close

ఆనందమానందమాయె!

ఎగిరి గంతేస్తారొకరు... కూనిరాగం తీసుకుంటూ తమలో తామే మైమరిచిపోతారు ఇంకొకరు. స్వీట్లు ఇచ్చో కబుర్లు చెప్పో అందరితోనూ పంచుకుంటారొకరు. మబ్బుల్లో తేలిపోతున్నట్లుందంటూ కవిత్వం రాస్తారొకరు. ఇక క్రీడాకారులైతే మైదానంలోనే ఒకరి మీద ఒకరు పడి దొర్లేస్తారు... అందరిదీ ఆనందమే..! ఏమిటీ ఆనందం? ఇలా అరుదుగా కన్పించేదేనా... లేక ఎప్పుడూ ఉంటుందా? ఎప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యమేనా అసలు?

(మార్చి 20: అంతర్జాతీయ ఆనంద దినోత్సవం)

ఓ వెన్నెల రాత్రి. రాజూ మంత్రీ మారువేషంలో పర్యటిస్తున్నారు. చుట్టూ పరికించి చూస్తూ నడుస్తున్న రాజుని ఓ పక్క చిన్న గుడిసె ముందు కన్పించిన దృశ్యం ఆకట్టుకుంది. అక్కడ నున్నగా అలికిన నేల మీద చాప వేసుకుని కూర్చున్న ఓ జంట పిల్లల ఆటపాటలు చూస్తూ ఆనందిస్తోంది. వాళ్లు నిరుపేదలని చూస్తేనే తెలుస్తోంది. కానీ వారి ముఖాలు మాత్రం ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఆశ్చర్యపోయిన రాజు ‘మహారాజునైన నేనే ఏనాడూ ఇంత సంతోషంగా గడిపిన గుర్తులేదు. వారి ఆనందానికి కారణమేమై ఉంటుంది?’ అని అడిగాడు మంత్రిని.
 

‘వారు ఇంకా 99 వరహాల సంఘంలో చేరి ఉండరు మహారాజా’ అని సమాధానమిచ్చాడు మంత్రి.

‘99 వరహాల సంఘమా? ఏమిటది?’ అడిగాడు రాజు.

‘99 వరహాలిస్తే చెబుతా’ అన్నాడు మంత్రి. తన వద్ద ఉన్న వరహాల మూటలోంచి 99 వరహాలు మంత్రికిచ్చి ‘ఊఁ ఇప్పుడు చెప్పు’ అన్నాడు రాజు. ‘ఒక్క ఆర్నెల్లు ఆగండి, చూపిస్తాను’ అంటూ, ఆ గుడిసెలోని కుటుంబం పడుకోవడానికి లోపలికి వెళ్లిపోయాక 99 వరహాలనీ ఓ మూటకట్టి దాన్ని తీసుకెళ్లి వారి గుమ్మం ముందు పెట్టి రాజుగారితో కలిసి తిరిగి వెళ్లిపోయాడు మంత్రి.

మర్నాడు లేవగానే గడపలో వరహాల మూట చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు ఇంటి యజమాని. వాటిని లెక్కపెడితే 99 ఉన్నాయి. ‘అయ్యో ఇంకొక్కటి ఉంటే 100 వరహాలకు యజమానిని అయ్యేవాడిని’ అనుకున్నాడు. భార్యని లేపి చూపించాడు. ఆమె కూడా సంతోషించింది. ఇంకొక్క వరహా సంపాదించి వందచేసి దాచుకుందా మన్నాడు భర్త. సరేనంది భార్య. రోజూ ఇద్దరూ కష్టపడితే వచ్చే కూలితో కుటుంబం మూడుపూటలా తినగలిగేది. అలాంటిది ఇప్పుడు వందో వరహా కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. కడుపు నిండా తినడం మానేశారు. పిల్లల్నీ పనికి పంపిస్తున్నారు. నెలలు గడుస్తున్నాయి. కడుపు నిండా తిండి లేదు, కంటినిండా నిద్రలేదు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం లేదు. విసిగిపోయిన తల్లీబిడ్డలు ఓరోజు ఆ మూట విప్పి రెండు వరహాలు తీసుకుని బజారుకెళ్లి కావలసినవన్నీ కొనుక్కొచ్చారు. రాత్రికి ఇంటికి వచ్చిన తండ్రి విషయం తెలుసుకుని కోపంతో అగ్గిమీద గుగ్గిలమైపోయాడు. 99 వరహాలు చేతిలో ఉంటే అనుభవించకుండా ఒక్క వరహాకోసం ఈ పిచ్చికష్టం పడటమేమిటని నిలదీసింది భార్య. 99ని వంద చేయాలి కానీ ఖర్చు చేసుకుంటామా అంటాడు భర్త.

ఆ విషయమై రోజూ తగవులాటే ఇద్దరికీ. అలాంటి సమయంలోనే మరోసారి అటుగా వచ్చారు రాజూ మంత్రీ. ఆ ఇంటి పరిస్థితి చూసి బిత్తరపోయిన రాజు వారి ఆనందం ఏమైపోయిందని అడిగాడు మంత్రిని. ‘అది ఒక్క వరహాలో చిక్కుకుపోయింది మహారాజా’ చెప్పాడు మంత్రి. అర్థం కాక చూస్తున్న రాజుకి తాను 99 వరహాలూ ఆ కుటుంబానికి ఇచ్చినప్పటినుంచి జరిగిన సంగతులన్నీ చెప్పాడు మంత్రి.

‘వారు రోజూ కాయకష్టం చేసుకుని ఉన్నంతలో తిని తృప్తిగా జీవించేవారు. ఎప్పుడైతే 99 వరహాలు వచ్చాయో అప్పటినుంచీ వాటిని వంద చేయాలన్న తాపత్రయం మొదలైంది. దాంతో ఆనందాన్ని మర్చిపోయారు. వారే కాదు, సమాజంలో నూటికి 90 మంది అదే తాపత్రయంతో బతుకుతున్నారు మహారాజా... అందుకే ఆనందం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కోవాల్సి వస్తోంది’ చెప్పాడు మంత్రి.

అందరిదీ అదే తాపత్రయం
ఈ కథ ఆ పేదజంటదే కాదు, ఇవాళ్టి సమాజానిది కూడా. సైకిల్‌ మీద తిరిగేవాడు మోటర్‌ సైకిల్‌ కొనాలనీ, మోటర్‌ సైకిల్‌ ఉన్నవాడు కారు కొనాలనీ, కారు ఉన్నవాడు మెర్సిడెస్‌ కొనుక్కోవాలనీ... ఎప్పటికప్పుడు ఇలా లేనిదానికోసం తాపత్రయపడుతూ చాలామంది ఉన్నదానితో లభించే ఆనందాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు. జీవితాన్ని మరింత సౌకర్యంగా సుఖంగా జీవించాలనుకోవడంలో తప్పులేదు. కానీ రేపు సాధించే దానికోసం ఈరోజును వృథా చేసుకోవడం తెలివైన పని కాదనీ, వస్తువుల మీద మోజులో పడి అసలైన అనుభూతుల్ని కోల్పోతున్నారనీ గుర్తించారు కొందరు సామాజికవేత్తలు. ప్రజలను ఆ తాపత్రయం నుంచి బయటపడేలా చేయాలని హ్యాపీనెస్‌ క్లబ్బుల్ని పెట్టారు. ఆనందం అనేది ఎప్పుడో చేరుకునే గమ్యం కాదనీ, రోజువారీ జీవిత ప్రయాణమే ఆనందంగా సాగాలనీ చెబుతూ పదిమందినీ పోగేసి రకరకాల కార్యక్రమాలు చేపట్టేవారు. సరదాగా సాగే ఆటపాటల నుంచీ నలుగురికీ సహాయపడే  సేవా కార్యక్రమాలవరకూ అందులో ఉండేవి.

చాలా చోట్ల జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి సలహాదారుగా ఉన్న జైమి ఇలియెన్‌ దృష్టికి వచ్చాయి. వాటి ఉద్దేశం అతడికి నచ్చింది. జైమి జీవితానుభవమూ అందుకు కారణం. కోల్‌కతాలో అనాథగా రోడ్డుమీద తిరుగుతున్న అతడిని మదర్‌ థెరిస్సా నిర్వహిస్తున్న మిషనరీ సంస్థ అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి ఓ అమెరికా మహిళ అతడిని దత్తత తీసుకోగా అక్కడికి వెళ్లిన జైమి బాగా చదువుకున్నాడు. తల్లీకొడుకులిద్దరూ పిల్లల సంక్షేమం కోసం ఓ స్వచ్ఛంద సంస్థనూ నడిపేవారు. అందుకే అతడికి హ్యాపీనెస్‌ క్లబ్బుల ఉద్దేశం నచ్చింది. దీన్ని పెద్ద ఎత్తున చేపడితే కానీ వ్యక్తుల ఆలోచనల్లో మార్పు రాదనుకుని సమితి ముందు పెట్టాడు. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో సభ్యదేశాలన్నీ 2013 నుంచి ఏటా మార్చి 20ని అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా జరుపుకోవడం మొదలెట్టాయి. ఆనందం మనసుకు కలిగే ఒక అనుభూతి. దాన్ని ఎవరికి వారు అనుభవించాలి కానీ ఇలా దినోత్సవాలుగా జరిపితే వస్తుందా అంటే... వస్తుందనే అంటున్నారు పరిశోధకులు.

నాలుగు హార్మోన్లు
ఆనందం అనేది మనిషిని బట్టి మారుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో పని ఆనందాన్నిస్తుంది. అటువంటప్పుడు అందరినీ ఆనందంగా ఉంచడం ఎలా సాధ్యం... అసలు ఆనందానికి కారణం ఏమిటి... ఇలాంటి ప్రశ్నలే పరిశోధకులకూ వచ్చాయి. తమ చేతిలోని పని కాబట్టి పరిశోధించి సమాధానాలూ కనిపెట్టేశారు. వారేం తేల్చారంటే... సంతోషంగా ఉండటమనేది సగం మన జన్యువుల మీద ఆధారపడి ఉంటుందనీ, మిగతా సగం మన మెదడులో తయారయ్యే రసాయనాల మీద ఆధారపడి ఉంటుందనీ... కాబట్టే అది మనిషికీ మనిషికీ మారుతోందని తేల్చారు. వారసత్వంగా వచ్చే జన్యువులను ఏమీ చేయలేం కాబట్టి వాటి సంగతి పక్కనపెట్టి మన శరీరంలో తయారయ్యే రసాయనాల సంగతి చూద్దాం.
డోపమైన్‌: పరీక్షలో మంచి మార్కులు వస్తే, ఆటలో మంచి స్కోర్‌ సాధిస్తే, ఒక పని విజయవంతంగా పూర్తి చేస్తే, ఎవరికైనా సాయం చేస్తే... డోపమైన్‌ విడుదలవుతుంది. అంటే మంచి పని చేశావు అని మెదడు మనకు కితాబిస్తుందన్నమాట. అందుకే దీన్ని ‘కెమికల్‌ ఆఫ్‌ రివార్డ్‌’ అంటారు.
ఆక్సిటోసిన్‌:
ర్భంతో ఉన్నప్పుడూ పిల్లలకు పాలిచ్చేటప్పుడూ తల్లుల్లో ఎక్కువగా ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ ఎవరిలోనైనా ఆత్మీయమైన పలకరింపుకీ, ప్రేమపూర్వకమైన స్పర్శకీ స్పందించి విడుదలవుతుంది. అందుకని దీనికి అనుబంధాల హార్మోన్‌ అని పేరు.
సెరొటొనిన్‌: శరీరానికో మనసుకో కాస్త హాయినిచ్చేదేదైనా చాలు సెరొటొనిన్‌ ఉత్పత్తి అవడానికి. అందుకే దీన్ని హ్యాపీనెస్‌ హార్మోన్‌ అంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం, నులివెచ్చని సూర్యకాంతి, రుచికరమైన ఆహారం, మంచి ఆలోచనలు... లాంటివన్నీ సెరొటొనిన్‌ని ఉత్పత్తి చేస్తాయి.
ఎండార్ఫిన్లు: శారీరక కష్టం చేసేటప్పుడూ వ్యాయామం చేసేటప్పుడూ విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరానికి నొప్పుల్ని తట్టుకునే శక్తినిస్తాయి.

హ్యాపీ హార్మోన్లు కావాలంటే...
పైన చెప్పిన నాలుగు హ్యాపీ హార్మోన్లూ ఏయే సందర్భాల్లో విడుదలవుతున్నాయో తెలిసింది కాబట్టి అలాంటి సందర్భాలను రోజువారీ జీవితంలో భాగమయ్యేలా చూసుకుంటే చాలు ఆనందం మీ వెంటే ఉంటుందంటున్నారు మానసికనిపుణులు. అందుకు వారు చెబుతున్న పనులేంటంటే...

మంచి పనులతో...  కొత్త భాష, కళ, క్రీడ... ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి. పెద్ద లక్ష్యం ఉంటే దాన్ని చిన్న భాగాలుగా విడదీసుకోవాలి. ఒక్కో దశా దాటి లక్ష్యానికి చేరువవుతుంటే మనసుకి కావలసిన థ్రిల్‌ దొరుకుతుంది. సమస్యలు ఎదురైనప్పుడు తల్లడిల్లిపోకుండా, పరిష్కరించుకునే మార్గం వెతికితే మనసుకి గెలిచిన అనుభూతి లభిస్తుంది. అలాగే ఇతరులకు ఉపయోగపడే మంచి పని చేయడం కూడా. ఏ స్వచ్ఛంద సంస్థలోనో చేరి వారానికో పూట, నెలకో రోజు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి. ఇలాంటి పనులన్నీ డోపమైన్‌ తయారీకి కారణమై మనసును ఆనందంగా ఉంచుతాయి.

బంధాలను బలపర్చుకుంటూ... కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు... దూరంగా ఉన్నవారిని ఇప్పుడు వారితో పనిలేదనో, తీరికలేదనో వదిలేయవద్దు. ఎలా ఉన్నారంటూ ఒక ఫోనుతోనో వాట్సప్‌ సందేశంతోనో పలకరించి బంధాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉంటే ఆక్సిటోసిన్‌ తరచూ విడుదలవుతుంటుంది. కొత్త స్నేహాలూ పరిచయాలూ కూడా అందుకు తోడ్పడతాయి.

ఇష్టమైన పనులతో... మనసు పెట్టి ఇష్టంగా చేసే పని సెరొటొనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, చేసే పనుల్ని ఇష్టపడి చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా పనిలోనే ఆనందమూ లభిస్తుంది. ఇష్టమైన హాబీకి రోజూ కొంత సమయం కేటాయించడం, ఇష్టమైన రుచులను ఆస్వాదించడం, నచ్చిన పుస్తకాలను చదవడం, సంగీతం వినడం... ఏవి చేసినా హ్యాపీ హార్మోన్‌ నిరంతరం విడుదలవుతూ సంతోషంగా ఉంచుతుంది.

ఆటలూ వ్యాయామంతో... ఫీల్‌ గుడ్‌ హార్మోన్లనీ, సహజమైన నొప్పినివారిణులనీ పేరున్న ఎండార్ఫిన్లు విడుదలవ్వాలంటే శరీరానికి వ్యాయామం అవసరం. మానసిక ఒత్తిడీ, నొప్పులూ కూడా వీటి విడుదలను ప్రేరేపిస్తాయి. ఎండార్ఫిన్ల వల్ల పడిన శ్రమ అంతా పోయి మనసుకు హాయిగా ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మానసిక కుంగుబాటు సైతం నయమవుతుందంటారు నిపుణులు. ఇలా హ్యాపీనెస్‌ హార్మోన్లకు నిత్యం పనిపెట్టేలా మన దినచర్యను మలచుకుంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడం మనచేతిలోని పనేనని ప్రచారం చేస్తోంది అంతర్జాతీయ ఆనంద దినోత్సవం.

కాసేపు నవ్వాలి!
శరీరం అనారోగ్యంగా ఉంటే మనసు ఆనందంతో కేరింతలు కొట్టడం అసాధ్యం. ఈ రెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అందుకని ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. శరీరాన్ని ప్రేమించాలి. అప్పుడే దాంట్లో జరిగే మార్పుల్ని నిశితంగా గమనిస్తాం. ఎలాంటి అనారోగ్య ఛాయలు కన్పించినా వెంటనే జాగ్రత్తపడగలుగుతాం. ఆరోగ్యంగా ఉండే శరీరంలోనే ఆనందంగా ఉండే మనసుంటుంది. ఆ రెండూ కలిసుంటే విజయం బోనస్‌గా వచ్చేస్తుందట. ఇక, పొద్దున్నే వాకింగో వ్యాయామమో చేసి ఆ తర్వాత ఇంటి పనులు చేసుకుని హడావుడిగా ఆఫీసుకెళ్లి, అక్కడ తలెత్తడానికి వీల్లేనంత పనిచేసి, మళ్లీ ఇంటికొచ్చి పిల్లల చదువులూ అవీ చూసుకుని మంచమెక్కేసరికి అర్ధరాత్రి అవుతోందా- అంత బిజీ అయితే మరి నవ్వేదెప్పుడు? అవును... రోజువారీ జీవితంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే- ఒక చిన్న బ్రేక్‌ తీసుకోండి. టీవీలో ప్రకటనల్లా ప్రతి పదినిమిషాలకీ అక్కర్లేదు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం... ఐదేసి నిమిషాలు చాలు. ఓ కార్టూనో, జోకో, కామెడీ సీనో చూడండి. ఆ పూటకి సరిపోయే నవ్వుల హార్మోన్‌ డోసు విడుదలవుతుంది. మనసంతా ఆనందం వెన్నెల్లా పరుచుకుంటుంది.

ఉత్పాదకత పెరుగుతుంది!
ఇంత కష్టపడి ఆనందాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఏమిటీ అంటే దానికీ సమాధానం ఉంది. ఆనందంగా నవ్వుతూ తుళ్లుతూ ఉండే ఉద్యోగుల వల్ల సంస్థల్లో 20 శాతం ఉత్పాదకత పెరుగుతుందని సోషల్‌ మార్కెట్‌ ఫౌండేషన్‌ జరిపిన ఓ అధ్యయనం తేల్చింది. అమ్మకాల విభాగంలో సిబ్బంది సంతోషంగా ఉంటే అమ్మకాలు ఏకంగా 37 శాతం పెరుగుతాయట. ఉద్యోగం చేయడానికి మంచి కంపెనీలుగా పేరొందిన టాప్‌ 100 సంస్థల్లో ఉత్పాదకత నిలకడగా 14 శాతం పెరగ్గా, ఇతర కంపెనీల్లో 6శాతమే పెరిగిందట. దాంతో ఇప్పుడు చాలా కంపెనీలు సిబ్బందిని ఆనందంగా ఉంచే కార్యక్రమాలనూ చేపడుతున్నాయి. సంస్థలకే కాదు, వ్యక్తిగతంగానూ ఆనందం లాభమే చేకూరుస్తుంది. సంతోషంగా ఉన్నవారు పనులన్నీ సకాలంలో సమర్థంగా చేయగలగడమే కాదు, వారికి జీవితంలో మధురానుభూతులూ ఎక్కువే ఉంటాయట.

*

ఒక ఆఫీసులో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సెమినార్‌ జరుగుతోంది. పాల్గొన్న యాభై మందికీ శిక్షకుడు తలా ఒక బెలూన్‌ ఇచ్చి దాని మీద వారి పేరు రాయమన్నాడు. అందరూ రాశాక తీసుకెళ్లి పక్కన ఖాళీగా ఉన్న ఓ గదిలో పెట్టి రమ్మన్నాడు. అలాగే పెట్టి వచ్చారు. తర్వాత మళ్లీ అందర్నీ ఎవరి బెలూన్‌ వాళ్లు ఐదే నిమిషాల్లో తెచ్చుకోవాలని చెప్పాడు. అందరూ ఒకర్ని తోసుకుంటూ ఒకరు గదిలోకి పరుగులు తీశారు. కిందామీదా పడ్డారు. అందరికీ దూరంగా తమ పేరున్న బెలూన్‌ కన్పించినట్టే కన్పిస్తోంది. అందరినీ తోసుకుని దగ్గరకెళ్లేసరికి మాయమైపోతోంది. ఐదు నిమిషాలైనా ఎవరి బెలూన్‌ వారికి దొరకలేదు. అప్పుడిక ఎవరికి దొరికిన బెలూన్‌ వారు తీసుకొచ్చి, దాని మీద ఎవరి పేరుంటే వారికి ఇవ్వమని చెప్పాడు శిక్షకుడు. ఏ గొడవా లేకుండా రెండే నిమిషాల్లో ఎవరి చేతికి వారి పేరున్న బెలూన్లు వచ్చేశాయి. అందరూ వాటిని పట్టుకుని నవ్వుతూ నిలబడ్డారు. అప్పుడు చెప్పాడు శిక్షకుడు- ఆనందం కూడా అంతే. మనకోసం మనం వెతుక్కుంటే దొరకదు. ఇతరులకు సహాయపడినప్పుడే మన ఆనందం మనకు దొరుకుతుంది... అని!

ఆనందం కావాలా... అయితే ఈ ఆప్స్‌ మీకే!

ఆనందం కొనుక్కునేది కాదు, బజారులో దొరకదు... అంటుంటారు పెద్దలు. బజారులో దొరకదేమో కానీ ఫోన్‌లోని ప్లేస్టోర్‌లో దొరుకుతోంది. ఉచితంగానూ కొనుక్కోడానికీనూ. అవును ‘హ్యాపినెస్‌’కీ ఆప్స్‌ ఉన్నాయి మరి. హ్యాపిఫై, హ్యాపీ హాబిట్స్‌, మై మూడ్‌ ట్రాకర్‌, మైండ్‌షిఫ్ట్‌, రిలాక్స్‌ మెలొడీస్‌, స్లీప్‌ బెటర్‌, కామ్‌, డైరో, హ్యాపీ నాట్‌ పర్‌ఫెక్ట్‌, స్మైలింగ్‌ మైండ్‌, ఇన్‌సైట్‌ టైమర్‌, ఆరా... లాంటి ఎన్నో ఆప్స్‌ ఉద్దేశం ఆనందం కలిగించడమే.

అందుకు ఇవేం చేస్తాయీ అంటే... మంద్రంగా సంగీతం విన్పిస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. ధ్యానం చేసుకోడానికి తోడ్పడతాయి. పచ్చని మొక్కల మధ్య కూర్చున్న అనుభూతిని ఇస్తాయి. పనులన్నీ పద్ధతి ప్రకారం చేసుకునేలా ఆర్గనైజ్‌ చేస్తాయి. కొద్ది నిమిషాల్లోనే మనసును మళ్లించి కోపం, ఆవేశం, ఆందోళన లాంటి ఉద్వేగాలను గాడిలో పెడతాయి. మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. ఒత్తిడిని అధిగమించి ఆనందంగా జీవితాన్ని గడిపేందుకు తోడ్పడతాయి. రోజువారీ పనుల్లో బిజీగా ఉండేవారు ఎక్కడ ఉన్నా చేతిలో ఫోను అయితే ఉంటుంది, అందులోని ఆప్స్‌ అందుబాటులోనే ఉంటాయి కాబట్టి వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. సైకాలజిస్టులూ మానసిక పరిశోధకులూ ప్రత్యేకంగా డిజైన్‌చేసిన ఆప్స్‌ కూడా వీటిలో ఉన్నాయి.

సంతోషాన్నీ కొలుస్తారు!

సంతోషం కేవలం ఒక మానసిక అనుభూతి. అయినా దానినీ కొలుస్తారు. కొలవడమే కాదు, ఏయే దేశాల్లో ప్రజలు ఎంతెంత సంతోషంగా ఉంటున్నారో లెక్కగట్టి, ర్యాంకులేసి ప్రపంచానికి చాటుతోంది వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌. ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ విభాగం 156 దేశాల్లో ప్రజల తలసరి ఆదాయమూ, వారికి అందుతున్న సామాజిక అండదండలూ, ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలూ, సాంఘిక స్వేచ్ఛా, సమాజంలో అవినీతి స్థాయులు... ఇలాంటివన్నీ అధ్యయనం చేసి ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో వెల్లడిస్తోంది. సమానత్వ, మానవాభివృద్ధి సూచీల్లో ముందు వరసలో నిలుస్తున్న ఫిన్‌లాండ్‌, నార్వే, డెన్మార్క్‌ లాంటి దేశాలే ఈ ఆనంద సూచీలోనూ తొలివరసలో ఉన్నాయి. మన దేశం అందులో 133వ స్థానంలో ఉంది. అరిస్టాటిల్‌ కాలం నుంచీ ఆనందం అంటే ఏమిటీ అన్న చర్చ జరుగుతున్నా దీన్ని ప్రభుత్వాలూ సీరియస్‌గా తీసుకోవడం మొదలెట్టింది ఈ మధ్య కాలంలోనే. మొట్ట మొదట 1972లో భూటాన్‌ రాజు ‘గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌’ అనే కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఒక్కో దేశమూ ఆ దిశగా అడుగులేయడం మొదలెట్టాయి. ఇప్పుడు మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆనంద మంత్రిత్వ శాఖలను నిర్వహించడానికి నేపథ్యం ఇదే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.