close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హోలీ... హోలీల రంగ హోలీ...

శ్రీరామనవమికి మనదగ్గర వసంతం చల్లుకోవడం తెలిసిందే. ఆ పండగే ఉత్తరాదికి వెళ్లేసరికి హోలీ రూపంలో కనిపిస్తుంది. ఇక్కడ వసంతం చల్లుకున్నా అక్కడ రంగులు పులుముకున్నా పండగలోని పరమార్థం ఒక్కటే. ప్రకృతిలో రుతువులు మారే సమయంలో- చలికాలానికి వీడ్కోలు పలుకుతూ వేసవిని స్వాగతిస్తూ ఒంటికి చల్లదనాన్ని కలిగించే రంగుల్ని చల్లుకుంటూ ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుకే హోలీ ఉరఫ్‌ వసంతోత్సవం!

రంగులకేళీ..!

చల్లగాలులు వేడెక్కే వేళ... ఫాల్గుణమాసం...పౌర్ణమిసమయం... వసంతుడికి ఆహ్వానం పలుకుతూ రంగులహేలనీ ఆనందాల తుళ్లింతల్నీ వెంటేసుకుని వచ్చేస్తుంది హోలీ. వసంత పంచమి, రంగ్‌ పంచమి, ఫల్గుణ పౌర్ణమి, కాముని పున్నమి... ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా దేశవ్యాప్తంగా ఈ పండగని జరుపుకునే తీరు మాత్రం దాదాపు ఒక్కటే. చిన్నాపెద్దా అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ రంగునీళ్లలో తడిసిముద్దవుతూ ఆటపాటలతో మునిగితేలతారు. అప్పటివరకూ శిశిరంతో మోడువారిన చెట్లన్నీ వసంతం తెచ్చిన రంగులతో విరబూసినట్లే- పాత మనస్పర్థల్నీ కోపతాపాల్నీ పక్కకి నెట్టేస్తూ ఆప్యాయతానురాగాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ప్రకృతిలో మమేకమై వేడుక జరుపుకోవడమే హోలీ పండగలోని ముఖ్యోద్దేశం. మనకి ఇది పండగ మాత్రమే. కానీ నేపాలీయులకి జాతీయ వేడుకœ. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, సురినామ్‌, దక్షిణాఫ్రికా, మలేషియా, బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, మారిషస్‌, ఫిజి దీవుల్లోనూ హోలీని ఘనంగా చేసుకుంటున్నారు.

ప్రేమలీల..!

హోలీ పేరు వింటేనే ప్రేమబాసలూ చిలిపి తగవులూ ఇలా ఎన్నో గుర్తొస్తాయి ఉత్తరప్రదేశ్‌లోని నందగావ్‌, బర్సానా ప్రాంతవాసులకి. నందగావ్‌ని కృష్ణ జన్మస్థలంగానూ బర్సానాని రాధ పుట్టిన ఊరుగానూ భావించి ఈ వేడుకని 16 రోజులపాటు వైభవంగా జరుపుకుంటారక్కడ. అక్కడి జానపద సాహిత్యంలో రాధాకృష్ణుల ప్రేమగాథలెన్నో కనిపిస్తాయి. నందగావ్‌, బర్సానాలో స్త్రీలు రాధలుగానూ; కవ్వించే మాటలతో వాళ్లను ఏడిపించే కృష్ణులుగా పురుషులూ మారిపోతారు. దాంతో రాధలంతా కలిసి సరదాగా కర్రలతో కొడుతుంటే వెంట తెచ్చుకున్న డాలుతో తమను కాపాడుకునేందుకు తంటాలు పడతారా కృష్ణులు. అందుకే దీన్ని లాఠ్‌మార్‌ హోలీ అంటారు. చివరకు మేమే గెలిచామంటూ స్త్రీలు బర్సానాలోని రాధారాణి ఆలయం ముందు కర్రల్ని పాతి రంగులూ పూలూ చల్లుకుని మిఠాయిలు పంచుకోవడంతో వేడుక ముగుస్తుంది.

హోలికా దహనం

ఈ పండగ వెనకున్న పురాణగాథలెన్నో. ప్రహ్లాదుడి హరినామస్మరణను వినలేని హిరణ్యకశ్యపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తాడు. ఏదీ ఫలించక చివరికి తన సోదరి హోలికను పిలిచి అగ్ని నుంచి కాపాడే శక్తులున్న శాలువా కప్పుకుని, ఒడిలో ప్రహ్లాదుడిని పెట్టుకుని మంటల్లో కూర్చోమని చెబుతాడు. కానీ దైవ మహిమవల్ల హోలిక కప్పుకున్న శాలువా జారి, ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. హోలిక చనిపోతుంది. రాక్షసత్వం మీద దైవత్వం, చెడు మీద మంచి గెలుపునకి సంకేతంగా ఏటా హోలికా దహనం చేసి, రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారనీ, అందుకే దీన్ని హోలీ అంటారనేది ఓ కథనం.

హోలీనే దక్షిణాదిన కాముని పున్నమి, కామదహనం అనీ అంటారు. పార్వతీదేవి బాధ చూడలేని మన్మథుడు, ఆ సుందరేశ్వరుడి మనుసులో ప్రేమభావనలు పుట్టించేందుకు శివదీక్షను భగ్నం చేస్తూ పూలబాణం వేయగా, ముక్కంటి ఆగ్రహానికి గురై భస్మమవుతాడు. రతీదేవి కోరిక మేరకు అతన్ని తిరిగి బతికిస్తాడుగానీ ఆ కామదేవుడికి దేహం ఉండదు. దాంతో ఆమె అతన్ని చూడగలుగుతుంది కానీ తాకలేదు. క్షణికమైన భౌతికవాంఛలకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే గడ్డితో కాముని బొమ్మ చేసి కాల్చి, రంగులు చల్లుకుంటారు. అందుకే ఈ పండగని కాముని పున్నమి, కామదహనం అనీ అంటారు.

వెండితెర వర్ణాలు..!

బాలీవుడ్‌ సినీ దర్శకులకి హోలీని తెరకెక్కించడం అంటే భలే ఇష్టం. సిల్‌సిలాలో ‘రంగ్‌ బరసే’ అంటూ అమితాబ్‌ రేఖమీద రంగులు చల్లినా, యే జవానీ హై దీవానీలో ‘బాలమ్‌ పిచ్‌కారి.. జో తనె ముఝే మారీ...’ అంటూ దీపిక, కల్కి, ఆదిత్యరాయ్‌ కపూర్‌, రణబీర్‌లు కలిసి చిందులేసినా, ‘లహూ ముహ్‌ లగ్‌ గయా’ అంటూ దీపిక రామ్‌లీలాలో రణ్‌వీర్‌ సింగ్‌తో ప్రేమకేళిలో మునిగిపోయినా... అవన్నీ హోలీ వేడుక చిత్రీకరణలో భాగమే. రాంఝనాలో సోనమ్‌కపూర్‌, ధనుష్‌లమీద చిత్రీకరించిన ‘తుమ్‌ తక్‌’ అనే పాట అంతటా ఉర్రూతలూగించింది. మొత్తమ్మీద ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులకి మనసులో చెరగని ముద్ర వేసేలా చిత్రీకరించేందుకు హోలీని ఓ అందమైన నేపథ్యంగా వాడుకోవడం బాలీవుడ్‌ సినీ దర్శకులకి వెన్నతో పెట్టిన విద్య. అడపాదడపా కొన్ని తెలుగుసినిమాల్లోనూ రంగుల్ని చల్లుకునే దృశ్యాల్ని చిత్రీకరించేస్తున్నారు.

పూలరంగులు

చలికాలం వెళ్లి వేసవి వచ్చే సమయంలో జ్వరాలూ జలుబులూ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ కాలంలో అంటే వసంతంలో విరబూసే వేప, బిల్వ, మందార, అగ్నిపూలు... వంటి ఔషధగుణాలున్న ఆకులూ పువ్వుల పొడుల్నీ పసుపూ కుంకుమల్నీ నీళ్లలో కలిపి చల్లుకోవడం మొదలైందని ఆయుర్వేదం చెబుతోంది. శ్రీరామనవమికి మనదగ్గర వసంతం చల్లుకోవడమూ ఇందులో భాగమే. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలా ఆరోగ్యంకోసం ఆడుకునేది కాస్తా క్రమంగా కృత్రిమ రంగులతో నిండిపోయింది. అయితే కృత్రిమరంగుల్లోని టాక్సిన్లవల్ల కళ్లు దెబ్బతినడం, చర్మక్యాన్సర్లు వస్తున్నాయన్న స్పృహ పెరగడంతో మార్కెట్లో మళ్లీ సహజ రంగులు కనిపిస్తున్నాయి. జట్రోపా, చావల్‌కొడి మొక్కల వేళ్లు; బిల్వ, గుల్‌మొహర్‌, మెంతి, గోరింటాకులు; బంతి, చామంతి, మందార, మోదుగ, శంఖు, జకరాండా పువ్వులు; క్యారెట్‌, బీట్‌రూట్‌... వంటి వాటితో రంగుల్ని చేస్తున్నారు. కాముని దహనంలోనూ కొబ్బరిడొప్పలూ, పిడకల్నే కాల్చుతున్నారు.

జర భద్రం..!

ఆనందం శృతిమించితే మిగిలేది విషాదమే. ముఖ్యంగా హోలీ ఆడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి.
* రంగుల పొడుల్ని గుప్పిళ్లకొద్దీ తీసుకుని ఎడాపెడా చల్లకూడదు. అవి కళ్లల్లోకీ ముక్కుల్లోకీ నోట్లోకీ వెళ్లి కళ్లు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం దెబ్బతినే అవకాశం ఉంది. వేళ్లతోనే పూసుకోవాలి. అప్పుడూ కళ్లలోకి వెళ్లకుండా అద్దాలు పెట్టుకోవాలి.
* బెలూన్లూ వాటర్‌గన్లూ ప్లాస్టిక్‌ బ్యాగుల్లో నీళ్లు నింపి ముఖంమీద కొట్టుకుంటే గాయాలవుతాయి. కాబట్టి సాధ్యమై నంతవరకూ పొడుల్నే పూసుకోవాలి. పూలరేకులయితే మరీ మంచిది.
* ఒంటికీ శిరోజాలకీ కొబ్బరి లేదా ఆలివ్‌నూనె రాయడం వల్ల రంగుల్ని కడగడం తేలిక. ఎండకి చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. ఒంటిని మొత్తంగా కప్పే దుస్తులే వాడాలి. తలకి స్కార్ఫ్‌ కట్టడంవల్ల జుట్టు పాడవదు.
* హోలీ ఆడటానికి ఒక వారం ముందూ తరవాతా ముఖానికి బ్లీచ్‌, ఒంటికి వ్యాక్సింగ్‌ చేయించకూడదు. దానివల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.
* రంగుల్ని వదిలించేందుకు పెట్రోల్‌, స్పిరిట్‌ వంటివి వాడటంకన్నా సీ సాల్ట్‌, గ్లిజరిన్‌ కలిపిన నీటితో కడిగి, మైల్డ్‌ సోప్‌తో రుద్దితే మేలు. అప్పుడే పండగ ఆరోగ్యకరం, ఆనందకరం!

జంతువులతో ఆటలొద్దు..!

కొందరు పెంపుడుజంతువుల మీదా రంగుల్ని చిమ్మి ఆనందిస్తారు. పెట్స్‌ ఏవైనా చర్మాన్ని నాకి శుభ్రంచేసుకోవడంతో రంగులు లోపలికి వెళ్లి అనారోగ్యం పాలవుతాయి. వాంతులు, గాలి ఆడకపోవడంతోబాటు దురదతో గోక్కోవడం, కొరుక్కోవడం చేస్తాయి. చర్మం పుండు పడుతుంది. కళ్లు ఎర్రబారి, నీళ్లు కారడంతో అంధత్వం వస్తుంది. చర్మ వ్యాధులతోబాటు బొచ్చు కూడా ఊడిపోతుంది. మరీ ముచ్చటగా ఉంటే కుంకుమతో చిన్న బొట్టుపెడితే సరి.

రంగుల ఫ్యాషన్‌!

హోలీ రోజున చల్లుకునే రంగులు ఆ ఒక్కరోజుకే ఎందుకు పరిమితం కావాలీ అనుకున్న నేటి డిజైనర్లు హోలీ ఫ్యాషన్లనీ సృష్టించేస్తున్నారు. ఫలితం... హోలీ ఆడిన ఫొటోలు, విరజిమ్మిన రంగులూ, హోలీ అని రాసిన రంగుల అక్షరాలతో ముద్రించిన టీషర్టులూ చీరలూ టాప్‌లూ స్కర్టులూ చెప్పులూ సెల్‌ఫోన్‌ కవర్లూ మార్కెట్లో అందంగా కనువిందు చేస్తున్నాయి. దాంతో మామూలు రోజుల్లోనూ హోలీ ఫ్యాషన్ల జోష్‌తో చిందులేస్తోంది నేటి యువత.

తియ్యని వేడుక!

సంక్రాంతి రాగానే అరిసెలు, దసరాకి కొబ్బరి బూరెలు గుర్తొచ్చి నోరూరినట్లే, ఉత్తరాదిన హోలీ అనగానే కోవా, కొబ్బరి, బెల్లం, మైదా కలిపి చేసే గుజియా(కోవా కజ్జికాయ) అనే సంప్రదాయ స్వీటు చవులూరిస్తుంది. ఆ రోజున రంగుల హేల అయ్యాక, ఒకరికొకరు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుని, కుల్ఫీలు తిని, చలువచేసే ఠండాయీ.. వంటి పానీయాలు తాగుతూ ఆనందంగా గడుపుతారు.  మొత్తమ్మీద ‘హోలీ హోలీల రంగహోలీ చెమ్మకేళీల హోలీ’ అంటూ పరిచితులూ, అపరిచితులతోనూ దోస్తీ అనేస్తూ, మిఠాయిలు పంచి ప్రేమబంధాన్ని పెనవేసుకుంటూ చేసుకునే హుషారైన వేడుకే హోలీ..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.