close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఏనుగుల ప్రపంచయాత్ర

ముందుగా కొచ్చి నగరం. అక్కడి నుంచి బెంగళూరు, దిల్లీ, తర్వాత లండన్‌ నగరానికి, ఆ తర్వాత నేరుగా అమెరికాకి...! ఇలా సాగుతుంది ఆ 101 ఏనుగుల ప్రపంచ యాత్ర. ఒక్కసారిగా నూటొక్క ఏనుగుల్ని తరలించాలంటే రోజూ వాటికయ్యే తిండీ, భద్రతా, వైద్య ఖర్చులూ భారీగా అవుతాయని అనుకుంటున్నారేమో! అంతలేదు. ఎందుకంటే ఇవన్నీ నిజం ఏనుగులు కాదు. ఏనుగుల ప్రతిమలు! ఇన్ని ఏనుగులు మూకుమ్మడిగా ఇప్పుడు ఎందుకు ప్రపంచ పర్యటన చేయాల్సి వస్తోందంటే...

పోతన భాగవతం మాట ఏమోకానీ నేటి మన భారతదేశ అడవుల్లోని ఏనుగులకి మాటలొస్తే ‘కావవే వరదా...’ అనే అంటాయి! ఓ వైపు దంతాల కోసం చంపేస్తున్న వేటగాళ్లు, మరోవైపు తరిగిపోతున్న అడవులూ, అడవుల్లోకి చొచ్చుకువస్తున్న జనావాసాలూ ఇవన్నీ మన ఏనుగుల సంఖ్యని భారీగా తగ్గించేశాయి. మరోవైపు మనుషులపైన ఏనుగుల దాడి కూడా పెరుగుతోంది. ఇలాంటి ఘటనలకి అడ్డుకట్టవేసి అటు ఏనుగులకీ, ఇటు అడవి సరిహద్దుల్లో నివసించే ప్రజలకీ ప్రమాదాలు రాకుండా చూసే పద్ధతుల మీద చైతన్యం తేవడమే ఈ ప్రదర్శనా, పర్యటనల లక్ష్యం. కో-ఎగ్జిస్ట్‌ పేరుతో జరగబోతున్న యాత్ర కోసం నూటొక్క ఏనుగుల ప్రతిమల్ని సిద్ధంచేశారు. లండన్‌కి చెందిన ఎలిఫెంట్‌ ఫ్యామిలీ, భారత్‌లోని ది రియల్‌ ఎలిఫెంట్‌ కలెక్టివ్‌, అశోకా ట్రస్ట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌(అట్రీ), షోలా ట్రస్టు... ఇవన్నీ కలిసి ఈ యాత్రను ఏర్పాటుచేస్తున్నాయి. కొచ్చి సముద్రతీరంలో ఈ నెల ఏడున మొదలైన ప్రదర్శన నెలరోజులపాటు ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రతిమల్ని బెంగళూరుకీ, అట్నుంచటు దిల్లీకీ తీసుకెళ్తారు. ఆ తర్వాత వీటిని లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్బర్ట్‌, రాయల్‌ పార్క్స్‌ మ్యూజియాల్లో ప్రదర్శనకి ఉంచుతారు. ఏడాది తర్వాత అమెరికా తీసుకెళ్తారు. అక్కడ వీటిని వేలం వేస్తారు. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని భారత్‌లో ఏనుగుల సంరక్షణ కోసం వినియోగిస్తారు.

ఆ ‘శత్రువుల’తోనే...
ఈ భారీ ఏనుగుల ప్రతిమలని లాంతానా కమారా అనే మొక్కలతో తయారుచేశారు. నిజానికి ఈ మొక్కని ఏనుగులకి శత్రువులని చెబుతుంటారు నిపుణులు. తెలుగు ప్రాంతాల్లో వీటిని తలంబ్రాల మొక్కా, అత్తాకోడళ్ల మొక్కా అని పిలుస్తుంటారు. గులాబీ, ఊదా రంగులతో కూడిన చిన్నపూలతో ఆకర్షణీయంగా ఉండే వీటిని ఆంగ్లేయులు రెండొందల ఏళ్లకిందట అలంకరణ మొక్కగా మనదేశానికి తీసుకొచ్చారు. ఇది క్రమంగా అడవుల్లోకి చేరి అక్కడ ఎకరాలకు ఎకరాలు విస్తృతంగా పెరిగింది. వీటి ఆకులు విషపూరితాలు కాబట్టి జంతువులేవీ వీటిని ముట్టవు! లాంతానా తన చుట్టూ మామూలు గడ్డినీ, ఇతర మొక్కల్నీ బతకనీయదు. దాంతో అడవుల్లో ఏనుగులకి ఇష్టమైన ఆహారం తగ్గిపోతోంది. అడవిలో వాటి వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రదర్శన ద్వారా చెప్పాలనుకున్నారు. కనుకే, ఏనుగుల భారీ ప్రతిమల్ని ఆ మొక్కలతోనే తయారుచేశారు!

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.