close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎరకాడు... ఎటు చూసినా అందాలే!

‘కొండల్నీ గుట్టల్నీ పచ్చని చెట్లనీ నీలి సరస్సుల్నీ సాహసక్రీడల్నీ ఉద్యానవన అందాల్నీ ఏకకాలంలో ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదతీరాలంటే తమిళనాడులోని సేలం పట్టణ సమీపంలోని ఎరకాడు కొండ ప్రదేశాన్ని సందర్శిస్తే చాలు’ అంటూ ఆ పర్యటన విశేషాలను చెప్పుకొస్తున్నారు బెంగళూరుకి చెందిన స్వామి.

బెంగళూరులో నివసించేవాళ్లకి వారాంతంలో విహరించడానికి స్థలాలు వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. అయితే ఈసారి మేం  220 కి.మీ. దూరంలో ఉన్న ఎరకాడు హిల్‌స్టేషన్‌కి వెళ్లి రావాలనుకున్నాం. ఇది తమిళనాడులోని సేలం పట్టణానికి 30 కి.మీ. దూరంలో ఉండటంతో కారులో హోసూరు మీదుగా బయలుదేరాం. ఎత్తైన కొండలూ పచ్చని చెట్ల మధ్య వెడల్పాటి రోడ్డుమీద ప్రయాణం హాయిగా సాగింది. దాదాపు 130 కి.మీ.వరకూ ప్రయాణించాక ఎరకాడుకి రెండు దారుల్లో వెళ్లొచ్చని చెప్పడంతో మేం దేవట్టిపట్టి మీదుగా వెళ్లాం. ఈ దారి కాకుండా మరొకటి సేలం పట్టణం మీదుగా వెళ్లొచ్చు. అప్పటికే సాయంత్రం ఐదు గంటలయింది. దారిలో చిన్న చిన్న గ్రామాలు మాత్రమే తగులుతున్నాయి. మిగిలిన ప్రదేశమంతా అరణ్యమే. గాఢమైన నిశ్శబ్దమే. జనసంచారం అస్సలు లేదు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ వర్షానికి అక్కడక్కడా రోడ్లు కొట్టుకుపోవడంతో గతుకులు ఉన్నాయి. కాసేపటికి చీకట్లు కమ్ముకొచ్చాయి. దాంతో మాకు గుండెల్లో భయం మొదలైంది. చిమ్మచీకటిలో మా వాహనం ఒక్కటే ముందుకు వెళుతోంది. అలాగే ప్రయాణిస్తూ ఏడుంపావుకల్లా ఎరకాడుకి చేరుకుని బతికాం రా దేవుడా అనుకున్నాం.

ప్రకృతి ఒడిలో... కాఫీ తోటలో..! 
నేరుగా మా వసతి గృహానికి వెళ్లాం. అది లేక్‌ఫారెస్ట్‌ హోటల్‌. ఈస్ట్‌లైన్‌ కాఫీ ఫామ్‌ ఎస్టేట్‌లో కట్టిన ఈ హోటల్‌ చూడ్డానికి ఆంగ్లో ఇండియన్‌ శైలిలో ఉంది. ఈ ఫామ్‌హౌస్‌ ఎరకాడు సరస్సు గట్టున ఉండటంతో చుట్టూ ప్రకృతి ఎంతో బాగుంది. ఉదయాన్నే లేచి రెస్టరెంట్‌ వాళ్ల బ్రేక్‌ఫాస్ట్‌ చేసి దాని చుట్టూ ఉన్న పూలమొక్కలూ చెట్లూ అన్నీ చూసుకుంటూ మధ్యాహ్నం సమయానికి గౌరీ ఎస్టేట్‌కి చేరుకున్నాం. అక్కడే ఉన్న చిన్న సరస్సులో కాసేపు బోటింగూ ఫిషింగూ చేసి ట్రెకింగ్‌కి వెళ్లాం. రెండు గంటలపాటు సాగిన ఆ ట్రెకింగ్‌ ఓ వింత అనుభూతిని అందించింది. తరవాత కాఫీతోటల్లో నడుస్తూ కాఫీ, మిరియాలు, బత్తాయి, అంజీర్‌, రామాఫలం... వంటి చెట్లన్నింటినీ చూశాం. అంజీర్‌ చెట్లు చాలా పెద్దవిగా ఎత్తుగా ఉన్నాయి. వీటిల్లో కొన్ని 150 సంవత్సరాల నాటివి కూడా ఉన్నాయి. కొన్ని చెట్ల కాండాలు డొల్లలు కావడంతో తొర్రల్లోకి నడిచి వెళ్లేలా ఉన్నాయి. 

అక్కడినుంచి కొండ పై అంచులో ఉన్న కాలి బాటలో నడుచుకుంటూ వెళ్లాం. దాదాపు గంటన్నర సేపు మరో ప్రపంచంలో విహరిస్తున్నట్లే అనిపించింది. పచ్చనిచెట్లూ మేఘాలను తాకుతున్న కొండలూ వాటి మధ్యలో లోయలూ మధ్యమధ్యలో రాళ్లను దాటుకుంటూ ఎత్తుపల్లాల దారిలో సాగింది మా నడక. హెవెన్స్‌ లెడ్జ్‌ అనే వ్యూపాయింట్‌ దగ్గరకు చేరేసరికి 4.30 గంటలు అయింది. అక్కడి నుంచి సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుందట. అది చూడొచ్చనుకుని ఎంతో సంబరపడ్డాం. కానీ ఉన్నట్టుండి మబ్బులు కమ్మడంతో మంచి కాఫీ తాగి వెనక్కి తిరిగాం. సాయంకాలం ఒకటే కుంభవృష్టి. దాంతో రాత్రికి వెళ్లాల్సిన సఫారీని మర్నాటికి మార్చుకున్నాం. ఆ సాయంత్రం హోటల్లోనే గడపక తప్పలేదు.

పచ్చని కొలనులో..! 
మర్నాడు ఉదయాన్నే అల్పాహారం తిని ఎరకాడు సరస్సుకి చేరుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లోని హిల్‌స్టేషన్లన్నింటిలోకీ సహజసిద్ధంగా ఏర్పడిన సరస్సు ఏదైనా ఉందీ అంటే అది ఎరకాడే. సరస్సు మధ్యలో ఓ ఫౌంటెయిన్‌ కూడా ఏర్పాడు చేశారు. సరస్సు చుట్టూ జింకల వనం, లీజర్‌ పార్కు ఏర్పాటు చేశారు. బోటింగ్‌ సౌకర్యం ఉండటంతో పడవలో ఓ అరగంట సేపు హాయిగా విహరించాం. సరస్సులో నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. చుట్టూ ఉన్న చెట్ల రంగు అందులో ప్రతిఫలిస్తుండటంతో దీన్ని ఎమరాల్డ్‌ లేక్‌ అనీ పిలుస్తారు. దీనికి సమీపంలోనే ఉన్న అన్నా పార్కులో ఏటా మే నెలలో ఫ్లవర్‌ షో జరుగుతుంది. దీని లోపల జపనీస్‌ ఉద్యానవనం చూడ్డానికి ఎంతో బాగుంది. 

తరవాత అక్కడి నుంచి కిలియూర్‌ జలపాతానికి బయలుదేరాం. అక్కడ కారు పార్కు చేసుకున్నాక కాస్త దూరం నడిచి మెట్లు దిగి వెళ్లాలి. దాదాపు 250 మెట్లు దిగితే గానీ జలపాతం దగ్గరున్న కొండ దగ్గరికి చేరుకోలేం. జలపాత నీటి ప్రవాహం మరీ వేగమూ నెమ్మదీ కాకుండా ఉంది.  మరీ ఎక్కువ లోతు లేకపోవడంతో నీళ్లలోకి వెళ్లి కాసేపు అక్కడ సరదాగా గడపొచ్చు. అయితే మెట్లు దిగడం పెద్దవాళ్లకి కాస్త కష్టమే. మేం కష్టపడి కిందకి దిగినందుకు ఫలితం దక్కిందని సంబరపడ్డాం. కాసేపు అక్కడ గడిపిన తరవాత బొటానికల్‌ గార్డెన్స్‌ దగ్గరకు వెళ్లాం. ఇక్కడ రెండు ఉద్యానవనాలు ఉన్నాయి. ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం, మరొకదాన్ని కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యానవనంలో మొక్కల పెంపకం గురించిన శిక్షణ తరగతులు కూడా ఉంటాయి. అయితే దానికి సంబంధించిన టిక్కెట్టును ముందే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. దాంతో మేం అక్కడికి వెళ్లలేకపోయాం. గులాబీ ఉద్యానవనాన్ని మాత్రం ఆసాంతం ఆస్వాదించాం. అందులో చిన్నగా ఉండే బటన్‌ రోజాల నుంచి అతి పెద్ద గులాబీ వరకూ ఎన్నో రకాలు కనువిందు చేస్తాయి. ఆకుపచ్చని గులాబీలనూ చూడొచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఆ మొక్కల్ని కొనుక్కోవచ్చు కూడా. 

తరవాత ఆర్థర్‌ సీట్‌ అనే పాయింట్‌కి వెళ్లాం. అక్కడి నుంచి ఎరకాడు పట్టణం, సర్వరాయన్‌ శిఖరం, సరస్సు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లే రోడ్డు మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. సాయంత్రం నైట్‌ సఫారీకి టొయోటా వేసుకుని వచ్చాడో యువకుడు. అతను విచిత్రమైన వేషధారణతో ఉన్నాడు. అక్కడ పెద్దగా జంతువులేమీ ఉండవు కానీ రెండుగంటలపాటు గుట్టలమీదా కాఫీ తోటల్లో ప్రయాణించడం చిత్రమైన అనుభూతిని అందించింది. వెనకాల ఉన్న ట్రైలర్‌లోకి వెళ్లి నించోవడంతో మరింత థ్రిల్లింగ్‌గా అనిపించింది. మేం బయలుదేరగానే రెండు ఎలుగుబంట్లు కనిపించాయి. అవి మావైపే తీక్షణంగా చూడటంతో మేం వాటివైపు వెళ్లలేదు. ఆ గుట్టల్లో ఎగిరెగిరి పడుతూ ప్రయాణించడం నిజంగా సాహసమే. తరవాత ఓ వ్యూపాయింట్‌ దగ్గరకు వెళ్లి పైనుంచి కిందకి హెయిర్‌పిన్‌ ఆకారంలో ఉన్న రహదారిని చూశాం. తరవాత మరో ఎకో పాయింట్‌ దగ్గరకు వెళ్లాం. అక్కడి నుంచి చూస్తే సేలం పట్టణం మొత్తం కనిపిస్తుంది. తరవాత మేం బ్రిటిష్‌ కాలం నాటి టిప్పరరీ కొలొనియల్‌ బంగ్లాకి వెళ్లాం. దీన్ని 1900 కాలంలో చార్లెస్‌ డికెన్స్‌ అనే ఆంగ్లేయుడు నిర్మించాడు. దీని చుట్టూ ఉన్న సువిశాలమైన కాఫీ తోటలో పనసచెట్లు, అవకాడో, అరటి, అడవి పసుపు, మిరియాలు... ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. 1970లో దీన్ని స్థానికులు కొనుగోలు చేశారట. 

 

20 మందికి సరిపడే ఆ వసతి గృహాన్ని సందర్శకులకి అద్దెకు ఇస్తుంటారట. అక్కడి నుంచి చూస్తే లోయ మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడే ఉన్న ఓ వ్యూపాయింట్‌ నుంచి చూస్తే కొన్ని రాళ్లు తెల్లగా అచ్చం ఏనుగు దంతాల్లా కనిపిస్తాయి. అక్కడ దొరికే నల్లని గ్రానైట్‌ రాయికి పూర్తి వ్యతిరేకంగా ఉండడంతో అవి ఉల్కాపాతం వల్ల ఏర్పడి ఉంటాయని చెబుతారు.

లేడీస్‌ సీట్‌! 
తరవాత ఎరకాడు కొండలకి ఆగ్నేయ దిశలో ‘లేడీస్‌ సీట్‌’ ఉంది. ఆ ప్రదేశంలో కొన్ని రాళ్లు కూర్చోవడానికి వీలుగా సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. బ్రిటిషర్ల కాలంలో ఓ ఇంగ్లిష్‌ మహిళకి ఈ ప్రదేశం ఎంతో ఇష్టమట. ఆమె అక్కడ కూర్చుని రోజూ సూర్యాస్తమయాన్ని చూడటంతో దాన్ని ఆ పేరుతో పిలిచేవారట. తరవాత స్థానికులు మగవాళ్లకీ పిల్లలకీ కూడా సీట్లు కావాలని అనడంతో ప్రభుత్వం దానికి పక్కనే మరో రెండు వ్యూ పాయింట్‌లను ఎంపిక చేసి వాటికి జెంట్స్‌ సీట్‌, చిల్డ్రన్స్‌ సీట్‌ అని పేర్లు పెట్టిందట. 


ఇక్కడికి సమీపంలోనే సర్వరాయన్‌ పీఠభూమి అనే ఓ కొండ ఉంది. దానిమీద నుంచి చుట్టూ చూస్తే కొండలూ లోయలూ సరస్సులూ అద్భుతంగా కనిపిస్తాయి. ఈ కొండమీద ఉన్న ఆలయం చీకటి గుహలో ఉంటుంది. ఈ సర్వరాయన్‌ కొండనీ కావేరీ నదినీ సూచిస్తూ గుడిలో స్వామి సర్వరాయన్‌ రూపంలోనూ దేవి కావేరీ మాత రూపంలోనూ కొలువయ్యారట. ఏటా మే నెలలో వేలాదిమంది గిరిజనులు ఇక్కడ రంగుల వేడుకని జరుపుకుంటారు.

సాహసక్రీడలకీ... 
ఎరకాడు పట్టణంలోని మాంట్‌ఫోర్ట్‌ స్కూలుని చూసి తీరాల్సిందే. 1917లో కట్టించిన ఈ స్కూల్లో అందమైన ఉద్యానవనాలూ ఈతకొలనులూ విశాలమైన భవంతులూ చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆర్కిడేరియంలో స్థానికంగా ఉండే ఆర్కిడ్లను సేకరించి ఉంచారు. వాటిల్లో లేడీస్‌ స్లిప్పర్‌ అనే కీటకాల్ని తినే పూలనీ చూడొచ్చు. ముఖ్యంగా మొక్కల ప్రేమికులకి ఈ ప్రదేశం కన్నులపండగే. అలాగే ఇక్కడే ఉన్న పట్టుపురుగుల క్షేత్రంలో వాటి పెంపకం గురించి మొత్తం తెలుసుకోవచ్చు. సాహసక్రీడలకీ ఈ ప్రదేశం పెట్టింది పేరే. చిన్నసైజు ట్రాక్టర్ల మాదిరిగా ఉండే బైకుల్ని అద్దెకు తీసుకుని రైడ్‌కి వెళ్లొచ్చు. తాళ్లు పట్టుకుని నడిచే క్రీడలూ ఉన్నాయిక్కడ. ఇక్కడికి దగ్గరలోని సంపకం అనే గ్రామంలోకి వెళితే షోలే అరణ్యం, హార్టీకల్చరల్‌ స్టేషన్‌, రాజరాజేశ్వరీ ఆలయం, చక్రమహామేరు ఆలయంతోపాటు పెద్ద అరటిచెట్లనీ చూడొచ్చు. 


ఇక్కడ ఎలుగుబంట్ల గుహ ఒకటి ఉంటుంది. అయితే అది పాతకాలంనాటి ఓ బంగ్లాని ఆనుకుని ఉంటుంది. అది ప్రైవేటు వ్యక్తులది కాబట్టి వాళ్ల అనుమతి ఉంటేనే ఆ గుహలోకి వెళ్లగలం. 


ఎరకాడులో జులై -ఆగస్టులో వర్షాలు ఎక్కువ. మిగిలిన అన్నివేళలా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫిబ్రవరిలో సందర్శకుల తాకిడి మరీ ఎక్కువ. సేలం మీదుగా దారి బాగుంటుందని చెప్పడంతో ఈసారి ఆ దారిలోనే వెనుతిరిగాం. కొండమీద నుంచి కిందకి దిగితే నీలి రంగు పూలతో నిండిన జకరాండా చెట్లు మళ్లీ మళ్లీ ఎరకాడు రమ్మని ఆహ్వానిస్తుంటాయి.

 

 


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.