close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త నిజం

- సాయి ప్రసాద్‌ కస్తూరి

అరచేతిలో ఉన్న నోట్లవైపు చూశాడు సుందరమూర్తి. అన్నీ పది రూపాయల నోట్లు. అప్పటికే అతను ఆ నోట్లను రెండుసార్లు లెక్కపెట్టాడు.చేతిలో ఉన్న బస్సు టికెట్టునీ దానిమీద ఉన్న ధరనూ చూశాక- ‘సందేహం లేదు, కండక్టర్‌ తనకి పది రూపాయలు ఎక్కువ ఇచ్చేశాడు’ అన్న నిర్ధారణకొచ్చాడు సుందరమూర్తి. కొంచెం దూరంలో ఉన్న బస్సు కండక్టర్‌ వైపు దృష్టి సారించాడు. కండక్టర్‌ టికెట్లు ఇస్తూ ప్రయాణీకుల నుండి డబ్బులు తీసుకుంటూ కాస్త బిజీగా ఉన్నాడు.

ఈ టికెట్ల హడావుడిలో కండక్టర్‌ ‘తనకి పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడో లేక ఒక నోటుకి మరోనోటు అంటుకుపోయి ఒక నోటు ఎక్కువ వచ్చిందో ఏమో అనుకున్నాడు’ సుందరమూర్తి.
ఆ నోట్లు జేబులో పెట్టుకోబోతుంటే ఏదో తెలియని ఇబ్బంది అనిపించింది అతనికి. ‘తను చేస్తున్నది కరెక్టేనా?’ అనుకున్నాడు.
‘పది రూపాయలు కండక్టర్‌కి ఇచ్చేస్తేనో..!’ అన్న ఆలోచనని మధ్యలోనే తుంచేశాడు.
‘ఇది చిన్న విషయం. దీనికోసం ఇంత మథనపడటం దేనికి? బస్సుల్లో ఇది మామూలే. కొంతమంది ఉద్యోగులు- ప్రయాణీకులకు చిల్లర ఇవ్వవలసినప్పుడూ చిల్లరలేదని చెప్పినప్పుడూ జరిగే తగాదాలు, కొంతమంది ప్రయాణీకులు చిల్లర వదిలేసి వెళ్ళిపోవడం ఎన్నోసార్లు తను చూశాడు. దీనికోసం ఇంత ఆలోచన అనవసరం.’
సుందరమూర్తి తనని తాను సమాధానపరుచుకుని చేతిలో ఉన్న పది రూపాయల నోట్లను జేబులో పెట్టుకుని సర్దుకుని రిలాక్స్‌డ్‌గా కూర్చుంటూ ఒకసారి కండక్టర్‌ వైపు చూశాడు.
కండక్టర్‌ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు.

*            *         *

సుందరమూర్తి ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. అతని పాండిత్య పటిమా, బోధనా విధానమూ అతనికి మంచి గుర్తింపు తెచ్చాయి. విద్యార్థులు కూడా అతని కలాసంటే ఆసక్తి చూపిస్తారు.
పుస్తక పఠనం మీద ఉన్న ఆసక్తి వల్ల సుందరమూర్తి ఎన్నో గ్రంథాలూ పురాణాలూ అనేక పుస్తకాలూ చదివాడు. అది అతనికి ఎంతో ఉపయోగపడింది.
కొన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలకీ సాహితీ సభల్లో ప్రసంగాలకీ అతన్ని ఆహ్వానిస్తుండేవారు. ఆ సందర్భాల్లో అతను అద్భుతంగా మాట్లాడటం జరిగేది. మానవ బలహీనతల గురించీ పాటించవలసిన విలువల గురించీ చెప్పేవాడు.
అతని భార్య ఆ పాయింటు మీదే తన వాగ్బాణం ప్రయోగించింది.
‘‘మీటింగుల్లో పెద్ద పెద్ద స్పీచులిస్తారు. ‘మానవత్వం కలిగి ఉండాలి, ఒకరికి సాయం చేయడం చాలా గొప్ప విషయం, మనకి ఉపకారం చేసినవారిని మరచిపోకూడదు, ఒకరి డబ్బు ఆశించకూడదు...’ అంటూ చాలా చాలా విషయాలు చెబుతుంటారు. అవన్నీ చెప్పడం వరకేనా...’’
‘‘అరె, అసలు విషయం చెప్పకుండా ఏమిటీ దాడి..!’’
‘‘లేకపోతే ఏమిటండీ... మా బాబాయి ఈ పది రోజుల్లో రెండుసార్లు ఫోను చేసి మీకో పని అప్పచెప్పి మిమ్మల్ని స్వయంగా వెళ్ళి కనుక్కోమన్నాడు. మీరు వాయిదాలు వేస్తున్నారు కానీ గుమ్మం దిగారా?
మన పెళ్ళయిన కొత్తలో మా బాబాయి మనకెంత సహాయం చేశాడు.’’
‘‘నేను ఈరోజే వెళతాను సరేనా’’ అని సుందరమూర్తి భార్య వాక్‌ ప్రవాహానికి అడ్డుకట్టవేశాడు. భార్య ఎత్తిపొడుపులుకన్నా బయలుదేరడమే మంచిదన్న ఉద్దేశ్యంతో పెట్టుకున్న ప్రయాణం ఇది అనుకున్నాడు సుందరమూర్తి.

*            *         *

సుందరమూర్తికి భార్య తనని వేసిన ప్రశ్నలో న్యాయం ఉందనిపించింది.‘చెప్పడానికేనా చేతల్లో ఉండవా!’ అన్నట్టు అడిగింది. చెప్పడం సులువు అన్న విషయం అందరికి తెలిసిందే అయినా తను కూడా దాన్నే అనుసరించినట్టుగా ఉంది. పది రూపాయలకి తను కక్కుర్తిపడటం జరిగింది. మాట్లాడకుండా జేబులో పెట్టేసుకున్నాడు. మనుషుల్లో ఉండే బలహీనతగా దానికి తానేమీ అతీతుడుకాడని సమర్థించుకోవచ్చు కానీ ఆ భావన తన మనస్సుకి అంతగా నచ్చడం లేదు.సుందరమూర్తి ఆలోచనల్ని చెదరగొడుతూ రోడ్డుమీద చిన్నగా కలకలం వినిపించింది.
బస్సు నెమ్మదిగా ఆగింది.
ఏమి జరిగిందా అని ముందుకు చూస్తే అనేక వాహనాలు ఆగి ముందుకు వెళ్ళడానికి వీలులేనట్లుగా జనం గుంపులుగా కనిపించారు. విషయం ఏమిటా అని ఆరాతీస్తే ఏదో రాజకీయ పార్టీ చేస్తున్న ఊరేగింపు సందర్భంగా అలా ట్రాఫిక్‌జామ్‌ అయ్యిందని తెలిసింది.
ఇదంతా వెంటనే క్లియరయి బస్సు బయలుదేరితే తను గమ్యం చేరడానికి కనీసం అరగంట పడుతుంది, లేదంటే ఇంకా ఎక్కువ పడుతుంది అనుకున్నాడు సుందరమూర్తి. బస్సు కిటికీ దగ్గర పళ్ళూ పూలూ తినుబండారాలూ అమ్మే చిల్లర వ్యాపారస్తుల కేకలతో కోలాహలంగా ఉంది. బస్సులో కొంతమంది వాళ్ళ దగ్గర ఏవో కొనుక్కుంటున్నారు.
రోడ్డు మీద హడావుడి కాస్త తగ్గినట్టుగా కనిపించి వాహనాలు బయలుదేరడానికి సిద్ధపడుతున్నాయి. ఇంతలో వెనక సీటులో కూర్చున్న ఎవరో బయట చిల్లర వ్యాపారితో ఒక రూపాయి కోసం గొడవపడి కేకలు వేస్తున్నాడు. ‘‘నీ డబ్బయితే గట్టా... ఇంకొకరి డబ్బులయితే తేరగా తీసుకుంటావా’’ అని, ఒక బూతుమాట జోడించాడు. బస్సు కదిలింది.

*            *         *

ఆ స్టాపులో చాలామంది ప్రయాణీకులు దిగిపోయారు. ఇద్దరు బస్సెక్కారు. బస్సు కొంచెం ఖాళీగా ఉంది. ఇంకో పావుగంటలో తను దిగిపోవచ్చు అనుకున్నాడు సుందరమూర్తి. కండక్టర్‌ కొత్తగా ఎక్కిన ఇద్దరు ప్రయాణీకులకి టికెట్లు ఇచ్చి ఖాళీగా ఉన్న సీటులో రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాడు.
తన సీటులోంచి నెమ్మదిగా లేచి కండక్టర్‌ వైపు నడిచాడు సుందరమూర్తి. అతని రాకని గమనించిన కండక్టర్‌ ‘‘మాస్టారూ, మీ స్టాప్‌ రావడానికి ఇంకా పది నిమిషాలు పైగా పడుతుంది. ఇలా కూర్చోండి’’ అన్నాడు తన పక్కనున్న ఖాళీ సీటు చూపిస్తూ.
సుందరమూర్తి కూర్చుంటూ ‘‘దిగడానికి కాదు, మీకోసం వచ్చాను’’ అన్నాడు. ‘‘నా కోసమా!’’ కండక్టర్‌ ఆశ్చర్యంగా అడిగాడు.
సుందరమూర్తి తలూపి తన జేబులో చెయ్యిపెట్టి డబ్బులు తీయబోతుండగా కండక్టర్‌ అడిగాడు ‘‘మాస్టారూ, ఈమధ్య గుళ్ళో మీ ప్రసంగాలు ఏమీ జరిగినట్లులేదే!’’సుందరమూర్తి జేబులో నుండి తీసిన పది రూపాయల నోటుని చేతిలో పట్టుకుని ‘‘నేను మీకు తెలుసా!’’ అనడిగాడు.
‘‘ఎందుకు తెలీదు మాస్టారూ, మా అబ్బాయి మీ శిష్యుడు.’’ ‘‘మీ అబ్బాయా! పేరేంటి, ఏ క్లాసు?’’ కండక్టర్‌ చెప్పిన వివరాలు విని ‘‘బాగా చదువుతాడు’’ అన్నాడు సుందరమూర్తి. కండక్టర్‌ మొహం వికసించింది.

‘‘మావాడే చెప్పాడు... మీరు పద్యాలు ఎంతో రాగయుక్తంగా పాడతారనీ మీ పాఠం వింటుంటే ఎంతో బాగుంటుందనీ మంచి నడవడిక గురించి చెబుతారనీ అన్నాడు.’’ సుందరమూర్తి ఇబ్బందిగా మొహంపెట్టి ‘‘ఏదో అభిమానంతో మీరు అలా అంటున్నారు కానీ నేను మామూలు ఉపాధ్యాయుణ్ణి’’ అన్నాడు.‘‘లేదు మాస్టారూ, నేను అభిమానంతోనో ముఖస్తుతి కోసమో అలా అనలేదు. మా అబ్బాయి చెప్పిన విషయం నిజమని నాకు కూడా తెలుసు.’’సుందరమూర్తి అతనివైపు అర్థంకానట్టు చూశాడు.
‘‘మీరు ప్రవచనాలు చెప్పడానికి వచ్చే వేణుగోపాలస్వామి గుడికి దగ్గరలోనే మా ఇల్లు. నేను చాలాసార్లు మీ కార్యక్రమానికి వచ్చాను. మీరు చెప్పే అనేక విషయాలు ఉదాహరణలతో చెప్పడం వల్ల మనసుకి చాలా హత్తుకునేవి. నిజాయతీగా ఉండటానికి ప్రయత్నం చేయాలనే ఆలోచన కలిగేది...’’ కండక్టర్‌ చెప్పడం ఆపి అడిగాడు ‘‘నాకోసం వచ్చానన్నారు దేనికి?’’సుందరమూర్తి చేతిలో ఉన్న పది రూపాయల నోటు అతనికిచ్చి ‘‘మీరు ఇందాక పది రూపాయల నోటు ఎక్కువ ఇచ్చారు. అది మీకు ఇవ్వాలని వచ్చాను’’ అన్నాడు.
కండక్టర్‌ అతని చేతిలోని పది రూపాయల నోటు తీసుకుని ‘‘థ్యాంక్స్‌ మాస్టారూ’’ అన్నాడు. సుందరమూర్తి తలూపాడు. ‘‘మీకు రెండోసారి కూడా థ్యాంక్స్‌ చెబుతున్నాను మాస్టారూ’’ అన్నాడు కండక్టర్‌. ‘‘రెండోసారా?’’ అర్థంకానట్టు అడిగాడు సుందరమూర్తి.

‘‘అవును మాస్టారూ, మొదటి థాంక్స్‌- నా పది రూపాయలు నాకిచ్చినందుకు... రెండోది- నా నమ్మకం దెబ్బతిననందుకు.’’‘‘నాకు మీరంటున్నది అర్థంకావడం లేదు.’’‘‘నేనే కావాలని మీకు పది రూపాయలు ఎక్కువ ఇచ్చాను మాస్టారూ.’’
సుందరమూర్తి చకితుడై ‘‘మీరే కావాలని ఎక్కువ ఇచ్చారా... ఎందుకు?’’ అడిగాడు. ‘‘మీరు టికెట్టు తీసుకుంటుండగా నాకు అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ‘విలువల గురించీ నిజాయితీ గురించీ మీరు చెబుతున్నారు కదా! వాటిని మీరు కొంచెమైనా పాటిస్తారా లేదా? లేకపోతే చెప్పడం వరకేనా?’ అన్న భావం కలగడంతో పది రూపాయలు మీకు ఎక్కువ ఇచ్చాను. ఆ డబ్బు మీరు నాకు వెనక్కి ఇచ్చేస్తారని ఏదో గట్టి నమ్మకం.’’ ‘‘మీ పరీక్షలో నేను పాసయ్యానంటారా?’’ ‘‘అయ్యయ్యో, అంతమాట అనకండి. లోకంలో విలువలు పాటిస్తూ కాస్తయినా నిజాయతీగా ఉండే జనం ఉన్నారని నా నమ్మకం. మీరూ అలాంటివారేననీ మీరు చెప్పేది మనస్ఫూర్తిగానే చెబుతారనీ అనుకుంటాను. అందుకే థ్యాంక్స్‌ చెప్పాను. మీరు మరోలా అనుకోకండి.’’

ఇంతలో బస్సు ఆగింది. అది సుందరమూర్తి దిగవలసిన చోటు. అది గమనించిన సుందరమూర్తి సీటులోంచి లేవగానే కండక్టర్‌ అతనితో ‘‘ఏమీ అనుకోకండి మాస్టారూ’’ అన్నాడు.
సుందరమూర్తి ఫరవాలేదన్నట్టుగా చేయి పైకెత్తి కండక్టర్‌తో ‘‘మీ అబ్బాయిని బాగా చదవమన్నానని చెప్పండి. ఆదివారం గుళ్ళో నా కార్యక్రమం ఉంది రండి’’ అంటూ బస్సు దిగాడు. కండక్టర్‌ తలూపాడు. బస్సు కదిలింది.
తను పొరపాటు చేయకుండా వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. దానివల్ల కొంపలేమీ మునిగిపోకపోయినా ఏ కొద్దిమంది ఆలోచనల్లో అయినా మార్పు రావచ్చు. మాటలకూ చేతలకూ పొంతన ఉండాలన్న విషయం అందరికి తెలిసిందే అయినా వేదికల మీద మాట్లాడే తనలాంటివాళ్ళను అతి కొద్దిమంది అయినా గమనిస్తూ ఉంటారన్నది తనకు తెలిసిన కొత్త నిజం. ఈ అనుభవం తనకు- తన ప్రవర్తనను అనుక్షణం గమనించుకుంటూ సరైన దారిలో నడిచేలా ఉపయోగపడుతుంది. సుందరమూర్తి తన మనసులో చెలరేగుతున్న ఆలోచనల్ని పక్కకి తప్పిస్తూ ముందుకు చూశాడు. తను దిగిన బస్సు వెళ్ళిపోతూ కనిపించింది. తను వెళ్ళవలసిన గమ్యంవైపు అతని అడుగులు వడివడిగా పడ్డాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.