close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరద కావేరి

- వారణాసి రామకృష్ణ

‘‘యాహూ! గూగుల్‌!’’ నందూ గట్టిగా కేక పెట్టాడు.
ఇంతకీ కేకలు ఎందుకు పెట్టాడూ అంటే- జీవితంలో శూన్యం పేరుకుపోయి నిస్తేజం గడ్డలు కట్టి బుర్ర పనిచెయ్యట్లేదు. అయితే ఉన్నట్టుండి మెదడులో ఎల్‌ఈడీ బల్బు వెలిగేసరికి ఒక్కసారిగా అలా అరిచాడు. ఇంతకీ మెదడెందుకు మొరాయించిందీ అంటే- నందూ భార్య కావేరి ఏడవకపోవటం వల్లనే. అవును, మీరు సరిగ్గానే చదివారు. పదిరోజులుగా నందూ పెళ్ళాం కావేరి ఏడవటం లేదు.
ఇదో వర
ల్డ్‌ రికార్డ్‌!

పెళ్ళయిన కొత్తల్లో కావేరి చిన్న చిన్న విషయాలకి ముక్కుచీది ఏడుస్తుంటే నందూకి వింతగా విసుగ్గా అనిపించినా ఇప్పుడామె వెక్కిళ్ళు పెట్టకపోతే వెలితిగా అనిపిస్తోంది. అలవాటయ్యాక పెళ్ళాం ఏడుపు కావేరి నది పరవళ్ళు తొక్కినట్టు పరవశంగా అనిపించేది. ఏదో ఒక కారణంతో ఆమె ఏడవడం చాలా ముఖ్యమని నందూకి బాగా అర్థమైంది. ఈ టైపులో పెళ్ళాం ఏడుపూ అలవాటవుతుందా అని ఏ నరమానవుడికైనా సందేహం కలగొచ్చుగాక! అలవాటనేది ఎంత పవరుఫుల్లో అనుభవంలోకి వస్తేనే అర్థం అవుతుంది. కావేరి ఏడుపు నందూకి - చంటిపిల్లకి తల్లిజోల పాడినట్టూ తాజా బోడిగుండుకి గంధం పట్టించినట్టూ ఆఫీసులో పక్కసీటు రమణి ‘మీరు అచ్చు మహేష్‌బాబుకే బాబులా ఉంటారండీ’ అన్నట్టూ యమా కిక్కు ఇచ్చేది. గత పది రోజులుగా కావేరి కళ్ళమ్మట ధారలుగా కన్నీరు కారక, వెక్కివెక్కి ఏడ్చే ఏడుపు వినిపించక మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. నిస్సత్తువ ఆవహించింది. వామ్మో, విషయం తెలియకపోతే ఎంత పనయ్యేది. సరే, ఇక ఎలాగైనా కావేరి ఓసారి ఏడిస్తే చాలు... తను మామూలు మనిషి అవుతాడు. జీవితం మీద మమకారం పెరుగుతుంది. బ్రెయిన్‌లో అన్నీ సక్రమంగా సరిగ్గా జరుగుతాయి. ‘నందూ, కెమెరా స్టార్ట్‌... యాక్షన్‌!’ అనుకుని ఆఫీసు అయిపోగానే సరాసరి చందన బ్రదర్స్‌కెళ్ళి కావేరి కోసం కొత్త చీర కొన్నాడు. ‘ఇదేంటీ, కొత్త చీర కొంటే పెళ్ళాం నవ్వుతుంది కానీ ఏడుస్తుందా?’ అనే కదూ మీ అనుమానం? నందూ పిచ్చోడేం కాదు. పెళ్ళయిన కొత్తల్లో ఇలాగే కొత్త చీర కొని పట్టుకెళ్తే... చెప్పటమెందుకు? ఆ రోజు ఏం జరిగిందో చదివేద్దాం...

*

‘‘కావేరీ, నీకోసం కొత్త చీరా!’’ చీరకొంగు భుజంమీద వేసుకుని నందూ వయ్యారంగా నిలబడ్డాడు.

కావేరి ఒక్క క్షణం మెరిసే కళ్ళతో చీరని చూసి వెంటనే ట్యాప్‌ తిప్పితే బొటబొటమని నీళ్ళు కారినట్టు కళ్ళల్లోంచి నీళ్ళు కార్చి ‘వా...’ అని నోరెళ్ళబెట్టి ఏడుపు లంకించుకుంది. నందూ బిత్తరపోయి ‘‘ఏమైంది? చీర  నచ్చలేదా?’’ అనడిగితే, వెక్కిళ్ళు ఆపుకుంటూ ‘‘అచ్చు ఇదే కలర్‌ చీర కొనుక్కోవాలని పెళ్ళికి ముందు ఎన్ని షాపులు తిరిగానో!’’ అంటూ వలవలా ఏడ్చింది.

‘‘అయ్యో, అవునా పాపం... అప్పుడు దొరకలేదేమోలే, ఇప్పుడు నేను తెచ్చాగా’’ నందూ చెప్పబోతే గయ్యిమని ఇంతెత్తున లేచి, ‘‘చాల్లే ఊర్కోండి. ఆఖరికి నేనింకేదో చీర కట్టుకుని బర్త్‌డే పార్టీకెళ్తే నా ఫ్రెండు సుశీల కావాలనే ఇదే కలరు చీర పోటీగా కట్టుకుని వచ్చి ఎన్ని పోజులు కొట్టిందో మీకేం తెలుసు?’’ అనేసి మళ్ళీ బావురుమంది.

‘‘అబ్బ, ఎప్పుడో పాత విషయానికి ఇంతలా ఏడవాలా?’’ అనగానే-

మరింత వాల్యూం పెంచి ‘‘నాకంత అవమానం జరిగిందని చెప్తుంటే మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు, హు... మీరు నా శరీరం చూసి చేసుకున్నారు కానీ మనసు కాదు’’ అంటూ శోకాలుపెట్టి ఏడ్చింది. నందూకి కళ్ళు తిరిగి ‘‘అయ్యో రామా, ఈ చీర చూడగానే నీకు నప్పుతుందని తెచ్చానే బాబూ’’ అన్నాడు బుర్ర గోక్కుంటూ.

‘‘అంటే... షాపులో వేరే ఏ చీరలూ నాకు నప్పవనేగా మీ ఉద్దేశ్యం?’’ కావేరి మళ్ళీ రాగం తీసింది.

‘‘ఓరి నాయనోయ్‌, కావేరీ నాకు వేరే ఏ ఉద్దేశాలూ లేవు తల్లో’’ నందూ జుట్టు పీక్కున్నాడు.

‘‘ఎందుకుంటాయి, ఓ చీర కొనేసి పెళ్ళాం మొహం మీద పడేస్తే అది మురిసి ముక్కలైపోయి పాత బాధలన్నీ అణిచేసుకుని పైకి నవ్వాలి, అంతేగా’’ అంటూ రయ్యిమని బెడ్‌రూమ్‌లోకి పరుగెత్తి పరుపు మీద పడి దొర్లిదొర్లి గంటసేపు ఏడ్చింది. ఆ గంటసేపూ నందూ చేతులు పిసుక్కుంటూ గుడ్లు అప్పగించి పెళ్ళాన్ని చూస్తూ ‘తన తప్పు ఎక్కడుందా?’ అని ఆలోచించాడు. మూడ్‌ ఎలా మార్చాలా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాడు.

*

కాబట్టి, ఈ టైపు సంఘటన మళ్ళీ జరిగితే? ఆహా... సూపరు! కొత్త చీర కొనుక్కెళ్ళి హుషారుగా ఎప్పటిలాగే చీర కొంగు భుజం మీద వేసుకుని ‘‘కావేరీ, నీ కోసం కొత్త చీర’’ అన్నాడు నాటకీయంగా.

అయితే కావేరి నిర్లిప్తంగా చూసి ‘‘ఎక్కడ కొన్నారు, ఎంతకి కొన్నారు?’’ అని అడిగింది. చీర చూడగానే ధార ప్రారంభం అనుకుంటే సీను రివర్సు అవటంతో నందూ కంగుతిని అప్పటికప్పుడు కథ అల్లేస్తూ ‘‘మా ఆఫీసులో రమణి లేదూ, తను కొనుక్కుని ‘బావోలేదు, రిటర్న్‌ ఇస్తాను’ అంటే, ‘లేదు లేదూ... కావేరీకి ఈ చీర బావుంటుంది, నేను తీసుకుంటా’ అని తెచ్చా’’ అన్నాడు.

నందూ ఉద్దేశమల్లా ‘రమణి బాలేదు అన్న చీర నీకు తెచ్చాను అంటే, కనీసం రెండు గంటలైనా ఏడుస్తుందనీ, తద్వారా తన మైండ్‌ ఉల్లాసం అవుతుందనీ!’ కానయితే కావేరి కిసుక్కున నవ్వి ‘‘మంచిపని చేశారు. నిజానికి ఈ చీర రమణిగారికంటే నాకే బాగా నప్పుతుంది’’ అంటూ, కొంగు భుజం మీద వేసుకుని మురిసిపోయింది. నందూకి ఒళ్ళు మండిపోయింది.

‘‘నాకైతే పెద్దగా నచ్చలేదు’’ అన్నాడు. అలా అంటే అయినా ఏడుస్తుందని. కానీ, కావేరి ‘‘అలాగా, అయితే ఆవిడకే వాపసు ఇచ్చేయండి’’ అని చెప్పేసి చీర చేతిలో పెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది.

మర్నాడు షాపులో ఇస్తే ‘వాపసు తీసుకోం, కావాలంటే ఇంకో చీర సెలెక్ట్‌ చేసుకోండి’ అన్నారు. ఇదెక్కడి తద్దినం అనుకుని ఏం చెయ్యాలో అర్థంకాక దాన్ని ఆఫీసు డ్రాలో దాచిపెడుతుండగా రమణి చూసి ‘‘అరె, చీర సూపరుంది’’ అంటూ ముచ్చటపడితే, ‘కావేరికి నచ్చలేదని’ చెప్పాడు. ‘‘మీ ఆవిడకి నచ్చకపోతేనేం, నాకు బాగా నచ్చింది సార్‌’’ అంటూ తీసుకుంది.

అమ్మయ్య, ఈ విషయం చెప్తే కావేరి వరదపారటం ఖాయం అనుకుని ఇంటికెళ్ళగానే చెప్పాడు.

అయితే కావేరి పకపకమని నవ్వి ‘‘నాకు ముందే తెలుసు. రమణి మనసు మార్చుకుంటుందని. మీ మగాళ్ళకే తెలీదు, మాకు ఏం నప్పుతాయో. పదండి, భోజనం చేద్దురుగాని’’ అంది.

నందూ లోలోపల తననితాను తిట్టుకున్నాడు. పళ్ళు నూరుకుంటూ లుంగీ కడుతుండగా ఒక ఐడియా శతాబ్ది ట్రెయిన్‌లా బ్రెయిన్‌లోకి దూసుకొచ్చింది. ‘ఆహా, వాటేన్‌ ఐడియా నందూగా! ఈ దెబ్బతో లైఫ్‌ టర్నింగే’ అనుకున్నాడు. ఇంతకీ ఏంటీ అంటే చాలా రోజుల కిందటి భోజనాల ముచ్చట. నందూ నిర్ఘాంతపోయి వరండాలో తన చెంప తనే ఛెళ్ళు ఛెళ్ళున కొట్టుకోటానికి దారితీసిన రసవత్తర ఫన్నీ సన్నివేశం! ఆలస్యమెందుకు, అదేంటో చదివేద్దాం!

*

కావేరి వంటచేస్తే- ఆలూకూరా ఆలూపప్పూ ఆలూపచ్చడీ, కాకరకాయ చేస్తే- కాకర కర్రీ కాకర పులుసూ కాకర పచ్చడీ... ఈ టైపులో యూనిఫాం ఫాలో అవుతుంది. ఆరోజు మెనూలో సొరకాయ చూసి నందూకి నవ్వొచ్చి ‘‘అయితే, ఇవాళ సొరకాయ ‘డే’ అన్నమాట’’ అన్నాడు. ‘డే’ అన్న అక్షరాన్ని వొత్తి పలికి.

కావేరి అర్థంకానట్టు చూస్తే ‘‘సొరకాయ పప్పూ సొరకాయ కూరా సొరకాయ పచ్చడీ, సొరకాయ టింగ్‌... టింగ్‌’’ అంటూ హుషారుగా కంచంలో పప్పు వేసుకున్నాడు. కావేరి మూతి ముడిచి ముభావంగా కూర్చుంది. ‘‘ఇలా అన్నీ ఒకే రకం తినాలి అంటే బోర్‌ కదా కావేరీ’’ పప్పులోకి నెయ్యి వేసుకుంటూ సరదాగా అన్నాడు.

అంతే! వెంటనే కావేరి ట్యాప్‌ తిప్పేసి జలజలమని కన్నీళ్ళు కారుస్తూ ‘‘లింగు లింగుమని మనం ఇద్దరం. మార్కెట్టు నుంచి సొరకాయ తెచ్చి ఒక్క కూర చేస్తే మిగతా ముక్క కుళ్ళి కంపుకొడుతుంది. అందుకే ఇలా చెయ్యక తప్పట్లేదు’’ అంటూ బావురుమంది.
నందూ ఖంగుతిని చిన్న విషయానికి ఏడిపించానే అనుకుని ‘‘అదా కారణం! అయినా ఒక్క సొరకాయతో ఎన్ని వెరైటీలు చేశావు, గ్రేట్‌’’ అని నిజంగానే మెచ్చుకున్నాడు.దాంతో ఇంకా వాల్యూమ్‌ పెంచి వలవలా ఏడ్చింది.

నందూ కొయ్యబారిపోయి ‘‘అయ్యో, నిజంగానే కావేరీ... సొరకాయని ఇన్ని రకాలుగా వండటం నాకు తెలీదు’’ అంటూ ఇంకా వివరంగా మెచ్చుకోబోతే-

‘‘అనండి, అనండి... మీరు ఎన్నైనా అంటారు. ఆఫ్ట్రాల్‌ ఆడది, భర్త ఎన్ని మాటలన్నా పడాలి. అంతా నా ఖర్మ’’ అంటూ ముక్కుచీది చీరకొంగుతో తుడుచుకుంది.

నందూ ఎడమచెయ్యి నెత్తిమీద పెట్టి ‘‘అయ్యో రామా, సత్య ప్రమాణకంగా ఐటమ్స్‌ అన్నీ బావున్నాయి. నువ్వూ తిను, రా’’ అంటూ ప్రేమగా చెయ్యి పట్టుకోబోతే విసురుగా తోసేసి ‘‘హు, మీ వ్యంగ్యంతోనే నా కడుపు నిండిపోయింది’’ అంది కుళ్ళికుళ్ళి ఏడుస్తూ.

నందూకి చిర్రెత్తి ‘‘అబ్బా, ఏదో మామూలుగా అంటే దానికి ఇంత రాద్దాంతం చెయ్యాలా?’’ అన్నాడు.‘‘మీకేం, మీరు మామూలుగా అన్నట్టూ అంటారు, ఆరాలూ తీస్తారు. ఎదుటివాళ్ళని మాటలతో కుళ్ళబొడుస్తారు’’ అంటూ కుహుకుహుమంటూ ఎక్కిళ్ళు పెట్టింది. దాంతో నందూకి బుర్ర తిరిగి అప్రయత్నంగా పళ్ళెం ముందునుంచి లేచాడు.

కావేరి వెంటనే ‘‘తినండి... తినండి, నేను ఎదురుగా ఉంటే ముద్ద దిగట్లేదు కామోసు’’ అనేసి వరండాలోకెళ్ళి బావురుమని పెద్దపెట్టున ఏడవసాగింది.

నందూ తల బాదుకుని కసిగా కంచంలో మజ్జిగ పోసుకుని తాగేసి వరండాలోకి వెళ్ళి ‘‘కావేరీ, నిజంగా చెప్తున్నాను... నిన్ను బాధపెట్టాలనిగానీ వేరే ఏ ఉద్దేశంతోగానీ అలా అనలేదు. సొరకాయపప్పు నిజంగా బావుంది’’ అన్నాడు. కావేరి బుంగమూతి పెట్టి కళ్ళెమ్మట నీరు కారుస్తుంటే పాపం నందూ నలిగిపోతూ ‘‘కావేరీ, ఆకలికి తిక్కతిక్కగా ఉంటుంది. కడుపులో కొంచెం ఏదైనా పడితే మూడ్‌ మారి నవ్వుతూ నువ్వే కమ్మటి కబుర్లు చెప్తావు’’ అన్నాడు.

అది వినగానే మరింత శోకాలుపెట్టి ‘‘అంటే, భోజనం ఎలాగూ కమ్మగా లేదు... కబుర్లయినా కమ్మగా చెప్పమనా?’’ అంటూ గుండెలు బాదుకుంది.

‘ఓరి నాయనోయ్‌, ఇదెక్కడి పెళ్ళాంరా బాబోయ్‌! దీనికి ఒకటి చెప్తే ఇంకోలా ధ్వనిస్తోందేమిటి’ అనుకుని జట్టు పీక్కుని ‘‘అబ్బా, కాదు కావేరీ... వెధవది సొరకాయ గురించి ఇంత గొడవా?’’ కాస్త విసుగ్గా అన్నాడు.‘‘అదిగదిగో ఆ విసుగు చూసి చెప్పచ్చు. ‘హు! మొగుడికింత కమ్మగా వండిపెట్టలేని ఆడదీ ఒక ఆడదేనా’ అని మీకు అసహనం, అంతేనా?’’ అంది.

‘‘కావేరీ, అపార్థం చేసుకుంటున్నావు’’ అంటూ సర్ది చెప్పబోతే,

‘‘కాదు, మిమ్మల్ని కరెక్టుగా అర్థంచేసుకుంటున్నాను’’ అంది ముక్కు చీదుకుంటూ. సహనం నశించిన నందూ పిడికిలి బిగించి తల కొట్టుకుని ‘‘హా రామా, అర్థం చేసుకుంటున్నాను అనుకుని అపార్థం చేసుకుంటున్నావు’’ అని గట్టిగా అరిచాడు.

‘‘లేదు, మీ సంగతి కొత్తల్లోనే గ్రహించా. నేను ఏది కరెక్ట్‌ చెప్పినా రాంగనటం, రాంగ్‌ చెప్తే కరెక్ట్‌ అనటం... అమ్మో అమ్మో, నావల్ల కావట్లేదు బాబూ మిమ్మల్ని అంచనా వెయ్యటం’’ అంటూ కావేరి నది పొంగి ప్రవహించినట్టు కన్నీళ్ళతో ముంచేస్తుంటే నందూ ముద్దముద్దగా తడిసిపోయాడు.

‘‘పెళ్ళిపీటల మీదా ఇంతే మీరు’’ అంటూ అరగంటసేపు కావేరి ఎన్నెన్నో ఉదాహరణలు ఉటంకించి చివర్న- ‘‘బుద్ధి పొరపాటై సొరకాయ తెచ్చాను. వెధవది, దొండకాయలు తెచ్చి ఉంటే ఇంత గొడవ జరిగేదా? అయినా మొగుడి సంపాదన పొదుపు చెయ్యాలన్న బుద్ధి నాకెందుకు చెప్పండి? పొరపాటైపోయింది నందూగారూ, క్షమించండి’’ అంటూ ఫటాఫటా లెంపలు వేసుకుని చరచరా గదిలోకి దూరి ధడేల్‌మని తలుపేసింది.

దాంతో నోటంట మాటరాక నందూ వరండాలో దాదాపు అరగంటపాటు ఉలుకూ పలుకూ మరిచిపోయి నిలబడ్డాడు. బుగ్గమీద దోమలు కుడుతుంటే ఫట్‌ ఫట్‌మని అప్రయత్నంగా చెంపలు వాయించుకున్నాడు.

*

అమ్మయ్య! ‘ఈరోజు ఈ ఐడియా భోజనం దగ్గర ఇంప్లిమెంట్‌ చేస్తే గ్యారంటీగా గగ్గోలుపెట్టి ఏడుపు ప్రారంభిస్తుంది’ అనుకుంటూ- నందూ ఆనందంగా డైనింగ్‌ టేబుల్‌మీది గిన్నెల మూతలు తీసి చూస్తే ఆలూ వేపుడూ టొమాటో పప్పూ కొత్తావకాయా గడ్డ పెరుగూ కనిపించాయి. అన్నీ తనకిష్టమైనవే! పైగా మూతలు తీయగానే వాసనలు ఘుమాయిస్తూ నోట్లో నీళ్ళూరాయి. కానీ, తక్షణ కర్తవ్యం గుర్తొచ్చి లేని గాంభీర్యం తెచ్చిపెట్టుకుంటూ ‘‘కావేరీ, ఈ ఆలూ కర్రీ ఏంటీ... ఇలా తగలడింది’’ అన్నాడు కోపం నటిస్తూ.

కావేరి అవునన్నట్టు తలూపి ‘‘ఏంటో మార్కెట్లో ఈమధ్య దొరికే ఆలూ రుచీపచీ ఉండట్లేదు’’ అంది.

‘‘ఆలూ మంచిది దొరకనప్పుడు కనీసం దాన్ని రుచిగా ఎలా చెయ్యాలో, యూట్యూబ్‌లో చూస్తే తెలుస్తుంది, చూడొచ్చుగా’’ అన్నాడు చిరాగ్గా.

‘‘ఈటీవీ అభిరుచి చూసి చేసినా బేసిగ్గా ఆలూ బాలేకపోతే కర్రీ బావుండదు’’ అంటూ ఆ గిన్నె కాస్తా తీసుకెళ్ళి వంటింట్లో పెట్టేసింది. ఇలా చేస్తుందని ఊహించని నందూ గింజుకున్నాడు.

కావేరి పప్పు వడ్డించి ‘‘కలుపుకొండి, నెయ్యి వేస్తా’’ అంది.

నందూ ఉడుక్కుంటూ ‘రుచిగా ఉండే ఆలూ కర్రీ లాగిద్దామనుకుంటే ఇలా అయ్యిందే’ అని తనని తాను తిట్టుకుని, రెండు ముద్దలు తిని తక్షణ కర్తవ్యం మళ్ళీ గుర్తొచ్చి ‘‘ఈ పప్పూ చండాలంగా ఉంది’’ అన్నాడు రెచ్చగొడుతున్నట్టు.

‘‘ఉందీ, మీకూ అలాగే ఉందా?’’ ఆశ్చర్యంగా అడిగింది.

‘‘అంటే, ముందు నువ్వు తినేశావా?’’ వంక దొరికిందని సంబరపడ్డాడు.

‘‘లేదు, రుచి చూశా. కందిపప్పు - ధర ఆకాశంలో - నాణ్యత పాతాళంలో ఉంది’’ అంటూ మళ్ళీ మరోసారి పప్పు వేసుకోబోతున్న నందూ చేతిలోంచి గరిట లాగేసి ‘‘చారు పోసుకోండి’’ అంటూ కంచంలో చారు పోసేసింది.

నందూకి ఏడుపు తన్నుకొచ్చి ‘‘ఆఖరికి ఈ చారు నీళ్ళా, నా మొహానికి మిగిల్చావు’’ అని మొహం చిట్లించాడు. ‘‘చారు బాగోలేదా?’’ అనుమానంగా చూసింది.

సమాధానం చెప్పకుండా చారు అన్నం లాగించి ‘‘బాగున్నదే ఈ ఒక్క చారు’’ వ్యంగ్యంగా అనేసి మళ్ళీ చారు కలుపుతుంటే-  కావేరి నవ్వి ‘‘చారు బాగా నచ్చినట్టుంది’’ అంది.

‘‘ఆహా సూపరు!’’

కాదంటే ఎక్కడ గిన్నె పట్టుకుపోతుందోనని భయపడి గట్టిగా గిన్నె పట్టుకుని మొత్తం వంపేసుకుని జుర్రేస్తుంటే- కావేరి ‘‘అది నిన్నటి చారు’’ అంటూ ఫక్కున నవ్వింది. నవ్వుతున్న కావేరిని కసిగా చూసి ‘‘నువ్వీమధ్య వంట దరిద్రంగా చేస్తున్నావు. శ్రద్ధ తగ్గింది’’ అన్నాడు కళ్ళూ ముక్కూ చిట్లించి.

కావేరి తల వంచుకుని వేలికొసతో బల్లమీద రాస్తూ మౌనంగా కూర్చుంది. ‘అమ్మయ్య, అమ్మగారు ఇక ఏడుపు ప్రారంభిస్తారు’ అని మనసులో నవ్వుకుంటూ ‘‘మాట్లాడవేంటి? మునపట్లా పనులు శ్రద్ధగా చెయ్యట్లేదు’’ రెట్టించాడు. అయినా ట్యాప్‌ తిప్పలేదు.
బుర్ర గోక్కుని ‘‘నాకైతే రోజురోజుకీ బోరు ఎక్కువైపోతోంది’’ అసహనం నటించాడు. అయినా ఫలితం లేదు. ‘‘మాట్లాడవేంటీ, మౌనవ్రతమా?’’ గట్టిగా నిలదీశాడు.

‘‘కొంచెం నీరసంగా ఉంటోంది. నిజమే. ఏ పనీ శ్రద్ధగా చెయ్యలేకపోతున్నాను’’ అని కావేరి చెబుతుంటే విననట్టు యాక్షన్‌ చేసి... ‘‘ఆఫీసు నుండి ఇంటికి రావాలంటేనే విసుగొస్తోంది’’ అన్నాడు మొహం గంటుపెట్టుకుని తెచ్చిపెట్టుకున్న కోపంతో.

‘‘అవును. మీకలా అనిపించటం సహజమే!’’ వొత్తి చెప్పింది.

ఊహించని జవాబులు రావడంతో ఏం మాట్లాడాలో అర్థంకాక నిలువు గుడ్లేసుకుని ఆలోచిస్తుంటే, ‘‘మీరు రోజూ ఇంటికి రాగానే నీరసంతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, సరైన కంపెనీ ఇవ్వలేకపోతున్నా, రుచిగా వండిపెట్టలేకపోతున్నా. కానీ కానీ...’’ అంటూ అక్కడితో ఆపేసింది. నందూ ఆత్రుతగా చూశాడు. కావేరి తలెత్తి ‘‘అయినా ఈ పరిస్థితి ఎన్నాళ్ళో ఉండదులెండి’’ అంటూ నవ్వింది కావేరి. నందూ ఉడుక్కుంటూ ‘‘ఎందుకని?’’ అరిచాడు.

కావేరి తల దించి చెప్పింది ‘‘నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను.’’

నెత్తిన బాంబుపడ్డట్టు నందూ ఉలిక్కిపడి ‘‘ఏమిటీ, పుట్టింటికా... వెళ్ళిపోతావా?’’ హడలిపోయాడు.

‘‘అవును. బోరు ఫీలయ్యే మీకు పుట్టింటి నుంచి ఓ బుజ్జి పాపాయిని తోడుగా తీసుకురావటానికి’’ అంది నవ్వుతూ.

నందూ ఈ లోకంలో లేడు. బుర్రతిరిగి పడిన పిడుగుదెబ్బకి ఎక్కడో ఉండటంతో విషయం అర్థంకాక ‘‘మీ పుట్టింట్లో బుజ్జి పాపాయిలు ఉంటారా?’’ అన్నాడు అయోమయంగా.

కావేరి సిగ్గుపడి ‘‘చాల్లెండి వేళాకోళం. ఓ బుజ్జిదొస్తే మీ విసుగూ కోపమూ అన్నీ అదే పోగొడుతుంది’’ అనేసి బెడ్‌రూమ్‌లోకి దూరి పరుపు మీద బోర్లాపడి దిండులో మొహం దాచుకుంది. ఈ షాక్‌ నుంచి తేరుకుని, స్పృహలోకి వచ్చి, చెప్పింది అర్థమైనాక ఒళ్ళు ఝల్లుమంది నందూకి. కలలో నడుస్తున్నట్టు గదిలోకి వెళ్ళాడు. ఆనందంతో కళ్ళమ్మట నీరు ధారగా కారింది. కావేరి తలతిప్పి చూసి ‘‘అదేంటి ఏడుస్తున్నారా?’’ అంది ఆశ్చర్యంగా.

నందూ ఒక్కసారిగా బావురుమని ‘‘నన్ను క్షమించు కావేరీ’’ అంటూ తను అనుకున్నదంతా చెప్పేసి ‘‘ఒట్టి మనిషివి కాదని కూడా చూడకుండా ఏడిపించే ప్రయత్నం చేశాను. నువ్వేడిస్తే బుర్ర బాగా పనిచేస్తుందనుకున్నాను’’ అంటూ మళ్ళీ బావురుమన్నాడు. కావేరి నవ్వి ‘‘అయితే నన్ను ఏడిపించాలన్న ధ్యాసలోపడి మీరే ఏడుస్తున్నారన్నమాట’’ అంది.

‘‘ఇవి కన్నీళ్ళు కాదు, నందూగాడి ఆనందబాష్పాలు’’ అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని ‘‘అది సరేగానీ, పెళ్ళయిన కొత్తల్లో ప్రతి చిన్న విషయాన్నీ లాగి పీకి సాగదీసి మరీ ఏడ్చేదానివి, ఎందుకూ?’’ అడిగాడు కుతూహలంగా. ‘‘అమ్మో, సీక్రెట్‌ చెప్పేస్తే ఎట్లా? పెళ్ళయిన కొత్తల్లో మొగుడి రుచుల్నీ అభిరుచుల్నీ టెస్ట్‌ చెయ్యటం కోసం బోలెడన్ని చిట్కాలు ప్రయోగిస్తాం. అవన్నీ చెప్పేస్తే ఎట్లా?’’ కావేరి మాట్లాడక మౌనంగా నవ్వింది.

దాంతో నందూ ఆత్రుతగా ‘‘ప్లీజ్‌ కావేరీ, ఎందుకో చెప్పు?’’ రెట్టించాడు.

‘‘అప్పుడప్పుడూ ఏడిస్తే ఆరోగ్యానికి మంచిదని పక్కింటి పిన్నిగారు చెబితేనూ...’’ నవ్వుతూ దాటేసింది.

‘‘కాదులే, అసలు విషయం చెప్పు’’ ఒత్తిడి చేశాడు.

కావేరి నందూని గట్టిగా హత్తుకుని ‘‘ఇప్పుడు అవసరమా? చూడు బాసూ, ఇకనుంచి ఇంట్లో అలకలూ ఏడుపులూ కన్నీటి వరదలూ అన్నీ బందు. బాధ్యతతో మెలగాలి ఇద్దరం, సరేనా? అర్థమైందా?’’ అంటూ సున్నితంగా చెవి మెలేస్తే నందూ గింజుకుని ‘‘అమ్మో ఎట్లా మరి, నీ ఏడుపు అలవాటయి అది లేకపోతే దిక్కుతోచదే, నిద్రపట్టదే, బుర్ర పనిచెయ్యదే’’ అన్నాడు చిందులు తొక్కుతూ.

ఆ తరవాత చాలాకాలం ఏడుపు వినిపించక గింజుకున్న నందూకి ఓ శుభోదయాన ఏడుపు వినిపించి తన చెవులు తనే నమ్మలేకపోయాడు. ఆనందం పట్టలేక ‘‘యాహూ, ఆపిల్‌, గూగుల్‌’’ అంటూ పిచ్చిగా గంతులు వేశాడు. అయితే ఈసారి గుక్కపెట్టి ఏడుస్తున్నది- కావేరి కాదు,
వాళ్ళ కలల పంట... సావేరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.