర రూపాయలతో ఆర్నమెంటల్‌ ఫిష్‌ పెంచే ప్రాజెక్టునీ మహిళలే నిర్వహిస్తున్నారు.
* అలప్పుళలో 300 మంది పుట్టగొడుగుల్ని పెంచుతున్నారు.
* ఎర్నాకుళంలో తిరుమధురం అనే పైనాపిల్‌ ప్రాజెక్టు కింద 12,500 మంది మహిళలు పైనాపిల్‌ పండిస్తున్నారు.
* వేర్వేరు చోట్ల అపారెల్‌ పార్కుల్లో వందలాది మహిళలు దుస్తులు కుట్టడం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
* అమృతం ఫుడ్‌ సప్లిమెంట్‌ పేరుతో పిల్లలకు అందించే పోషకాహారాన్ని 400 యూనిట్లలో తయారుచేస్తున్నారు.
* క్లీన్‌ కేరళ పథకంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే బాధ్యతా కుటుంబశ్రీ మహిళలదే.

కొబ్బరి చెట్లెక్కుతారు!
కేరళనీ కొబ్బరి చెట్లనీ విడదీసి చూడలేం. అక్కడ కొబ్బరి ఏదో ఒక రూపంలో భోజనంలో కన్పిస్తుంది. అందుకే ప్రతి ఇంటి పెరట్లోనూ కొబ్బరి చెట్లుంటాయి. అయితే ఇన్ని చెట్లు ఉన్నప్పుడు కొబ్బరికాయలు కోసేవారు కూడా ఉండాలిగా. చదువుకుని ఉద్యోగాల మోజులో పడిన పురుషులు ఆ పనిని నామోషీగా భావించడంతో కొబ్బరికాయలు కోసేవారే దొరకడం లేదు. ఆ కొరత తీరాలంటే మహిళల్ని అందులో ప్రవేశపెట్టటమే మార్గమని భావించిన అధికారులు ఆ బాధ్యతా కుటుంబశ్రీకి అప్పజెప్పారు. మహిళలకు కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోయడంలో శిక్షణ ఇవ్వడమే కాక, వారు సురక్షితంగా చెట్టు ఎక్కి దిగేందుకు ఉపయోగపడే పరికరాలనూ, సెల్‌ఫోన్‌నూ, ద్విచక్రవాహనాన్నీ కూడా అందజేశారు. జీవితబీమా సౌకర్యం కల్పించారు. ఇలా శిక్షణ పొందిన మహిళలు రోజూ వెయ్యి రూపాయలవరకూ సంపాదించగలుగుతున్నారు.

వరదసాయంలో ముందున్నారు!
రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్న డబ్బు నుంచి రూ.7 కోట్లకు పైగానే వరద సహాయ చర్యలకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు కుటుంబశ్రీ సభ్యులు. డబ్బు ఇచ్చి ఊరుకోలేదు,. లక్షకు పైగా ఇళ్లనూ, పాఠశాలలూ ఆస్పత్రులూ లాంటి ప్రభుత్వ భవనాలనూ శ్రమదానంతో శుభ్రంచేశారు. కొన్ని వేలమందికి కౌన్సెలింగ్‌ సేవలు అందించారు. వరదలు వచ్చిన రెండో రోజు నుంచే కుటుంబశ్రీ సభ్యులు ఎక్కడికక్కడ సమావేశమై ఏం చేయాలో చర్చించుకున్నారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే రంగంలోకి దిగారు. ఇళ్లూ ఇతర భవనాల్లో మేట వేసిన బురద తొలగించడంలో ప్రధాన పాత్ర పోషించింది వారే. బురదలో రోజుల తరబడి పనిచేయడం తమ ఆరోగ్యానికి
హానికరమని తెలిసినా వారు వెనకడుగు వేయలేదు. మొత్తం లక్ష మంది దాకా తమ ఇల్లూ వాకిలీ వదిలి వెళ్లి వివిధరకాలుగా సహాయపనుల్లో పాల్గొన్నారు.

చేయీ చేయీ కలిపి...
కేరళలో 50 శాతం పంచాయతీ స్థానాలను మహిళలకే కేటాయించారు. దాంతో పార్టీలు కూడా మహిళా అభ్యర్థుల కోసం కుటుంబశ్రీవైపు చూస్తాయి. అక్కడ పనిచేసేవారైతే సహజంగానే నాయకత్వలక్షణాలు కలిగి ఉంటారని దానికి తోడు కుటుంబశ్రీ పథకం పనితీరు కూడా స్థానిక సంస్థలతో చేయీచేయీ కలిపి పనిచేసేలా ఉంటుంది. తాగునీరు, పారిశుద్ధ్యమూ లాంటి మౌలికవసతులు కల్పించాలన్నా, ఉపాధి హామీ పథకం కింద పని ఇప్పించాలన్నా సంఘాలూ పంచాయితీలూ కలిసి సంప్రదించుకుని చేస్తాయి. ఇలా కలిసికట్టుగా ముందుకు సాగడం వల్ల  రాష్ట్రం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి సాధించడానికి దారి ఏర్పడుతోంది.

త్రిసూర్‌ జిల్లాలోని ఓ గ్రామం. తనకంటూ అడుగు జాగా కూడా లేని ఓ రైతుకూలీ దంపతుల ఎనిమిది మంది సంతానంలో బిందుకి పదహారేళ్లకే పెళ్లయింది. ఒక పేద కుటుంబం నుంచి మరోపేద కుటుంబంలోకి వెళ్లిన ఆమె, భర్త చాలీచాలని సంపాదనా పిల్లల అనారోగ్యాలతో నానా అవస్థా పడేది. ఇరవయ్యేళ్లనాటి సంగతిది. పొరుగువారిని చూసి బిందు కూడా కుటుంబశ్రీలో చేరాలనుకుంది. కానీ వారానికి పది రూపాయలు కట్టగలిగే స్తోమత లేదు. చివరకు, పస్తులున్నా ఫరవాలేదనుకుని సంఘంలో చేరింది. సమావేశాల్లో అధికారులు చెప్పే విషయాలను ఆసక్తిగా వినేది. స్వయంగా ఏదైనా చేద్దామనుకున్న బిందు మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి బీడుగా ఉన్న పొలాన్ని కౌలుకు తీసుకుంది. నలుగురూ కలిసి కష్టపడి దాన్ని శుభ్రంచేశారు. సంఘం నుంచి లోను తీసుకుని పంట వేశారు. వ్యవసాయం గురించి ఏమీ తెలియనివారికి సంఘ సభ్యులే సలహాలిచ్చి అండగా నిలిచారు. వారి కష్టానికి ఫలితంగా ఏడాదికి సరిపోనూ ధాన్యం మిగిలింది. పూట గడవని కుటుంబాలకు అది పెద్ద విజయమే. దాంతో మరికొంత పొలం తీసుకుని విడివిడిగా సాగు కొనసాగించారు. సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో బిందులో ఆత్మవిశ్వాసం పెరిగింది. పదోతరగతి పరీక్ష రాసి పాసైంది. కారూ, ట్రాక్టరూ నడపడం నేర్చుకుంది. ఉత్తమరైతుగా అవార్డులు అందుకుంది. సంఘం అధ్యక్షురాలై తనలాంటి మరికొందరికీ స్ఫూర్తినిస్తోంది. 16 ఏళ్లు తిరిగేసరికల్లా ఆమె సొంతంగా 20 ఎకరాల పొలమూ, రెండంతస్తుల ఇల్లూ, కారూ ఏర్పర్చుకుంది. పిల్లలిద్దర్నీ ఇంజినీరింగ్‌ చదివిస్తోంది. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి కుటుంబశ్రీ లాంటి పథకం చేయూతనిస్తే ఏం సాధించవచ్చో చెప్పడానికి నిదర్శనం... బిందు కథ! ఇలాంటి ఎందరో బిందులవల్లే కుటుంబశ్రీ ఇప్పుడు ఆసియాలో అతి పెద్ద మహిళా సాధికారతా ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది!!


ప్రత్యేకతలెన్నో!

లక్ష్యం ఒకటే అయినా దాన్ని చేరుకునే మార్గాలు ఎన్నో ఉంటాయనడానికి నిదర్శనం కుటుంబశ్రీ మిషన్‌ కింద చేపడుతున్న పథకాలు. ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్న వనరులూ అవకాశాల ఆధారంగా మహిళల ఉపాధికి బాటవేయడం వల్ల అన్నిరంగాల్లోనూ వారు అడుగుపెడుతున్నారు, విజయ పతాక ఎగురవేస్తున్నారు.


మహిళా మాల్‌

కోళికోడ్‌లో అచ్చంగా మహిళలే నిర్వహించే మాల్‌ని ఈ మధ్యే ప్రారంభించారు. ఈ ఏడంతస్తుల భవనంలో 105 దుకాణాలున్నాయి. అవి కాక ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్‌, రెస్టరెంట్‌, మహిళా కోఆపరేటివ్‌ బ్యాంకు, వృత్తి శిక్షణా కేంద్రమూ ఉన్నాయి. ఈ మాల్‌లో మరో ఆకర్షణ పాతికమంది కలిసి పెట్టిన మైక్రో బజార్‌. మాల్‌ నిర్వహణ అంటే పెద్ద కార్పొరేట్‌్ సంస్థలకే సాధ్యం అనే అభిప్రాయాన్ని తిరగరాస్తూ ఈ మహిళలు ఉత్పత్తినుంచీ అమ్మకాల వరకూ అన్ని పనులూ తామే చేస్తూ వ్యాపార నిర్వహణలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు.


కుటుంబశ్రీ కిచెన్స్‌

క్యాంటీన్‌, కేటరింగ్‌ రంగంలో కుటుంబశ్రీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కేరళ సంప్రదాయ ఆహార పదార్థాలను ఒకచోట తయారుచేసి నగరాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో విక్రయిస్తున్నారు. కెఫే కుటుంబశ్రీ పేరుతో పనిచేస్తున్న గొలుసు రెస్టరెంట్లకూ మంచి ఆదరణ లభిస్తోంది. దళిత, ఆదివాసీ మహిళలూ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి ప్రారంభించిన కమ్యూనిటీ కిచెన్‌ వల్ల కాన్పు సమయంలో తల్లీబిడ్డల మరణాల్ని అరికట్టగలిగారు.


కుటుంబశ్రీ బజార్‌

కుటుంబశ్రీ సభ్యులు తయారుచేసిన పలురకాల ఉత్పత్తులకూ అందిస్తున్న సేవలకూ ఆన్‌లైన్‌ వేదిక ఇది. ఏ జిల్లా ఉత్పత్తులు కావాలంటే ఆ జిల్లా ఉత్పత్తులను కుటుంబశ్రీబజార్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో చూసి కొనుక్కోవచ్చు. కేటరింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, డేకేర్‌ లాంటి సేవలే కాదు ఆఖరికి పెళ్లిసంబంధాలు వెతికిపెట్టే సేవలూ అందించేవారున్నారు.

 


అమెజాన్‌లో ఆర్డర్లు!

‘అమెజాన్‌ సహేలి’ పథకంలో ఇప్పుడు కుటుంబశ్రీ కూడా చేరింది. మహిళలకు వ్యాపారనిర్వహణలో శిక్షణ ఇవ్వడమే కాక వారు తయారుచేసిన ఉత్పత్తులను అమ్మేందుకు అమెజాన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. పైలట్‌ వర్క్‌షాపు కింద 300 మందికి శిక్షణ ఇచ్చి ప్రయోగాత్మకంగా కొన్ని ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో పెట్టగా కొద్ది రోజుల్లోనే పలు ఉత్తరాది రాష్ట్రాలనుంచి వాటికి ఆర్డర్లు రావడం విశేషం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.