close
ఈ పక్షి గూళ్లను తింటారు తెలుసా!

పక్షిగూడు... చూడ్డానికి అందంగానే కాదు, రుచిగానూ ఉంటుంది. నమ్మశక్యం కావడం లేదా... కానీ ఇది అక్షరసత్యం. అందుకే ఆ పక్షి గూళ్లని లక్షల రూపాయలు పోసి మరీ కొంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అంతేనా... ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఫుడ్‌ ఏదన్నా ఉందీ అంటే అది ఆ పక్షి గూడేనట. మరి ఆ గూటి కథేంటో కాస్త చూద్దామా...

స్టార్‌ హోటల్‌ షెఫ్‌లు బర్డ్స్‌ నెస్ట్‌ పేరుతో సేమ్యాతో పిట్టగూటిని పోలిన వంటల్ని చేస్తుంటారు. ఇవీ అలాంటివే అనుకునేరు, కానే కాదు. అచ్చంగా పక్షి నోట్లో నుంచి వచ్చిన గూళ్లివి. స్విఫ్ట్‌లెట్‌ జాతికి చెందిన కొన్ని రకాల పక్షుల్లో ఆడామగ పక్షులు సంతానోత్పత్తి కోసం రెండు నెలలు కష్టపడి లాలాజలంతోనే స్వయంగా గూడుని అల్లుతాయి. ఎక్కడో మారుమూల చీకటిగుహల పై భాగంలో పక్షులు పెట్టే ఆ గూటి అల్లిక మనిషి కంట ఎప్పుడు పడిందో తెలీదు కానీ, చైనీయులు వాటితో సూపులు చేసుకుని తాగేస్తున్నారు. ఆనోటా ఈనోటా ఆ రుచీ, అందులోని పోషకవిలువలూ, ఔషధగుణాలూ అంతటా పాకి భూగోళంలోనే ఖరీదైన ఆహారంగా పేరొందింది. నాణ్యతను బట్టి కిలో గూళ్లు మూడు నుంచి ఏడు లక్షల రూపాయల ఖరీదు పలుకుతాయివి.

బోలెడన్ని పోషకాలు 
వంద గ్రాముల గూడు నుంచి 345గ్రా. క్యాలరీలు, 50గ్రా. ప్రొటీన్లూ, 30.6గ్రా. కార్బొహైడ్రేట్లూ, 4.9గ్రా.ఐరన్‌, 2.5 గ్రా. ఇతరత్రా ఖనిజాలూ లభ్యమవుతాయి. పెరుగుదలకి తోడ్పడే అమైనోఆమ్లాలూ, టెస్టోస్టెరాన్‌, ఎస్ట్రాడియోల్‌... వంటి హార్మోన్లూ ఇతరత్రా పోషకాలూ కూడా ఇందులో పుష్కలమే. ఉడికించిన గూడు రుచిగా ఉండటంతోబాటు, రోగనిరోధకశక్తిని పెంచుతుందనీ, దీర్ఘకాలిక వ్యాధులనుంచి త్వరగా కోలుకునేలా చేస్తుందనీ, వీటిని పరగడుపున తింటే ఎంతో మంచిదనీ చైనా సంప్రదాయ వైద్యం పేర్కొంటోంది. ఇంకా జలుబూ ఫ్లూ జ్వరాలు రావనీ, శృంగారాన్ని ప్రేరేపిస్తాయనీ వయసుమీద పడకుండా ఉంటుందనీ కణాల పునర్నిర్మాణానికి తోడ్పడతాయనీ చెబుతుంటారు. పెరిగే పిల్లలకీ వృద్ధులకీ ఎంతో మంచిదట. దెబ్బతిన్న కణాల పెరుగుదలకి ఇందులోని పోషకాలు తోడ్పడతాయని ఆధునిక పరిశీలనల్లోనూ తేలింది. అందుకే ఎంతో కష్టమైనా సరే, వీటిని సేకరించి, వాటిల్లో ఈకలూ, గడ్డీ ఏమైనా ఉంటే వాటిని శుభ్రం చేసి విక్రయిస్తుంటారు. గూటి పరిమాణం, స్వచ్ఛత,  వాటిని ఉడికించాక వచ్చే వాసన గాఢత, రంగుని బట్టి గూళ్ల ఖరీదు ఉంటుంది.

ఏది నిజం? 
ఈ స్విఫ్ట్‌లెట్స్‌ ఆగ్నేయాసియా దేశాల్లో సముద్రతీర ప్రాంతాల్లోనూ; మనదేశంలో అండమాన్‌ తీరంలోని సున్నపురాతి గుహల్లోనూ, పశ్చిమ కనుమల్లోని బాంద్రా రాతిగుహల్లోనూ కనిపిస్తాయి. క్రిమికీటకాలు దరిచేరకుండానూ, గుడ్లగూబలూ పాముల వంటి శత్రువుల బారిన కంటపడకుండా ఉండేలా చీకటి ప్రదేశాల్లో గుహలపైభాగాల్లో ఇవి గూళ్లు కడుతుంటాయి. మార్చి-జూన్‌ వీటి బ్రీడింగ్‌ సీజన్‌. కట్టినప్పుడు గూడు తెల్లగానే ఉన్నా ఎండ సోకగానే బంగారువర్ణంలోకి మారతాయి. అందుకే వీటిని వైట్‌ గోల్డ్‌ అంటారు. ఆయా ప్రదేశాలనుంచి సేకరించడం కష్టం కావడంతో ఈ పక్షులు సంచరించే ప్రదేశాల్లో ఎత్తైన చీకటి భవనాలని నిర్మించి, అక్కడ గూళ్లు కట్టేలా చూసి, తర్వాత వాటిని సేకరిస్తుంటారు. కొందరు పిల్లపక్షుల వయసుని పట్టించుకోకుండా గూళ్లని తీసేయడంతో వాటి సంఖ్య చాలావరకూ తగ్గిపోయింది. దాంతో కోయంబత్తూర్‌లోని సలీం అలీ సెంటర్‌కు చెందిన నిపుణుల బృందం గత దశాబ్దంగా స్విఫ్ట్‌లెట్‌ల్ని సంరక్షిస్తోంది. ఏరోడ్రామస్‌ ఫ్యుసిఫాగా అనే రకం పక్షులు అత్యంత శుభ్రంగా ఉండే గూళ్లను పెడతాయట. పిట్టల రకం, అవి నివసించే వాతావరణాన్ని బట్టి ఈ పక్షులు పెట్టే గూళ్లు తెలుపూ ఎరుపూ నలుపూ గోధుమా బంగారు వర్ణాల్లో ఉంటాయి. 
ముత్యాల పంటలానే ఈ పక్షిగూళ్లకీ నకిలీల బెడద ఎక్కువే. ఇవి సహజంగా వచ్చేవి కాబట్టి ఏ రెండు గూళ్లూ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండవు. ఒకవేళ అలా ఉంటే అవి కృత్రిమంగా తయారుచేసినవై ఉంటాయి. అలాగే మరీ పారదర్శకంగా ఉండకుండా చేపల మాదిరిగా ఒకలాంటి వాసనతో ఉంటాయి. అందులోని స్రావాల కారణంగా ఈ గూళ్లను నీళ్లలో వేస్తే ఓ పట్టాన కరగవు సరికదా, ఏడెనిమిది గంటలు నానితేగానీ మెత్తబడవు, నీళ్ల రంగు మారదు. వీటిని నానబెట్టి, ఉడికించి సూపులా చేసుకుని తాగుతుంటే ఆ తీగలు జిగటగా సాగుతుంటాయి. కాబట్టి పక్షిగూళ్లను కొనాలంటే  ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందే మరి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.