close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అదండీ సంగతి

- అప్పరాజు నాగజ్యోతి

‘‘ఏమైంది బంగారూ, అలా ఉన్నావేం? మీ అమ్మ నిన్నూ విసిగిస్తోందా?’’
‘‘అవును నాన్నా.’’
‘‘మీ అమ్మకి చాతయింది అదొక్కటేగా. ఇంతకీ విషయమేంటి తల్లీ?’’
నన్ను హేళన చేస్తూ కూతురిని బుజ్జగిస్తూ అడిగారు మావారు.
‘‘చూడండి నాన్నా, నేను ఎంబీబీఎస్‌ చేస్తానంటే వద్దంటూ ఫార్మసీ కోర్సు చేయమని చచ్చు సలహా ఇస్తోంది అమ్మ. ఫీజులు కట్టి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో చదివించాలంటే ఖర్చవుతుందని అమ్మ ఏడుపు. మెడిసిన్‌ చేస్తున్నానంటే ఎంత గొప్పగా ఉంటుందో మీరే చెప్పండి నాన్నా. ఫార్మసీ అట, ఫార్మసీ... ఛీ.’’
‘‘మీ అమ్మ మాటలకేంలే తల్లీ, ఆవిడగారు చేసేది బోడి క్లర్క్‌ ఉద్యోగమే అయినా అన్నీ తనకే తెలుసునన్న అహంకారంగానీ... నిజానికి ప్రొఫెషనల్‌ చదువుల గురించి దానికేం తెలుసు చెప్పు? నువ్వు కోరుకున్నట్లుగానే మెడిసిన్‌లోనే చేరుదువుగాని బంగారూ.’’
కూతురికి ఉదారంగా వాగ్దానం చేసేశారు మావారు.
‘‘థ్యాంక్యూ నాన్నా’’
విజయగర్వంతో నావైపు చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది నా పెద్దకూతురు వైష్ణవి.
మావారి వెటకారాలు నాకేం కొత్తకాదు కాబట్టి ఆయన మాటల్ని నేను పెద్దగా పట్టించుకోకపోయినా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మనసులో ఏవేవో జ్ఞాపకాల దొంతరలు...

*            *           *

తల్లిదండ్రుల మాటలకి డూడూ బసవన్నలా తలూపే నా భర్త నా మనసుని గాయపరచని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.
ఈ విషయంలో మా అత్తామామల్ని నేనెంత మాత్రమూ తప్పు పట్టను. వాళ్ళు పాతకాలపు మనుషులు. కొడుకుని కోడలు కొంగున కట్టేసుకుంటుందేమోనన్న భయం వాళ్ళది. కొడుకు మీద పట్టు కోల్పోకూడదనీ కోడల్ని అదుపాజ్ఞల్లో పెట్టాలనీ తాపత్రయపడటం ఆ కాలంలో సహజమే!
ఏ మాటకామాటే చెప్పాలి, మా అత్తగారూ మామగారూ మా పిల్లల్ని ప్రాణంలా చూసుకునేవారు. వాళ్ళున్నంత కాలమూ నేను ఆఫీసులో పనిచేస్తున్నా పిల్లల విషయంలో ఏ చీకూచింతా లేకుండా నిమ్మళంగా ఉండేదాన్ని.
ఉన్నత చదువులు చదివి బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్న నా భర్త మనస్తత్వం మాత్రం నాకెప్పుడూ కొత్తగానే ఉండేది. అతనివన్నీ ఛాందస భావాలు. భార్య అంటే అతని దృష్టిలో బానిస. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భర్త చెప్పుచేతల్లో ఉండి అతని కాలికింద చెప్పులా నలిగేదే భార్య’ అనుకునే పురుష వర్గానికి ప్రతీక ఆయన.
ఆయన ప్రవర్తనకి నేను బాధపడుతూ కళ్ళనీళ్ళు నింపుకున్నప్పుడల్లా తన పసిచేతులతో నా కన్నీళ్ళని తుడిచేది వైష్ణవి.
‘ఏడవకమ్మా, నాన్న వెరీ బాడ్‌బాయ్‌. నాన్న ఆఫీసులో బాస్‌కి చెప్పి నాన్నని బాగా కొట్టిద్దాం, సరేనా’ అంటూ తన చిట్టిపొట్టి మాటలతో నన్ను ఓదారుస్తుండేదది.
ఒకసారి ఏమైందంటే- అప్పటికి వైష్ణవికి నాలుగేళ్ళు దాటాయేమో... ఇంట్లో జరిగేవన్నీ దానికి కొద్దికొద్దిగా అర్థమవుతున్నాయి.
మా అత్తామామలు రైలు ప్రమాదంలో పోయినప్పటి నుంచీ ‘డే కేర్‌’లో ఉంటుండటం మూలాన అక్కడ తన
ఈడు పిల్లల ద్వారా దానికి కొత్తకొత్త సంగతులన్నీ తెలుస్తున్నాయి.
ఆరోజు ఆఫీసు నుండి తిరిగొస్తూ పిల్లలిద్దరినీ డే కేర్‌ నుండి ఇంటికి తీసుకొచ్చి పాలు తాగించాను.
బాగా అలసిపోయిందేమో, చిన్నది శాంభవి వెంటనే నిద్రలోకి జారుకుంది.
వంటింట్లో నేను పనిచేసుకుంటుంటే నా కొంగు పట్టుకుని నా వెనకాలే తిరుగుతోంది వైష్ణవి.
‘‘అమ్మా, మనమూ ఒక సుశీలక్కని కొనుక్కుందాం.’’
అదేమంటోందో నాకు వెంటనే అర్థంకాలేదు.
రెండు క్షణాలు ఆలోచించిన మీదట వాళ్ళ డే కేర్‌లో పనిచేసే ఆయా పేరు ‘సుశీల’ అని తట్టింది.
‘‘తప్పమ్మా, మనుషులను కొనుక్కోరు, పనికి పెట్టుకుంటారు.’’
వైష్ణవి మాటల్ని సరిదిద్దాను.
‘‘సరే అయితే, మనం కూడా సుశీలక్కని పనికి పెట్టుకుందాం. అప్పుడైతే మరి...’’
ఇంకా ఏదో చెబుతోంది. ఈలోగా స్టవ్‌ మీద పోపు మాడబోతుంటే గబాల్న స్టవ్‌ ఆఫ్‌ చేశాను.
‘పాపం పిచ్చిపిల్ల, ఇంట్లో పనికి సాయంగా మనిషిని పెట్టుకుంటే అప్పుడు తనతో ఎక్కువ సమయం గడిపేందుకు నాకు వీలవుతుందని దాని ఉద్దేశం కాబోలు. ప్చ్‌, ఆఫీసులోనూ ఇంటిపనులతోనూ బిజీగా ఉండటం వలన పిల్లల కోసం తగినంత సమయాన్ని కేటాయించడం కుదరట్లేదు’ మనసులోనే బాధపడ్డాను.
అయితే నా ఆలోచనలన్నీ తప్పేనని రుజువు చేసింది నా చిన్నారి వైష్ణవి.
‘‘అప్పుడేమో సుశీలక్క మనింట్లో అన్ని పనులూ చేస్తుంది కాబట్టి నువ్వు హ్యాపీగా సోఫాలో కూర్చుని ఏదైనా తింటూ చక్కగా పుస్తకం చదువుకోవచ్చు కదమ్మా’’ చెప్పడం పూర్తిచేసింది వైష్ణవి.
అవాక్కయ్యాను.
నాకు పుస్తకాలంటే ప్రాణం. కారప్పూస, జంతికల్లాంటి స్నాక్స్‌ తింటూ చదువుకోవడం చిన్నతనంనుండీ నాకు అలవాటు. అయితే పెళ్ళి తరవాత అలా తింటూ నేను పుస్తకం చదివిన సందర్భాల్ని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. మా అత్తామామలు బతికున్నంతకాలం నేనేనాడూ పుస్తకాన్ని ముట్టుకున్నదే లేదు.
ఆ తర్వాత మావారు ఆఫీసు పనిమీద ఏ మూడు నెలలకో టూరుకి వెళ్ళినప్పుడు మాత్రమే చదువుకునేందుకు కాసింత సమయం చిక్కుతుండేది నాకు.
నన్నూ నా అలవాట్లనీ మా వైషూ అంతలా గమనిస్తోందని నాకప్పుడే తెలిసింది.
‘‘ఈ అమ్మ మీద ఎందుకురా నాన్నా నీకింత ప్రేమ?’’
కళ్ళల్లో నీరు చిప్పిల్లుతుండగా వైషూని దగ్గరికి తీసుకున్నాను.

*           *          *

స్కూలు నుండి తిరిగొచ్చిన నా చిన్నకూతురు శాంభవి ‘అమ్మా’ అంటూ నా మెడచుట్టూ చేతులు వేయడంతో జ్ఞాపకాల దారం పుటుక్కున తెగింది.
‘‘డ్రెస్‌ మార్చుకుని రామ్మా, నీకిష్టమని పెసర పుణుకులు చేశాను- తిందువుగానీ.’’
నా బుగ్గమీద ముద్దు పెట్టుకుని స్కూలు డ్రెస్‌ మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళింది శాంభవి.

*           *          *

నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే వైష్ణవిని పైఊళ్ళో ఉన్న మెడికల్‌ కాలేజీలో చేర్పించి దగ్గరుండి హాస్టల్లో దిగబెట్టి వచ్చారు మావారు.
ఆపైన మూడేళ్ళకి శాంభవి ఇంటర్‌ పూర్తిచేసి దుర్గాపూర్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ సీటు తెచ్చుకోవడంతో దాన్ని అక్కడి హాస్టల్లో చేర్పించాం.
పిల్లలు ఇంట్లో ఉన్నంతకాలం వడివడిగా పరిగెత్తిన కాలం ఇప్పుడేమో నత్తనడకలు నడుస్తోంది.
ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక సంవత్సరంపాటు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని ఎమ్మెస్‌లో సీటు తెచ్చుకుంది వైష్ణవి. ఎమ్మెస్‌ చివర్లో ఉండగా శ్రీకర్‌ అనే కుర్రాడిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి మాకు పరిచయం చేసింది. కులాలు ఒకటే కావడంతో ఇరువైపులా ఏ విధమైన అభ్యంతరాలూ లేకపోయాయి.
ఎమ్మెస్‌ పూర్తవగానే వైష్ణవి పెళ్ళి జరిపించాం. అది సుఖంగా కాపురం చేసుకుంటుంటే చూసి సంతోషించాం.

*           *           *

బీటెక్‌ తర్వాత గేట్‌ పరీక్ష రాసి ఐఐటీ చెన్నైలో ఎంటెక్‌లో చేరింది శాంభవి. ఎంటెక్‌ పూర్తవుతుండగానే క్యాంపస్‌ సెలక్షన్‌లో టెక్సాస్‌ కంపెనీలో మంచి ప్యాకేజీతో దానికి ఉద్యోగం వచ్చింది.
ఇక పెళ్ళి సంబంధాలు వాకబు చేద్దామనుకుంటుండగానే తన క్లాస్‌మేట్‌ సుహాన్‌, తనూ ప్రేమించుకుంటున్నట్లుగా చెప్పింది శాంభవి.
నేనడిగేలోగా తనే చెప్పేసింది అతనిది వేరే కులమని.
‘‘శాంభీ, కులాలు వేరైనప్పుడు- అలవాట్లూ సంప్రదాయాలూ అన్నింట్లోనూ తేడాలుంటాయమ్మా. వాళ్ళు మాంసాహారులు, మనమేమో ఫక్తు శాకాహారులం. వాళ్ళకీ మనకీ ఏ విషయంలోనూ పొసగదు.
నా మాట విని ఆ అబ్బాయిని మర్చిపో. మనకి తగిన చక్కటి కుర్రాడిని మన కులంలోనే చూసుకుందాం’’ అన్నాను.
నావైపు చురుగ్గా చూసింది శాంభవి.
‘‘ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఈ కాలంలో కూడా కులాలూ శాఖలూ ఏంటి? షిట్‌... నాన్నా మీరెప్పుడూ అంటుంటారే ‘మీ అమ్మ ఉద్యోగం చేస్తోందన్నమాటేగానీ లోకజ్ఞానం బొత్తిగా శూన్యం, ఒట్టి సత్తెకాలపు మనిషి, కూపస్థమండూకం’ అని. అప్పట్లో మీ మాటలు నాకర్థంకాలా. కానీ, ఇప్పుడు తెలుస్తోంది... మీరు చెప్పింది నూరు శాతం కరెక్ట్‌. అమ్మతో అయ్యే పనికాదుగానీ, నాన్నా... మీరే పూనుకుని ఎలాగైనా మా పెళ్ళి జరిపించాలి ప్లీజ్‌.’’
అక్కలాగే తనూ తల్లిని ఈసడిస్తూ నాన్న మద్దతుని కోరింది శాంభవి.
‘‘మీ అమ్మవన్నీ పాత చింతకాయపచ్చడి భావాలని నీకిప్పటికైనా తెలిసినందుకు చాలా సంతోషం కన్నా. నువ్వేం దిగులుపడకు, నీ పెళ్ళి నీకిష్టమైన వాడితో నేను దగ్గరుండి జరిపిస్తానుగా.’’
ఎప్పటిలాగే నాపై వ్యంగ్యాస్త్రాలని విసురుతూ కూతురికి హామీ ఇచ్చారాయన.
వాళ్ళ నాన్న చేతులు పట్టుకుని గట్టిగా ఊపి మరీ థ్యాంక్స్‌ చెప్పి, నా మానానికి నన్ను ఒంటరిగా హాల్లో వదిలేసి ఆనందంగా కూనిరాగం తీసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శాంభవి.
ఆరేళ్ళకిందట దుర్గాపూర్‌ ఎన్‌ఐటీలో దాన్ని చేర్పించినరోజు కళ్ళనీళ్ళు పెట్టుకున్న దృశ్యం గుర్తొచ్చింది.
నా ప్రమేయం లేకుండానే నా మనసు గతంలోకి జారుకుంది.

*             *           *

ఆరోజు దాన్ని దుర్గాపూర్‌లో హాస్టల్లో చేర్పించి మేము తిరుగు ప్రయాణమవు తుండగా దిగాలుగా నా ఒళ్ళో తల పెట్టుకుంది శాంభవి.‘‘పిచ్చిపిల్లా, ఒక్కదానివీ ఉండాలని బెంగపెట్టుకున్నావా? ఇలా చూడు, ఇక్కడంతా నీ వయసువాళ్ళేగా, రెండు రోజుల్లో అంతా ఫ్రెండ్సవుతారు. హాస్టల్లో అక్కయ్య హ్యాపీగా ఉండటంలా’’ ప్రేమగా దాని వెన్ను నిమిరాను.

‘‘అది కాదమ్మా, నేనూ అక్కా ఇద్దరం లేకపోతే ఇంట్లో నువ్వెంత ఒంటరిగా ఉంటావోనన్న విషయం తలచుకుంటేనే బాధేస్తోందమ్మా.’’ దాని మాటలకి నా కళ్ళల్లో ఊరబోతున్న ధారని బైటకి రాకుండా అదిమేశా.

‘‘ఈ అమ్మ గురించి ఇంతలా ఆలోచించే బంగారుతల్లివి నువ్వుండగా నాకు ఒంటరితనమేమిటి కన్నా!?’’ దాన్ని దగ్గరికి తీసుకుని ఓదార్చాను.

*            *          *

కాలింగ్‌బెల్‌ మోగడంతో నా ఆలోచనలకి అంతరాయం కలిగింది.
లేచి వెళ్ళి తలుపు తెరిచాను. ఎవరో అడ్రస్‌ కోసం వస్తే నాకు తెలిసింది చెప్పి పంపించి లోనికి వచ్చా.
మళ్ళీ శాంభవి గురించిన ఆలోచనలు నా చుట్టూ ముసురుకున్నాయి.
ఆయన వ్యంగ్యాలని పట్టించుకోవడం ఎప్పుడో మానేసినా కళ్ళు అప్పుడప్పుడూ చెమ్మగిల్లుతూనే ఉంటాయి.
చిన్నతనంలో నేను కాసింత మూడీగా ఉంటే చాలు, నా దగ్గరకొచ్చి నన్ను నవ్వించాలని ప్రయత్నించేది శాంభవి.
అది పదేళ్ళ వయసులో ఉండగా- ఆ వేళ ఆదివారం. లంచ్‌ చేశాక తీరిగ్గా కూర్చుని టీవీలో సినిమాని చూస్తున్నామంతా. సినిమాలో ఏదో పెళ్ళి దృశ్యం వస్తుంటే శాంభవి పెద్ద పెద్ద కళ్ళని విప్పార్చుకుని
మరీ చూస్తోంది. కిందటి నెలలోనే దానికి ఆరు నిండి ఏడేళ్ళు వచ్చాయి. దాని చిట్టిబుర్ర నిండా ప్రశ్నలే.
‘‘అమ్మా, అసలు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? ఈ అబ్బాయికీ ఈ అమ్మాయికీ పెళ్ళి చేయాలని ఎలా తెలుస్తుంది?’’
దాని వయసుకి అర్థం అయ్యేట్లుగా చెప్పడానికి నేను కొద్దిగా ఆలోచించవలసి వచ్చింది.
‘‘అమ్మాయి అమ్మానాన్నలు అబ్బాయి వాళ్ళింటికి వెళ్ళి ‘మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూసి వెళ్ళండి’ అని పిలుస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి నచ్చిందని చెబుతారు. ఇంకేముందీ, అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలు ‘ఈ అబ్బాయి మంచోడేనా’ అంటూ తెలిసిన వాళ్ళందరినీ అడిగి, వాళ్ళంతా ‘ఔను, వీడు మంచోడే’ అని చెబితే అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేస్తారన్నమాట.’’
పదేళ్ళ పిల్లకి అర్థమయ్యేట్లుగా బాగానే చెప్పాననుకున్నా. అంతలో బుల్లెట్‌లా అది మరో ప్రశ్నని సంధించింది.
‘‘అమ్మా, మరి అమ్మమ్మా తాతయ్యలు ‘నాన్న మంచోడేనా’ అంటూ మీ పెళ్ళికి ముందర అందరినీ అడగలేదా?’’ షాక్‌ అయ్యాను.
తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు లేవనీ తల్లిపట్ల తండ్రి ప్రవర్తన ఉచితంగా లేదనీ అంత చిన్నపిల్లకి కూడా అర్థమయ్యేట్లుగా మా భార్యాభర్తల ప్రవర్తన ఉండటం నాకు సిగ్గుగానూ నామోషీగానూ అనిపించింది.
పదేేళ్ళ పిల్లకి అంత పరిశీలనాశక్తి ఉండటం ఆశ్చర్యమే. ఈకాలం పిల్లలు చాలా చురుకు.
మాతోపాటే టీవీ చూస్తున్న మావారు మా సంభాషణకి చిరాకుపడుతూ టీవీ చానెల్‌ని మార్చేసి బీబీసీ న్యూస్‌ పెట్టారు.

*            *           *

ఫోన్‌ మోగుతుంటే జ్ఞాపకాల నుండి బయటపడి ఫోన్‌ లిఫ్ట్‌ చేశాను.
వైష్ణవి ఫోనులో చెబుతోంది... తనూ వాళ్ళాయనా కొన్నేళ్ళపాటు ఏదైనా పల్లెటూరికి వెళ్ళి అక్కడి ప్రజలకి వైద్య సేవల్ని అందించాలని నిర్ణయించుకున్నామని.
ఒక విధమైన వైరాగ్యంలో ఉన్నానేమో ‘‘మంచిదమ్మా, మీ మనసులకి నచ్చినట్లుగా చేసుకోండి.’’
క్లుప్తంగా చెప్పి ఫోన్‌ పెట్టేశాను.

*          *         *

వారం రోజుల్లో మావారు వెళ్ళి సుహాన్‌ తల్లిదండ్రుల్ని కలిసి పెళ్ళి ముహూర్తం ఖాయం చేసుకొచ్చారు.
శాంభవి పెళ్ళి ఏర్పాట్లన్నీ చురుకుగా జరిగి పోతున్నాయి, నా ప్రమేయమేమీ లేకుండానే.
నెలరోజుల్లో శాంభవి వివాహం జరిగిపోయి అది అత్తవారింటికి వెళ్ళిపోయింది.
ఆపై వారంలో వైష్ణవి, శ్రీకర్‌లు ఏదో చిన్న ఊరికి వెళ్ళి అక్కడ ప్రాక్టీసు మొదలుపెట్టారు.
ఎమ్మెస్‌ చేసిన కూతురూ అల్లుడూ సిటీలోని పెద్ద కార్పొరేట్‌ హాస్పిటల్లో బంగారంలాంటి ఉద్యోగాల్ని వదిలేసి ‘సమాజసేవ’ అంటూ పల్లెటూళ్ళని పట్టుకుని వేళ్ళాడటం మావారికి బొత్తిగా నచ్చలేదు. కానీ పెళ్ళి చేశాక ‘వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం కదా’ అనుకుని సరిపెట్టుకున్నారు.
జీవితం ఒక రకమైన రొటీన్‌లో స్తబ్దుగా నడుస్తోంది.
‘‘అమ్మ, నిన్ను ఈమధ్యన బాగా తలచుకుంటోంది అక్కా, ఒకసారి వచ్చి వెళ్ళకూడదూ’’ తమ్ముడు ఫోన్‌లో చెప్పడంతో ఆలోచనలోపడ్డాను.
ఆఫీసు పనిమీద ఆస్ట్రేలియా వెళ్ళిన మావారు తిరిగొచ్చేందుకు ఎలాగూ మరో రెండు వారాలు పడుతుంది కదాని ఆఫీసుకి లీవ్‌ పెట్టి అమ్మ దగ్గరికి ప్రయాణమై వెళ్ళాను.

*         *        *

‘‘ఇలా చిక్కిపోయావేమిటి అమ్మడూ?’’ ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుంది అమ్మ.
కన్నతల్లి కళ్ళకి బిడ్డలెప్పుడూ చిక్కినట్లే కనిపిస్తారేమో!
నేనిక్కడికి వచ్చిన వారానికి మా పిల్లలిద్దరూ వీలు చేసుకుని వచ్చారు.
భోజనాలు పూర్తయ్యాక తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నామంతా. అంతలో ఏవో ఫోన్‌ కాల్స్‌ వస్తే మాట్లాడుతూ పిల్లలిద్దరూ దూరంగా బాల్కనీలోకి వెళ్ళారు.
‘‘ఏమిటోనే అమ్మడూ, పిల్లలిద్దరూ నిన్ను ఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టాలన్నీ నాన్నతో చెప్పి నెగ్గించుకున్నారన్న దిగులుతోనే నువ్విలా చిక్కినట్లున్నావు.’’
‘‘అదేంలేదమ్మా. నిజానికి మా పిల్లలకి నాతోనే చనువెక్కువ. ఏ ఒక్కరోజూ నాతో ఫోన్లో మాట్లాడకుండా ఉండరు వాళ్ళు. అన్ని విషయాల్లో నా సలహా అడుగుతుంటారు. నా ఆరోగ్యం, డాక్టర్‌ అప్పాయింట్‌మెంట్స్‌ లాంటివన్నీ దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాదు, బజారు నుండి కూరగాయలతో సహా నాక్కావాలసినవన్నీ వాళ్ళే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పిస్తారు. నిజానికి ఇవేవీ నా పిల్లల నుండి నేనాశించలేదమ్మా. నా సంతోషంకొద్దీ వాళ్ళని నేను కన్నాను. కన్నందుకు ప్రేమగా బాధ్యతగా పెంచాను. అంతే!’’
నా మాటల్ని అమ్మ నమ్మినట్లులేదు.
నేను తనతో మనసు విప్పి మాట్లాడటం లేదనుకున్నట్లుంది. మొహం గంటుపెట్టుకుంది.
ఫోన్‌లో సంభాషణ పూర్తికాగానే పిల్లలిద్దరూ ఇంట్లోకి వచ్చారు.
‘‘ఏమిటి అమ్మమ్మా, అదోలా ఉన్నావు?’’
పిల్లలు అడిగినదానికి అమ్మ ఒక్కసారిగా బరస్ట్‌ అయింది.
‘‘మీమీదే ప్రాణాలు పెట్టుకుని మీ కోసమే బతుకుతున్న అమ్మని నిర్లక్ష్యం చేసి నాన్నతో కుమ్మక్కై అమ్మని తక్కువ చేస్తారా, మీరసలు కన్నబిడ్డలేనా? ఛీ ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరమెత్తుతోంది.’’
ఒక క్షణం బిత్తరపోయినా వెంటనే ముగ్గురం ఫక్కుమని నవ్వేశాం.
అమ్మ అయోమయంగా చూసింది మావైపు.
‘‘పిచ్చి అమ్మా’’ అంటూ అసలు విషయాన్ని అమ్మకి విడమరచి చెప్పసాగాను.
‘‘మావారికి అవధులు లేనంత పురుషాహంకారం. భార్యనైన నన్ను ప్రతిక్షణం చులకన చేయడమూ నేను చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించడమూ... ఈ రెండే ఆయన జీవితలక్ష్యాలు.
ఆయనలో ఉన్న ఆ బలహీనతనే మా బలంగా మార్చుకున్నాం నేనూ నా కూతుళ్ళూ.
మొదటినుండీ నాకు వైష్ణవి మెడిసిన్‌ చదవాలనే ఉండేది. ఆ విషయం చెబితే ఆయన కచ్చితంగా ఇంజినీరింగ్‌ వైపు మొగ్గు చూపుతారు లేదా ఫార్మసీ చదవమంటారు తప్పిస్తే, పొరపాటున కూడా మెడిసిన్‌లో చేర్పించరు. అందుకని మేం ఒక పథకం ప్రకారం ఆయన ఎదుట పిల్లలు నన్ను చులకన చేస్తూ ఆయన మద్దతుని కోరుతున్నట్లుగా నాటకమాడాం.
అది నిజమనుకుని హ్యాపీగా వేరే ఊళ్ళో హాస్టల్లో పెట్టి మరీ దానిచేత మెడిసిన్‌ చేయించారాయన.
చిన్నదాని విషయంలోనూ అదే పద్ధతిని అవలంబించాం. అది ప్రేమించిన సుహాన్‌ మరెవరో కాదు, టెన్త్‌ వరకూ నాతో కలిసి చదివిన నా ప్రాణస్నేహితురాలి కొడుకే! చాలా మంచి కుర్రాడు, మంచి కుటుంబం. అలాగని ఆ పెళ్ళి నాకు ఇష్టమేనంటే ఆయనగారు కులాంతరమంటూ వెంటనే అభ్యంతరం లేవదీస్తారు. అందుకని నేను ఆ పెళ్ళిని వ్యతిరేకించినట్లుగా నటించాను. దాంతో ఆయన సంతోషంగా వాళ్ళ పెళ్ళికి ఓకే చెప్పేసి ఇష్టంగా ఆదర్శంగా పెళ్ళి చేశారు.’’

*            *         *

అసలు విషయం తెలిశాక అమ్మ మనసు తేలికైంది. ఆనందంగా మనవరాళ్ళని దగ్గరికి తీసుకుంది.
అదండీ సంగతి.. ముళ్ళ తీగమీద పడిన చీరని ఎంతో ఓపికతో జాగ్రత్తగా తీయాలి తప్పితే చిరాకుపడి గభాల్న లాగితే చిరిగేది మన చీరే కదా... ఏమంటారు?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.