close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంచెకట్టు.. అదిరేట్టు..!

బ్యాగీ ప్యాంటేస్తే బాగుందనీ, చిరిగిన జీన్స్‌ వేస్తే స్టైలిష్‌గా ఉందనీ నోటిమాటతో క్యాజువల్‌గా మెచ్చుకున్నవాళ్లంతా సరిగంచు పంచె కట్టుకోగానే ఓ క్షణం ఆగి చూసి మరీ వావ్‌,  సూపర్‌, అదిరింది బాసూ అంటూ ఏకబిగిన పొగడకపోతే ఒట్టు... అదే పంచెకట్టులోని కనికట్టు. అందుకే ఇప్పుడు సంప్రదాయ వేడుకల్లో అమ్మాయిల చీరకట్టుకి దీటుగా అబ్బాయిలు పంచెకట్టుతో హుందాగా నడిచొస్తున్నారు..!

అప్పుడప్పుడూ అయినా పంచెకట్టులో తళుక్కుమంటోన్న సినీహీరోలూ; తారస్థాయికి చేరిన ఫొటోషూట్‌లూ వీడియో షూట్‌లూ; సోషల్‌మీడియా షేరింగులూ... కారణం ఏదైనా కావచ్చు, పంచెకట్టు ఫ్యాషన్‌ దేశాల్నీ ఖండాల్నీ దాటుకుని రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. పెళ్లి వేడుకల్లోనూ పండగల సమయంలోనూ ఇంట్లోని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ పోటీపడి మరీ పంచె కట్టుకునేందుకు సరదా పడుతున్నారు. దాంతో నిన్నమొన్నటిదాకా ‘అబ్బ... ఓ పండగా లేదూ పబ్బం లేదు, పెళ్లి అన్నా లెక్క లేదు, వ్రతం అన్నా ఖాతరు చేయరు. ఎప్పుడు చూసినా ఆ జీన్సే. చూసీ చూసీ ముఖం మొత్తేస్తోంది’ అంటూ విరుచుకుపడిన పెద్దతరం అంతా ఇప్పుడు కుర్రకారుని పంచెకట్టులో మురిపెంగా చూసుకుంటున్నారు. ఫలితం... నేడు మార్కెట్లో ప్రాచుర్యం పొందిన బ్రాండెడ్‌ షోరూమ్‌ల్లో సైతం పంచె కట్టిన మానెకిన్స్‌ హుందాగా కొలువుదీరుతున్నాయి.

పంచె... తాజా ఫ్యాషన్‌!
ఒకప్పుడు తెలుపు, కోరా రంగుల్లో సాదాసీదాగా కనిపించే పంచెలు, నేడు ఆకర్షణీయమైన అంచుల్లో రంగుల్లో వస్తున్నాయి. ఖద్దరు, కాటన్‌ ఫ్యాబ్రిక్కులో మాత్రమే వచ్చే ధోతీలు పట్టు, శాటిన్‌, సింథటిక్‌ మెటీరియల్స్‌లోనూ మెరుస్తున్నాయి. కలంకారీ, పోచంపల్లి, బాంధనీ, బాతిక్‌... వంటి అద్దకాల్నీ అద్దుకుంటున్నాయి. వీటిల్లోనూ చీర కుచ్చిళ్లు కలబోసినట్లుగా కట్టుకునే పంచెలు కొన్నయితే, ఆ శ్రమంతా లేకుండా రెడీమేడ్‌గా తొడుక్కునేవి ఇంకొన్ని. ఈ రెడీమేడ్‌ పంచెల్లో మళ్లీ బోలెడు డిజైన్లు... కొన్నింటికి అంచులు మధ్యలోకి వచ్చినట్లుగా కుడితే, మరికొన్నింటికి కాళ్లమీదుగా వచ్చేలా కుడుతున్నారు. కట్టుకునేవయినా కుట్టినవయినా పంచెలన్నీ కూడా షేర్వాణీ, కుర్తీలతో జోడీ కుదుర్చుకుని సెట్‌ల రూపంలోనే దొరుకుతున్నాయి. అందులోనూ వేడుక ఏదయినాగానీ ఈతరం అబ్బాయిలు డ్రెస్సింగులో అమ్మాయిలకి ఏమాత్రం తగ్గడం లేదు. ఎంబ్రాయిడరీ చేసిన షేర్వాణీ/కుర్తా పంచె కాంబినేషన్‌లో హుందాగా అందంగా కనిపిస్తున్నారు. ఇక, పిల్లల విషయానికొస్తే- ఆడపిల్లలకు ఓణీల పేరంటం చేసినట్లే మగపిల్లలకి పదకొండు, పదమూడో ఏట పంచెల వేడుక చేశాకే పంచె కట్టుకోవడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి మొదటి పుట్టినరోజుకే పంచెని తొడిగేస్తున్నారు. దాంతో పిల్లల పంచెల సెట్లలో లెక్కలేనన్ని రంగులూ డిజైన్లూ వస్తున్నాయి.
ఇప్పుడంటే పంచెకట్టు అనేది వేడుకలకి సంబంధించిన ట్రెండీ డ్రెస్‌లా కనిపిస్తుంది కానీ, ఒకప్పడు ఫార్మల్‌, క్యాజువల్‌, ఫెస్టివల్‌ వేర్‌ ఏదయినా అదొక్కటే. కాకపోతే సందర్భాన్ని బట్టి కట్టుకునే పంచెల్లో సాదా, జరీ అంచులూ ముతకదా, మెత్తని ఖద్దరా అన్న తేడా మాత్రమే కనిపించేది. అప్పట్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా రైతులు, కూలీలు, ఉద్యోగులు, నాయకులు, అధికారులు... అందరూ పంచెకట్టులోనే ఉండేవారు. ఇంగ్లిషోళ్ల పుణ్యమా అని ప్యాంటు అలవాటై, పంచె కట్టుకోవడాన్ని దాదాపు మరిచిపోయారు. కానీ పాతతరం మాత్రం నేటికీ పంచెకట్టుని వీడలేదనే చెప్పాలి. తెల్లని పంచె, తెల్లని లాల్చీ వేసుకుని దానిమీద జరీ అంచు కండువా వేసుకుని కనిపించే తాతయ్యలు ఇంటింటా కనిపిస్తూనే ఉంటారు. గుడుల్లో పూజారులంతా పంచె కట్టుకునే పూజలు చేస్తుంటారు. జైనులు గుడికి వెళ్ళేప్పుడు పంచెనే కడతారు.

ఎక్కడెక్కడ?
చీరకట్టులానే పంచెకట్టు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటుంది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల్లో అడ్డ పంచెకట్టు కనిపిస్తే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కుచ్చిళ్లతో ఉండే కట్టే ఎక్కువగా కనిపిస్తుంటుంది. రాజస్థానీ, గుజరాతీ, మహారాష్ట్ర ధోతీ కూడా ఇంచుమించు తెలుగువారి పంచెలానే ఉంటుంది. నడవడానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా మోకాళ్లపైకి మడిచి కట్టే గాంధీజీ పంచెకట్టుని కాపీ కొట్టే ధైర్యం మాత్రం ఇంతవరకూ ఎవరూ చేయలేదనే చెప్పాలి, పొలాల్లో పనిచేసే రైతులూ రైతుకూలీలూ తప్ప.
పంచెనే ధోతీ, ధోవతి, అంగోస్త్ర అనీ అంటారు. ఏకవస్త్రాన్ని తీసుకుని, ఒక అంచుని ఓ పక్కకి ముడేసి, మిగిలినదంతా కుచ్చిళ్లు పెట్టి వాటిని ముందువైపు దోపి, కాళ్ల మధ్యలోంచి ఓ అంచుని గోచీ మాదిరిగా వెనక్కి దోపి కట్టడం అనేది పూర్వకాలం నుంచీ ఉంది. పైగా పంచె అనేది కేవలం పురుషుల అంగవస్త్రం అని చెప్పలేం. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో క్రీ.పూ. మొదటి శతాబ్దం నాటి పంచె కట్టుకున్న చక్రావతి అనే స్త్రీ శిల్పమే ఇందుకు నిదర్శనం. అంతెందుకు... ఒకప్పటి రాణుల చీరకట్టూ, నేటి మరాఠా సంప్రదాయ చీరకట్టు సైతం కొంత పంచెకట్టునే తలపిస్తుంది. ఏది ఏమయినప్పటికీ ప్యాంటులో లేని సౌలభ్యం పంచెలో ఉంటుంది. అదీ నేతవి కట్టుకుంటే వేసవిలో చక్కగా గాలాడుతుంటుంది. కొత్తదనమో సౌకర్యమో సినీ ప్రభావమో తెలీదుకానీ, ఒకప్పుడు మనదైన సంప్రదాయ పంచెకట్టు, నేడు వేడుకల్లో ధరించే ఫ్యాషన్‌ కట్‌గా మారి, అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోల్లోనూ కనిపిస్తోంది. మొత్తమ్మీద ఆనాటి అంగోస్త్రాన్ని సరికొత్త ట్రెండ్‌గా ఫీలై ఆనందంగా ధరిస్తోందీ తరం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.