close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యాపారం వాళ్లది... లాభం మనది!

ఏ వ్యాపారానికైనా- పెట్టుబడికీ డబ్బే కావాలి, ప్రతిఫలంగానూ డబ్బే రావాలి. సామాజిక వ్యాపారానికి అలా కాదు... ఇక్కడ ఆలోచనా ఆచరణా అన్నీ మనుషుల చుట్టే తిరుగుతాయి. ప్రతిఫలమూ వారికే అందుతుంది. అందుకేనేమో డబ్బు సంపాదించే స్టార్టప్‌లకన్నా పదిమందికీ మంచి చేసే సామాజిక వ్యాపారంలోనే కిక్‌ ఉందంటున్నారు మిలెనియల్‌ ఎంట్రప్రెన్యూర్లు. చదివింది ఐఐటీ అయినా హార్వర్డ్‌ అయినా తాము చేసే పని తాలూకు ఫలితం మాత్రం ఎవరికి చేరాలో కచ్చితంగా ఆలోచించుకుని మరీ వ్యాపారంలో అడుగుపెడుతున్నారు!

కుంకుడుకాయలకి చాలా సీనుంది!

అది ఒడిశాలోని ఒక పల్లె. ఓ రైతు పెరట్లో వరసగా ఐదారు కుంకుడు చెట్లను చూసిన ఒక యువకుడు లోపలికి వెళ్లి ‘కాయలు అమ్ముతారా’ అని అడిగాడు. అది విని ఆ రైతు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎప్పుడో పాతికేళ్లక్రితం వాళ్లన్నయ్య చెప్పాడట- ఇంటెనకాల కుంకుడుచెట్లు వెయ్యి, వాటి విలువ తెలిసే రోజొకటి వస్తుందీ అని. అప్పుడు వేసిన చెట్లు పెరిగి కాయలు కాస్తున్నాయి. ఎండి రాలిపోతున్నాయి. రెండురూపాయలకు షాంపూ పాకెట్‌ వస్తుండగా కుంకుడుకాయలు వాడేదెవరు. ఇవాళ నువ్వు వాటిని అమ్ముతారా అంటే అన్నయ్య మాట గుర్తొచ్చింది- అన్నాడా రైతు. ఇప్పుడు ఒడిశా, ఉత్తరాంచల్‌ ప్రాంతాల్లోని అలాంటి ఎందరో గిరిజన రైతులకు కుంకుడుకాయల్ని ఆదాయమార్గంగా మార్చిన ఆ యువకుడు మానస్‌ నందా. ‘బబుల్‌నట్‌ వాష్‌’ బ్రాండ్‌ సృష్టికర్త.  
మానస్‌ భువనేశ్వర్‌ ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదివి ఆ తర్వాత ఆర్థిక రంగంపట్ల ఆసక్తి పెరిగి అమెరికాలోని సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సర్టిఫికెట్‌ పొందాడు. ఆర్థిక విశ్లేషకుడిగా పనిచేస్తుంటే డబ్బొస్తోంది కానీ తృప్తి లేదు. దాంతో చుట్టూ ఉన్న పరిస్థితుల్ని పరిశీలనగా చూడడం అలవాటయింది. ఆ క్రమంలో తెలుసుకున్న విషయాలు అతడికి నిద్రపట్టనివ్వలేదు. డియోడరెంట్లు, రూమ్‌ఫ్రెషనర్లతో మొదలెట్టి సబ్బులూ షాంపూలూ డిటర్జెంట్లవరకూ అన్నిట్లోనూ క్యాన్సర్‌ కారక రసాయనాలేననీ, వాడేసిన తర్వాత కూడా ఆ నీరు డ్రెయిన్ల ద్వారా వెళ్లి జలవనరులపై, జలచరాలపై ప్రభావం చూపుతోందనీ తెలిశాక జీవితం పట్ల అతడి దృక్పథమే మారిపోయింది. ఇష్టంగా చేపట్టిన వృత్తి మానేసి ఓ ఎన్జీఓలో చేరి గ్రామాల్లో పనిచేశాడు. ఆ అనుభవంతో సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకున్నాడు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఎంబీఏ చేసొచ్చాడు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు చూపించడం లక్ష్యంగా ‘హార్వెస్ట్‌ వైల్డ్‌’ పేరుతో ఓ సంస్థను పెట్టి రంగంలోకి దిగాడు. ఐఐఎం-బెంగళూరు వారి ఇంక్యుబేషన్‌ సెల్‌లో స్నేహితులతో చర్చలు జరుపుతున్నప్పుడు వచ్చింది ‘బబుల్‌నట్‌వాష్‌’ ఆలోచన. దాన్ని ఆచరణలో పెట్టడానికి సొంతూరికి వెళ్లి ఓ బస్తాడు కుంకుడు కాయలు కొని ప్రయోగాలు మొదలుపెట్టాడు. వాటితో షాంపూలను తయారుచేయడమే అందరికీ తెలుసు. మానస్‌ మాత్రం వాటితో పలురకాల క్లీనర్లు తయారుచేశాడు. బట్టలు ఉతకడానికీ ఇల్లు తుడవడానికీ పిల్లల స్నానానికీ... ఇలా దాదాపు డజను ఉత్పత్తులు అందులో ఉన్నాయి. వాటిని ఆన్‌లైన్‌లోనూ నగరాల్లోని సూపర్‌మార్కెట్లలోనూ విక్రయిస్తున్నాడు. మానస్‌ ప్రారంభించిన ఈ స్టార్టప్‌ వల్ల ఇప్పుడు- గ్రామాల్లోని యువతకు పని దొరికింది, కుంకుడు కాయలు సేకరించే గిరిజనులకు ఏడాది పొడుగునా ఆదాయం వస్తోంది, మరో పక్క ఎలాంటి రసాయనాలూ లేని, పర్యావరణానికి సైతం హాని చేయని సేంద్రియ డిటర్జెంట్‌ ఉత్పత్తులు వినియోగదారులకు లభిస్తున్నాయి. 

ఈ పత్రిక ప్రత్యేకం!

పొద్దున్నే లేచి న్యూస్‌పేపరు చదవందే రోజు గడవదు చాలామందికి. మరి చూపులేనివాళ్ల సంగతేమిటి... టీవీలో వార్తలు వింటే పేపరు చదివిన ఆనందం రాదు కదా... ఈ సందేహమే వచ్చింది ఉపాసనా మాకాటికి. ఈ ముంబయి యువతి జర్నలిజంలో డిగ్రీ చేసి కెనడా వెళ్లి పై చదువులు చదివి మంచి జీతంతో ఉద్యోగమూ సంపాదించింది. కానీ కొన్నాళ్లు చేసేసరికి ఉద్యోగం బోర్‌కొట్టింది. ఓరోజు తీరిగ్గా కూర్చుని ఇంట్లో పత్రికలన్నీ తిరగేస్తున్నప్పుడు వచ్చిందా ఆలోచన. చూపులేనివారు పత్రికలు ఎలా చదువుతారూ అని. వెంటనే గూగుల్‌లో వెతికి బ్రెయిలీలో ఒక్క పత్రికా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. ఏదైనా ఒక సందేహం వస్తే దాని అంతు తేల్చుకునేదాకా ఊరుకోకపోవడం ఉపాసన స్వభావం. అందుకే తన రిసెర్చ్‌ కొనసాగించి ప్రపంచంలో ఉన్న అంధుల్లో 40శాతం మనదేశంలోనే ఉన్నారనీ వారికోసం పత్రికలు కాదు కదా పుస్తకాలూ అంతంతమాత్రమేననీ తెలుసుకుంది. ఉద్యోగం మానేసి స్వదేశానికి తిరిగొచ్చింది. దాదాపు కోటిన్నర మంది ప్రజలు వార్తాపత్రికలకు దూరంగా ఉంటే వారి గొంతు సమాజానికి విన్పించేదెలా అనుకున్న ఉపాసన ముంబయిలోని నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద బ్లైండ్‌ కార్యాలయానికి వెళ్లి డైరెక్టర్‌తో మాట్లాడింది. ఉద్యోగాలు చేస్తున్న, చదువుకుంటున్న అంధులతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. తమకంటూ ఒక పత్రిక ఉంటే తప్పకుండా కొని చదువుకుంటామన్న వారి సమాధానంతో ఆమెకు తానేం చేయాలో తెలిసింది. ‘వైట్‌ప్రింట్‌’ పేరుతో బ్రెయిలీలో 64 పేజీల మాసపత్రికను ప్రారంభించింది. దేశంలో బ్రెయిలీలో వెలువడుతున్న తొలి ఇంగ్లిష్‌ పత్రిక అయిన వైట్‌ప్రింట్‌లో రాజకీయాల నుంచి సినిమాలూ క్రీడల దాకా అన్నిరకాల వార్తలూ ఉంటాయి. పత్రిక నడవాలంటే ప్రకటనలూ కావాలి కాబట్టి కార్పొరేట్‌ సంస్థలతో మాట్లాడి తొలి సంచికకే రేమండ్స్‌ ప్రకటన సంపాదించింది. పేజీ తిప్పేటప్పుడు ప్రకటన వినిపించేలా మ్యూజికల్‌ గ్రీటింగ్‌ కార్డు తరహాలో కోకకోలా ప్రకటనని ప్రచురించి సృజనాత్మకంగా ఆలోచిస్తే ఏదైనా సాధ్యమేనని నిరూపించింది. అలా ఐదేళ్లుగా ఉపాసన నిరంతరాయంగా పత్రికను ప్రచురిస్తూ అంధులకు పత్రిక చదివే ఆనందంతో పాటు అందులో తమ అనుభవాల్నీ ఆకాంక్షల్నీ రాసుకునే అవకాశాన్నీ ఇస్తోంది. ఉద్యోగంలో కొనసాగితే తన దగ్గర డబ్బు మాత్రమే ఉండేదనీ, ఇప్పుడు ఎనలేని సంతృప్తితోపాటు ఏ డబ్బుతోనూ కొనలేని వేలాది పాఠకుల ప్రేమ ఉందనీ గర్వంగా చెబుతోంది నిండా మూడు పదులన్నా నిండని ఉపాసన.

కాలుష్యం ఇంక్‌ అయ్యింది...

అనిరుధ్‌ శర్మ ఓసారి కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. అక్కడ డీజిల్‌ జనరేటర్‌ పైప్‌ నుంచి సూక్ష్మరేణువులుగా వెలువడుతున్న నల్లని మసి గోడమీద ఒక ఆకృతిలో పేరుకోవడం అనిరుధ్‌ని ఆకర్షించింది. దాన్ని ఫొటో తీసుకున్నాడు. ఆ తర్వాత చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయాడు. ఆరేళ్ల కిందటి సంగతిది. ఓరోజు ఏదో పుస్తకం చదువుతుంటే ‘కాలుష్యం అంటే మనం ఇంకా ఉపయోగించడం మొదలుపెట్టని ముడిసరుకు’ అన్న మాటలు కన్పించాయి. ఒకటికి రెండుసార్లు ఆ మాటలు చదివిన అనిరుధ్‌కి తాను ఫామ్‌హౌస్‌ దగ్గర తీసిన ఫొటో గుర్తొచ్చింది. కొత్త కోణంలో ఆలోచించడం మొదలెట్టాడు. వాహనాల సైలెన్సర్‌లో నల్లటి మసిలా పేరుకునేదాన్ని ప్రింటింగ్‌ ఇంక్‌గా ఎందుకు వాడకూడదన్న ఆలోచనతో స్వదేశం వచ్చి ప్రయోగాలు చేశాడు. ఆ క్రమంలో అనిరుధ్‌, అతని స్నేహితులూ చాలా సాహసాలే చేశారు. ప్రయోగాలు వికటించి ఆ మసి అంతా వీరి మొహాలకు అతుక్కుపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఎలాగైతేనేం చివరికి ‘ఎయిర్‌ ఇంక్‌’ తయారుచేశారు. 

వాహనాల సైలెన్సర్‌లో ఓ పరికరాన్ని అమర్చి అందులోకి చేరిన కాలుష్యాన్నంతా వడపోసి కార్సినోజెన్లూ, లోహమిశ్రమాల్లాంటివాటిని తొలగించి మిగిలినదాన్ని ఇంక్‌ లాగా తయారుచేశాడు. మామూలు ఇంక్‌ లాగే దీన్ని వాడవచ్చని అందరూ సర్టిఫికెట్‌ ఇచ్చాక అనిరుధ్‌ గ్రావికీ ల్యాబ్స్‌ అనే సంస్థను ఏర్పాటుచేసి కాలుష్యాన్ని సేకరించే పరికరాలను తయారుచేస్తున్నాడు. సేకరించిన కాలుష్యంతో ఎయిర్‌ఇంక్‌ పేరుతో పెన్నుల్నీ తయారుచేస్తున్నాడు. వెలువడుతున్న కాలుష్యంలో 30శాతాన్ని సేకరిస్తే చాలు మొత్తం ప్రపంచానికి అవసరమైన ఇంక్‌ తయారవుతుందనే అనిరుధ్‌ తన ఆవిష్కరణతో అటు కాలుష్యాన్నీ తగ్గించవచ్చనీ, ఇటు దాన్ని తిరిగి ఉపయోగించవచ్చనీ నిరూపించాడు. చిన్నప్పటినుంచీ అనిరుధ్‌కి టెక్నాలజీ అంటే ఇష్టం. బికనేర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరాడు కానీ ఏనాడూ క్లాసులో కూర్చుని పాఠం వినలేదు. టెక్నోఫెస్ట్‌లకు వెళ్లడం కొత్త కొత్త పరికరాలు ప్రదర్శించడం, ప్రైజులు తీసుకుని రావడం... ఆ అనుభవంతో ఇంజినీరింగ్‌ పూర్తిచేయకుండానే బెంగళూరులో హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ ఇండియా శాఖలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడ ఉండగానే అంధులు రోడ్డు మీద నడిచేందుకు దారిచూపేలా ‘లే చల్‌’ పేరుతో పాదరక్షల్లో అమర్చే పరికరాన్ని తయారుచేశాడు. ఆ ఆవిష్కరణే అతడికి ‘ఎంఐటీ ఇన్నొవేటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుతో పాటు ఎంఐటీ మీడియా ల్యాబ్స్‌లో ప్రవేశమూ కల్పించింది. ‘కొత్తది తయారుచేయడం ఆనందం, అది వాడినవాళ్లు ఉపయోగకరంగా ఉందని చెబితే మరింత ఆనందం...’ అంటాడీ ఆవిష్కర్త.

ఊరి రుచులు నగరానికి...

అమ్మ పంపింది... అంటూ నగరాల్లో ఉద్యోగాలు చేసుకునేవాళ్లు ఊరి నుంచి వచ్చిన తినుబండారాల్నీ పచ్చళ్లనీ పొడుల్నీ ఇష్టంగా దాచుకుని తినడంతో పాటు సన్నిహితులకూ ఇస్తుంటారు. ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక పచ్చడో పొడో అని కాకుండా మన ఊళ్లో మన రైతులు పండించిన ధాన్యమే మనం వాడుకోవడానికి వీలుగా తయారై నేరుగా మన ఇంటికి వస్తే..? దళారుల చేతులు మారి నెలల తరబడి నిల్వ ఉండి, రకరకాల ప్రాసెసింగ్‌కి గురై సూపర్‌మార్కెట్ల ద్వారా మనకి చేరే ఆహారపదార్థాలకన్నా తప్పకుండా అవి రుచికరంగానే ఉంటాయి. ఆ పనే చేస్తోంది ఇండియా ఫార్మ్‌ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఆ సంస్థ తయారుచేస్తున్న ఉత్పత్తులను ‘ఫార్మ్‌వేద’ అనే బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తోంది. అనంతపురం రైతు పండించిన వేరుశనగల పొడీ, ఆదిలాబాద్‌ రైతు పండించిన కందుల పొడీ మాత్రమే కాదు 14 రకాల రడీటుఈట్‌ ఆహారపదార్థాలను నేరుగా మన ఇంటికి తెచ్చేస్తుంది ఈ ఫార్మ్‌వేద. దీని వెనక ఏ కార్పొరేట్‌ సంస్థా లేదు. మరెలా అంటే... ‘అమూల్‌’ తరహాలో చిన్న, సన్నకారు రైతులకోసమూ ఓ సహకారోద్యమం చేపడితే ఆత్మహత్యలు తగ్గుతాయేమోనన్న ఆలోచన వచ్చింది బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్‌కి. పల్లెల్లో తిరిగి రైతుల్ని సంఘటితపరిచి పదిహేనేళ్లక్రితమే సెంటర్‌ ఫర్‌ కలెక్టివ్‌ డెవలప్‌మెంట్‌ని(సీసీడీ) ఏర్పాటుచేశారు ఆయన. ఇప్పుడు అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 45వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సీసీడీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ రైతులంతా సంఘాలుగా ఏర్పడి తమ ధాన్యాన్ని తామే శుభ్రంచేసి భద్రపరుచుకుని ధర వచ్చినప్పుడు అమ్మడం మొదలెట్టారు. ఆ తర్వాత ఇండియా ఫార్మ్‌ ఫుడ్స్‌ అనే మరో సంస్థను పెట్టి దాని ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌ కేంద్రాలను నెలకొల్పి ఇడ్లీ దోసె మిక్స్‌లూ, రడీటు ఈట్‌ అల్పాహారాలనూ కూడా రైతుల ఆధ్వర్యంలోనే తయారుచేయిస్తున్నారు. ఈ ఉత్పత్తులన్నీ ‘ఫార్మ్‌వేద’ బ్రాండ్‌ పేరుతో ఆన్‌లైన్‌లో  విక్రయిస్తున్నారు. అజ్ఞాతంగా ఉండడానికి ఇష్టపడే ఆ ప్రొఫెసర్‌ ఆలోచనని ఆచరణలో పెడుతున్న ‘టీమ్‌ ఫార్మ్‌వేద’లో కీలకపాత్ర పోషిస్తున్నారు సీఈఓ కౌశలేంద్ర యాదవ్‌తోపాటు శివం శుక్లా, మైత్రేయి గుప్తాలు. కౌశలేంద్ర ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్నాడు. ఎన్నో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు మారాడు. ఎక్కడా అతడికి ఉద్యోగంలో సంతృప్తి లభించలేదు. ఐఐటీ పూర్వవిద్యార్థుల బాధ్యతల్లో భాగంగా వ్యవసాయ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు సీసీడీ గురించి తెలిసి వెంటనే చేరిపోయాడు. తాము చేపడుతున్న కార్యక్రమాల వల్ల పొలంలో పండిన పంట అతి తక్కువ సమయంలోనే వంటింటి బీరువా దాకా చేరడమే కాక మొత్తం ప్రయాణమంతా రైతు పర్యవేక్షణలోనే జరుగుతోందనీ లాభాలనూ రైతులకే పంచుతున్నామనీ చెబుతాడు కౌశలేంద్ర. ‘వేరుశనగల్ని రైతులు కిలో రూ.40కి అమ్ముతారు. అదే పల్లీల పొడి అయితే కిలో రూ.400కి అమ్మొచ్చు. ఆ పనే ఫార్మ్‌వేద చేయూతతో రైతులు చేస్తున్నారు. ప్రస్తుతం 14 రకాల ఉత్పత్తులు తయారుచేస్తున్నాం. క్రమంగా వీటిని పెంచుతూవెళ్తాం’ అని చెప్పే కౌశలేంద్ర ఏ ఉద్యోగంలోనూ దొరకని తృప్తిని ఇక్కడ పొందుతున్నానంటాడు. 

తనలా మరొకరు కాకూడదని...

నాలుగేళ్ల క్రితం ఓరోజు హర్ష్‌ సోంగ్రాకి అర్ధరాత్రి 2గంటలకే మెలకువొచ్చింది. ఫేస్‌బుక్‌లో నోటిఫికేషన్‌ సౌండ్స్‌ ఆగకుండా వస్తోంటే కళ్లు నులుముకుని చూశాడు. ఫేస్‌బుక్‌ సీఓఓ షెరిల్‌ శాండ్‌బర్గ్‌ హర్ష్‌ గురించి ఓ పోస్ట్‌ రాసింది. దాన్ని అందరూ లైక్‌ చేసి షేర్‌ చేస్తుండడంతో అతనికి ఆగకుండా నోటిఫికేషన్స్‌ వస్తున్నాయి. హర్ష్‌కి ఆనందంతో నోట మాటరాలేదు. అమ్మానాన్నల్ని నిద్రలేపి ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. ఫేస్‌బుక్‌ సీఓఓ ప్రశంసలందుకోవడానికి హర్ష్‌ ఏం చేశాడంటే... ఓ ఆండ్రాయిడ్‌ ఆప్‌ తయారుచేశాడు. 19 ఏళ్ల అబ్బాయి ఆప్‌ తయారుచేయడంలో విశేషమేముందీ అంటే... అతడు అందరు పిల్లల్లా ఆరోగ్యంగా ఉన్నవాడు కాదు. హర్ష్‌ సోంగ్రా భోపాల్‌ దగ్గర ఒక చిన్న ఊళ్లో పుట్టిపెరిగాడు. తల్లిదండ్రులు గుర్తించలేకా సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకా తొమ్మిదేళ్ల దాకా ఆ అబ్బాయికి డిస్ప్రాక్సియా (ఇంద్రియాల మధ్య సమన్వయం లేకపోవటం) అనే సమస్య ఉన్నట్లు తెలియలేదు. ఎదుగుదలకి సంబంధించిన సమస్యలు ఆలస్యమైన కొద్దీ నయమవడం కష్టమవుతుంది. హర్ష్‌ విషయంలోనూ అదే జరిగింది. అయితే హార్డ్‌వేర్‌ ఇంజినీరైన తండ్రి కొడుకు చేత కంప్యూటర్‌లో వీడియో గేమ్స్‌ ఎక్కువగా ఆడించేవాడు. దాంతో హర్ష్‌ సమస్యని అధిగమించగలిగాడు. 16వ ఏటనుంచీ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ పొందాడు. అలాంటి అబ్బాయి తనలాగా ఇతరులు బాధపడకూడదనుకుని స్వయంగా తయారుచేసిందే ‘మై చైల్డ్‌’ అనే ఆప్‌. రెండేళ్ల లోపు పిల్లల తల్లిదండ్రులు ఆ ఆప్‌ సాయంతో పిల్లల్లో ఎలాంటి ఎదుగుదల లోపాలున్నా కనిపెట్టి వెంటనే నిపుణుల సలహా తీసుకోడానికి వీలవుతుంది. చిన్న చిన్న ప్రశ్నల ద్వారానే నిమిషంలో ఆ తేడాలను కనిపెట్టగలిగేలా హర్ష్‌ దీన్ని తయారుచేశాడు. వందకు పైగా దేశాల్లో తల్లిదండ్రులు ఇప్పుడీ ఆప్‌ని వినియోగిస్తున్నారు. ఏం తేడా ఉందో, ఏ నిపుణుడిని కలవాలో సూచిస్తుందీ ఆప్‌. అయినా అది తల్లిదండ్రులకు పెద్ద వరమే. చీటికీ మాటికీ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లనక్కరలేకుండానే సమస్య ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఆప్‌ డెవలపర్లను ప్రోత్సహించడానికి ఫేస్‌బుక్‌ సంస్థ నిర్వహించే ‘ఎఫ్‌బి స్టార్ట్‌’ కార్యక్రమానికి దాదాపు 500 మంది డెవలపర్లు హాజరు కాగా వారిలోనుంచి శాండ్‌బర్గ్‌ హర్ష్‌ని మాత్రమే ఎంచుకోవడానికి కారణం ఆ ఆప్‌. అలా హర్ష్‌ సోంగ్రా ఇరవయ్యేళ్లకే సొంత సంస్థకి సీఈవో అయిపోయాడు. ‘వియ్‌ఇన్‌క్లూడెడ్‌’ అనే వెబ్‌సైట్‌లో దివ్యాంగుల కోణంనుంచీ సమాజాన్ని చూడమంటూ వ్యాసాలూ రాస్తుంటాడు. 

సొంతలాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్‌... అన్న కవి మాటలను అక్షరాలా ఆచరణలో చూపుతున్న ఆధునిక వ్యాపారవేత్తలు వీరంతా.

సృజననే ముడిసరుకుగా చేసి, ఐఐటీ చదువుల్నీ విదేశీ శిక్షణల్నీ పెట్టుబడిగా పెట్టి, తాము గెలవడంతోపాటు తోటివారినీ గెలిపిస్తున్న ఇలాంటి యువతకు జేజేలు చెప్పొద్దూ..?!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.