close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష్మణుడి కంకణం జారిపడింది ఇక్కడే..!

సాక్షాత్తూ లక్ష్మణస్వామి ప్రతిష్ఠించిన దివ్యలింగమది. త్రేతాయుగంనాటి ఆ శైవక్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీయాత్ర చేసినంత పుణ్యమని చెబుతారు. కోరిన కోర్కెలు తీర్చే ఆ ముక్కంటి ఈ క్షేత్రంలో భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాలక్ష్మణేశ్వరాలయానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

రామాయణంలో రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు. ఇద్దరూ వేదవేదాంగాలనూ నీతిశాస్త్రాలనూ అభ్యసించినవారే. కానీ ఒక్కటే భేదం. రాముడు ధర్మంవైపు నిలబడితే, రావణుడు అధర్మాన్ని నమ్ముకున్నాడు. అందుకే తప్పని తెలిసినా సీతమ్మను అపహరించి రామరావణ యుద్ధానికి తెరతీశాడు. రామలక్ష్మణుల శక్తియుక్తులను తక్కువగా అంచనావేసి కదనరంగంలో అడుగుపెట్టాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అధర్మాన్ని అంతమొందించాలి కానీ మనుషులను కాదన్నది రామలక్ష్మణుల వాదన. అందుకే రావణుడిని హతమార్చినందుకు పశ్చాత్తాపం చెందుతారు. బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి తగిన ఉపాయాన్ని సూచించాల్సిందిగా తమ కులగురువైన వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తారు. దీంతో వశిష్ఠుడు వారికి రెండు కంకణాలు ఇస్తాడు. వాటిని ముంజేతులకు ధరించి దేశ సంచారం చేయమనీ ఆ కంకణాలు ఎక్కడైతే జారిపడతాయో ఆ ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి, అభిషేకించడం ద్వారా బ్రహ్మహత్యాపాతం నుంచి విముక్తి పొందొచ్చనీ చెబుతాడు. అలా బయలుదేరిన లక్ష్మణుడి కంకణం నేటి పశ్చిమగోదావరి జిల్లాలోని లక్ష్మణేశ్వరంలో పడుతుంది. దీంతో లక్ష్మణుడు ఆ ప్రాంతంలో శక్తి సమేతంగా శివలింగాన్ని ఏర్పాటుచేసి, దగ్గరలోని గోదావరి నదీజలాలతో అభిషేకిస్తాడు. అలా శక్తితో కలిపి పూజలందుకుంటున్న శివలింగం కాబట్టే ఈ క్షేత్రంలో కొలువైన శివయ్యకు దుర్గాలక్ష్మణేశ్వరుడు అనే పేరొచ్చింది. ఇక్కడి స్వామి చాలా మహిమాన్వితుడని ప్రసిద్ధి.

రాజుల కాలంలో... 
ఒకవైపు గోదారమ్మ పరవళ్లూ... మరోవైపు మైమరపించే ప్రకృతి అందాలూ... ఇంకోవైపు లక్ష్మణస్వామి పూజించిన శివలింగం... ఇక్కడికి చేరుకున్న భక్తులకు ఒక మరపురాని మధురానుభూతిని కలిగిస్తాయి. అయితే దీని వెనక శతాబ్దాల కిందట మొగల్తూరు కోటను పరిపాలించిన రాజుల కృషి ఎంతో ఉంది. వీరు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంతోపాటు వంద ఎకరాల మెరక భూమిని ఆలయ అభివృద్ధికి కేటాయించారు. స్వామివారికి విశేష పూజలూ ఉత్సవాలూ లోటులేకుండా జరిపించేవారు. తర్వాతి కాలంలో ఎన్నో మార్పులూ చేర్పులూ చోటుచేసుకున్నప్పటికీ ఈ భూములమీద వచ్చిన ఆదాయంతోనే నేటికీ ధూపదీప నైవేద్యాలను సమర్పించడం గమనార్హం. దుర్గాలక్ష్మణేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దుర్గాదేవి విగ్రహాలతోపాటు గ్రామదేవత అయిన గోగులమ్మ అమ్మవారూ కొలువై ఉన్నారు. శంకరయ్యతోపాటూ వీరికీ ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

వేడుకలు ఇలా... 
ఈ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ఆ జంగమయ్యను దర్శించుకుని, ఆయనకు విన్నవించిన ఏ కోరిక అయినా తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అయితే భక్తులు తమ కోర్కెలు నెరవేరగానే మళ్లీ దుర్గాలక్ష్మణేశ్వరుడిని దర్శించుకుని మొక్కుచెల్లించుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున తొలిసంధ్య నుంచే స్వామికి వివిధ అభిషేకాలూ, సహస్రనామార్చనలూ, విశేష అలంకారాలూ ప్రారంభమైపోతాయి. తెల్లవారుజామున మొదలైన ఈ అభిషేకాలు లింగోద్భవ కాలంవరకూ కొనసాగడం విశేషం. ఆ రాత్రికి పార్వతీపరమేశ్వరులకు కల్యాణం చేస్తారు. అనంతరం దేవేరితో కొలువైన శివయ్యను పురవీధుల్లో రథంమీద ఊరేగిస్తారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజు నుంచీ అయిదురోజుల పాటు వార్షికోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఇందులో దుర్గాలక్ష్మణేశ్వరుడికి జరిగే తెప్పోత్సవం ముఖ్యమైంది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

ఇలా చేరుకోవచ్చు 
దుర్గాలక్ష్మణేశ్వరుడి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంతోపాటు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అన్ని ప్రధాన పట్టణాల నుంచీ నరసాపురానికి బస్సు సౌకర్యం ఉంది. బస్టాండు నుంచి బస్సు లేదా ఆటోరిక్షాలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. లక్ష్మణేశ్వరానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో నరసాపురం రైల్వేస్టేషన్‌ ఉంది. స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

- కరింశెట్టి శ్రీనివాసు, న్యూస్‌టుడే, నరసాపురం

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.