close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉచితంగా తిరుపతి తీసుకెళ్తారు

ఇల వైకుంఠపురంగా తిరుమలను చెప్పుకుంటుంటే ఆ చెవులు విని సంతోషపడతాయి. శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని వర్ణిస్తుంటే ఆయన దర్శనం కోసం ఆ కళ్లు తహతహలాడతాయి. కొండ మీది వాతావరణం గురించి విన్నప్పుడల్లా ఆ ఆనందాన్ని అనుభవించేందుకు తనువంతా ఎదురుచూస్తుంది. కానీ స్వామి కొండ మీది ఒక్క మెట్టైనా ఎక్కేందుకు కాళ్లుండవు. మొక్కేందుకు చేతులూ సహకరించవు. అన్నీ ఉన్నా అంతదూరం వెళ్లేందుకు రోజువారీ బతుకుల్లో రూపాయి మిగులే ఉండదు. అలాంటి వందల మందికి శ్రీవారి దర్శనాన్ని ఉచితంగా చేయిస్తోంది ‘చుక్కల చారిటబుల్‌ ట్రస్టు’.

తిరుమలలో వెలసిన శ్రీవారు సాక్షాత్తూ శ్రీమహావిష్ణు స్వరూపుడని హిందువులు విశ్వసిస్తారు. చేరి కొలిచిన వారి కోర్కెలు తీర్చే కొంగుబంగారు కొండలరాయుడిగా భక్తులు ఆయన్ను కొలుస్తారు. నిలువునా ముంచేసేంత ఆపదొచ్చినా నిలువు దోపిడీ మొక్కితే చాలు ఆయన గట్టెక్కించేస్తాడన్న ధీమా వాళ్లది. అందుకే, ఏం కావాలన్నా ‘కొండకొస్తాం స్వామీ’ అని మొక్కేస్తుంటారు. కానీ, ఎంత కష్టమొచ్చినా అదే మొక్కు మొక్కడానికి వెనకాడతాడు కడుపునిండా అన్నానికే నోచుకోని పేదవాడు... వడ్డికాసులవాణ్ణి చేరేందుకు బోలెడు కాసులు కావాలి మరి! ఇక దివ్యాంగుల పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. ఇలాంటి వారందరికీ స్వామి దర్శనం చేయించడమే పరమావధిగా పనిచేస్తోంది హైదరాబాద్‌లోని అష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్టు. ఇప్పటి దాకా పదిహేను వందల మందికిపైగా ఈ ట్రస్టు ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ఆలోచన...
హైదరాబాద్‌కు చెందిన వేణుకుమార్‌ స్థిరాస్తి వ్యాపారి. 1996లో ఓ రోజు శ్రీనివాసుడి రూపం కలలో కనిపించడంతో స్వామి దర్శనం కోసం మొదటిసారి తిరుమలకు కాలినడకన వెళ్లారు. తర్వాత పూర్తిగా స్వామి భక్తుడిగా మారారు. ఒకసారి మెట్లమార్గంలో తిరుమలకు వెళ్లినప్పుడు గతంలో వచ్చినవారు ఎదురయ్యారు. స్వామి సన్నిధికి ఎప్పుడూ వచ్చినవాళ్లే వస్తుంటారా లేక అసలు చూడని వాళ్లూ ఉంటారా... అనే ఆలోచన అప్పుడే ఆయనకు వచ్చింది. దాన్నే తన సన్నిహితుడు శ్రీనివాసశర్మతో పంచుకున్నారు. ఆయన ఈ విషయం తెలుసుకునేందుకు నాగోల్‌లో ఉన్న శివాలయంలో ‘ఇప్పటి వరకూ తిరుమల వెళ్లనివాళ్లు ఎవరైనా ఉంటే ఒకసారి సంప్రదించమంటూ’ మైకులో అనౌన్సు చేశారు. ఆ సమయంలో గుళ్లో ఉన్న భక్తుల్లోని 35 మంది స్పందించారు. వెళ్లకపోవడానికి కారణం తెలుసుకుంటే వారిలో కొంతమంది పేదవారూ, మరికొందరు దివ్యాంగులూ ఉన్నారు. వాళ్లని ఎలాగైనా తిరుమల తీసుకువెళ్లాలని వేణుకుమార్‌ అప్పటికప్పుడు నిశ్చయించుకున్నారు. అందుకోసం, హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానమున్న 108కి తన ఇంటిపేరు
‘చుక్కల’ను కలిపి అష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్టును స్థాపించారు.

ఎంపిక ఇలా...
మిత్రుల ఆర్థికసహాయంతో ట్రస్టు ఏర్పాటు చేసిన సంవత్సరమే 39మందిని ఎంపిక చేసి తిరుమల తీసుకెళ్లారు. వీరంతా నిరుపేదలూ, పక్కన అండ లేకుండా ఒక్క అడుగూ వేయలేని దివ్యాంగులే. ప్రస్తుతం ట్రస్టు వాళ్లు దర్శనానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాక ఆరునెలల ముందు దాని గురించి పత్రికల్లో ప్రకటన ఇస్తున్నారు. ఆ ప్రకటనలో ఫోన్‌ నంబర్‌తో పాటు దర్శనానికి ఎప్పుడు తీసుకెళతారూ అన్న వివరాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్లు సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలి. అప్పుడు ట్రస్టు సభ్యులు వాళ్ల దగ్గరకు వెళ్లి ఆర్థిక పరిస్థితీ, మిగిలిన వివరాలూ నిజమాకాదా నిర్థరించుకుంటారు. ఎంపిక చేసిన వారికి రానూ పోనూ ఛార్జీలూ, భోజనం, వసతీ అన్నీ ఉచితంగా అందిస్తారు. అందరిలాగే కాలి నడకన స్వామిని చేరుకున్నామన్న సంతృప్తి కల్పించడం కోసం దివ్యాంగులనూ నడకదారిలోనే స్వామి దగ్గరికి తీసుకెళతారు. అసలు నడవలేనివాళ్లని భుజాల మీద ఎత్తుకుని మరీ తీసుకెళతారు. దీని కోసం ట్రస్టుకు సుమారు ఐదువందల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ ఆశయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రసాద్‌కు తెలపడంతో, తిరుమలలో వసతీ, దర్శన సమయాల్లో ట్రస్టుకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరికీ రెండు వేల రూపాయలకుపైగా ఖర్చవుతుండటంతో దాతల సాయమూ తీసుకుంటున్నారు. వచ్చే అక్టోబరులో మరో విడత దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోనే ఎక్కువగా తమ సేవలు సాగుతున్నాయనీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎవరైనా ఆసక్తి చూపితే వాళ్లనూ తీసుకెళుతున్నామనీ చెబుతున్నారు ట్రస్టు సభ్యులు. దేవదేవుణ్ణి తొలిసారి దర్శించిన వీళ్ల ఆనందాన్ని చూస్తే తనకెంతో సంతృప్తిగా ఉంటుందనీ, స్వామి వారే తనతో ఈ పని చేయిస్తున్నాడనీ అంటారు వేణుకుమార్‌.

- జానపాటి వెంకట కొండయ్య, ఈనాడు పాత్రికేయ పాఠశాల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.