close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దీర్ఘాయుష్మాన్‌భవ

నిండునూరేళ్లూ ఆరోగ్యంగా జీవించేందుకు జన్యువుల పాత్ర 25 శాతం అయితే, మిగిలిన 75 శాతం జీవనశైలే కారణం. అందులోనూ ఆహారపుటలవాట్లు అత్యంత కీలకం అంటున్నాయి అనేక పరిశీలనలు.

పండ్లు తినాలి: పండిన పండ్లను ఎక్కువగా తినడంవల్ల అందులోని యాంటీఆక్సిడెంట్ల వల్ల ఆయుఃప్రమాణం పెరుగుతుంది.

మంచినీళ్లు తాగాలి: మంచినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల మూత్రాశయ, పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గడంతోబాటు మూత్రపిండాల పనితీరూ బాగుంటుంది.

శాకాహారం మేలు: మాంసాహారంకన్నా కూరగాయలు తినేవాళ్లలో ఆయుష్షు ఎక్కువ.

కాఫీ, టీ ఫర్లేదు: అసలు కాఫీ తాగనివాళ్లతో పోలిస్తే కాఫీ తాగేవాళ్లలోనే మధుమేహం, క్యాన్సర్లూ పక్షవాతం వచ్చే అవకాశం 15 శాతం తక్కువట.
అది ఇష్టంలేకపోతే గ్రీన్‌ టీ తాగినా మంచిదేనట. ఇది పురుషుల్లో 12 శాతం, మహిళల్లో 23 శాతం ఆయుష్షును పెంచుతుంది.

చక్కెరకి హద్ద్దు: పంచదార ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువట.

మిర్చి మంచిదే: మిర్చిలోని కారం ఆయుష్షును పెంచుతుంది. తగు మోతాదులో దీన్ని ఆహారంలో భాగంగా తింటే ఎండార్ఫిన్లు విడుదలై హానికర ఇన్‌ఫ్లమేషన్‌నీ నొప్పినీ తగ్గిస్తాయి.

ముడిధాన్యం తినండి: దంపుడు బియ్యం, క్వినోవా, బార్లీ... వంటివి తీసుకుంటే ఆయుష్షు పెరిగి మరణాల రేటు తగ్గినట్లు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశీలన. అయితే ఏది తిన్నా నిద్రపోవడానికి రెండు గంటల ముందే ముగించాలి. లేదంటే నిద్రపోయేటప్పుడు క్యాలరీలు కరగకపోవడంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం అదీ పురుషుల్లో మరీ ఎక్కువ. తినేటప్పుడు పొట్ట పూర్తిగా కాకుండా 80 శాతం మాత్రమే నిండేలా అంటే కాస్త వెలితి ఉండగానే భోజనం ముగిస్తే బీపీ, కొలెస్ట్రాల్‌ రాకుండా ఉంటాయి. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇవన్నీ పాటిస్తే నిండునూరేళ్లూ ఆరోగ్యంగా జీవించేస్తారు.


 

తల దురద పుడుతోందా?


కొన్నిసార్లు పేలు లేకున్నా మనం వాడే షాంపూల్లోని రసాయనాలూ లేదా చుండ్రు కారణంగా తల పొడిబారిపోయి ఒకటే దురద పుడుతుంది. ఏమి రాసినా ఓ పట్టాన తగ్గదు. అందుకోసం కొన్ని చిట్కాలు...
* కాస్త ఆలివ్‌ నూనెను తీసుకుని గోరువెచ్చగా చేసి వేళ్లతో బాగా మర్దన చేసినట్లుగా తలకి పట్టించాలి. రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే సాలిసిలిక్‌ ఆమ్లంతో కూడిన మెడికేటెడ్‌ షాంపూతో స్నానం చేయాలి.
* ఓట్‌మీల్‌ను బాగా పొడి చేసి దాన్ని ఓ పలుచని బట్టలో వేయాలి. తరవాత అందులో గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని కదుపుతూ ఏదైనా గిన్నెలోకి ఆ నీటిని వడగట్టాలి. అలా వడగట్టిన నీళ్లని తలంతా పట్టిస్తే మాడు పొడిబారిపోకుండానూ చుండ్రు రాకుండానూ ఉంటుందట.
* ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌లో సహజమైన ఎసిటిక్‌ ఆమ్లం ఉంటుంది. దీనికి యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉండటంతో ఇది తల దురదనీ తగ్గిస్తుందట. ఇందుకోసం ఒక వంతు వినెగర్‌కి ఒకవంతు నీళ్లు కలిపి తలకి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అయితే తలమీద పుండ్లలాంటివి ఉంటే మాత్రం దీన్ని వాడకపోవడమే మేలు.


 

మెదడుకి మందు!


సాధారణంగా పక్షవాతం వచ్చినప్పుడో, ప్రమాదం కారణంగా తలకి దెబ్బ తగిలినప్పుడో లేదా ఆల్జీమర్స్‌ కారణంగానో మెదడు కణాలు దెబ్బతినడంతో వాటి పనితీరుని కోల్పోతాయి. రక్త కణాల మాదిరిగా మెదడు కణాల సంఖ్య తగ్గిపోతే మళ్లీ పునరుత్పత్తి కావడం జరగదు. అయితే పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నాడీకణాల సంరక్షణకి తోడ్పడే గ్లియల్‌ కణాలను కొన్ని మందుల సాయంతో నాడీకణాలుగా మార్చవచ్చు అంటున్నారు. అలా మార్చిన కణాలు సాధారణ నాడీ కణాల మాదిరిగానే పనిచేస్తాయనీ మెదడు నుంచి అన్ని భాగాలకూ సంకేతాలను పంపిస్తాయనీ అంటున్నారు. ఇందుకోసం ఎలుకల్లో చేసిన పరిశోధనల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగంలో మెదడు కణాలను పునరుద్ధరించగలిగారట. కాబట్టి మున్ముందు ప్రమాదవశాత్తూ కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకురావచ్చన్నమాట.


 

గర్భనిరోధానికో  కొత్త ప్యాచ్‌!

గర్భనిరోధం కోసం దంపతులు రకరకాల పద్ధతుల్ని ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కాస్త ఇబ్బందితో కూడుకున్నవే. ఇకనుంచి ఎలాంటి సమస్యలూ లేకుండా అతిసూక్ష్మమైన సూదులతో ఉన్న చిన్న ప్యాచ్‌ను ఒంటిమీద ఐదు సెకన్ల పాటు అతికించుకుంటే చాలు, నెలరోజులవరకూ ఎలాంటి సమస్యా ఉండదని చెబుతున్నారు జార్జియా టెక్‌ పరిశోధకులు. ఈ ప్యాచ్‌లోని లెవొనార్గెస్ట్రెల్‌ అనే మందు చిన్న సూదుల నుంచి చర్మకణాల ద్వారా నేరుగా రక్తంలో కలుస్తుంది. గతంలో యాంటీ బయోటిక్స్‌, ఫ్లూ వ్యాక్సీన్లు, ఇన్సులిన్‌, చర్మ క్యాన్సర్‌ మందులు, కొవ్వును కరిగించే మందుల్ని ఇంజెక్ట్‌ చేయడానికి కూడా ఈ ప్యాచ్‌ను ఉపయోగించి చూశారు. వాటన్నింటికీ ఇది సమర్థంగా పనిచేయడంతో కొత్తగా దీన్ని గర్భనిరోధక మందుకోసం ఎలుకల్లో పరిశీలించి చూడగా అది చక్కగా పనిచేసిందట. దాంతో వీళ్లు త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నారు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.