close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బర్మా... అడుగడుగునా పగోడాలే!

బర్మా... ఆ పేరు వినగానే వేలకొద్దీ బౌద్ధ స్తూపాలూ; భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రతో ముడిపడి ఉన్న మాండలే జైలూ, దేశ బహిష్కార శిక్షతో రంగూన్‌లో మరణించిన చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌షా, నాణ్యమైన టేకు, ముత్యాలు, పచ్చలు, కెంపులూ... ఇలా చాలానే గుర్తొస్తాయి.  అటు సాంస్కృతిక, చారిత్రక విశేషాలకీ ఇటు వర్తక వాణిజ్యాలకీ పేరొందిన ఒకనాటి బర్మా- నేటి మయన్మార్‌-ను సందర్శించి, ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన నున్నా వేణుగోపాలరావు.

టేకు అనగానే ఠక్కున బర్మా పేరే స్ఫురిస్తుంది. నాణ్యమైన కెంపులు, ముత్యాలు, పచ్చలకీ బర్మా ప్రసిద్ధి. అందుకే బర్మాను చూడాలన్న కోరికతో బ్యాంకాక్‌ మీదుగా మయన్మార్‌కి చేరుకున్నాం. పలు రాజవంశాల పాలనలో, భిన్న సంస్కృతులతో విలసిల్లిన బర్మా రెండో ప్రపంచయుద్ధంలో బాగా ధ్వంసమైంది. 1948లో ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందినప్పటికీ అంతర్యుద్ధాల వల్ల 1962లో సైనికపాలన మొదలై అది 2011లో అంతమైంది. సైనిక పాలనలో ఉండగానే బర్మా పేరును మయన్మార్‌గానూ, రాజధాని రంగూన్‌ పేరును యాంగన్‌గానూ మార్చారు. రాజధానిని కూడా రంగూన్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని నైపీడా నగరానికి తరలించారు. అధిక సంఖ్యాకులైన బామర్‌ జాతీయులు మాట్లాడే భాష వల్ల అప్పట్లో బర్మాగా పిలిస్తే, మయన్మార్‌ జాతి సంప్రదాయాలను పాటించే సమూహాల వల్ల దీన్ని మయాన్మార్‌గానూ వ్యవహరిస్తుంటారు. దేశ జనాభాలో అత్యధికులు మనవాళ్లు ఉండటంతో భారతీయ సంప్రదాయాలూ అక్కడ కనిపిస్తాయి. కార్తీకపౌర్ణమి రోజున సామూహిక దీపారాధనలూ చేస్తుంటారు.  మేం నేరుగా మాండలే నగరానికి వెళ్లాం. ఇరవాడి నది ఒడ్డున ఉన్న ఈ నగరం, భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రతో ముడిపడి ఉంది. అప్పట్లో బ్రిటిష్‌వారు ఉద్యమకారులను మాండలే నగరానికి తీసుకొచ్చి ఇక్కడి జైల్లో బంధించేవారు. బాలగంగాధర తిలక్‌ను రాజద్రోహం నేరంపై ఆరేళ్లపాటు ఉంచిన మాండలే జైలు ఇక్కడిదే. మేం ముందు రాజభవనం చూడ్డానికి వెళ్లాం.

ఆనాటి రాజభవంతి!
బర్మాలో రాజవంశీకులతో నిర్మితమైన చిట్టచివరి భవనమిది. రాయల్‌ ఎమరాల్డ్‌ ప్యాలెస్‌గా పిలిచే ఈ భవన సముదాయాన్ని అప్పటి రాజు మిండన్‌ మిన్‌ 1857లో నిర్మించాడట. అమరపురలో ఉన్న పాత రాజభవనాన్ని విప్పి, తీసుకొచ్చి మరీ పునర్నిర్మించారు. ప్రాకారం చుట్టూ వెడల్పాటి కందకం ఉంది. ప్రహరీ మీద 48 బురుజులూ 12 రాశులకు గుర్తుగా 12 గేట్లు ఏర్పాటుచేశారు.  ఆవరణలో డజన్లకొద్దీ భవనాలు ఉన్నాయి. అవన్నీ టేకుతో నిర్మించినవే. అయితే బ్రిటిష్‌వారు మాండలే నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో బర్మాలో రాచరికం అంతమైంది. ఆంగ్లేయులు భవనంలోని కళాఖండాలను బ్రిటన్‌కు తరలించి మ్యూజియంలో భద్రపరిచారు. రెండో ప్రపంచయుద్ధంలో ఈ భవనం పూర్తిగా ధ్వంసమైనా 1990లలో పునరుద్ధరించారు. కానీ సంప్రదాయ టేకుతో కాకుండా పాక్షికంగా సిమెంటు, స్టీలు, కాంక్రీటు వంటివీ వాడారు. ఈ రాజభవన సముదాయంలో గస్తీ గోపురం, సుప్రీంకోర్టు భవనం, దర్బార్‌హాలు, సింహాసనం ఉంచిన గది, అద్దాల భవంతి, గోల్డెన్‌ ప్యాలెస్‌ మొనాస్టరీ, రాజకుటుంబీకుల సమాధులు నాటి వైభవానికి అద్దం పడుతున్నాయి.

సందముని గోపురం
మాండలేలోని ప్రధాన బౌద్ధాలయాల్లో సందముని, కుతోడ, మహాముని, సింబియూమ్‌ గోపురాలు చెప్పుకోదగ్గవి. చుట్టూ వందలాది గోపురాలతో మధ్యలో స్వర్ణకాంతులీనే పెద్ద గోపురంతో సందముని పగోడా అందంగా ఉంది. ఈ చిన్న గోపురాల్లో బుద్ధుడి బోధనలు బర్మా లిపిలో చెక్కిన పాలరాతి పలకలు ఉంటాయి. తరవాత బంగారు మెరుపులతో ఉండే కుతోడ గోపురానికి వెళ్లాం. దీన్ని ‘ప్రపంచపు అతిపెద్ద పుస్తకం’గా అభివర్ణిస్తారు. సందముని పగోడాలోకన్నా అత్యధికంగా బుద్ధుడి బోధనలను 729 పాలరాతి పలకలమీద చెక్కించడంతో ఆ పేరు వచ్చింది. ఈ స్తూపం ప్రధాన ద్వారం లతలు, జంతువులు, దేవతాబొమ్మలతో బంగారువర్ణంతో ఎంతో అందంగా ఉంది. 1885లో బ్రిటిష్‌ సైన్యం మాండలేను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ పగోడాలోని బంగారం, వజ్రాలు, ఆభరణాలతోబాటు పాలరాతి పలకలమీది అక్షరాలపై తాపడం చేసిన బంగారాన్నీ అపహరించారు. ఆ తరవాత బర్మా ప్రజలు ఇచ్చిన విరాళాలతో దీన్ని పునరుద్ధరించి పూర్వవైభవాన్ని తెచ్చారు.

మహాముని గోపురం
మహాముని బౌద్ధాలయంలో ఎత్తైన వేదికమీద భూమి స్పర్శ ముద్రతో సుమారు 6.5 టన్నుల బరువున్న బుద్ధ విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. మహాముని బుద్ధుడు వజ్రాలు, కెంపులు పొదిగిన కిరీటం ధరించి ఉంటాడు. బుద్ధుడు ఒకసారి అరకాన్‌ రాజ్య రాజధాని ధాన్యవాడికి వచ్చినప్పుడు ఆ రాజు బుద్ధుడి బోధనలకు ప్రభావితుడై బుద్ధుడి బొమ్మను తయారుచేయించాలని భావిస్తాడు. రాజుతోపాటు ప్రజలు ఇచ్చిన బంగారం, ఇతర వస్తువులతో జీవం ఉట్టిపడే బొమ్మను రూపొందిస్తారు. బుద్ధుడి స్పర్శతో ఆ ప్రతిమ పవిత్రంగా మారిందట. అప్పటినుంచీ
ఆ విగ్రహాన్ని జీవ ప్రతిమగా భావిస్తారు.  ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఓ భిక్షువు పైకెక్కి బుద్ధుడికి పళ్లు తోమి, ముఖం కడుగుతాడు. ఈ సంప్రదాయాన్ని చూడ్డానికి పలువురు యాత్రికులూ వస్తారు. ప్రాంగణంలో మూడుతలల ఏనుగు, మూడు సింహాలు, రెండు సిపాయిల రూపంలో ఆరు పెద్ద కంచు విగ్రహాలు ఉన్నాయి. 15వ శతాబ్దంలో కంబోడియా యుద్ధ సమయంలో వీటిని అంకోర్‌వాట్‌ దేవాలయం నుంచి తీసుకొచ్చారట. రోగులు ఈ సైనిక బొమ్మలకి శరీరాన్ని ఎక్కడైతే రుద్దుతారో ఆ భాగంలో రుగ్మత నశిస్తుందని ఓ నమ్మకం. అక్కడినుంచి మాండలే నగరానికి ఉత్తరం వైపున ఇరవాడి నది ఒడ్డున ఉన్న సింబియూమ్‌ అనే శ్వేతవర్ణ పగోడా చూడ్డానికి వెళ్లాం. ప్రసవ సమయంలో మరణించిన రాణి జ్ఞాపకార్థం అప్పటి రాజు దీన్ని 1816లో కట్టించాడట. బౌద్ధవిశ్వాసం ప్రకారం- విశ్వానికి కేంద్రకంగా భావించే మేరు పర్వతాన్ని చుట్టి ఉండే ఏడు పర్వత శ్రేణుల నమూనాలో దీని పునాదిని నిర్మించారట. పగోడా సువర్ణ శిఖరం మీద బుద్ధుడి ప్రతిమ ఉంటుంది. శిఖరం పైకి ఎక్కవచ్చు. వీటిని దర్శించుకున్నాక బాలగంగాధర్‌ తిలక్‌ను ఖైదు చేసిన మాండలే జైలుకు వెళ్లాం. కానీ లోపలకు ప్రవేశం లభించలేదు.

బగాన్‌... గోపురాల పంట!
తరవాత పర్యటక రంగానికి కీలకమైన బగాన్‌కు వెళ్లాం. 11-13 శతాబ్దాల్లో ఇక్కడ బౌద్ధాలయాలు, పగోడాలు, మఠాలు దాదాపు పదివేల దాకా ఉన్నాయట. కానీ ఇప్పుడు 2200 వరకూ మాత్రమే ఉన్నాయి. దీన్ని కాంబోడియాలోని అంకోర్‌వాట్‌గా భావిస్తారు. నాటి పాలకులూ, సంపన్నులూ కలిసి 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు వెయ్యి స్తూపాలు, పదివేల చిన్న గూళ్లు, మూడువేల మఠాలు నిర్మించారు. విమానం నుంచి విత్తులు చల్లితే అవి అక్కడక్కడా పడి మొక్కలు మొలిచినట్లు ఈ గోపురాల నిర్మాణం ఉంది. ఈ ఆలయాలను ఆకాశం నుంచి చూడ్డానికి హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లు అందుబాటులో ఉన్నాయి. బగాన్‌లో ప్రసిద్ధి చెందిన వాటిలో ఆనందా పగోడా ఒకటి. బంగారుపూత పూసిన గోపుర శిఖరం దీనికి ప్రత్యేక ఆకర్షణ. 11వ శతాబ్దం చివరలో భారత్‌ నుంచి 8 మంది బౌద్ధ భిక్షువులు బగాన్‌కు వచ్చి అప్పటి రాజును కలిశారట. వారు ఆ రాజుతో హిమాలయాల గురించీ అక్కడి గుహాలయం గురించీ చెప్పడంతో ఆయన బగాన్‌లో అటువంటి ఆలయాన్ని కట్టించి, మరెక్కడా అలాంటిది నిర్మించకుండా శిల్పులను ఉరి తీయించాడట.తరవాత ష్వెజిగాన్‌ పగోడాకి వెళ్లాం. వృత్తాకారంలో బంగారు పూత పూసిన స్తూపానికి చుట్టూ చిన్న పగోడాలు నిర్మించారు. ఇందులో బుద్ధుడి దంతం, ఎముక ఉన్నాయట. నలువైపులా బుద్ధుడి కంచు ప్రతిమల్ని ప్రతిష్ఠించారు. తరవాత రాజుకి సులామణి(కెంపు) దొరికిన చోట నిర్మించిన సులామణి పగోడానీ, తిలోమిన్లో రాజు కట్టించిన పగోడాలనీ సందర్శించాం.

రంగూన్‌ నగరంలో...
ఆ మర్నాడు యాంగన్‌గా పేరు మార్చుకున్న రంగూన్‌కి బయలుదేరాం. మొదట్లో ఇది చేపలు పట్టుకొనే చిన్న మత్స్యకారుల గ్రామం. తరవాత బర్మా రాజధానిగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు అక్కడ జనాభా 5 లక్షలు.  సగం మంది భారతీయులే. తరవాత ఈ నగరం బాగా ధ్వంసమైంది. 1857నాటి సిపాయిల తిరుగుబాటును ప్రోత్సహించాడనే ఆరోపణలతో చిట్టచివరి మొఘల్‌ చక్రవర్తి బహదూర్‌ షాకి దేశ బహిష్కార శిక్ష విధించి తరలించిన ప్రదేశం ఇదే. ఆయన ఇక్కడే తన 85వ ఏట మరణించారు.

తరవాత రెండువేల సంవత్సరాలనాటి బుద్ధుడి శిరోజాలు ఉన్నాయని భావించే సులే పగోడాకి వెళ్లాం. అది చూశాక బర్మాలోనే అతి పవిత్రమైన పగోడాగా భావించే శ్వేడగాన్‌ పగోడాని చూశాం. దీని శిఖరాగ్రంలో వజ్రాలూ, కెంపులూ పొదిగి ఉన్నాయి. 2600 సంవత్సరాల పూర్వమే నిర్మించిన ఈ పగోడా ప్రపంచంలోనే అతి పురాతన బౌద్ధస్తూపం. ఆలయం చుట్టూ ఒక్కో వారం పేరుతో బుద్ధ విగ్రహాలు ఉంటాయి. ఏ వారం పుట్టినవాళ్లు ఆ వారం పేరున్న విగ్రహం దగ్గరకు వెళ్లి, ఎన్ని సంవత్సరాల వయసయితే అన్ని చెంబులతో బుద్ధుడిని అభిషేకిస్తే ఆరోగ్యం బాగుంటుందట. 1608లో పోర్చుగీసు సాహసికుడొకరు ఈ ఆలయంలోని 300 టన్నుల బరువైన గంటను కరిగించి ఫిరంగులు చేయించాలని దాన్ని గుడి నుంచి అపహరించి తీసుకెళ్లే క్రమంలో అది బాగా నదిలో మునిగిపోయి, ఇప్పటివరకూ బయటపడలేదట. ఆ తరవాత బ్రిటిష్‌ సైన్యం ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, మధుర స్వరాలను పలికించే 23 టన్నుల కంచుగంటను కోల్‌కతాకు తరలించే ప్రయత్నంలో అది కూడా నదిలోనే పడి మునిగిపోయిందట. అక్కడి నుంచి నేషనల్‌ మ్యూజియానికి వెళ్లాం. ఆభరణాలు, సంగీత పరికరాలు, పురాతన వస్తువులు, శాసనాలు... ఇలా ఒకటేమిటి పురాతన కాలం నుంచీ బర్మా ప్రజల నాగరికతకు సంబంధించినవన్నీ ఆ ప్రదర్శనశాలలోనే పొందుపరిచారు. అవన్నీ చూశాక కౌలాలంపూర్‌ మీదుగా హైదరాబాద్‌కి వచ్చేశాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.