close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పల్లెలకెళ్తున్నారు హై-టెక్‌గా!

పల్లెలే పట్టుగొమ్మలు అన్నమాట చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. కానీ ఏ కాస్త చదువుకుని స్థిరపడ్డా నగరంలోనే ఉండిపోతున్నాం. ఉద్యోగమే కాదు వ్యాపారం చేసినా పట్నవాసులనే దృష్టిలో పెట్టుకుని సేవలందిస్తున్నాం. అయితే ఈ మూడు సంస్థలూ అందుకు భిన్నంగా గ్రామీణుల సమస్యలకి హై-టెక్‌ పరిష్కారాలని వెతికిపట్టుకున్నాయి.


 

కల్గుడి డాట్‌ కామ్‌

ఆ మధ్య విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ‘సరస్‌ డ్వాక్రా బజార్‌’ పేరుతో ఓ ఎగ్జిబిషన్‌ జరిగింది. ఇరవై రాష్ట్రాల నుంచి మహిళా సంఘాలు పాల్గొన్న ఈ ఎగ్జిబిషన్‌లో  ‘కల్గుడి’ వెబ్‌సైట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మన మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులన్నీ ఆన్‌లైన్‌లో అమ్మే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ కమ్‌ ఆప్‌ ఇది!
హైదరాబాద్‌కి చెందిన వసుధైక సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ దీన్ని రూపొందించింది. రాజ్‌ వల్లభనేని దీని వ్యవస్థాపకుడు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాలకి ఐటీ ఫలాలని తీసుకెళ్లడమే లక్ష్యంగా చేసుకుంది. కర్ణాటకలోని రైతు బజార్ల కోసం ‘ఐఅగ్రీమార్క్‌’ అనే వినూత్న ఆప్‌ని తయారుచేసి ఇచ్చింది. ధరల నిర్ణయంలో దాదాపు నలభై వేలమంది రైతులకి లబ్ధి చేకూర్చింది. అదే తరహాలో తెలుగు రాష్ట్రాలకి చెందిన రెండులక్షలమంది మహిళా సంఘాల సభ్యురాళ్లు లబ్ధిపొందేలా మూణ్నెళ్ల కిందట కల్గుడిని సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌ సొసైటీ ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ(సెర్ప్‌), గ్రామీణాభివృద్ధి శాఖ, టాటా ట్రస్టుతో కలిసి దీన్ని అభివృద్ధిచేసింది. ‘సెర్ప్‌’ సంస్థ ఇదివరకే అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల సహకారంతో మహిళా సంఘాల ఉత్పత్తుల్ని అమ్మేందుకు ప్రయత్నించినా ఆ సంస్థలు ఆశించినంతగా అమ్మకాలు సాధించిపెట్టలేకపోయాయి. అవి చేయలేని వాటిని కల్గుడి చేసి చూపుతోంది. నవంబర్‌లో ప్రారంభమైన ఈ ఆప్‌ ఇప్పటికే లక్ష రూపాయలకి పైగా అమ్మకాలు సాధించిపెట్టింది!


 

గడపగడపకీ వెళ్లి టెస్ట్‌ చేస్తారు!


మనదేశంలో ఒకప్పుడు ప్లేగు, మశూచి, కలరా వంటి అంటువ్యాధుల కారణంగానే ఎక్కువ మరణాలు చోటుచేసుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పదిమందిలో ఆరుగురు జీవనశైలి(నాన్‌కమ్యూనికబుల్‌/లైఫ్‌ స్టైల్‌) సంబంధిత వ్యాధులతోనే మరణిస్తున్నారని చెబుతున్నాయి గణాంకాలు. అంటే షుగర్‌, బీపీ, హృద్రోగంలాంటివన్నమాట! ముందుగానే వీటిని పసిగడితే చాలావరకూ మరణాలని అడ్డుకోవచ్చు. ఆ పరీక్షలు పట్టణవాసులకి అందుబాటులో ఉన్నంతగా పల్లెజనాలకి ఉండవు! ఉన్నా ఆ ఖర్చుల్ని గ్రామీణులు భరించలేరు. కర్ణాటకకి చెందిన ‘చికిత్సక్‌ లైఫ్‌సైన్సెస్‌’ సంస్థ ఈ సమస్యపైనే దృష్టిపెడుతోంది. ఆ రాష్ట్రంలో పల్లెపల్లెలోని ప్రతి గడపకీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తోంది. సాధారణంగా నగరాల్లోని ఆసుపత్రుల్లో షుగర్‌ టెస్టుకి తక్కువలో తక్కువగా రూ.150 అవుతుంది. కానీ చికిత్సక్‌ సంస్థ షుగర్‌ టెస్టుతోపాటూ ఈసీజీ, బీఎంఐ, హార్ట్‌రేట్‌ అంచనా, ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌... వంటి టెస్టుల్నీ రూ.180లకే చేస్తుంది! పల్లెల్లో ఓ మోస్తరుగా చదువుకున్నవాళ్లని నియమించుకుని వాళ్లకి కొద్దిపాటి శిక్షణ అందించి వాళ్ల చేతే శాంపిల్స్‌ తీయిస్తుంది. ఇందుకోసం వాళ్లకి బ్లూటూత్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతతో పనిచేసే అధునాతన పరికరాలు అందిస్తుంది. వాళ్లు సేకరించినవాటిని నగరాల్లో ఉన్న నిపుణులకి పంపి చాలా తక్కువ సమయంలోనే రిపోర్టులూ అందిస్తోంది. అంతేకాదు... వాటిని డిజిటల్‌గానూ నిక్షిప్తం చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వీలూ కల్పిస్తోంది.


 

పల్లెకూ ఇంగ్లిషు పలుకు!


క్రిష్‌ వర్క్స్‌... హైదరాబాద్‌ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో పురుడుపోసుకున్న(ఇన్‌క్యుబేట్‌) సంస్థ. ప్రస్తుతం పశ్చిమబంగలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తోంది. శుభాజిత్‌ రాయ్‌, కేవీ బాలగోపాల్‌, గార్గి మజుందార్‌, కౌశిక్‌ మజుందార్‌లు క్రిష్‌ వర్క్స్‌ సంస్థ వ్యవస్థాపకులు. గ్రామీణ పిల్లలకి ఇంగ్లిషు చదవడం, మాట్లాడటం, రాయడం నేర్పిస్తుంది క్రిష్‌ వర్క్స్‌ సంస్థ. వీళ్ల పద్ధతి చాలా కొత్తగా ఉంటుంది. ఓ టాబ్లెట్‌ సాయంతో ‘వీడియో గేమ్స్‌’ ద్వారా ఆటపాటలూ, చిన్నచిన్న నాటకాలతో వీటిని నేర్పిస్తారు. ఇందుకోసం ప్రతి గ్రామంలోనూ చదువుకున్న నిరుద్యోగ యువతని గుర్తించి వాళ్లకి శిక్షణ ఇస్తారు. వాళ్ల చేత పల్లెల్లో ‘స్మార్ట్‌ ఇంగ్లిషు ట్రెయినింగ్‌ సెంటర్‌’ పేరుతో డిజిటల్‌ క్లాసురూములు ఏర్పాటుచేయించి పిల్లలకి ఇంగ్లిషు నేర్పిస్తారు. అంటే అటు పిల్లలకి ఇంగ్లిషు నేర్పించడంతోపాటూ గ్రామీణ యువతకి ఉపాధీ అందిస్తారన్నమాట. గత ఏడాది కాలంలో బెంగాల్‌లో 14 కేంద్రాలు ఏర్పాటుచేయించి ఆరువందలమంది పిల్లల చేత చక్కగా ఇంగ్లిషు మాట్లాడిస్తున్నారు!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.