close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ గోవిందుడు మత్స్యావతారుడు!

పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిల్లో మొదటిదీ వేదాలకు పునర్జన్మను ప్రసాదించిందీ మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం.ఇక్కడ స్వామి శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు.

మనిషి పుట్టుక నుంచీ మరణం వరకూ ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించిందే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. వేదాలను అపహరించిన సోమకాసురుడిని శిక్షించి వేదాలను రక్షించిన వైనమే మత్స్యావతారంలోని ముఖ్య ఘట్టం. ఈ ఘట్టం ఆవిష్కృతమైన ప్రదేశమే చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామి మత్స్యావతారుడిగా వెలసి భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.

స్థలపురాణం
భూమ్మీద ప్రాణికోటి ఏర్పడక ముందు బ్రహ్మదేవుడు సృష్టికార్యాన్ని నెరవేర్చడానికి తపస్సు చేస్తుండగా, సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గరున్న వేదాలను అపహరించి, సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.

మరోవైపు... వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్ని రోజులకీ ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమ్మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది.

రాజుల కాలంలో...
శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదనారాయణస్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు.  చోళరాజుల అనంతరం శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆలయ ఉత్తర గోపురం మీది శాసనం తెలియజేస్తోంది. రాయలనాటి శిలానైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడలను తీర్చిదిద్దారు.  ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది.

విశేష పూజలు...
ఏటా మార్చి మూడోవారంలో అయిదు రోజులపాటు వేదనారాయణుడికి సూర్యపూజోత్సవాలూ తెప్పోత్సవాలూ అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటిరోజున స్వామివారి పాదాలమీద, రెండోరోజున నాభిమీద, మూడోరోజున శిరస్సుమీదా సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. గరుడసేవా, రథోత్సవాలను కన్నుల పండగగా జరుపుతారు. వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆండాళ్‌నీరాట్టు ఉత్సవాలు, నవరాత్రులు...ఇలా ప్రతి పర్వదినాన్నీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

ఇలాచేరుకోవచ్చు
తిరుపతికి 68 కి.మీ., మద్రాసుకు 73 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువైన వేదనారాయణుడిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డుమార్గం ద్వారా వచ్చే వారికి దేశంలోని అన్ని ప్రధాన బస్‌స్టాండ్‌ల నుంచీ బస్సు సౌకర్యం ఉంది. తిరుమల బస్‌స్టాండ్‌ నుంచి ఊత్తుకోట మీదుగా చెన్నై వెళ్లే మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. రైలు, వాయు మార్గాల్లో వచ్చేవారు తిరుపతి లేదా చెన్నై చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి
నాగలాపురం వెళ్లొచ్చు.

- సరస్వతుల శివకుమార్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.