close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నష్టపోయారా... ఫిర్యాదు చెయ్యండి!

డబ్బు పెట్టి కూరలూ సరుకులూ కొనుక్కుంటాం. వేలల్లో ఫీజులు కట్టి పిల్లల్ని బడికి పంపుతాం. టికెట్‌ కొనుక్కుని బస్సుల్లో రైళ్లలో ప్రయాణిస్తాం. ఫీజు చెల్లించి లాయరు సలహా తీసుకుంటాం, వైద్య చికిత్స పొందుతాం... ఇలా తెల్లవారి లేచిందగ్గర్నుంచీ మనం ఎన్నోసార్లు వినియోగదారు అవతారమెత్తుతాం. ఆ క్రమంలో ఒక్కోసారి మోసపోతాం. వినియోగదారుడే కేంద్రంగా ఇన్ని వ్యాపారాలూ జరుగుతున్నప్పుడు అతడినే మోసం చేయడం తగదంటూ వచ్చిందే వినియోగదారుల రక్షణ చట్టం. ఆ అండ ఉండబట్టే ఈ వ్యాపార ప్రపంచంలో మనం మనగలుగుతున్నాం.

ఊరెళ్లడానికి బస్సెక్కారు. ఏ రేకో తట్టుకుని చీర చిరుగుతుంది. రద్దీగా ఉండి సీటు దొరకదు. తోపులాటలో పర్సు పోతుంది. వేలు పోసి కొన్న ఫోను రెండురోజులకే పనిచేయడం మానేస్తుంది. ఏం చేస్తాం? ‘కర్మ’ అనుకుని మన దురదృష్టాన్ని మనమే తిట్టుకుంటూ ఇంట్లో కూర్చుంటాం. కానీ... వీళ్లు అలా చేయలేదు. వినియోగదారులుగా మనకీ కొన్ని హక్కులున్నాయని గుర్తించారు. జరిగిన నష్టానికి పరిహారం అందుకుని వినియోగదారుల చైతన్యం అంటే ఇదీ... అని చాటిచెప్పారు.

చీర చిరిగింది!
నరసింహారావు, వాణిశ్రీ దంపతులు ఓ పెళ్లికి హాజరవడానికి నల్గొండ నుంచి హైదరాబాద్‌ ప్రయాణమయ్యారు. ఆర్టీసీ లగ్జరీ బస్సెక్కారు. ఆ బస్సు తలుపు దగ్గర ఇనుప రేకు పైకి లేచిఉండటంతో దానికి తట్టుకుని వాణిశ్రీ పట్టుచీర చిరిగింది. ఆ రేకుని సరిచేయమని నరసింహారావు డ్రైవరుకి చెబితే అది డిపోలోని సిబ్బంది పని అని సమాధానమిచ్చాడు. తమలాగా మరొకరు ఇబ్బంది పడకూడదనుకుని నరసింహారావు డిపోకి వెళ్లి మరీ సమస్యను అధికారుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవటంతో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుచేశారు. ఇరుపక్షాల వాదనలూ విన్న ఫోరం ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ బాధితులకు మూడువేల రూపాయల పరిహారం ఇప్పించింది.

సీటు ఇవ్వలేకపోవడమూ...
నీతులు చెప్పడానికే కానీ చెయ్యడానికి కాదా అని ఆర్టీసీనే ప్రశ్నించారు మరో ప్రయాణికుడు నాగేందర్‌. ఆయనకి 64ఏళ్లు. ఓరోజు బస్సులో పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వెళ్లారు. ఎవరూ సీటు ఖాళీ చేయకపోవడంతో ఆయన నిలబడే ప్రయాణం చేయాల్సొచ్చింది. సీనియర్‌ సిటిజెన్స్‌కి సీటు ఇవ్వాలంటూ ఆర్టీసీ సిబ్బందికి అధికారులు 2013లోనే ఒక సర్క్యులర్‌ పంపిన సంగతి గుర్తు చేస్తూ తన అనుభవాన్ని పేర్కొంటూ నాగేందర్‌ ఆర్టీసీకి లీగల్‌ నోటీసు పంపించారు. ఆ సర్క్యులర్‌ని తాము మరోసారి డిపార్టుమెంట్‌లో సర్క్యులేట్‌ చేశామని ఆర్టీసీ సమాధానం ఇచ్చింది. కొన్నాళ్లకి ఆయన మళ్లీ బస్సెక్కారు. ఈసారీ అదే పరిస్థితి. కండక్టర్‌ దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోవటంతో ఆయన ఈసారి డిపార్టుమెంట్‌ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ తనకు కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారం ఇప్పించవలసిందిగా వినియోగదారుల ఫోరానికి వెళ్లారు. బస్సులు రద్దీగా ఉండటం వలన ఆయనే కాక ఇంకా చాలామంది సీనియర్‌ సిటిజెన్లు నిలబడి ఉన్నారనీ అందులో తాము చేయగలిగిందేమీ లేదు కాబట్టి కేసు కొట్టివేయవలసిందిగా ఫోరంని కోరింది ఆర్టీసీ. ‘దీన్ని నాగేందర్‌ ఒక్కరి సమస్యగా కాదు, నిలబడి ప్రయాణించే వాళ్లందరి సమస్యగా చూడాలి. వయోధికులైన ప్రయాణికులకు సీటు ఇవ్వలేకపోవడం ఆర్టీసీ సేవల్లో లోపమే’నంటూ బాధితుడికి రూ.10వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సంస్థను ఆదేశించింది వినియోగదారుల ఫోరం.

రైలైనా అంతే...
పడుకోవడానికి బెర్తులుంటాయి, బాత్రూమూ తదితర సౌకర్యాలుంటాయని దూరప్రయాణానికి రైలుమార్గాన్ని ఎంచుకుంటాం. కానీ మనం అనుకున్నదానికి భిన్నమైన అనుభవం ఎదురైతే..? చెన్నైకి చెందిన గాబ్రియెల్‌ ఓసారి దిల్లీ నుంచి చెన్నైకి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఆయన ఎక్కిన కోచ్‌లో బాత్‌రూములో నీళ్లు రాలేదు. వెళ్లి టీటీఈకి చెబితే తర్వాతి స్టేషన్లో సరిచేయిస్తానన్నాడు. రాత్రంతా సరిచేయించలేదు సరికదా, పొద్దున్న లేచి చూసినా అదే పరిస్థితి. వాష్‌బేసిన్‌లో కూడా నీళ్లు రాకపోవడంతో మంచినీళ్ల సీసాలు కొనుక్కుని వాడుకున్నారు గాబ్రియెల్‌. టీటీఈతో మరోసారి చెప్పి ఆయన దగ్గరున్న ఫిర్యాదుల పుస్తకంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి రాశారు. ఆ తర్వాత రైల్వే అధికారులకు ఈమెయిల్‌ పెట్టారు. దానికి జవాబుగా వాళ్లు రైలు నిర్వహణ బాధ్యత చూసే కంట్రాక్టరుకి రూ.3వేలు జరిమానా విధించామని మెయిల్‌ ఇచ్చారు. అంతేకానీ తాను ఎదుర్కొన్న ఇబ్బందికి వారి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవటంతో గాబ్రియెల్‌ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుచేశారు. అక్కడ రైల్వే అధికారులు ప్లేటు ఫిరాయించారు. రైలు నిర్వహణ భేషుగ్గా ఉందనీ గాబ్రియెల్‌ది తప్పుడు ఫిర్యాదనీ వాదించారు. ఫిర్యాదుల పుస్తకంలో టీటీఈ సంతకాన్నీ అధికారులు ఇచ్చిన ఈమెయిల్‌నీ ఫిర్యాదు సరైనదేననడానికి సాక్ష్యాలుగా చూపించిన ఫోరం గాబ్రియెల్‌కి నష్టపరిహారంగా రూ.10వేలు, మానసిక వేదన కలిగించినందుకు మరో 5వేలు చెల్లించమని రైల్వేని ఆదేశించింది.

చాకొలెట్‌ చేదైంది!
గుంటూరుకు చెందిన అనుపమ ఓ రోజు ఇంటికెళ్తూ రెండు పెద్ద రోస్టెడ్‌ ఆల్మండ్‌ క్యాడ్‌బరీ చాకొలెట్లు కొనుక్కెళ్లింది. ఇంటికి వెళ్లగానే ఒకటి తీసుకుని తిన్న పిల్లలు చాకొలెట్‌ చేదుగా ఉందని చెప్పి ఊసేశారు. దాంతో రెండో చాకొలెట్‌ ప్యాకెట్‌ విప్పిన అనుపమ దానిలోపల బూజు చూసి బిత్తరపోయింది. ఆ చాకొలెట్‌ ఫొటోలు తీసి సదరు కంపెనీకి ఈమెయిల్‌ పెట్టింది. వెంటనే కంపెనీ ప్రతినిధి ఒకరు అనుపమ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఈ విషయంపై నలుగురికీ తెలిసేలా గొడవ చేయవద్దని కోరి, ఆ చాకొలెట్లను తీసుకెళ్లిపోయాడు. అయినా అనుపమకి విషయం మింగుడుపడక తనకు కలిగిన వేదనకు పరిహారం ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. ఫోరం విచారŸణలో చాకొలెట్‌ తయారుచేసిన సంస్థ తరఫు న్యాయవాది అనుపమ పురుగుపట్టినట్లుగా చెబుతున్న చాకొలెట్ల శాంపిల్స్‌ని కోర్టుకు చూపలేదు కాబట్టి ఆమె చెబుతున్నదాన్ని నమ్మలేమని వాదించాడు. మరో పక్క తమ ప్రతినిధి అనుపమ ఇంటికి వెళ్లి శాంపిల్స్‌ తీసుకున్న విషయాన్ని కంపెనీ ఖండించలేదు. దాంతో ఫోరం ఉత్పత్తిదారునే తప్పుబట్టి వినియోగదారు నమ్మకాన్ని వమ్ము చేసినందుకు రూ.50వేలు, ఖర్చుల కింద 5వేలు, చాకొలెట్ల ఖరీదూ చెల్లించమని ఆదేశించింది.

ఐదు నక్షత్రాల హోటల్‌కీ తప్పలేదు...
వినయ్‌, రవీనా అనే యువజంట బంధువు పెళ్లికి గోవా వెళ్లింది. అక్కడో ఐదు నక్షత్రాల హోటల్‌లో బస ఏర్పాటుచేశారు పెళ్లివారు. వేడుక ముగిశాక రాత్రి గదికి తిరిగివచ్చిన వినయ్‌ బాత్‌రూమ్‌లో బొక్కబోర్లా పడ్డాడు. ముఖానికి తీవ్రగాయాలు కావడంతో అతడిని వెంటనే ప్రత్యేక విమానంలో ముంబయి తీసుకెళ్లారు. వినయ్‌ పూర్తిగా కోలుకోవటానికి ఏడాది పట్టింది. హోటల్‌ గదిలోని బాత్‌రూమ్‌ సరిగా లేకపోవటం వల్లే తనకు ప్రమాదం జరిగిందనీ అందుకని తనకు నష్టపరిహారం చెల్లించాలనీ పేర్కొంటూ వినయ్‌ హోటల్‌ యాజమాన్యానికి లేఖ రాశాడు. వాళ్లు జవాబివ్వకపోవడంతో వినియోగదారుల ఫోరానికి వెళ్లాడు. హోటల్‌ గదిలోని ఆ బాత్‌రూమ్‌లోకి వెళ్లాలంటే నాలుగు మెట్లు దిగాలనీ, అందువల్లే తాను పడిపోయాననీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొన్ని సంవత్సరాలుగా హోటల్‌ గదిని వాడుతున్నామనీ ఎప్పుడూ ఎవరికీ ఏమీ కాలేదని వాదించిన యాజమాన్యం వినయ్‌ ప్రమాదానికీ బాత్‌రూమ్‌ నిర్మాణానికీ సంబంధం లేదని పేర్కొంది. బాత్‌రూమ్‌కి సంబంధించిన ఫొటోలను నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం హోటల్‌నే తప్పుపట్టింది. బాత్‌రూమ్‌ నిర్మాణం సురక్షితంగా లేదనీ సపోర్టుగా కట్టిన రెయిలింగ్‌ తక్కువ ఎత్తులో కొంతవరకే ఉందనీ, మెట్లకేమో ఏమాత్రం తడిగా ఉన్నా జారిపోయే నున్నని మార్బుల్‌ ఫ్లోరింగ్‌ వేసి నేలకి పాలిష్‌ చేయని మామూలు రాయి వాడడంతో మెట్లమీంచి జారిపడిన వినయ్‌ ముఖానికి తీవ్రగాయాలయ్యాయనీ పేర్కొంది. వినయ్‌ వైద్యఖర్చులూ నష్టపరిహారం కలిపి రూ. 9,44,000 చెల్లించాల్సిందిగా హోటల్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది.

హోమియో డాక్టరు అల్లోపతి వైద్యం
హోమియో వైద్యులు తాము చదివిన చదువుకు సంబంధించిన మందులు ఇవ్వకుండా అల్లోపతి మందులు ఇస్తే, అది ప్రాణాపాయానికి దారి తీస్తే బాధ్యులెవరు? ఇలాంటి కేసులెన్నో వినియోగదారుల కమిషన్‌ ముందుకు వచ్చాయి. అశ్విన్‌ పటేల్‌ హోమియో వైద్యుడు. జ్వరంతో తన దగ్గరికి వచ్చిన ప్రమోద్‌ వర్మకి వైరల్‌ ఫీవర్‌ అని చెప్పి పెద్ద మోతాదులో యాంటిబయాటిక్స్‌ ఇచ్చాడు. అయినా జ్వరం తగ్గకపోతే టైఫాయిడ్‌ అని మందులు మార్చాడు. రోగి పరిస్థితి విషమించడంతో అప్పుడు మరో ఆస్పత్రికి పంపించాడు. అక్కడికి వెళ్లిన వెంటనే ప్రమోద్‌ మరణించాడు. దాంతో అతడి భార్య వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తన భర్త మరణించాడని ఫోరంలో ఫిర్యాదు చేయడంతో విచారించిన కమిషన్‌ డాక్టరు తన పరిమితులను విస్మరించి రోగిని ప్రాణాపాయ పరిస్థితిలోకి నెట్టినందుకు రూ.3లక్షల నష్టపరిహారం చెల్లించమంది.

ఖాతాలో డబ్బు మాయం
శ్రీనాథన్‌కి యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా ఉంది. ఓరోజు ఆయన ఖాతా నుంచి 5 లక్షల చొప్పున మొత్తం పదిలక్షలు రెండు వేర్వేరు ఖాతాలకి బదిలీ అయినట్లు ఎస్సెమ్మెస్‌ వచ్చింది. తాను చేయకుండా, ఓటీపీ రాకుండా అపరిచిత వ్యక్తుల ఖాతాలకి డబ్బు ఎలా బదిలీ అయిందో అర్థం కాక శ్రీనాథన్‌ వెంటనే బ్యాంకుకి వెళ్లి ఫిర్యాదు రాసిచ్చాడు. పోలీసు స్టేషన్లో కూడా కేసుపెట్టాడు. ఏడాదైనా ఇటు బ్యాంకువారు కానీ అటు పోలీసులు కానీ ఆ నేరం చేసిందెవరో కనిపెట్టలేకపోయారు. దాంతో శ్రీనాథన్‌ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. విచారించిన ఫోరం ఓటీపీ రాకుండా డబ్బు బదిలీ జరిగింది కాబట్టి బ్యాంకులు అనుసరించాల్సిన సురక్షిత విధానంలో ఎక్కడో లొసుగు ఉందని రుజువవుతోందనీ అందువల్ల జరిగిన మోసానికి బ్యాంకే బాధ్యత వహించాలనీ పేర్కొంది. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో తేడా ఉన్నట్లు వినియోగదారు ఫిర్యాదు చేస్తే దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత బ్యాంకుదే కాబట్టి శ్రీనాథన్‌కి వడ్డీ, ఖర్చులతో సహా మొత్తం డబ్బు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

విమానం నిండిపోతే...
ప్రైవేటు సంస్థలో ఉన్నతాధికారులు ముగ్గురు ఓ సమావేశానికి హాజరయ్యేందుకు పారిస్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణానికీ ముందుగానే ఎయిర్‌ఫ్రాన్స్‌ విమానానికి టికెట్లు తీసుకున్నారు. పనైపోగానే ఎయిర్‌పోర్టుకి వచ్చారు. అయితే ఖాళీలేదని వాళ్లని సిబ్బంది విమానం ఎక్కనివ్వలేదు. మరుసటిరోజు విమానంలో వారిని పంపించారు. దాంతో తమ రాక ఒక రోజు ఆలస్యమైనందున ప్రభుత్వంతో ముఖ్యమైన సమావేశానికి అందుకోలేకపోయామనీ దానివల్ల తమ కంపెనీకి రూ.50 లక్షలు నష్టం వచ్చిందనీ పేర్కొంటూ ఆ అధికారులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుచేశారు. టికెట్లు ఓవర్‌బుకింగ్‌ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు చేసే పనే తామూ చేశామనీ, వారికి ఉచిత భోజన, వసతి, టెలిఫోన్‌ సదుపాయాలు కల్పించడమే కాక రూ.50వేలు నగదు కూడా ఇచ్చామనీ ఎయిర్‌ఫ్రాన్స్‌ పేర్కొంది. కన్‌ఫర్మ్‌ అయిన టికెట్లు ఉన్నవారిని ప్రయాణం చేయనీయకుండా అడ్డుకోవడం సంస్థ తప్పేనని పేర్కొంటూ రాష్ట్ర ఫోరం ఆ ముగ్గురు అధికారులకు ఒక్కొక్కరికీ రూ.6,30,000 చొప్పున పరిహారం చెల్లించమని ఆదేశించింది. ఆ తీర్పుపై జాతీయ కమిషన్‌కి వెళ్లింది ఎయిర్‌ఫ్రాన్స్‌. జరిగినదానికి విమానయాన సంస్థే బాధ్యత వహించాలన్న జాతీయ కమిషన్‌ ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు చొప్పున పరిహారం చెల్లించమంది.

వేదనకీ పరిహారం
నాలుగేళ్ల కొడుకుతో ఓ మహిళ ముంబయిలోని బాంద్రా స్టేషన్లో రైలు ఎక్కింది. సురక్షితంగా ఉంటుందని మొదటి తరగతి టికెట్టు తీసుకున్న ఆమె కూపేలోకి వెళ్లి తలుపేసుకుంది. కాసేపటికి తలుపు కొట్టిన చప్పుడైంది. తాను టీటీఈననీ టికెట్‌ పరీక్షించాలనీ అవతలి వ్యక్తి చెబితే తలుపు తెరిచిందామె. చేతిలో కత్తి పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి పిల్లవాడిని చంపేస్తామని బెదిరిస్తూ ఆమెని అరవకుండా చేసి డబ్బూ నగలూ ఫోనూ లాక్కున్నారు. నడుస్తున్న రైలునుంచి దూకేశారు. పట్టపగలు ప్రయాణంలో జరిగిన ఈ దారుణం గురించి ఫిర్యాదు చేద్దామని వెతికితే కంపార్టుమెంటులో ఆమెకు టీటీఈ కన్పించలేదు. తర్వాత స్టేషన్లో దిగి ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నాళ్లైనా వారి దగ్గర్నుంచీ స్పందన లేకపోవటంతో ఆమె వినియోగదారుల ఫోరంకి వెళ్లింది. ‘సురక్షిత ప్రయాణాన్ని హామీ ఇస్తున్నాం’ అంటూ ప్రకటన ఇచ్చి రైల్లో ఆ రక్షణ ఇవ్వలేకపోయిందని సంస్థను తప్పుబట్టిన ఫోరం తీవ్ర మానసిక వేదన అనుభవించిన తల్లీ కొడుకులకు పరిహారంగా రూ.50వేలు, షాక్‌తో డిప్రెషన్‌కి గురైన పిల్లవాడి చికిత్సకు రూ.3వేలు, పోయిన డబ్బు రూ.6000, కేసు ఖర్చుల కింద 5వేలు... మొత్తం 64వేలు రైల్వే శాఖ ఆ తల్లీకొడుకులకు చెల్లించాలని తీర్పుచెప్పింది.

ఫిర్యాదు ఇలా చేయాలి!

తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల వేదికలు చురుగ్గా పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్‌లో మూడు వినియోగదారుల ఫోరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండేసి మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇక ఫిర్యాదు విషయానికి వస్తే డబ్బు చెల్లించి కొనుక్కున్న వస్తువులో/ పొందిన సేవల్లో లోపాలు ఉన్నప్పుడు మొదట సంబంధిత సంస్థ దృష్టికి తేవాలి. వారు న్యాయం చేయకపోతే అప్పుడు ఫోరంలో ఫిర్యాదు చేయాలి. ఓ కాగితం మీద ఫిర్యాదుదారు పేరు, చిరునామా, వృత్తి వివరాలు రాయాలి. తర్వాత ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తున్నామో వారి/సంస్థ వివరాలు రాయాలి. ఫిర్యాదు ఏమిటో పేర్కొంటూ వస్తువు కొన్న/ సేవలు అందుకున్న రసీదు కాపీలనూ లోపాలకు సంబంధించిన ఆధారాలుంటే వాటినీ జతచేయాలి. కలిగిన నష్టం ఎంతో, కోరుతున్న పరిహారం ఏమిటో పేర్కొంటూ చివర సంతకం చేయాలి. జరిగిన నష్టం రూ.20 లక్షల లోపు అయితే జిల్లా ఫోరంలో, 20 లక్షలనుంచి కోటి మధ్య ఉంటే రాష్ట్ర కమిషన్‌లో, కోటికి మించిన కేసులైతే జాతీయ కమిషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఒకచోట న్యాయం జరగలేదనుకుంటే పై కోర్టుకి అప్పీలు చేసుకోవచ్చు. జాతీయ కమిషన్‌ తర్వాత సుప్రీంకోర్టుకీ వెళ్లవచ్చు. సంఘటన జరిగిన రెండేళ్లలోపే కేసు వేయాలి. చట్టప్రకారం కేసు నమోదైన మూడు నెలలలోగా కేసును పరిష్కరించాలి. అయితే వివిధ కారణాల వల్ల కేసుల పరిష్కారం ఆలస్యమవుతున్నా మామూలు కోర్టులంత ఆలస్యం మాత్రం కాదు.

మార్చి పదిహేను వినియోగదారుల రోజు

1962లో మొట్టమొదటిసారి మార్చి 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ వినియోగదారుల హక్కుల గురించి బహిరంగ ప్రకటన చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా మార్చి 15ని ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా జరుపుతున్నారు. ఏటా ఒక ప్రత్యేక థీమ్‌ని ఎంచుకుని ఆ రంగంపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో ఫోన్లూ కంప్యూటర్లూ ఎప్పటికప్పుడు మరింత స్మార్ట్‌గా తయారవుతున్నాయి. అంతర్జాలంతో అనుసంధానమై రకరకాల సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోప్యత, వ్యక్తిగత వివరాలూ లాంటి వాటి విషయంలో భద్రత సమస్యలు తలెత్తితే వినియోగదారుకున్న హక్కులేమిటి అన్న విషయంపై చర్చించాలని ‘ట్రస్టెడ్‌ స్మార్ట్‌ ప్రోడక్ట్స్‌’ అన్నది ఈ ఏడాది థీమ్‌గా ఎంచుకున్నారు.

చివరగా ఒక మాట...
 

దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకున్న శకుంతల నిండుసభలో ఆయన ‘నువ్వెవరో నాకు తెలియదు’ అంటే బిత్తరపోతుంది. నిస్సహాయగా వెనుతిరుగుతుంది. వినియోగదారుడైనా అంతే. కొన్న వస్తువుకు బిల్లు లేకపోతే జరిగిన అన్యాయానికి ఆధారం చూపలేకపోతే వ్యాపారి అడ్డం తిరుగుతాడు. అప్పుడు చట్టం కూడా ఏమీ చేయలేదు. అందుకే- ఏ వస్తువు కొన్నా ఏ సేవలు పొందినా రసీదులు లేదా బిల్లులు భద్రంగా ఉంచితే చట్టాన్ని అండగా చేసుకుని అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు. జరిగిన మోసానికీ పడిన వేదనకీ కూడా పరిహారాన్ని పొందవచ్చు. వినియోగదారుడే రాజని లోకానికి చాటవచ్చు!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.