close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంధ్యాదీపం 

- ఈశ్వరి

‘‘అమ్మా రాధా, నేను రేపో ఎల్లుండో మన ఊరు బయలుదేరి వెళతానమ్మా. అత్తయ్య కార్యక్రమం దగ్గరకొస్తోంది. రెండురోజుల ముందు నువ్వూ అబ్బాయీ పిల్లలూ బయలుదేరి రండి. అమ్మాయికీ అల్లుడుగారికీ కూడా రెండు రోజుల ముందే రమ్మని చెప్పాను.’’

‘‘మీరొక్కరే వెళ్ళి ఏం కష్టపడతార్లే మావయ్యా. అందరం కలిసే వెళదాం. నేనూ సాహితీ కావలసినవన్నీ రెండురోజుల్లో ఏర్పాటు చేసేస్తాం. మీరేం కంగారుపడకండి. పురోహితులకు మాత్రం ఫోన్‌ చేసి చెప్పండి. మీరొక్కరే బస్సులో వెళ్ళి ఏం తిప్పలు పడతారు?’’ అంది రాధ.

‘‘దాందేం ఉందమ్మా, రాత్రి పది గంటలకి బస్సు ఎక్కితే తెల్లవారేసరికి మన ఊరు వెళ్ళిపోవచ్చు. అయినా పక్కన అద్దెకున్నవాళ్ళు ఉన్నారు కదమ్మా. పాపం ఆ అమ్మాయి అన్నీ చేసి పట్టుకొస్తుంది. నన్ను స్టవ్‌ కూడా వెలిగించనివ్వదు. నేను ముందుగా వెళ్ళి ఇల్లూ అదీ శుభ్రం చేయిస్తాను. కొన్ని బ్యాంకు పనులు కూడా ఉన్నాయి. అబ్బాయికి చెప్పాను. సరేనన్నాడు. ఎంత... నేను వెళ్ళిన వారం రోజులకు మీరూ అమ్మాయీ అల్లుడూ పిల్లలూ కూడా వచ్చేస్తారు కదా. ఈలోపు ఊళ్ళో స్నేహితులనీ చుట్టాలనీ కూడా కలుస్తాను.

మళ్ళీ మీతో వచ్చేస్తాను కదమ్మా.’’

మామగారి మాటలకి కోడలు రాధ కన్విన్స్‌ అయి ‘‘సరే మావయ్యా, మీ ఇష్టం. ఇంటి పనులని మరీ కష్టపడిపోకండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రిజర్వేషన్‌ చేయించమని ఈయనకి ఫోన్‌ చేసి చెప్పండి.’’

‘‘అలాగేనమ్మా’’

కోడలి మాటలకి సంతృప్తిపడిన విశ్వనాథం న్యూస్‌పేపరు తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. కుర్చీలో కూర్చోబోతున్న విశ్వనాథానికి ఎదురుగా అలమరలో ఉన్న ఫొటోలోని శాంత తననే చూస్తున్నట్టు అనిపించింది. ఒక్క నిట్టూర్పు విడిచి కుర్చీలో కూర్చున్నాడు. 
‘అప్పుడే శాంత నన్ను వదిలివెళ్ళి రెండేళ్ళయి పోయాయి. శాంత పోయినప్పటి నుండి ఎక్కువ కాలం కొడుకు దగ్గరో, కూతురి దగ్గరో ఉంటున్నాను. ఒక్కడినీ ఊళ్ళో ఉండటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కోడలూ అల్లుడూ కూడా తనను అభిమానంగానే చూసుకుంటారు కాబట్టి ఎప్పుడూ ఒంటరితనంగా అనిపించలేదు. శాంత తనతో ఉన్నట్టే ఉంటోంది’ అనుకున్నాడు మనసులో. ఆలోచనల నుండి బయటకు వచ్చి పేపరులో తలదూర్చాడు విశ్వనాథం.

విశ్వనాథం ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. సర్వీసులో ఉండగానే ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులూ పెళ్ళిళ్ళూ వంటి బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాడు. రిటైర్‌ అయ్యాక తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళి వచ్చాడు. ఇక ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకునేవాడు. కానీ శాంత పడనిచ్చేది కాదు. మనవడి పుట్టినరోజు అనో, కూతురు పెళ్ళిరోజు వస్తోందనో తరచుగా పిల్లల ఇంటికి ప్రయాణం కట్టించేది. పోనీ వెళ్ళి రెండు మూడు రోజులు ఉండి రావడం కాదు, నెలా రెండు నెలలు ఉండి వచ్చేవారు. ఈ సమయంలో మనవల కోసం పిండివంటలు చేయడం, వారికి కథలు చెప్పి నిద్రపుచ్చడం, వారికి స్నానాలు చేయించి స్కూలుకి తయారుచేయడం, వంటపనులు... శాంత చాలా ఇష్టంగా చేస్తూ ఉండేది. వారి పనుల్లో ఉండిపోయి విశ్వనాథం అవసరాలు కూడా గమనించనట్లుండేది. విశ్వనాథానికి భోజనం, కాఫీ, టిఫిన్‌ల వంటి అవసరాలను కూతురునో కోడలినో చూసుకోమనేది. అది అస్సలు నచ్చేది కాదు ఆయనకు. తరచుగా శాంతమీద అలుగుతుండేవాడు. అయినా అదేమీ పట్టించుకోకుండా కూరలు తేవడం, మనుమలను స్కూలుకి దింపి తీసుకురావడం వంటి పనులు కొడుకు చేత మాన్పించి విశ్వనాథం చేత చేయిస్తూ ఉండేది.

కొడుకు ‘ఎందుకమ్మా, నాన్నకు శ్రమ’ అంటే, ‘ఆయనకు మాత్రం ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? బయటకు వెళ్ళివస్తే కాస్త కాలక్షేపం అవుతుంది’ అనేది. శని, ఆదివారాలయితే మనవలను తీసుకుని పార్కుకి తప్పనిసరిగా వెళ్ళేవారు శాంత, విశ్వనాథంలు. కొన్నాళ్ళు ఉన్నాక, తమ ఊరికి ప్రయాణమై వెళ్ళేవారు. అంతలోనే మళ్ళీ ఏదో విశేషం చెప్పి పిల్లల ఇంటికి బయలుదేరతీసేది. విశ్వనాథానికి కోపం వచ్చి తాను రానంటే ‘సరేలెండి, నేనొక్కదాన్నే వెళ్ళి వస్తాను. పది రోజుల్లో వచ్చేస్తాను. మొన్న ఆ మనవడి పుట్టినరోజుకి వెళ్ళి ఇప్పుడు ఈ మనవరాలి పుట్టినరోజుకు వెళ్ళకపోతే బాగోదు’ అంటూ వంటింటి చిట్కాలతో సహా ఏ రోజు ఏమి వండుకోవాలో చెప్పి బస్సెక్కేది. ఉద్యోగంలో ఉండగా ఏనాడూ వంటింటి వైపు కూడా చూడని విశ్వనాథం ఇప్పుడు చేతులు కాల్చుకోవడం మొదలుపెట్టాడు. వద్దంటే కూతురూ కొడుకూ ఏమైనా అనుకుంటారేమోనని ఊరుకునేవాడు. నెమ్మదిగా తనకు కావలసినవి తయారుచేసుకోవడం బాగానే నేర్చేసుకున్నాడు. మళ్ళీ భార్య వస్తే వంటింటి వైపు వెళ్ళేవాడు కాదు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఒకనాటి ఉదయం శాంత ఇంకా నిద్ర లేవకపోవడం చూసి లేపడానికి ప్రయత్నించిన విశ్వనాథానికి అది లేచే నిద్రకాదనీ, శాశ్వత నిద్ర అనీ కొంతసేపటికి కానీ తెలియలేదు. అలా ఒంటరి వాడైన విశ్వనాథాన్ని ఒక్కణ్ణీ ఉంచటం ఇష్టంలేక రెండు గదులు ఉంచి, మిగతా ఇంటిని శాంత దూరపు బంధువులు కావాలంటే వారికి అద్దెకు ఇచ్చి కొడుకు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

*   *   *

బస్టాండులో తెల్లవారుజామున బస్సు దిగి ఆటో ఎక్కి తన ఇంటికి చేరుకున్నాడు విశ్వనాథం. అప్పటికే పక్క పోర్షన్‌లో అద్దెకుంటున్నావిడ వాకిట్లో ముగ్గు వేస్తోంది. ‘శాంత ఎంత బాగా ముగ్గులేసేదో. పోనీలే ఈవిడ కూడా ముగ్గులు వేస్తోంది. శాంత ఎక్కడ ఉన్నా ఆనందపడుతుంది’ అనుకుంటూ లోపలికి వెళ్ళబోతున్న విశ్వనాథాన్ని చూసి ‘‘వచ్చారా బాబాయిగారూ, రండి. నిన్ననే పనమ్మాయి చేత ఇల్లు తుడిపించాను. మీరేమీ చేసుకోకండి, అన్నీ నేను పంపిస్తాను. కాఫీ పట్టుకొస్తాను. ఈలోపు ఫ్రెష్‌ అవ్వండి’’ అంది. 
‘‘ఎందుకమ్మా నీకు శ్రమ. నాకు అన్నీ వచ్చు, నేను చేసుకుంటానులేమ్మా. నీకు పిల్లలూ స్కూలూ... హడావుడికదమ్మా.’’

‘‘అలాకాదు బాబాయ్‌గారూ, మీరు మాలో ఒకరే. మీ పనేమీ నాకు ఎక్కువకాదు. మా పిల్లలు చంటిపిల్లలుగా ఉన్నప్పుడు పిన్నిగారు చేసిన సాయంతో పోలిస్తే నేను చేసేది ఎంతటిది? మీరు అలా చేసుకుంటుంటే పిన్నిగారు ఊరుకోరు. నా కలలోకి వచ్చి మరీ తిడతారు’’ అంది నవ్వుతూ.

‘‘సరేనమ్మా, నీ ఇష్టం’’ అన్నాడు, శాంత పేరు చెప్పేసరికి ఇంకేం అనలేక.

తమ వీధిలో పెద్ద ముత్తయిదువ శాంతే. ఎవరికి ఏం కావాలన్నా పెరటిగుమ్మంలో నుండి వెళ్ళిపోయి వాళ్ళకి పనులు చేసిపెట్టి వచ్చేది.

తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి శాంత జ్ఞాపకాలు ఇంకా ఎక్కువయ్యాయి. అతని ఆలోచనల్లో అతనుండగానే ‘‘తాతయ్యా, వేడినీళ్ళు. మా అమ్మ మీకు ఇమ్మంది’’ అంటూ పక్కింటి వాళ్ళబ్బాయి చెంబు మంచినీళ్ళతో వచ్చాడు. తనకి బ్రష్‌ చేసుకున్న వెంటనే వేడినీళ్ళు తాగటం అలవాటు. కొడుకు ఇంట్లో అయినా, కూతురు ఇంట్లో అయినా విశ్వనాథానికి అలాగే వేడినీళ్ళు తెచ్చి ఇస్తారు.

‘‘అయ్యో, ఎందుకమ్మా... నా దగ్గర వాటర్‌బాటిల్‌ ఉంది’’ అన్నాడు విశ్వనాథం.

‘‘తాతయ్యా, మా అమ్మ నిన్ననే ఫిల్టర్‌ కడిగి మంచినీళ్ళు పట్టానని చెప్పమంది’’ అని పరుగెత్తి వెళ్ళిపోయాడు.

విశ్వనాథం బ్రష్‌ చేసుకుని, మంచినీళ్ళు తాగేసరికి మళ్ళీ పక్కవాళ్ళ అబ్బాయి ఒక చేత్తో కాఫీ కప్పూ మరొకచేత్తో పేపరూ పట్టుకొచ్చాడు. అతనికి కాఫీ తాగుతూ పేపరు చదవడం అలవాటు. పడకకుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ పేపరు తెరచి చూడబోతూ మనసులో ‘ఎంతమందికి ఈ అదృష్టం ఉంటుంది? తన చుట్టాలూ స్నేహితుల్లో కొందరు భార్యలు పోయిన తరవాత పిల్లల దగ్గర అడ్జస్ట్‌ అవ్వలేక, ఒక్కరూ ఉండలేక వృద్ధాశ్రమాలలో చేరి నిరాశగా జీవితాన్ని గడుపుతున్న వారున్నారు. ఒక్కరూ ఉండలేక బెంగతో భార్య వెనుకే పోయినవారూ ఉన్నారు.

దురదృష్టవశాత్తూ తను శాంతను పోగొట్టుకున్నా, తన అలవాట్ల కనుగుణంగా అన్నీ అమర్చే కూతురూ కోడలూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఏ లోటూ లేకుండా గడుస్తోంది’ అనుకున్నాడు తృప్తిగా.

కాఫీ తాగి, పేపరు చదివి, ఆ పడకకుర్చీలోనే ఒక గంట పడుకుని లేచాడు. ఈలోపు పక్క పోర్షను నుండి టిఫిన్‌ రానేవచ్చింది. స్నానానికి లేచి వెళ్ళబోతూ ఎదురుగా ఉన్న బీరువా వైపు చూశాడు. ‘ఆమధ్య దీనిలో ఉండే శాంత చీరలూ నగలూ- కూతురూ కోడలూ ఏవో సర్దుబాటు చేసుకున్నారు. నా బట్టలు ఏమైనా ఉన్నాయా’ అనుకుంటూ పక్క అలమారులో ఉన్న తాళం తీసి బీరువా తెరిచాడు విశ్వనాథం. చాలామటుకు అరలు ఖాళీగానే ఉన్నాయి. పైఅరలో అతనివి కొన్ని ఇస్త్రీ బట్టలు కనిపించాయి. అవి బయటకు తీయబోతుంటే పైనుండి కిందకు సెల్‌ఫోన్‌ పడింది. ‘ఇది ఎక్కడిది?’ అని ఆశ్చర్యంగా తీశాడు. ‘ఆ! గుర్తొచ్చింది... శాంత పుట్టినరోజుకి తమ కూతురు గిఫ్ట్‌గా ఇచ్చింది. చార్జర్‌ తీసి చార్జింగ్‌ పెట్టి స్క్రీన్‌ ఆన్‌ చేసి ఏమున్నాయా అని చూడసాగాడు. ఎందుకో దాన్ని చూడగానే శాంత జ్ఞాపకాలతో మనసు భారం అయింది. శాంత- మంగళహారతులూ అన్నమాచార్య కీర్తనలూ చక్కగా పాడుతుండేది. సెల్‌ఫోన్‌ వాడే విధానం తనకు తానుగానే నేర్చుకుని పాటలు పాడి రికార్డు చేసుకునేది. ఫోన్‌లో శాంత పాటలు ఏమైనా ఉన్నాయేమోనని రికార్డింగ్స్‌ తీసి వెతకసాగాడు విశ్వనాథం. చాలానే రికార్డింగ్స్‌ ఉన్నాయి. మొదటగా ఉన్న దానిపై ప్రెస్‌ చేశాడు. తన మనవడు ముద్దుముద్దు మాటలతో లింగాష్టకం పాడుతున్నాడు. ‘మనవలకి ఎంత శ్రద్ధగా పాటలూ పద్యాలూ నేర్పించేదో శాంత’ అనుకున్నాడు. మరికొన్ని రికార్డింగ్స్‌ విన్నాడు. అవి శాంత పాడిన మంగళహారతులు. అవి వింటుంటే శాంత అతనిముందే ఉండి పాడుతున్నట్లు అనిపించసాగింది. స్నానానికి వెళ్ళడం వాయిదా వేసి మళ్ళీ కుర్చీలో కూర్చుని ఒక్కొక్క రికార్డింగ్‌ తీసి వినసాగాడు. వాటిలో కొన్ని టీవీలో వచ్చిన ఆధ్యాత్మిక ప్రసంగాలూ దేవతాస్తుతులూ మనవరాలి పాటలూ శాంత పాడిన అన్నమాచార్య కీర్తనలూ... అలా ఒక్కొక్కటి వింటూ ఉండిపోయాడు. ఇంకొక్కటి మాత్రమే మిగిలింది. అది కూడా విందామని దానిపై ప్రెస్‌ చేశాడు. ‘ఏమండీ’ శాంత గొంతు. తననే పిలుస్తున్నట్టుంది. ఇంకా ఏం మాట్లాడుతుందా అని ఆసక్తిగా వినసాగాడు. ‘దీనిలో రికార్డింగ్‌ ఇలాగేనా...’ కొంత నిశ్శబ్దం... ‘ఆంటీ’ వేరెవరిదో గొంతు. విశ్వనాథం మరింత ఆసక్తిగా వినసాగాడు. ‘రామ్మా, లక్ష్మీ రా!’ శాంత గొంతు అది. ‘ఏం చేస్తున్నారాంటీ?’, ‘ఏం లేదమ్మా, మా అమ్మాయి నాకు సెల్‌ఫోన్‌ పంపింది. మంగళ హారతులు రికార్డు చేసి పంపమంది. ఎలా రికార్డు చేయాలో చూస్తున్నాను. మీ నాన్నగారు ఎలా ఉన్నారమ్మా?’ ఆర్ద్రత నిండిన గొంతుతో అడిగింది శాంత. ఈ మాటలు ఫోన్‌లో నుండి వస్తుంటే విశ్వనాథం ‘అయ్యో, ఈ మాటలు రికార్డు అవుతున్నాయని శాంతకి తెలిసినట్లు లేదు’ అనుకుంటూ ఉత్సుకతతో నిటారుగా కూర్చుని మరీ వినసాగాడు. ఫోన్‌లో ఆ అమ్మాయి అంటోంది- ‘ఏం చెప్పను ఆంటీ, ఆయన్ని అని ఏం లాభం? పోయిన మా అమ్మని అనాలి. వాళ్ళిద్దరూ ఉన్నన్నాళ్ళూ ఇల్లు దాటి ఎవరింటికీ వచ్చేవారు కాదు. మా ఇంటికిగానీ, అన్నయ్య ఇంటికిగానీ వెళ్ళినా ముళ్ళమీద ఉన్నట్లు రెండు లేదా మూడు రోజులుండి వెళ్ళిపోయేవారు. అక్కడ కూడా మా నాన్నకి మంచినీళ్ళ దగ్గర నుండి అన్నీ మా అమ్మే అందించేది. ఆయనకి స్టవ్‌ వెలిగించడం కూడా రాదు. ఇప్పుడు ఆవిడ పోయాక ఆయన మా ఇళ్ళలో ఎవరిదగ్గరా అడ్జస్ట్‌ అవ్వలేకపోతున్నారు. అలా అని ఒక్కరూ ఉండలేకపోతున్నారు. కూతుర్ని అయిన- నా దగ్గరే ఉండలేకపోతుంటే మా వదినని మాత్రం ఏం అంటాం? ఎప్పుడైనా పది రోజులు మా దగ్గర ఉంటే ఆయన అలవాట్లూ ఇష్టాలూ మాకు తెలిసేవి. ఇది కావాలి అని అడగరు. లోలోపలే బాధపడుతుంటారు. అమ్మ అంత తొందరగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆయన్ను ఎలా మార్చాలో అర్థంకావడం లేదు.’

‘అవునమ్మా, పెద్దవాళ్ళకీ పిల్లలకీ మనవలకీ మధ్య ఆ గ్యాప్‌ రాకూడదు. అమ్మో, నేను కూడా ఈయనకి అన్నీ నేర్పించాలి. మా పిల్లల ఇళ్ళల్లో కూడా ఉండి వస్తుండాలి.’

‘ఛఛ, అవేం మాటలాంటీ? మీరెందుకలా అనుకుంటారు. మీరూ అంకుల్‌ పదికాలాలపాటు చల్లగా ఉండాలి.’

‘అదేంకాదమ్మా. ఇద్దరిలో ఒకరు ముందూ ఒకరు వెనుకా తప్పదు. తోడు దూరమైన ఆడవాళ్ళు తమ బాధను బయటకు చెప్తూ ఏడుస్తూ బాధను క్రమంగా తగ్గించుకుంటారు. అదే మగవారు బయటకు చెప్పుకోలేక గుండె బరువును పెంచుకుంటారు. భర్త అనంతరం భార్యకు పెన్షన్‌ ఎలా ఆధారమవుతుందో భార్య అనంతరం కూడా భర్తకు ఆధారాన్ని చూపాల్సిన బాధ్యత భార్యే చూసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత సంధ్యాదీపాన్ని ఆసరా చేసుకునే జీవించేయాలమ్మా.’

‘ఆంటీ, ఇక ఈ మాటలు వదిలేయండి. నేనొచ్చి మిమ్మల్ని అనవసరంగా బాధపెడ్తున్నాను. సరే ఆంటీ, ఒక పాట పాడండి నేను రికార్డు చేస్తాను.’

అక్కడితో ఫోన్‌లో వస్తున్న మాటలు ఆగి పోయాయి. గాలి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నట్టుగా ఉన్న విశ్వనాథం కళ్ళనుండి టపటప నీటిబొట్లు ఫోన్‌పై పడసాగాయి.

‘నేనీరోజు ఇంత సదుపాయంగా ఉండగలుగుతున్నానంటే... అదంతా శాంత ముందే ప్లాన్‌ చేసిపెట్టిందా?’ అప్రయత్నంగా శాంత ఫొటో వద్దకు నడిచాడు విశ్వనాథం. రెండు చేతులూ జోడించి భగవంతుడికి దండం పెట్టినట్లుగా శాంత ఫొటోకి దండం పెట్టాడు. అంతలోనే ఫొటోను దగ్గరికి తీసుకుని తన పెదవులను ఆన్చి ‘థాంక్యూ శాంతా. నాకోసం నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నావు..! నువ్వు ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా నా బాగోగులను చూసుకుంటున్నావు. అయినా, నువ్వులేని లోటు లోటే. నన్ను కూడా నీ దగ్గరికి తొందరగా తీసుకెళ్ళవూ’ అనుకున్నాడు భారమైన మనసుతో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.