close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యువ హృదయాల కోసం జోష్‌

‘పరీక్షలొస్తున్నాయి... రెండేళ్లపాటు చదివినా తరగనంత సిలబస్సుంది’ అని భయపడుతున్నారా? ‘లక్షల రూపాయలు పెట్టి కోర్సు చేసినా ఉద్యోగం అందని మానిపండులా ఉందేంటీ...’  అని ఆందోళన చెందుతున్నారా? మనలోని ఈ భయాందోళనలను పారదోలడమే లక్ష్యంగా రూపొందాయి ఆ వీడియోలు! ఒకప్పుడు మనలాగే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నవాళ్ల స్వీయానుభవాలు అందులో ఉంటాయి. పావుగంట నిడివున్న ఈ వీడియోలని చూస్తే కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉన్న ఆశలు ఉత్సాహాల రెక్కల్ని తొడుగుతాయి. అందుకే, ఆ వీడియోల పేరు ‘జోష్‌ టాక్స్‌’!

కృష్ణారెడ్డి... యువ కాంట్రాక్టర్‌. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర్లోని కుగ్రామంలో కటిక పేదరికంలో పుట్టి ఎంబీఏ చేశాడు. సొంతకాళ్లపైన నిలబడాలనే ఆశతో సివిల్‌ కాంట్రాక్టర్‌ అయ్యాడు. దూకుడుగా దూసుకెళుతూ ప్రభుత్వ కాంట్రాక్టులూ సాధించే స్థితికొచ్చాడు. మూడేళ్లు బాగానే గడిచాయికానీ... చుట్టూ ఉన్న అవినీతి అతని వ్యాపారాన్ని దెబ్బతీసింది. ముప్పై లక్షల రూపాయలు నష్టపోయాడు. అందులో పదిహేను లక్షలదాకా అప్పులు! ముప్పైఏళ్లు నిండని కృష్ణారెడ్డి ఇక ఆత్మహత్యే శరణ్యమనుకున్నాడు. అప్పుడే యాదృచ్ఛికంగా ‘జోష్‌ టాక్స్‌’ యూట్యూబ్‌ ఛానల్‌లో నన్నం తిరుపతిరావు ప్రసంగం విన్నాడు. తిరుపతిరావు కుటుంబానిది పూటగడవని పరిస్థితి. ఏడో తరగతిలోనే చదువు మానేసి ఎలక్ట్రికల్‌ పనులు చేస్తుండేవాడు. ఓసారి రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని అతని కుడికాలు నుజ్జునుజ్జయింది. అసలే పేదరికం... ఆపైన తన వైద్యానికి రోజురోజుకీ పెరుగుతున్న ఖర్చు! తనవల్లే ఇంట్లోవాళ్లకి ఇన్ని కష్టాలు అనుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాలూ చేశాడు. కానీ ఒక్కసారిగా ఏదో మొండిధైర్యం వచ్చింది. ‘బతికి సాధిద్దాం’ అనుకున్నాడు. కాలికి ఏర్పడ్డ గాయం కాస్త కుదుటపడగానే మళ్లీ కూలీకెళ్లాడు. తనలాంటివాళ్లు కరెంటు స్తంభం ఎక్కడంలోని కష్టాల నుంచి బయటపడేయడానికి సరికొత్త క్లైంబర్‌-ని కనిపెట్టాడు. గ్రామీణ ఆవిష్కర్తగా జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. తిరుపతిరావు ఇప్పుడో పారిశ్రామికవేత్త కూడా! అతని ప్రసంగమే కృష్ణారెడ్డిని కదిలించింది. ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేసింది. ఇప్పుడు కాంట్రాక్టర్‌గా కొత్త అవతారమెత్తాడు. ఇదంతా వివరిస్తూ ‘జోష్‌ టాక్స్‌’ సంస్థకి ఓ లేఖరాశాడు. లేఖలే కాదు, జోష్‌ టాక్స్‌ వీడియోల కిందున్న కామెంట్స్‌ బాక్స్‌లో ఇలా ప్రేరణపొందిన అనుభవాలు ఎన్నో చూడొచ్చు.

ఇది లోకల్‌ గురూ! 
ప్రముఖుల ప్రసంగాలని వీడియోతీసి యూట్యూబ్‌లో పెట్టే ఛానళ్లు చాలా వస్తున్నాయిప్పుడు. వాణిజ్య పరిభాషలో ‘ఇంపాక్ట్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌’ అంటున్నారు వీటిని. ‘టెడ్‌ టాక్స్‌’ స్ఫూర్తితో వచ్చిన ఈ యూట్యూబ్‌ ఛానళ్లు ఎక్కువగా ప్రముఖులూ, బిజినెస్‌ టైకూన్‌లచేతే ఈ ప్రసంగాలు చేయిస్తున్నాయి. ఇంగ్లిషు అర్థం చేసుకోగలవారినే లక్ష్యంగా చేసుకుంటాయి. కానీ జోష్‌ టాక్స్‌ ప్రముఖులనే కాకుండా యువతకి స్ఫూర్తినివ్వగల ప్రతి జీవితాన్నీ పరిగణనలోకి తీసుకుంటోంది. వారి భాషలోనే కాదు... వారి యాసలోనే మాట్లాడించి వీడియోలు తీసి తన ఛానల్‌లో పెడుతుంది. పక్కాలోకల్‌ భావన కల్పిస్తోంది. తెలుగుతో పాటు ఇంగ్లిషు, హిందీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, గుజరాతీ, మలయాళం సహా తొమ్మిది భాషల్లో జోష్‌ టాక్స్‌ వీడియోలు రూపొందిస్తోంది. అన్నింటికీ కలిపి 23 లక్షల మంది చందాదారులున్నారు. ఇప్పటిదాకా పది కోట్లమేరకు వీక్షణలు నమోదయ్యాయి. తెలుగులో గత మే నెలలో ప్రారంభమైన జోష్‌టాక్స్‌ ఇప్పటికే ఇరవై లక్షల వీక్షణలనీ... సుమారు 50 వేలమంది చందాదారులనీ సొంతం చేసుకుంది.

వాళ్లదీ అలాంటి కథే...! 
శోభిత్‌ భంగా, సుప్రియా పాల్‌... వీళ్లిద్దరే జోష్‌టాక్స్‌ వ్యవస్థాపకులు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఇద్దరూ సగటు భారతీయ యువతలో ఆత్మన్యూనతకి కారణమైన సాఫ్ట్‌ స్కిల్స్‌ లోపాలకి పరిష్కారంగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతుల చేత ప్రసంగ కార్యక్రమాలు ఏర్పాటుచేయాలనుకున్నారు. 2015లో జోష్‌ టాక్స్‌ని ప్రారంభించారు. ముందు మూడువందలమంది యువప్రేక్షకులతో కార్యక్రమాలు మొదలు పెట్టి ఏడాదిలోనే ఐదువేల మంది హాజరయ్యే భారీ సభలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. వాటిని యూట్యూబ్‌ వీడియోలుగా పెట్టడం ఈ సంస్థ దశని మార్చింది! ప్రసంగాలని వినేందుకు వచ్చే యువకుల నుంచి ఒక్కపైసా తీసుకోకుండా యాడ్స్‌, బ్రాండ్‌ టై అప్‌లతోనే ఆదాయం వచ్చేలా ప్లాన్‌ చేసుకున్నారు. కానీ తొలి ఏడాది పది లక్షలు, తర్వాతి ఏడాది యాభై లక్షలదాకా నష్టం వచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. వీడియోలని ఇతర భాషల్లోకి తీసుకురావడం మొదలుపెట్టడంతో కోట్ల రూపాయల్లో లాభాలు రావడం మొదలయ్యాయి. ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక 2017కి గాను ఉత్తమ స్టార్టప్‌లో ఒకటిగా జోష్‌టాక్స్‌ని ఎంపికచేసింది. ఫోర్బ్స్‌ పత్రిక భారత్‌లోని ‘30 ఏళ్లలోపు స్ఫూర్తిమంతుల జాబితా’లో శోభిత్‌ భంగా, సుప్రియలకి స్థానమిచ్చింది!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.