close
రంగుల టిఫినీలు తిన్నారా..?

‘అమ్మా రేపు స్కూలుకి నాకు పింక్‌ ఇడ్లీలు పెట్టమ్మా... ఈరోజు ఆరాధ్య అవే తెచ్చుకుంది చూస్తుంటే ఎంత బాగున్నాయో తెలుసా...’ ఆరేళ్ల అక్క మాటలు విన్న చిట్టి తమ్ముడు ‘అయితే, నాకు గ్రీన్‌ కలర్‌ పూరీ కావాలి’ అని పోటీకి వచ్చేశాడు.  ఇడ్లీలూ పూరీలే కాదు, దోశలూ ఉప్మాల్లాంటి అన్నిరకాల  సంప్రదాయ టిఫిన్లూ రంగులద్దుకోవడమే ఇప్పటి ట్రెండ్‌... అదీ ఫుడ్‌ కలర్స్‌ వెయ్యకుండా.

టేబుల్‌మీద ఎన్నిరకాల వంటకాలైనా ఉండనివ్వండి... మన చెయ్యి ముందుగా కంటికి ఇంపుగా ఉన్నదానిమీదికే వెళ్తుంది. పదార్థాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటే వాటిని తినాలనే కోరిక మనసుకు అంతగా కలుగుతుందట మరి. ఇది పరిశోధనల్లోనూ తేలింది. అందుకే, హోటళ్లలో అందంగా అలంకరించిన వంటకాలను చూడగానే తినాలనుకున్నదానికన్నా ఎక్కువగానే తినేస్తాం. 
ముద్ద నోట్లో పెట్టాలంటేనే మారాం చేసే పిల్లల విషయంలో ఇదే సూత్రాన్ని ఎందుకు అప్లై చెయ్యకూడదూ... అనుకున్నట్లున్నారు ఈతరం అమ్మలు... బ్రేక్‌ఫాస్ట్‌ని రంగులమయం చెయ్యడం మొదలుపెట్టారు. వంటింటి మహారాణి తలుచుకుంటే కానిదేముందీ... ఇడ్లీ అనగానే గుర్తొచ్చే తెల్లటిరంగు స్థానంలో సప్తవర్ణాలూ ప్లేటులోకొచ్చి చేరాయి. 
వేగినట్లూ కనిపించే దోశలేమో గులాబి, నారింజ, పసుపు, ఆకుపచ్చ, రాగి రంగులతో మరింత నోరూరించేస్తున్నాయి. గోధుమ వర్ణంలో ఉండే పూరీలూ రోటీలు కూడా హరివిల్లు వర్ణాలను అందంగా అరువు తెచ్చేసుకున్నాయి. ఉప్మాలూ తక్కువేం తినలేదు. సేమ్యా, రవ్వ, అటుకులు... అనే తేడా లేకుండా అన్నీ రంగుల ముద్దలయ్యాయి. అలాఅని వీటిని ఫుడ్‌ కలర్స్‌ వేసి చేస్తున్నారనుకుంటే పొరబడినట్లే. ఈ రంగులన్నీ అచ్చంగా ఆకుకూరలూ కూరగాయలూ దుంపలతో వచ్చినవే.

ఎలా చేస్తారంటే... 
పాలకూర, పుదీనాలను పేస్ట్‌ చేసి ఏ వంటకంలో వేసినా ఆ వంటకం ఆకుపచ్చగా మారిపోతుందని తెలిసిందే. అలాగే క్యారెట్‌ పేస్ట్‌ వేస్తే నారింజ రంగులోనూ బీట్‌రూట్‌ గుజ్జు వేస్తే గులాబీ రంగూ వస్తుంది. ఇక, అన్నాన్ని తాలింపు వేసి అందులో కాస్త పసుపు వెయ్యగానే అది బంగరు వర్ణంలో ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగుల బ్రేక్‌ఫాస్ట్‌ని తయారుచెయ్యడానికి కావల్సింది కూడా ఇవే. అయితే, ఆయా కూరగాయలూ ఆకుకూరల గుజ్జులతో పాటు రుచికోసం జీలకర్ర, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి... లాంటి వాటిని చేర్చుతారు. ఉదాహరణకు ఆకుపచ్చ ఇడ్లీలు వెయ్యాలనుకుంటే కొంచెం పాలకూరా పుదీనాలకు రెండు మూడు పచ్చిమిర్చీ అరస్పూను జీలకర్రా మిక్సీలో వేసి మెత్తటి గుజ్జులా అయ్యాక దాన్ని ఇడ్లీ పిండిలో కలపడమే. మనం ఎంత పిండిలో కలపాలనుకుంటున్నామో చూసుకుని అందుకు సరిపడా పాలకూరా పుదీనా పచ్చిమిర్చిలను తీసుకోవాలి. 
క్యారెట్‌, బీట్‌రూట్‌లకైతే పచ్చిమిర్చికి బదులు వాటి రంగుకు దగ్గరగా ఉండే ఎండు మిర్చి వేసుకోవాలి. క్యారెట్లలో నారింజ, ఎరుపు రెండు రకాలుంటాయి కాబట్టి రెండు రంగులొస్తాయి. పసుపు వర్ణం కోసం కాస్త పసుపు కలిపితే సరిపోతుంది. ఇక, పసుపు రంగు పిండికి తక్కువ మోతాదులో పాలకూర గుజ్జుని కలిపి ఇంకో రంగుని సృష్టించొచ్చు. ఇలా కొత్త కొత్త రంగులు మరికొన్నిటినీ తెచ్చేయొచ్చు. వీటితోపాటు, ఇడ్లీ పిండిలో రాగిపిండి కలిపితే ఇడ్లీలు ఆ రంగులో కనిపిస్తాయి. ఒకేసారి రంగు రంగు ఇడ్లీలు చేసుకోవాలనుకుంటే పిండిని వేరు వేరు గిన్నెల్లోకి తీసి ఒక్కో గిన్నెలో ఒక్కో రంగునిచ్చేవాటిని విడివిడిగా కలుపుకుంటే సరిపోతుంది. అన్నిరంగుల మధ్యలో ఉన్నపుడు తెలుపు కూడా అందంగానే కనిపిస్తుంది. అందుకే, ఒక గిన్నెలో పిండిని తెలుపు రంగులోనే వదిలేయాలి. ఇక, హరివిల్లు రంగుల్లో ఉన్న ఇడ్లీలను వడ్డిస్తే ప్లేటులోకి రంగుల చందమామలు వచ్చినట్లుంటాయనడంలో ఆశ్చర్యంలేదు... వీటిని చూస్తే పిల్లలకే కాదు పెద్దలకూ నోరూరిపోతుందనడం అతిశయోక్తి కాదు. 
ఇడ్లీ పిండికి కలిపినట్లే మినపట్టూ రవ్వట్టూ పుల్లట్టూ ఊతప్పం... లాంటి రకరకాల పిండుల్లోనూ కూరగాయలూ ఆకుకూరల గుజ్జుని కలిపి దోశల్నీ వర్ణరంజితంగా మార్చేయొచ్చు. చపాతీ లేదా పూరీ పిండి కలిపేటపుడు నీటికి బదులు ఏ రంగు కావాలంటే ఆ రంగు ఆకు కూర, దుంపల గుజ్జులూ కలుపుకుంటే సరిపోతుంది. నీటిలో పసుపు కలిపితే ఆ రంగు వస్తుంది. ఇక, ఉప్మాలు చేసేటపుడు కూడా తాలింపు వేశాక కాస్త బీట్‌ రూట్‌/క్యారెట్‌/పాలకూర గుజ్జు వేసి కొంచెం వేగాక నీళ్లు పోసి మరిగాక రవ్వ లేదా సేమ్యా కలిపితే ఉప్మా ఆయా రంగుల్లో తయారైపోతుంది. అటుకుల ఉప్మా చేసే పద్ధతీ ఇదే. రాగి అటుకులూ సేమ్యాలూ ఎలాగూ మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి ఆ రంగు ఉప్మాలనీ చేసేసుకోవచ్చు.

ఆరోగ్యమెంతో... 
సంప్రదాయ టిఫిన్లను రంగు రంగుల్లో చేసుకోవడం వల్ల పిల్లలు మారాం చెయ్యకుండా ఎంచక్కా తినేస్తారు. ఇక, ఆకుకూరలూ దుంపల్లో రంగుకి కారణమైన ఫైటోకెమికల్స్‌ మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. బీట్‌రూట్‌కి ఆ వర్ణాన్నిచ్చే బెటానిన్‌ వర్ణద్రవ్యం మంచి యాంటీ ఆక్సిడెంట్‌. ఇది చెడు కొవ్వుల్ని తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్లలో రంగుకు కారణమైన బీటాకెరోటిన్‌ కంటి ఆరోగ్యానికీ, లైకోపీన్‌ గుండెకూ మంచివి. పాలకూరకు రంగునిచ్చే జియాక్సాంథిన్‌, ల్యుటీన్‌లు కంటికి ఎంతో మేలుచేస్తాయి. చెప్పాలే కానీ ఇలాంటి ఉపయోగాలు ఇంకెన్నో. కాబట్టి, సహజసిద్ధమైన కూరగాయలూ ఆకుకూరల రంగులతో మన ఆహారాన్ని ఎంత వర్ణరంజితం చేసుకుంటే అంత ఆరోగ్యమన్నమాట. మామూలుగా పాలకూర, బీట్‌రూట్‌, క్యారెట్‌లను పిల్లలతో తినిపించాలంటే ఎంత కష్టమో. కానీ ఇలా రంగులకోసం వాటిని వాడటం వల్ల తెలియకుండానే తినేస్తారు. ఆలోచన అందంగా ఆరోగ్యంగా ఉంది కదూ!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.