close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందానికి ఆముదం!

 

ఆముదమా... అంటూ ముఖం అదోలా పెట్టకండి... చర్మసౌందర్యానికీ శిరోజాల సంరక్షణకి ఆముదం చేసే మేలెంతో అంటున్నారు సౌందర్య నిపుణులు.

* కాలిన లేదా కమిలిన చర్మంమీద ఆముదంలో ముంచిన దూదిని పెట్టి ఓ గంటసేపటి తరవాత కడిగేస్తే త్వరగా తగ్గుతుంది.
* కొంచెం ఆముదాన్ని ఒంటికి పట్టించి మర్దన చేస్తే చర్మంలో సాగే గుణం పెరిగి మృదువుగా తయారవుతుంది. ముఖ్యంగా కళ్లకింద రాస్తే అక్కడి ముడతలు తగ్గి చర్మం మెరుస్తూ వయసుని కనబడనీయకుండా చేస్తుంది.
* రెండు చుక్కల ఆముదాన్ని కాసిని గోరువెచ్చని నీటిలో కలిపి ముఖానికి పట్టించి మృదువుగా మర్దన చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. ఆముదంలోని రిసినోలియాక్‌ ఆమ్లం మొటిమలకి కారణమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది.
* ముఖమ్మీద మచ్చలుంటే రోజూ కాస్త ఆముదంతో అక్కడ రాయడంవల్ల అవి క్రమంగా తగ్గుతాయి. అలాగే గర్భం దాల్చినపుడు వచ్చిన చారలు తగ్గేందుకూ ఇది పనిచేస్తుంది.
* రాత్రిపూట తలకి ఆముదాన్ని పట్టించి బాగా మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల జుట్టు పెరగడంతోబాటు తలలోని ఇన్ఫెక్షన్లూ తగ్గుతాయి. తెల్లబడటమూ తగ్గుతుంది. పైగా ఇది జుట్టుకి కండిషనర్‌లానూ పనిచేస్తుంది.

స్పిరులినా... ఓ నాచుమందు!

సూపర్‌ఫుడ్‌గా ప్రాచుర్యంలోకి వచ్చిన స్పిరులినా నాచు మొక్కలోని పోషకాల గురించి తెలియంది కాదు. ఇప్పుడు ఇది బీపీని సైతం తగ్గిస్తుందని చెబుతున్నారు ఇటలీకి చెందిన వాస్క్యులర్‌ ఫిజియోపాథాలజీ లేబొరేటరీకి చెందిన నిపుణులు. ఇందుకోసం వీళ్లు ప్రయోగపూర్వకంగా నిర్వహించిన పరీక్షల్లో స్పిరులినా తిన్నవారి రక్తనాళాలు వ్యాకోచించి రక్తప్రసరణ సరిగ్గా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు, స్పిరులినా నుంచి సేకరించిన పెప్టైడ్‌ను ఇంజెక్ట్‌ చేయడం వల్ల కూడా రక్తనాళాల గోడల్లో నుంచి నైట్రిక్‌ ఆక్సైడ్‌ విడుదల కావడంతో అవి వ్యాకోచించడాన్ని గుర్తించారు. దాంతో దీన్ని ఆహారంలో భాగంగా చేసుకునేవాళ్లలో బీపీ తగ్గే అవకాశం ఉంది అని చెబుతున్నారు సదరు పరిశోధకులు.

నిద్ర ఎందుకు పట్టడం లేదు?


 

నిద్ర పట్టకపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. అయితే ఎక్కువమంది ఫోన్లూ, ల్యాప్‌ట్యాప్‌ల అధిక వినియోగం వల్ల కళ్లు ఎక్కువసేపు లైటింగ్‌ని చూడటం వల్లే నిద్రలేమికి గురవుతున్నారట. కృత్రిమ కాంతి కారణంగా కంటిలోని రెటీనా వెనకున్న సున్నితమైన కణాలు మెలనాప్సిన్‌ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడంతో అది మెదడుకి చేరి, మేలుకుని ఉండేలా చేస్తుంది. దాంతో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ హార్మోన్‌ విడుదల తగ్గుతుంది. అంటే కళ్లు కాంతికి గురవడంతో ఆ ప్రభావం వల్ల జీవగడియారం సరిగ్గా పనిచేయదు. దాంతో నిద్రలేమి, మైగ్రెయిన్లు రావడంతోబాటు సరిగ్గా ఆలోచించలేకపోవడం, ఊబకాయం, క్యాన్సర్లూ, జీవక్రియా వ్యాధులు వంటివి చోటుచేసుకుంటాయి. అందుకే నిద్రలేమితో బాధపడేవాళ్లు ఓ రెండు గంటల ముందు నుంచీ ఫోన్లూ ల్యాప్‌ట్యాప్‌లూ ఎక్కువసేపు చూడకుండా ఉంటే ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు సాల్క్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు.

మగవాళ్లకే ఎక్కువ!

కుంగుబాటు, ఆందోళన... వంటివి మహిళల నోట ఎక్కువగా వింటుంటాం. కానీ నిజానికి ఇవి ఆడవాళ్లతో పోలిస్తే మగవాళ్లలోనే ఎక్కువ. అందుకే ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. అయితే వాళ్లు ఆ విషయాన్ని చెప్పడానికీ నలుగురితో పంచుకోవడానికీ మొహమాటపడి తమలోనే దాచుకుంటారు. కొందరు కోప్పడటం, చిరాకుపడటం, హింసించడం, హింసించుకోవడం...వంటి చర్యల ద్వారా ఆ సమస్యల్ని బయటపెడుతుంటారు. అందుకే వాళ్లలోనే ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ పేర్కొంటోంది. ముఖ్యంగా ఆకలి లేకపోవడం, శృంగారవాంఛ తగ్గిపోవడం, మద్యానికి అలవాటుపడటం, విచారంగా ఉండటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడటం, నిరాశావాదంతో ఉండటం... వంటి లక్షణాలు ఎవరిలోనయినా కనిపిస్తే సంబంధిత వ్యక్తుల కుటుంబసభ్యులు సమస్యను గుర్తించి వాళ్లకి ఏదో ఒక రకంగా నచ్చజెప్పి వైద్యుల్ని సంప్రదించేలా చేయాలి అని చెబుతున్నారు నిపుణులు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.