close

ముగింపు

- వలివేటి నాగచంద్రావతి

సాగరతీరం...  సంధ్యా సమయం. నురగల చిరునవ్వులతో తుళ్ళింతలు పెడుతూ ముందుకు వచ్చే లేలేత అలలు తమకు గిలిగింతలు పెడుతున్నట్టు పకపకలాడుతూ ఆడుకుంటున్నారు చిన్నారులు. వీచే చల్లగాలినీ అనంత సముద్ర సౌందర్యాన్నీ ఆస్వాదిస్తూ ఒడ్డునే సేదతీరుతూ ఆనందిస్తున్నారు కొందరు.

వీళ్ళచుట్టూనే తిరుగుతూ ఆ అందాల మీదా ఆనందాల మీదా ఏమాత్రం ఆసక్తి కనబరచకుండా ‘ఐసుక్రీములూ’, ‘వేరుశెనగలూ,’ ‘బెలూన్లూ’... అని అరుస్తూ అమ్మేస్తున్నారు చిల్లర వ్యాపారులు.
ఈ గందరగోళానికి దూరంగా ఓ పాడైపోయిన పడవ మరుగున కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకరి చేతిలో ఒకరి చేయి. ఇద్దరి కళ్ళనిండా నీళ్ళు. దిగిపోతున్న సూర్యుణ్ణి చూస్తూ వాళ్ళెంతసేపు అలా కూర్చున్నారో తెలీదు. క్షితిజంలోకి భానుడు జారాక తప్పదన్నట్టు చేతులలా పట్టుకునే భారంగా లేచారిద్దరూ. ‘పాత మిత్రుణ్ణి మరచిపోకు సుమా’ అని బేలచూపులతో లాలిస్తున్నట్టు నావని తడిమేరు. ఎక్కడ తరిగిపోతుందో దూరమన్నట్టు అడుగులో అడుగువేసుకుంటూ నడిచారు. అయినా నడవాల్సిన దారి కరిగేపోయింది. చీలిన మార్గం విడిపోయే
సమయాన్ని గుర్తుచేసింది.
‘‘నన్ను మర్చిపో సారికా.’’
‘‘సాధ్యమా సాగర్‌?’’
క్యాబ్‌ సారిక ముందుకొచ్చి ఆగింది. సాగర్‌ అప్పుడే వచ్చిన బస్సెక్కి చెయ్యి ఊపాడు. కలిసి బతకాలనుకున్న వారి జీవితాలు తలో దిక్కుకూ చెదిరిపోయాయి.
ప్రాణాలు ఎక్కడో వదిలేసి వచ్చినదానిలా నిస్తేజంగా హాస్టల్‌ రూమ్‌ చేరింది సారిక. త్రాణలేనిదానిలా మంచం మీద వాలింది. మనసంతా శూన్యం. ఆ శూన్యంలోకి భరించలేనంత బాధ వచ్చి చేరుతోంది.
రెండున్నరేళ్ళ తమ స్నేహం, ప్రేమ, అభిమానం, కట్టుకున్న స్వప్న సౌధాలు... వాటన్నిటినీ పెకలించాలంటే తనవల్ల అయ్యే పనా! ఆ పెకలించిన స్థానంలో అయిన గాయాన్ని ఏ ఔషధం మాన్చగలదు? తమ ఒక్కొక్క సమాగమంలోని మాధుర్యాన్నీ తలచుకుని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చింది సారిక. అతడు తోడవని భవిష్యత్తు ఎంత దుస్సహమో ఎంత అంధకారబంధురమో ఊహించి భయకంపితురాలైంది. ఎంత ఊరడించినా సమాధానపడటం లేదు హృదయం. ఈ విషాదం ఈ నరకం మోయలేనంటోంది గుండె. చచ్చిపోవటమే మేలని పరిష్కారం సూచిస్తోంది మనసు.
దిగ్గున లేచింది సారిక. కళ్ళు తుడుచుకుంటూ లెటర్‌పాడ్‌లో నాలుగు పంక్తులు రాసి ముగింపు చుక్క పెట్టింది.
‘‘సారికా’’ తలుపు తోసుకుంటూ వచ్చింది స్నేహితురాలు రాధ. గడియపెట్టని తన మందమతిని తిట్టుకుంటూ చప్పున ఉత్తరాన్ని దిండు కిందకి తోసి ఎర్రబడిన కళ్ళని పక్కకి తిప్పి బాత్‌రూమ్‌లోకి పరిగెత్తింది సారిక.
అసలే హడావుడి పిల్ల రాధ. ఇవేవీ గమనించనట్టు ‘‘ఏమిటీ, నువ్వింకా స్నానమే చెయ్యలేదా? కానివ్వు కానివ్వు తొందరగా. గౌతమి నిన్ను ఫంక్షన్‌కి తప్పకుండా తీసుకురమ్మని ఇందాక మళ్ళీ ఫోన్‌ చేసి చెప్పింది’’ అంది.
గౌతమి-రాధ రిలేటివ్‌. సారికకి కూడా పరిచయం.
‘‘ఉహుఁ, నేను రాను. నాక్కాస్త డల్‌గా ఉంది’’ మొహం తుడుచుకుంటున్నట్టు టవల్‌ అడ్డంపెట్టుకుని చెప్పింది సారిక బాత్‌రూమ్‌లోంచి వస్తూ.
‘‘అట్లా అయితే తప్పకుండా రావాల్సిందే. నీ మూడంతా బాగైపోతుందక్కడ. పద పద’’ సారికని గుమ్మంవైపు నెట్టుకుపోతూ అంది రాధ. రాధ అంతే, ఎదుటివాళ్ళకి మాట్లాడే సందివ్వదు. అంతా ‘వన్‌వే’.
సారిక ఎన్నెన్ని వంకలో పెట్టింది మానెయ్యటానికి.
‘‘ఉహూఁ, నేనేమీ వినను. ఎంత- గంటలో- అది కేకు కొయ్యగానే వచ్చేద్దాం సరేనా’’ తాడు కట్టి బలవంతాన లాక్కుపోతున్నట్టే తీసుకువెళ్ళిపోయింది రాధ సారికని.
పడుచుతనం పరవళ్ళు తొక్కుతోంది గౌతమి ఇంట్లో. రంగురంగుల సీతాకోకచిలకల్లాంటి అమ్మాయిలూ గండుతుమ్మెదల్లా అబ్బాయిలూ ఒక దగ్గర చేరితే సందడికీ సంబరానికీ కొదవేమి ఉంటుంది? ఆటలూ పాటలూ, సరదా సరదా ఛలోక్తులూ, కొంటెమాటల కవ్వింతలూ, చిలిపి చేష్టలూ, నవ్వుల పువ్వులూ... టైము చూసుకునే వ్యవధి కూడా లేదెవ్వరికీ.
నిద్రాదేవత వచ్చి కంటిరెప్పల మీద ముద్దుపెట్టే వేళకు అర్ధరాత్రి ఒంటిగంట. అప్పటిదాకా జాతరలో తప్పిపోయిన చంటిబిడ్డలా దిక్కులు చూస్తూ దిగాలుగా కిటికీ దగ్గరే కూర్చోనుంది సారిక. అక్కడ పొంగిపొర్లుతున్న ఉత్సాహం ఉల్లాసం సారిక నిర్లిప్తతని కించిత్తూ కదిలించలేదు.
‘సాగర్‌ లేకుంటే తన బతుకంతా చీకటే. అతను సరసనలేని ఏ సంతోషాలూ తనకు వద్దు. ఏ సరదాలూ తనని ఆనందపరచలేవు. ఇక తను జీవించటమే వ్యర్థం. ఈ విషాదాన్ని ఇక తను మోయలేదు’ సారిక ఆలోచనల నిండా ఇదే నైరాశ్యం, వైరాగ్యం.
‘‘వెడదామా? రాశి- వాళ్ళ కారులో మనల్ని దిగబెడతానంది’’ అంటూ వచ్చింది రాధ.
వచ్చిన దగ్గర్నుంచీ ఆ కోలాహలంలో మునిగిపోయినట్టే కనపడుతున్న రాధ- సారిక మీద ఓ చూపు వేసే ఉంచింది. సర్వం కోల్పోయినదానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న స్నేహితురాల్ని గమనిస్తూనే ఉంది.
ఇద్దరూ రూమ్‌కి వచ్చారు. రాగానే తలగడ ఎత్తి చూసింది గుట్టుగా. తన నిర్ణయం మారనట్టే అది అక్కడే ఉంది పదిలంగా. ఇక రాధ వెళ్ళిపోవటమే ఆలస్యం.
‘‘నేనిప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ కర్ర పుచ్చుకుంటుంది. ఇందాకే ఫోన్‌ చేసి చెప్పేశాను- నీ రూమ్‌లో పడుకుంటానని. కారు కూడా అందుకే పంపించేశాను’’ చెప్పేసింది రాధ. ఏం మాట్లాడుతుందిక. అప్పటికే సోఫాలో దుప్పటి సరిచేసింది కూడా.
మిగతా రాత్రంతా నిద్రపోలేదు సారిక. నిన్నటి వరకూ మురిపించి ఇప్పుడు కరిగిపోయిన కలలు కలిగిస్తున్న వేదన. దుఃఖం నరనరాన్నీ మెలిపెట్టే బాధ. ఈ యాతన నుంచి విముక్తి కావాలి. కానీ... కానీ...
బెడ్‌లైట్‌ వేసుకుని మరీ మొబైల్లో మెసేజ్‌లు చూసుకుంటున్న రాధ వైపు చాలా అసహనంగా చూసింది సారిక.
తెల్లవారింది కానీ రాధ కదిలే సూచనల్లేవు. పైపెచ్చు ‘‘ఇవాళ శనివారం. నీకూ సెలవే కదా... నువ్వు త్వరగా తెమిలితే ముందు గుడికి వెళదాం. అక్కణ్ణుంచి నిన్నోచోటికి తీసుకువెళతా’’ అంటూ ప్రోగ్రామ్‌ ఫిక్స్‌ చేసేసింది.
సారిక మరీ గొర్రె మాదిరి. గట్టిగా ఎదురు తిరగలేదు. రాధ నియంత టైపు. తన మాటే నెగ్గించుకుంటుంది. వాదించే ఓపిక కూడా లేక తన ప్రోగ్రామే వాయిదా వేసుకుంది సారిక.
ఆంజనేయస్వామికి పూజ చేయించి గుడి బయటకు వచ్చారు. ‘‘ఇప్పుడెక్కడికి?’’ రాధ బైకు స్టార్ట్‌ చేస్తే వెనక కూర్చుంటూ అడిగింది సారిక.
‘‘చూడు’’ అని నవ్వి బైక్‌ని ముందుకు పోనిచ్చింది రాధ. మధ్యమధ్యలో బండి ఆపి, ఏవేవో కొంటూనే ఉంది - స్వీట్సూ చాక్లెట్లూ చిన్నచిన్న బొమ్మలూ...
ఊరు దాటగానే పచ్చటి తోటల మధ్య ఉంది ‘మదర్‌ థెరిసా అనాథాశ్రమం’. ‘‘ఇక్కడ నాకో ఫ్రెండ్‌ ఉంది. తననొకసారి పలకరించి పోదాం.’’
బైక్‌ పార్క్‌ చేసింది రాధ.
‘అనాథాశ్రమంలో ఫ్రెండా?’ ఆశ్చర్యపోతూ వెంట నడిచింది సారిక.
రాధని చూడగానే ‘‘రాధక్క, రాధక్క’’ అంటూ చుట్టూ చేరారు పిల్లలు. వెలిగిపోయినయ్‌ వాళ్ళ మొహాలు. అంతా పది పన్నెండేళ్ళలోపు వయసు వాళ్ళే. వాళ్ళకి తను తెచ్చినవన్నీ పేరుపేరునా పిలిచి ఇచ్చింది రాధ. ఆ చిన్నిచిన్ని గిఫ్ట్‌లకే సంతోషపడిపోయారు వాళ్ళు.
క్రితంసారి వచ్చినప్పుడు వాళ్ళు కోరుకున్నవేనట అవన్నీ. ఆ పిల్లల్లో పిల్లలా కలిసిపోయి వాళ్ళతో కబుర్లు చెబుతోంది రాధ. వాళ్ళు కూడా అంతే. సొంత అక్కతోనో క్లాస్‌మేట్‌తోనో మాట్లాడుతున్నట్టు స్కూల్లో నేర్చుకున్నవీ, కొత్తగా వచ్చిన డుంబూ చేస్తున్న అల్లరీ, టీవీలో మొన్న ఆదివారం చూపించిన సినిమాలో నచ్చిన హాస్యం డైలాగులూ... ఇలా ఏవేవో చెప్పేస్తున్నారు ఉత్సాహంగా.

నిన్న గౌతమి ఇంట్లో అంత సంబరంలోనూ కలగని కదలిక ఆ పిల్లల అమాయకపు మాటలు వింటూంటే కలిగింది సారికలో.
‘‘నా ఫ్రెండ్‌ని చూద్దాం పద’’ రాధ అనేదాకా అక్కణ్ణుంచి లేవలేదు సారిక.
పై అంతస్తుకు వెళుతూ అంది రాధ ‘‘అమ్మానాన్నలతో హాయిగా గడపవలసిన విలువైన కాలాన్ని పోగొట్టుకున్నామని తెలిసినా, ఆ అసంతృప్తి వాళ్ళకు తాకనట్టుగా ఎంత నిబ్బరంగా ఉన్నారో చూడు.’’
తల పంకించింది సారిక అవునూ కాదూల మధ్య.
మేడ మీద గదిలో రాధ స్నేహితురాల్ని చూసి నిర్ఘాంతపోయింది సారిక. పదిహేనేళ్ళ పాప తను. చాలా అందంగా ఉంది. కానీ... ఆ అమ్మాయి కళ్ళలో వెలుగు లేదు. ‘‘అవును. బిందుకి చూపులేదు’’ అతి మెల్లగా ఉదాసీనంగా చెప్పింది రాధ.
‘‘ఆశ్రమంవాళ్ళే ఎప్పట్నుంచో రెటీనా కోసం ప్రయత్నం చేస్తున్నారు.’’
‘‘రాధక్కా’’ చూస్తున్నట్టే దగ్గరగా వచ్చి రాధ నడుం చుట్టేసింది బిందు ఆనందంతో.
‘‘ఇదిగో నీ మామూలు’’ ప్రత్యేకంగా బ్యాగు అడుగున పెట్టిన కాజూ బర్ఫీ డబ్బా మూత తీసి ఒకటి నోటికి అందించింది రాధ చిరునవ్వుతో.
‘‘బిందు చాలా తెలివైంది. బ్రెయిలీలో టెన్త్‌ పరీక్షలు రాస్తోంది తెలుసా? పాటలు బ్రహ్మాండంగా పాడుతుంది. మా రత్నావాళ్ళ స్కూలు ఫంక్షన్‌లో కృష్ణశాస్త్రిగారి గేయం ‘ఆకులో ఆకునై...’ పాడుతుంటే విన్నాను. అప్పుడే తనకి ఫిదా అయిపోయాను.
అప్పట్నుంచే తనతో ఫ్రెండ్‌షిప్‌. తన కోసమే ఇక్కడకు రావటం.’’
రాధ పాడమనగానే బతిమాలించుకోకుండా జయదేవుడి అష్టపది పాడింది బిందు. ‘‘అతిశయోక్తి కాదు... నిజంగా కోకిల కూజితమే’’ మందకొడితనాన్ని వదిలించుకుని మరీ మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సారిక.
వచ్చేసేటప్పుడు ‘‘ఎవరు నేర్పించారివన్నీ’’ అడిగింది సారిక కుతూహలంగా.
ఓ నిమిషం జవాబివ్వలేదు బిందు.
‘‘నా అన్నవాళ్ళందరూ ఒక యాక్సిడెంట్లో మరణించారు. కళ్ళలో గాజుపెంకులు గుచ్చుకుని నాకు చూపుపోయింది. మాకు దూరబంధువు ఒకాయన కలుగజేసుకుని కొద్దిగా ఉన్న మా ఆస్తిని కరెన్సీలోకి మార్చి ఈ ఆశ్రమం ట్రస్టుకి డొనేట్‌ చేసి, స్పెషల్‌ రిక్వెస్ట్‌ మీద నన్నిక్కడ చేర్పించారు.
మొదట్లో చాలా డిస్ట్రబ్డ్‌గా దిక్కుతోచనట్టుగా ఉండేది. ‘నన్ను మాత్రం ఎందుకు బతికించావు దేవుడా’ అనుకుంటూ ప్రార్థన టైముకి ఆ హాలులోకి వెళ్ళేదాన్ని కాదు. కళ్ళు మూస్తే చీకటి, కళ్ళు తెరిచినా చీకటే. అలాంటి సమయంలో ఇక్కడ ఉన్న ఒక ఫాదర్‌ ఎప్పుడూ ఏడుస్తూ ఉండే నన్ను ఆదరంగా దగ్గరకు తీసుకున్నారు. ఆయనే నాకు బ్రెయిలీ నేర్పించారు. నా గొంతు బావుంటుందనీ పాటలు నేర్చుకోమనీ ప్రోత్సహించింది ఆయనే.
ఆయన అనేవారు ‘విధివశాత్తూ నీకో చిన్న లోటు ఏర్పడింది. నిజమే. అందుకని నీకే ఏదో అన్యాయం జరిగిపోయిందనీ ఈ జన్మే వృథా అనీ కుంగిపోయే పిరికితనం కూడదమ్మా. ఈ జీవితం దేవుడిచ్చిన వరం. అన్నిటికన్నా మిన్న అయిన అదృష్టం అదే. బతికి ఉన్నన్నాళ్ళూ ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తూ దాన్ని సార్ధకం చేసుకోవాలి. అప్పుడే భగవంతుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు’ అని, ఇక ఆ తరవాత ఏ నిరాశా నిస్పృహలూ నా పక్కకి రాలేదు’’ అంది చిరునవ్వుతో.
‘‘నీకు తొందరలో కళ్ళు దొరికి ఈ లోకాన్ని చూడగలగాలి. నువ్వింకా గొప్ప గాయకురాలిగా ఎదగాలని దేవుణ్ణి కోరుకుంటాను’’ అంది సారిక మనస్ఫూర్తిగా.
బిందు చిన్నగా నవ్వింది. ‘‘అవి దొరకనీ దొరకకపోనీ, నాకు విచారం లేదు. ఇప్పటిలాగే ఎవరడిగినా నా పాట వినిపించి సంతోషపెడుతూనో లేదా నాలో నేనే పాడుకుంటూనో ఆనందంగా ఇలాగే ఉండిపోగలను. అన్నట్టు... బ్రెయిలీలో కవితలు రాసే ప్రయత్నం చేస్తున్నా. ఈసారి మీరొచ్చినప్పుడు తప్పకుండా వినిపిస్తా.’’
‘విధి ఎన్ని మొట్టికాయలు మొట్టినా ఈ అమ్మాయిలో ఎంత మెచ్యూరిటీ... ఎంత ఆత్మవిశ్వాసం!’ అద్భుతమన్నట్టు చూసింది సారిక- బిందు వంక.
మళ్ళీ బైకు దగ్గరకొచ్చారు. ఊరివైపు కాకుండా వ్యతిరేక దిశలో కదలటం చూసి ‘‘మళ్ళీ ఎక్కడికి?’’ ముఖం చిట్లించింది సారిక.
‘‘ఇదిగో, ఈ పక్కనే మంచి నర్సరీ ఒకటుంది. మొన్న వచ్చినప్పుడు పసుపూ ఎరుపూ కలిసిన గులాబీమొక్క కావాలని చెప్పాను. తెప్పించి ఉంచుతానన్నాడు. ఎంతా... పది నిమిషాలు వెళ్ళొచ్చేద్దాం’’  తల అడ్డంగా ఊపిందా నిలువుగానా అన్నది చూడకుండా ముందుకు పోనిచ్చింది రాధ.
పొలాల మధ్య ఉన్నదా నర్సరీ. ఫెన్సింగు దాటి లోపలికి వెళితే సన్నని కాలిబాటకు అటూ ఇటూ బోలెడు అంట్లుకట్టిన మొక్కలు. ఓ పక్కగా పర్ణశాల లాంటి చిన్న తాటాకుల పాక. అంత ఎండవేళ కూడా చల్లగా అనిపించింది ఇద్దరికీ.
చిన్నిచిన్ని కుండీల్లో పాలిథీన్‌ కవర్లలో ఉన్న లేత మొక్కలకి నీళ్ళు చల్లుతున్నాడు ఓ ముసలాయన. వీళ్ళని చూడగానే ట్యూబ్‌ని కొబ్బరిచెట్టు బోదెలోకి వదిలి దగ్గరగా వచ్చాడు.
‘‘బాగున్నావా, తాతా?’’ ఆప్యాయంగా కుశలప్రశ్న వేసింది రాధ.
‘‘బాగున్నానమ్మా’’ మందహాసంతో చెప్పాడతను.

చుట్టూరా నయనానందకరంగా కనిపిస్తోంది తోట. ‘‘పద, గార్డెన్‌ చూద్దాం’’ ఉత్సాహంగా ముందుకు వెళుతూ అంది రాధ. అనాసక్తంగా వెంట నడిచింది సారిక.
అంట్లుకట్టి సిద్ధంచేసిన పూలమొక్కలూ మందారాలూ గులాబీలూ మల్లెలూ లిల్లీలూ... అవే పువ్వులనిపించే ఇంద్రధనుస్సు రంగుల ఆకులున్న క్రోటన్స్‌, బోన్సాయ్‌ మొక్కలూ... మధ్యమధ్య వాటికి నీడ ఇచ్చేటందుకుగ్గావును పెద్ద చెట్లూ... ఎన్ని రకాలో!
ఒక్కొక్క మొక్క ప్రత్యేకతనీ చెబుతూ నడుస్తున్నాడు తాత వారితో.
‘‘మామ్మ ఎలా ఉంది తాతా?’’ అడిగింది రాధ చనువుగా.
ఆ మాటకి సమాధానం చెప్పకుండా నిట్టూర్చాడు తాత. ‘‘రామ్మా, చూద్దువుగాని’’ అన్నాడు తరవాత.
ఆ తాటాకుల ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరూ తాతతో కలిసి. లోపల మంచానికి అంటుకుపోయి ఉందో ముసలావిడ. ఊపిరితీసి వదిలే కదలికబట్టి బతికి ఉన్నదనుకోవాలంతే!
భయంభయంగా ఇవతలికి వచ్చేస్తూ ‘‘ఏమిటి సుస్తీ?’’ అడిగింది సారిక.
‘‘వంటికేం లేదమ్మా. మనసుకి పట్టుకుంది పెద్ద జబ్బు. దానికి మందులేదు’’ అన్నాడు తాత ఉదాసీనంగా.
తాత ఇచ్చిన గులాబీ అంటు తీసుకుని తిరుగుముఖం పట్టారు ఇద్దరూ.
‘‘ఏమిటావిడ బాధ?’’ తాతని అడగలేని ప్రశ్నని రాధని అడిగింది సారిక దారిలో.
‘‘ఉన్నది ఒకే ఒక్క కొడుకు. కొడుకు గొప్పవాడు కావాలని రెక్కలు ముక్కలు చేసుకుని బీటెక్‌ చదివించారు.
ఏడాదిక్రితం ఎండ్రిన్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మొక్కల్ని చూసుకుంటూ మనసు మరల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు తాత. తల్లి కదా- ఆ దిటవు లేదు.
ఎంతలే- ఇవ్వాళో రేపో బొందినొదిలి ఆ ప్రాణంపోతే బతికిపోతుంది’’ అంది రాధ విరక్తిగా.
‘‘ఎందుకలా?’’ నోట్లో తడి ఆరిపోతోంది సారికకి.
‘‘ఏవుందీ... లవ్‌ ఫెయిల్యూర్‌.’’
కలుక్కుమంది ఎక్కడో సారికకి.
‘‘ఈ తల్లిదండ్రులున్నారే... వీళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళుండరు. పిల్లల మీద అంత మమకారం పెంచుకోవటమెందుకు చెప్పు. వాళ్ళకి వీళ్ళకంటే ప్రాణప్రదమైన వాళ్ళుండరూ, పిచ్చి కాకపోతే. ఆ ఫాదర్‌ ఒకడు- జీవితం దేవుడిచ్చిన వరమట. గాడిదగుడ్డేం కాదూ- వాళ్ళు పోగొట్టుకున్న ప్రేమ ముందు లక్ష్యాలు సాధించమనటాలూ, కళల్ని ఆరాధిస్తూ మైమరచిపొమ్మనటాలూ... అంతా ట్రాష్‌. వట్టి కంటితుడుపు మాటలు. ప్రేమ విఫలమైనప్పుడు అమ్మానాన్నా అంటూ ఆలోచించటం పిరికితనం. వేరే దారులు వెతుక్కుని రాజీపడిపోవటం పలాయనవాదం. అమర ప్రేమికులు ఎడబాటు సహించరు. ప్రాణత్యాగానికి వెనకాడరు. నన్నడిగితే మరణమే శరణ్యం. దాన్ని మించిన సొల్యూషన్‌ మరి లేదంటాను. ఏమంటావ్‌ సారికా’’ నిలదీసినట్టు అడుగుతోంది రాధ.
హాస్టల్‌కి వచ్చేశారు. రాధ బైకు ఆపగానే తొందరగా దిగి గదికి వచ్చేసింది సారిక. దిండు ఎత్తి స్లిప్‌కేసి ఓ క్షణం చూసింది. ‘నేను బతికుండటానికి ఆధారం సాగర్‌ ప్రేమ ఒక్కటేనా? ఆ వెలితిని పూడ్చటానికి ఇంకో ప్రత్యామ్నాయం గురించి యోచించకుండానే జీవించి ఉండటం
ప్రయోజనంలేనిదని నిర్ణయానికి రావటం ఎంత బుద్ధితక్కువ! నా తొందరపాటు వల్ల- నేనే లోకమనుకుంటున్న నావాళ్ళు ఏమవుతారు... కూలిపోరూ’ ఉలిక్కిపడింది సారిక. స్లిప్‌ చేతిలోకి తీసుకుంది ముక్కలుగా చింపి డస్ట్‌బిన్‌లో పడేసింది.
‘నా ప్రయత్నం వ్యర్థం కాలేదు’ గది లోపలికి రాకుండానే సంతృప్తిగా వెనక్కి తిరిగింది రాధ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.