close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జగమంత కుటుంబం ఈయనది!

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కుమారుడి వైద్య ఖర్చులకు చేయూతనివ్వమంటూ ఆయన్ని కలిశాడో పేద తండ్రి. అమ్మాయి చదువుకు సాయం చేయమని ఆయనకి విన్నవించుకుంది కూలి పనిచేసుకునే ఓ తల్లి. తమ గ్రామంలో నిర్మిస్తున్న ఆలయానికి తోడ్పాటు కావాలంటూ ఆయన్ని కోరింది ఓ బృందం. గూడూరు పట్టణంలోని కోట సునీల్‌కుమార్‌ ఇంటికి ఇలా ఎవరో ఒకరు సాయం కోరుతూ వస్తూనే ఉంటారు. ఎంత మంది వచ్చినా వాళ్లని ఖాళీ చేతులతో పంపరాయన... ఎందుకంటే సాయం ఆయన నైజం.

హుద్‌ హుద్‌... 2014లో వచ్చిన ఈ తుపాను ప్రభావానికి విశాఖనగరం చిగురుటాకులా వణికింది. ఆ దృశ్యాల్ని పత్రికలూ, టీవీల్లో చూసిన కోట సునీల్‌కుమార్‌ వెంటనే ఓ ట్రక్కు నిండా ఆహార పొట్లాలూ, నిత్యావసర సరుకులూ, దుస్తులూ పట్టుకుని తన బృందంతో వైజాగ్‌లో వాలిపోయారు. మూడు రోజులపాటు నిరాశ్రయులకు రూ.6.8 లక్షలు విలువచేసే ఆ సరుకుల్ని పంపిణీ చేశారు. గతేడాది కేరళ వరదలపుడు ప్రత్యేక వాహనంలో రూ.7లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుస్తులు, మందుల్ని తీసుకువెళ్లి బాధితులకు అందించారు. 2015లో తన సొంతూరైన గూడూరుని తుపాను ముంచెత్తినపుడు రూ.20లక్షలతో 15 రోజులపాటు నిర్విరామంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 2017 చెన్నై వరదల సమయంలోనూ ఆయన తన వంతు సహాయ కార్యక్రమాలు చేశారు. ఇలా తన ఊరు, రాష్ట్రం అని మాత్రమేకాదు, సాయం ఎక్కడ అవసరమైతే అక్కడ వాలిపోతారు సునీల్‌. ఇవన్నీ తన సంపాదనతో చేస్తారు. దాతృత్వం ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆ కుటుంబం తమ ఇంటి ప్రాంగణంలో కొన్ని దశాబ్దాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తోంది.

పేదల పెన్నిధి
తాత, తండ్రుల మాదిరిగానే సునీల్‌ కూడా సేల్స్‌ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్‌. చదువుకునే రోజులనుంచే సేవా, ఆధ్యాత్మిక బాటల్లో నడుస్తున్నారు సునీల్‌. గూడూరులోని ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లోనే కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వాటికి రక్షణ కంచెలు చేర్పాటుచేశారు. 1996లో ‘కోట అసోషియేషన్‌ ట్రస్టు’ను ప్రారంభించి దానిద్వారా పలు సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఇప్పటివరకూ దీనిద్వారా 43 మంది విద్యార్థుల్ని చదివించారు. ఇంకా చాలామంది విద్యార్థులకు బస్సు పాసులు అందిస్తున్నారు. పలు పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడల్లో చూపుతున్న ప్రతిభను గురించి వారికీ సాయం చేస్తుంటారు. ‘జగమంత కుటుంబం నాది’ అనుకుంటూ చేయూతనిచ్చేందుకు సర్వదా సిద్ధంగా ఉంటారు సునీల్‌. సొంతూరు గూడూరులో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తానున్నానంటారు. తాను చదివిన కళాశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో రూ.2 లక్షలు వెచ్చించి వసతి గృహాన్ని నూతనంగా నిర్మించి ఇటీవల ప్రారంభింపజేశారు.
గతేడాది పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ అభివృద్ధి పనులకు లక్ష రూపాయలు అందించారు. 2016లో రూ.6 లక్షలు పెట్టి వృద్ధులకు వసతి గృహాన్ని నిర్మించారు. ట్రాఫిక్‌ పోలీసుల సౌకర్యార్థం పట్టణంలోని అయిదు ప్రధాన కూడళ్లలో రెండున్నర లక్షలు వెచ్చించి ఐలాండ్‌లు నిర్మించారు. పేద మహిళలకు కుట్టు మిషన్లనీ అందిస్తుంటారు. 2015లో గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామాన్ని దత్తత తీసుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

ఆధ్యాత్మిక పరిమళాలు...
సేవా కార్యక్రమాలతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఎంతో చురుగ్గా పాల్గొంటారు సునీల్‌. 20 ఏళ్ల వయసులోనే శ్రీసాయి సత్సంగ నిలయం ఏర్పాటుచేసి దాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా మలిచారు. 2008లో శ్రీ విజయదుర్గ పీఠాధిపతుల ఆశీస్సులతో స్థాపించిన ‘విజయదుర్గ యువజన సమితి’ ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిత్య హోమం జరిపిస్తున్నారు. అక్కడ ప్రతి ఆదివారం మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలనే బృహత్తర లక్ష్య సాధనకు సునీల్‌కుమార్‌ అవిరళ కృషిచేశారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో పలు దళితవాడల్లో దేవాలయాల్ని నిర్మింపజేశారు. స్థానిక యువకులకే వేదపాఠాలు నేర్పి అర్చకులుగా నియమింపజేశారు. దీనికోసం తితిదే వేద పండితుల ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇచ్చి వందల మందిని అర్చకులుగా నియమించారు.

కేరళ వరద బాధితులకు సాయం అందించడానికి వెళ్లినపుడు... ఆకలితో ఏడిస్తున్న పసికందుకు స్పాంజి సాయంతో బురదనీటిని తాగిస్తున్న ఓ తల్లిని చూసి తనకు పట్టరాని దుఃఖం వచ్చిందని చెప్పే సునీల్‌, ఆరోజు అక్కణ్నుంచే తన సహాయ కార్యక్రమాల్ని మొదలుపెట్టానంటారు. సాయం పొందేవారి కళ్లల్లోని ఆనందం అందించే సంతృప్తికి ఏదీ సాటిరాదని చెబుతారు. బతికినంత కాలం తన సేవల్ని కొనసాగిస్తానని చెప్పే సునీల్‌ యువతలోనూ సేవా స్ఫూర్తిని పెంపొందించేలా తన కార్యక్రమాల్లో వారిని భాగం చేస్తున్నారు.

-  ఓసూరి మురళీకృష్ణ, ఈనాడు నెల్లూరు
ఫొటోలు: రాఘవేంద్ర బాబు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.