close
పజిల్‌ చేస్తే... ఫొటో వస్తుంది!

పజిళ్లు చేయడం చాలా మందికి సరదా. అందులోనూ విడివిడిగా ఉండే ముక్కలన్నింటినీ ఒకచోట పేర్చి బొమ్మ వచ్చేలా అమర్చే జిగ్సా పజిళ్లంటే కొందరికి మరీ ఇష్టం ఉంటుంది. మరి మనకోసమే ప్రత్యేకంగా అలాంటి పజిళ్లు తయారైతే, వాటిని పూర్తి చేయడం ఎంత సంతోషాన్నిస్తుందో కదూ! అలాంటి అనుభూతిని కలిగించేందుకే ఇప్పుడు ‘పర్సనలైజ్డ్‌ ఫొటో జిగ్సా పజిళ్లు’ రూపొందుతున్నాయి.

ప్రియమైన వారి ఫొటోకు రకరకాల ఆప్‌ల ద్వారా పూలూ డిజైన్లూ జోడించి అందమైన ఫ్రేముల్లో అమర్చి బహుమతులుగా ఇస్తుంటాం. ఈ మధ్య కప్పులూ, క్యూబుల్లాంటి వాటి మీదా ఇలా ఫొటోలు ముద్రించి కానుకలుగా ఇస్తున్నాం. వాళ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఈ తరహా బహుమతుల్ని చూసినప్పుడు ఎదుటి వారి కళ్లలో కనిపించే ఆనందానికి మనం పెట్టిన ఖర్చు చెల్లిపోతుంది. అందుకే పర్సనలైజ్డ్‌ బహుమతులకు విపరీతంగా గిరాకీ పెరిగింది. మొదట్లో కేవలం ప్రేమికుల మధ్యే ఈ తరహా కానుకల ప్రవాహం పరుగు పెట్టినా, ఇప్పుడు ప్రియమైన ఏ ఇద్దరైనా ఇచ్చి పుచ్చుకునే స్థాయికి చేరింది. అమ్మానాన్నలకూ, అన్నదమ్ములకూ, మిత్రులకూ కూడా ఈ రకం బహుమతుల్ని అందిస్తున్నారు. అయితే ఇలాంటి ఏ వస్తువిచ్చినా ఎదుటి వాళ్లు దాన్ని చూసుకుని సంతోషిస్తారంతే. కానీ ఆ బహుమతిలోనూ ఓ కొత్త ట్విస్టు ఉంటే... అది వాళ్లకు ఆనందంతో పాటు వినోదాన్నీ అందిస్తే... ఇంకా బాగుంటుంది కదూ! 

‘పర్సనలైజ్డ్‌ ఫొటో జిగ్సా పజిళ్లు’ ఇవన్నీ అందిస్తాయి. మనం గిఫ్టుగా ఇవ్వాలనుకున్న ఫొటోను వీటిని తయారు చేసే సంస్థ వాళ్లకు అందిస్తే వాళ్లు ఆ ఫొటోతో జిగ్సా పజిల్‌ను రూపొందించి, ఆ ముక్కలన్నింటినీ ఒక డబ్బాలో వేసి అందిస్తారు. మనం ఇచ్చిన ఫొటో ఆ డబ్బా మీద ముద్రించి ఉంటుంది. బహుమతి అందుకున్న వాళ్లు ఆ ముక్కలన్నింటినీ ఫొటో ఆధారంగా క్రమంలో అమరిస్తే అక్కడ వాళ్ల చిత్రం ఆవిష్కృతమవుతుందన్నమాట! మన ఇష్టాన్ని బట్టి చిన్నా పెద్దా సైజుల్లో తయారవుతున్న ఈ బహుమతులు ఫ్యామిలీ ఫంక్షన్లప్పుడు ఇవ్వడానికీ బాగుంటాయి. అలాంటి సమయంలో అందరూ కలిసి ఈ పజిల్‌ పూర్తి చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఇక ప్రేయసీ ప్రియులూ, భార్యాభర్తలూ, అన్నదమ్ములూ అక్కచెల్లెళ్లూ, చిన్న పిల్లలూ... ఇలా ఎవరికైనా ఎలాంటి వేడుక కోసమైనా ఎదుటి వారి మదిని దోచే 
కానుకగా వీటిని ఇవ్వొచ్చు. ఫొటోతో పాటు కొటేషన్లు రాసి ఉండేలానూ, నాలుగైదు ఫొటోల కొలేజ్‌లానూ కూడా వీటిని తయారు చేయించుకోవచ్చు. అమెజాన్‌, గిఫ్ట్‌కార్ట్‌ తదితర వెబ్‌సైట్లు ఈ తరహా సేవల్ని అందిస్తున్నాయి. మొత్తానికి ఈ కొత్త బహుమతి అందుకునేవారికి ఆనందంతో పాటు కాలక్షేపాన్నీ ఇస్తుందన్నమాట!

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.