close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కంటి ఆరోగ్యానికి...

వయసు పెరిగేకొద్దీ కంటిచూపు మసకబారడం సహజమే. అయితే జింక్‌, కాపర్‌, విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, బీటాకెరోటిన్‌, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వంటి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా వయసుతోబాటు వచ్చే కంటి క్షీణతని చాలావరకూ తగ్గించుకోవచ్చు అంటున్నారు కంటి నిపుణులు.
* చేపలు, చేపనూనెల్లో ఒమెగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని వారానికి రెండుమూడుసార్లయినా తీసుకోవాలి. ముఖ్యంగా పొడిబారిన కళ్లకి చేప చక్కని పరిష్కారం.
* వాల్‌నట్స్‌, జీడిపప్పు, వేరుసెనగపప్పు... వంటి నట్స్‌లోనూ అవిసె, చియా వంటి గింజల్లోనూ సమృద్ధిగా ఉండే విటమిన్‌-ఇ, ఫ్యాటీ ఆమ్లాలు కూడా కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
* నిమ్మ, నారింజ... వంటి సిట్రస్‌ పండ్లలోని విటమిన్‌-సి, ఇ, లు కూడా కళ్లు దెబ్బతినకుండా చేస్తాయి.
* విటమిన్‌-సితోబాటు ల్యూటెన్‌, జియాక్సాంథిన్‌ పుష్కలంగా ఉండే పాలకూర, క్యాబేజీ; విటమిన్‌-ఎ సమృద్ధిగా ఉండే క్యారెట్లు; విటమిన్‌-ఇ ఎక్కువగా ఉండే చిలగడదుంపలూ; ఇవన్నీ పుష్కలంగా ఉండే గుడ్లూ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇవన్నీ తినడంతోబాటు నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కళ్లు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.

సరైన ఆహారం తీసుకోవడంతో బాటు ఎండలోకి వెళ్లినప్పుడు సన్‌గ్లాసెస్‌ వాడటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం, కంప్యూటర్‌ మీద నుంచి ఇరవై నిమిషాలకోసారి దృష్టి మరల్చి 20 అడుగుల దూరం వరకూ 20 సెకన్లపాటు చూడటం వంటివి చేస్తే కళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.

పచ్చదనంతో మానసిక ఆరోగ్యం!

పచ్చదనం కళ్లకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందిస్తుంది అంటున్నారు డెన్మార్క్‌లోని ఆర్హస్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. ఎందుకంటే చిన్నతనం నుంచీ పచ్చని మొక్కల్ని చూస్తూ ఆ మొక్కలూ చెట్ల మధ్య ఆడుకుంటూ పెరిగే పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్‌... వంటి మానసిక సమస్యలు తక్కువగా ఉంటాయని గుర్తించారు. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది పిల్లలు వాయు కాలుష్యంతో నిండిపోయిన నగరాల్లోనూ పచ్చదనం లోపించిన భవంతుల్లోనూ జీవిస్తున్నారు. దాంతో కౌమారదశలో చాలామంది పిల్లలు ఒత్తిడికి లోనై రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అలాకాకుండా ప్రకృతిఒడిలో పెరిగిన పిల్లల్లో పెద్దయ్యాక తలెత్తే ఒత్తిడిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అందుకే కనీసం పిల్లలకు పది సంవత్సరాలు వచ్చేవరకయినా వాళ్లని పచ్చదనంతో నిండిన వాతావరణంలో పెంచితే వాళ్లు శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా పెరుగుతారని చెబుతున్నారు.

మధుమేహంతో సంతానలేమి!

వయసుతో సంబంధం లేకుండా జీవనశైలి వల్ల చాలామంది చిన్నవయసులోనే మధుమేహానికి గురవుతున్నారు. అయితే ఇది సంతానలేమికి కారణమవుతుంది అంటున్నారు భారతీయ నిపుణులు. ముఖ్యంగా మధుమేహం పురుషుల్లో శుక్రకణాల డీఎన్‌ఏని దెబ్బతీయడంతో వాటిల్లో కదలిక తగ్గుతుందట. అలాగని మధుమేహం పూర్తిగా సంతానరాహిత్యానికి దారితీస్తుందని చెప్పలేం. కానీ సంతాన అవకాశాల్ని తగ్గిస్తుంది అంటున్నారు. అలాగే ఈ మధుమేహం మహిళల్లో పాలీ సిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌కీ ఇతరత్రా ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకీ కారణమవుతుంది. ఇవన్నీ కలిసి సంతాన సాఫల్యత శాతాన్ని తగ్గిస్తాయి. అంటే మధుమేహంతో బాధపడే మహిళల్లో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని హెచ్చరిస్తున్నారు.

నిద్ర ఎందుకూ అంటే...

కొందరికి ఎంత కొట్టుకున్నా నిద్ర రాదు. మరికొందరు ఇట్టే నిద్రపోతారు. అసలు నిద్ర ఎందుకు? నిద్రపోకపోతే జీవించలేమా అన్న సందేహం సహజం. శరీరానికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. అది ఆరోగ్యంమీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నిద్ర రక్తప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుందన్న విషయం మరోసారి బార్‌లాన్‌ విశ్వవిద్యాలయం చేసిన కొత్త పరిశీలనలో స్పష్టమైంది. అయితే నిద్రపోవడం వల్ల మెదడు కణాలన్నీ విశ్రాంత స్థితిలోకి వెళతాయి. దీనివల్ల పగటివేళలో చేసిన పనుల ఒత్తిడి నుంచి తిరిగి కోలుకోవడంతోబాటు వాటిల్లోని డీఎన్‌ఏ దెబ్బతినకుండా ఉండటాన్ని గమనించారు. ఒకవేళ నిద్ర సరిగ్గా పట్టకపోతే అంటే-  మెదడు కణాలు విశ్రాంతస్థితిలోకి వెళ్లకపోతే ఆ ఒత్తిడి కారణంగా అవి దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ప్రతి ప్రాణికీ నిద్ర తప్పక అవసరం అని భావిస్తున్నారు నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.