close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రకృతికి ప్రణామం!

గాలి, నీరు, నేల... వీటి కాలుష్యంతో మానవ మనుగడకే ముప్పు. ఈ విషయాన్ని తెలుసుకున్నా కూడా మార్పు దిశగా అడుగులు వేయలేకపోతున్నాం.  కానీ కొందరు మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదు. తమవంతుగా మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారెవరో, చేస్తున్నదేమిటో మీరే చదవండి!

పాత టైర్లు మాకివ్వండి!

అనుభవ్‌ వాద్వా వయసు 19 సంవత్సరాలే అయినా, ఒక కంపెనీకి సీఈఓ. అదేం సాదా సీదా కంపెనీ కాదు, పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఆదర్శవంతమైన సంస్థ. దాని పేరు tyrelessly. పాత టైర్లను సేకరించి పర్యావరణానికి హాని కలగకుండా వాటినుంచి రబ్బరు, ఇనుము, మరికొన్ని హానికర రసాయన కందెనల్ని వేరుచేస్తుందీ కంపెనీ. ఒక రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్తున్నపుడు రోడ్డుపక్కన టైర్లను కాల్చుతుంటే భరించలేని వాసనా, దట్టమైన పొగా రావడాన్ని చూశాడు అనుభవ్‌. ఇంటికి వెళ్లాక కూడా దాన్ని మర్చిపోలేకపోయాడు. ఆ తర్వాత టైర్లు కాల్చడంవల్ల వెలువడే కాలుష్య కారకాల గురించి ఇంర్నెట్‌లో చదివాడు. అక్కడి సమాచారం, ల్యాబ్‌లో ప్రయోగాల అనంతరం 2015లో టైర్‌లెస్లీ కంపెనీని పెట్టాడు. ఇండియాలో ఏడాదికి పది కోట్ల టైర్లు వాడి పడేస్తున్నారు. కానీ వాటిలో అయిదు శాతం టైర్లను మాత్రమే పర్యావరణహితంగా పునర్వినియోగం చేస్తున్నారు. మిగిలిన వాటినీ సేకరించి పర్యావరణాన్ని రక్షించాలనేది అనుభవ్‌ లక్ష్యం. టైర్‌లెస్లీ వెబ్‌సైట్లోకి వెళ్లి మనం ఉండే ప్రాంతం చెబితే వారు వచ్చి టైర్లని సేకరిస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉంది. త్వరలో మరిన్ని రాష్ట్రాలకూ విస్తరించనున్నారు. ఇలా సేకరించిన టైర్లని హర్యానాలోని ప్లాంట్‌కు తీసుకువెళ్లి ప్రతి 100 టైర్లనుంచి 23 లీటర్ల కందెనల్ని తీస్తారు... అంటే ఎంత కాలుష్యాన్ని తగ్గిస్తున్నాడో చూడండి!

 

అతడు... వృక్ష వైద్యుడు

గార్డెన్‌ సిటీగా పేరొందిన బెంగళూరులో కొన్నేళ్లుగా పచ్చదనం తగ్గిపోతుండటాన్ని గమనించి వృక్ష సంరక్షకుడిగా మారాడు విజయ్‌ నిషాంత్‌. దీనికోసం ‘వృక్ష ఫౌండేషన్‌’ను ప్రారంభించాడు. బెంగళూరులో రోడ్లపక్కన ఉండే చెట్లకు చెదలూ, చీడా పట్టినట్లు గుర్తిస్తే వెళ్లి చికిత్సచేసి వాటిని సహజంగా పెరిగేలా చేస్తాడు. రక్షణ కోసం పెట్టిన ట్రీ గార్డ్‌లు కొన్నాళ్లకు చెట్ల పెరుగుదలకు అడ్డంకిగా మారుతాయి. అలాంటపుడు చెట్లకు హానిలేకుండా వాటిని తొలగిస్తాడు. ఎవరైనా తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉందని చెబితే వెళ్లి వాటికీ చికిత్స చేస్తాడు. ఇలా కొన్ని వేల చెట్లని బతికించాడు. అంతేకాకుండా విద్యార్థులకు వృక్ష సంరక్షణ గురించి పాఠాలు చెబుతాడు. అనుమతి లేకుండా చెట్లు కొట్టేసేవాళ్లమీద ఫిర్యాదులూ చేస్తాడు. ఇతడి సేవల్ని మెచ్చి బెంగళూరు నగర పాలక సంస్థ అటవీ విభాగానికి సలహాదారుగా తీసుకుంది. ‘ప్రాజెక్ట్‌ వృక్ష’ పేరుతో బెంగళూరు, మంగళూరులలో చెట్లను లెక్కించి ఆ సమాచారాన్ని ‘వృక్షడాట్‌కామ్‌’లో ఉంచుతున్నాడు. చెట్ల వివరాలతోపాటు జీపీఎస్‌ ద్వారా అవి ఉండే చోటునీ గుర్తించి పెడతాడు. ఎవరైనా ఆ చెట్టుని కొట్టేస్తే దీనిద్వారా తెలుస్తుంది. ఈ లెక్కలవల్ల నగరంలో ఎక్కడ పచ్చదనం తక్కువగా ఉందో గుర్తించి అక్కడ మొక్కలు నాటొచ్చు. ఈ విధంగా బెంగళూరులోని పది వార్డుల్లో చెట్ల వివరాల్ని సేకరించారు. బెంగళూరులో మొత్తంగా ఈ పని పూర్తిచేసి ఇదే మోడల్‌ని ఇతర నగరాలూ అనుసరించేలా చేయాలనేది విజయ్‌ ఆలోచన.

నగరం మధ్యలో అడవి...

ఎవరూ లేనిచోట ఎన్ని చెట్లు ఉంటే మాత్రం ఏం లాభం? కాలుష్యాన్ని తగ్గించాలంటే జనాలు ఉన్నచోటే అవి ఇంకా ఎక్కువ ఉండాలి. ఇదే విషయాన్ని గమనించింది ‘గ్రీన్‌ యాత్ర’ సంస్థ. అందుకే కేవలం 13 శాతం పచ్చదనం ఉన్న ముంబయి మహానగరంలో చిన్నపాటి అడవిని పెంచుతోంది. ‘అక్కడ మనుషులకే చోటులేదు మొక్కలకి ఎక్కడిది?’ అనేగా మీ సందేహం. దీనికోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘సెంట్రల్‌ రైల్‌ సైడ్‌ వేర్‌హౌస్‌ సొసైటీ’ ప్రాంగణంలోని ఎకరా స్థలాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా ఎకరా విస్తీర్ణంలో వెయ్యికంటే ఎక్కువ మొక్కలు పెరగవు. అందుకే ఇక్కడ జపాన్‌ పర్యావరణవేత్త మియావాకీ అనుసరిస్తున్న పద్ధతిలో మొక్కల్ని పెంచుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరాలో 12వేల మొక్కల్ని పెంచొచ్చు. దీనికోసం వేర్వేరు ఎత్తుల్లో పెరిగే మొక్కల్ని ఎంచుకుంటారు. వీటిని నాటేముందు నేలను బాగా సారవంతంగా తయారుచేస్తారు. మొక్కలు దట్టంగా ఉండటంవల్ల ఆకుల్ని దాటుకుని సూర్యరశ్మి నేలను తాకలేదు. అందుకే నేలలో ఏడాది పొడుగునా తేమ ఉంటుంది. దాంతోపాటే పచ్చదనమూనూ! రెండేళ్లలో వీటిలో కొన్ని మొక్కలు ఆరు అడుగుల ఎత్తును చేరుకుంటాయి. పచ్చదనం ఉన్నచోట పక్షులూ చేరుతాయిగా. అందుకే గ్రీన్‌ మిత్ర ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి అడవుల్నే మిగతా నగరాల్లోనూ పెంచాలని చూస్తోందా సంస్థ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు