close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంతేగా.. ఆకలేస్తే కోపమేగా!

‘నాకు కోపం వస్తే మనిషిని కాదు...’ అంటుంటారు కొందరు. అలా చెప్పి వచ్చే కోపమైతే పర్వాలేదు కానీ కడుపులో ఆకలి కేకలు పెడుతున్నప్పుడు వచ్చే కోపం ఉంటుందే దాన్ని మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది వారినే కాదు, పక్కనున్నవారినీ ఇబ్బంది పెడుతుంది మరి. ‘హ్యాంగ్రీ’గా ఈ మధ్యే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీకి సైతం ఎక్కిన ఈ ‘ఆకలికోపం’ ఇప్పుడు మరో జీవనశైలి సమస్యగా మారి వ్యక్తిగత, సామాజిక అనుబంధాలపైనా ప్రభావం చూపిస్తోంది.

ఆకలితో నకనకలాడిపోతున్నా... నన్ను పలకరించొద్దు!
దురుసుగా మాట్లాడానా... సారీ, ఆకలితో అసహనంగా ఉన్నా!
ఐయామ్‌ సారీ ఫర్‌ వాట్‌ ఐ సెడ్‌ వెన్‌ ఐ యామ్‌ హ్యాంగ్రీ...
... ఇవన్నీ కార్డులూ టీషర్టుల మీద రాతలే కాదు, అన్నివయసులవారూ ఎదుర్కొంటున్న పరిస్థితులు. ‘హ్యాంగ్రీ’ ఇప్పుడు సోషల్‌ మీడియా హ్యాష్‌ట్యాగ్‌ మాత్రమే కాదు. ఈరోజుల్లో చాలామందిని ఇబ్బందిపెడుతున్న కొత్త జీవనశైలి సమస్య. ‘హ్యాంగ్రీ’
(హంగ్రీ ప్లస్‌ యాంగ్రీ) అంటే ఆకలి వల్ల వచ్చే కోపమన్నమాట. ఆకలి వేస్తే నీరసమొస్తుంది కానీ కోపమెందుకు వస్తుందీ అంటే... దీని వెనక చాలా కథే ఉంది మరి!
లలిత ఈ మధ్య ప్రతి చిన్న విషయానికీ చికాకుపడిపోతోంది. పిల్లల మీద విసుక్కోవటమే కాదు ఊరకూరకే చేయి చేసుకుంటోంది కూడా. భర్తతో అయినదానికీ కానిదానికీ వాదిస్తోంది. ఆఫీసులోనూ సహోద్యోగులతో గొడవలవుతున్నాయి. స్నేహితులు కూడా ఆమె ప్రవర్తన చూసి చిన్నబుచ్చుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది ఎందుకింత కోపమొస్తోందో ఆమెకు అర్థంకాక సైకాలజిస్టు సలహాకోసం వెళ్లింది.

లలిత దినచర్యా, అలవాట్లూ, అభిరుచులూ, ఇంట్లోనూ బయటా ఆమె నిర్వహిస్తున్న బాధ్యతలూ అన్నిటి గురించీ ఆరాతీసిన సైకాలజిస్టు ఆమెను బ్లడ్‌షుగర్‌ పరీక్ష చేయించుకోమనీ అలాగే ఒకసారి పోషకాహార నిపుణుల్ని సంప్రదించమనీ చెప్పాడు. చీటికీ మాటికీ కోపమెందుకొస్తోందో చెప్పమంటే డైటీషియన్‌ దగ్గరికి వెళ్లమంటాడేమిటీ అనుకున్న లలితకి ఆ డాక్టరు మీదా చర్రున కోపం వచ్చింది. విసురుగా బయటకు వచ్చి రిసెప్షన్‌లో ఫీజు ఇస్తూ బ్యాగులో చాకొలెట్‌ కనిపిస్తే తీసి నోట్లో వేసుకుంది. కాసేపటికి రిలాక్స్‌డ్‌గా అనిపించింది. ఎలాగూ సెలవు పెట్టాను కాబట్టి ఆ డైటీషియన్‌ దగ్గరికీ వెళ్తే పనైపోతుందనుకుని వెళ్లింది. తన పరిస్థితితో పాటు సైకాలజిస్టు దగ్గరికి వెళ్లిన విషయమూ డైటీషియన్‌కి చెప్పింది. లలిత ఆహారపుటలవాట్ల గురించి వివరంగా తెలుసుకుని ఒక డైట్‌ చార్ట్‌ వేసిచ్చారు ఆవిడ. రెండువారాలు తాను చెప్పినట్లు ఆహారం తీసుకుని ఆ తర్వాత వచ్చి కలవమన్నారు. తన సమస్యేమిటో, దానికి వాళ్లు చెప్తున్న పరిష్కారమేమిటో అర్థంకాలేదు లలితకు.
ఇద్దరు డాక్టర్లు తప్పు చెప్పరు కదా సరే చూద్దాం- అనుకుని సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి పండ్లూ కూరగాయలతో పాటు డాక్టరు చెప్పిన ప్రకారం డ్రైఫ్రూట్సూ, వేరుశనగలూ నువ్వులూ లాంటివాటితో చేసిన చిక్కీలు కూడా తీసుకుంది. రోజూ డైటీషియన్‌ చెప్పినట్లు రెండు గంటలకోసారి ఏదో ఒకటి తింటూ ఉంది. అన్నిసార్లు తినడం మొదట్లో కొంచెం ఇబ్బందనిపించినా కొన్నాళ్లే కదా తిని చూద్దామనుకుంది. రెండు వారాలు తిరిగేసరికి విచిత్రంగా ఆమెలో చిరాకు తగ్గింది. డైటీషియన్‌ దగ్గరికి వెళ్లి ఆ విషయమే చెప్పింది. ‘అవును మరి, మీ చికాకూ కోపాలకు కారణం ఆకలి. దాన్ని గుర్తించకుండా మీరు ఇబ్బందిపడుతూ ఇతరులనూ ఇబ్బందిపెట్టారు’ నవ్వుతూ చెప్పింది డైటీషియన్‌.
టైమ్‌ లేదని రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఆఫీసుకు వెళ్లిపోవడమూ, మధ్యాహ్నం లంచ్‌ చేస్తే మళ్లీ రాత్రి వరకూ ఏమీ తినకుండా ఉండటమూ,  ఐదారుసార్లు టీలు తాగడమూ... ఇదీ గతంలో లలిత ఆహారం తీసుకున్న విధానం. ఆమే కాదు, ఈరోజుల్లో అన్నివయసుల వారూ ఆహారపుటలవాట్ల విషయంలో రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటున్నారు నిపుణులు. పనుల్లో పడి వేళకి భోజనం చేయకపోవడమూ, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడమూ, డైటింగ్‌ పేరుతో కడుపు మాడ్చుకోవడమూ, తీసుకునే ఆహారంలో పోషకాలూ విటమిన్లూ తగుపాళ్లలో లేకపోవడమూ... ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు ఆకలికోపానికి కారణమవుతున్నాయట.

అదెలాగంటే...
మనం తీసుకునే ఆహారంలోని పిండిపదార్థాలూ మాంసకృత్తులూ కొవ్వు పదార్థాలూ అన్నీ జీర్ణమై గ్లూకోజు, అమైనో ఆసిడ్లు, ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్లుగా మారి రక్తంలో కలిసి అన్ని అవయవాలకీ సరఫరా అవుతాయి. అవి పనిచేయడానికి కావలసిన శక్తినిస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత సమయం గడిచేకొద్దీ ఈ సరఫరా తగ్గిపోతుంది. అందుకే ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే రక్తంలో ఇలా శక్తినిచ్చే చక్కెర(గ్లూకోజ్‌) స్థాయి తగ్గిపోతుంది. అది మరీ తక్కువ స్థాయికి పడిపోతే మెదడు వెంటనే అప్రమత్తమై అత్యవసర పరిస్థితి ప్రకటించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని అవయవాలన్నిటికీ సూచనలిచ్చేస్తుంది. దాంతో అప్పటికప్పుడు నాలుగు రకాల హార్మోన్లు తయారవుతాయి. పిట్యూటరీ గ్రంథి నుంచి గ్రోత్‌ హార్మోను, క్లోమగ్రంథి నుంచి గ్లూకజాన్‌తో పాటు కార్టిసోల్‌, అడ్రెనలైన్‌ లాంటి స్ట్రెస్‌ హార్మోన్లు కూడా విడుదలై రక్తంలో కలిసి తగ్గిన చక్కెర స్థాయిని బ్యాలన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తాయి.
* ఇలా విడుదలయ్యే కార్టిసోల్‌ కొంతమందిలో దురుసు ప్రవర్తనకు కారణమవుతుంది.
* ఇక అడ్రెనలైన్‌ పేరే ‘ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌ హార్మోన్‌’. మన భద్రతకి ముప్పు పొంచి ఉందనిపించినప్పుడు ఎదురు తిరిగి పోరాడమనో లేదా అక్కడినుంచి పారిపొమ్మనో చెబుతుందని దానికా పేరు పెట్టారు.
* రక్తంలో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంటే మెదడు పనితీరుపైన ప్రభావం పడుతుంది. సభ్యత మరిచి గట్టిగా కేకలు వేయడమూ, నోటికొచ్చినట్లు మాట్లాడటమూ చేస్తారు. సాధారణంగా అలసిపోయి ఉన్నప్పుడో అనారోగ్యంగా ఉన్నప్పుడో కొంతవరకు విచక్షణ కోల్పోవడం చూస్తాం కానీ దానికీ ఈ ప్రవర్తనకీ తేడా ఉంటుంది. మామూలుగా కోపం వస్తే లాజిక్‌తో ప్రశ్నించడమూ లేదా గట్టిగా నాలుగు కేకలు వేసి పని జరిపించుకోవడమూ, అలిగి మాట్లాడకుండా ఉండడమూ... ఇలా సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు. ఆకలి కోపంతో చేసే పనుల్లో సమన్వయం కన్పించదు. మాటలూ తడబడతాయి.

కోపమే కాదు, ఇంకా చాలా...
ఆకలి అందరికీ వేస్తుంది. కోపమూ అందరికీ వస్తుంది. రెండూ కలిసి ఒకేసారి దాడి చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితిని కూడా కొందరు సమర్థంగానే ఎదుర్కొనగలుగుతారు. కోపాన్ని నియంత్రించుకునే అలవాటు లేనివారూ ప్రతి చిన్నదానికీ తీవ్రంగా స్పందించేవారూ ‘హ్యాంగ్రీ’కి ఎక్కువగా లోనవుతారు అంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజీ పరిశోధకురాలైన డాక్టర్‌ క్రిస్టీన్‌ లీ. ఆకలి వల్ల ఒక్క కోపం రావడం మాత్రమే కాదు ఇంకా చాలా ఇబ్బందిపెట్టే లక్షణాలూ ఉంటాయంటారామె. కోపం రావడం లేదు కాబట్టి ఆకలి లేదనుకోవద్దు. నిస్సత్తువ, నిద్రమత్తు,
దేనిమీదా దృష్టిపెట్టలేకపోవడం, చేసే పనుల్లో సమన్వయం లోపించడం, మాట తడబడడం, పనిలో తరచుగా పొరపాట్లు చేయడం... లాంటి లక్షణాలన్నీ ఆకలి వల్లేనంటారామె.
ఆరోగ్యంగా ఉన్నవారు ఎప్పుడైనా ఓసారి ఆకలి కోపాన్ని ఎదుర్కొంటే దాన్ని సమస్యగా భావించనక్కర్లేదు. అలా కాకుండా ఇతరత్రా ఏ రకమైన అనారోగ్యమైనా ఉంటే మాత్రం ఈ పరిస్థితిని తేలిగ్గా తీసుకోకూడదు. తగినంత బరువు లేనివారూ ఏదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్నవారూ రక్తహీనత, పోషకాహారలేమితో బాధపడుతున్నవారూ కోపం వచ్చేదాకా ఆకలిని గుర్తించకపోతే తీవ్ర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మధుమేహం, క్లోమగ్రంథి లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలూ అడ్రినల్‌ ఇన్‌సఫిషియెన్సీ సిండ్రోమ్స్‌ ఉన్నవారికీ రక్తంలో ఇలా చక్కెర స్థాయులు మరీ తక్కువగా పడిపోతే ప్రమాదమేనంటున్నారు నిపుణులు.

వేర్వేరు పరిస్థితుల్లో...
ఈ కోపానికి కారణం ఆకలే అయినా దానికి దారితీసే పరిస్థితులు చాలారకాలుగా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండటమంటే ఇన్నాళ్లూ బరువు సరిగ్గా ఉంటే చాలనుకునేవాళ్లమనీ ఇప్పుడు మారుతున్న ఆహారపుటలవాట్ల వల్ల మరెన్నో విషయాలు దృష్టిలో పెట్టుకోవాల్సివస్తోందనీ అంటారు పోషకాహార నిపుణులు డాక్టర్‌ జానకీశ్రీనాథ్‌. చాలాసార్లు మనం తీసుకునే ఆహారంలో కెలొరీలు ఉంటున్నాయి కానీ పోషకాలూ, విటమిన్లూ ఉండడం లేదు. కెలొరీల వల్ల కడుపు నిండుగా ఉన్నట్లుండి వేరే ఏమీ తినాలనిపించదు. ఫలితంగా పోషకాహార లేమితో సమస్యలు వస్తున్నాయనీ, కోపానికి తోడు చురుకుదనం తగ్గడమూ స్టామినా లేకపోవడమూ దానివల్లనేననీ చెబుతారు డాక్టర్‌ జానకి. ఇక ఈ ఆకలికోపానికి దారితీస్తున్న రకరకాల పరిస్థితుల విషయానికి వస్తే...

ఆహారపుటలవాట్లు: ఒకప్పుడు మూడుపూటలా కడుపునిండా తినేవాళ్లం. అలాగే శారీరక శ్రమా ఎక్కువే చేసేవాళ్లం. ఇప్పుడు తీసుకునే ఆహారంలోనూ, తినే పద్ధతుల్లోనూ మార్పు వచ్చింది. కడుపునిండా తినాల్సిన అల్పాహారాన్ని కొందరు నిర్లక్ష్యం చేస్తే, తక్కువగా తీసుకోవాల్సిన రాత్రి భోజనానికి కొందరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి అలవాట్లు శరీరంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని స్థిరంగా ఉండనివ్వవు. ఎక్కువ గంటలు పనిచేసేవాళ్లకీ, తీవ్రమైన పనిఒత్తిడితో సతమతమయ్యేవారికీ భోజనానికీ భోజనానికీ మధ్య చాలా విరామం ఉంటుంది. చాలామంది గృహిణులు పొద్దున్నే వంట చేసి పిల్లల్ని పంపించే హడావుడిలో తొమ్మిదీ పది గంటలవరకూ గ్లాసుడు మంచినీళ్లు కూడా తాగరు. ఇలాంటి అలవాట్లన్నీ పరోక్షంగా మెదడు మీదా తద్వారా మళ్లీ శరీరం మీదా ప్రభావం చూపుతాయి.
జంక్‌ఫుడ్‌: యువతలో, పిల్లల్లో ఫాస్ట్‌ఫుడ్‌ తినడమూ ఆకలికోపానికి మరో కారణమవుతోంది. ఫాస్ట్‌ఫుడ్‌లో ఎక్కువ కెలొరీలు ఉంటాయి వాటిని కరిగించే వ్యాయామం మాత్రం వారికి ఉండటం లేదు. శరీరంలోకి ఎక్కువ కెలొరీలు చేరగానే మెదడు వాటిని కొవ్వు రూపంలో నిల్వ చేయమని సూచనలిస్తుంది. దాంతో బరువు పెరగడమూ స్థూలకాయానికి దారితీయడమూ జరుగుతుంది. ఇలాంటివారు చూడటానికి నిండుగా కన్పిస్తారు కానీ లోపల మాత్రం శక్తి ఉండదు. మెదడుకి అవసరమైన సూక్ష్మపోషకాలు అందకపోవడంతో ఉత్సాహం తగ్గుతుంది.
పట్టుమని పది అడుగులు వేస్తే అలసిపోతారు. వ్యాయామమూ, ఆటల పట్ల ఆసక్తి చూపరు. ఎవరైనా ఆ విషయాన్ని ఎత్తి చూపితే కోపంతో గట్టిగా అరిచేస్తారు.
డైటింగ్‌: డైటింగ్‌ చేసేవారిలోనూ ఆకలికోపం ఎక్కువే. బరువు తగ్గించుకోవాలనే పట్టుదలతో నోరు కట్టుకుంటారు. దాంతో ఇష్టమైన పదార్థాలను తినలేని అసంతృప్తి కోపంగా బయటపడుతుంది. అకారణంగా ఆవేశపడతారు. నిగ్రహించుకోగలిగినంత కాలం నిగ్రహించుకుని ఒక్కసారిగా ఆహారంపైన నియంత్రణ తప్పుతారు. ఫలితం మళ్లీ గ్లూకోజ్‌ స్థాయుల మీద పడుతుంది.

పేచీలూ అందుకే...
ఆకలి కోపం తాలూకు పర్యవసానాలూ చాలారకాలుగా ఉంటాయి. పెద్దల్లో అది కోపం రూపంలోనో అసహనం రూపంలోనో కన్పిస్తే పిల్లల్లో పేచీల రూపంలో బయటపడుతుంది. ఒక్కోసారి పిల్లలు వేళకి కడుపు నిండా తింటున్నా కూడా పేచీలు పెడుతున్నారంటే అది ఆకలి కోపం కాదనుకోవడానికి లేదు, వారికి అవసరమైన పోషకాలేవో ఆహారం ద్వారా అందడం లేదని గ్రహించాలి అంటున్నారు నిపుణులు. పోషకాహార లోపం వల్ల పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. ఏకాగ్రత చూపలేరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. జీవచర్యల వేగం మందగిస్తుంది. ఇక పెద్దల విషయానికి వస్తే- కోపం, అసహనం, చికాకులాంటివి తరచూ కలుగుతోంటే ముందుగా ఆహారపుటలవాట్లను పరిశీలించుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ లక్షణాల ప్రభావం ఉద్యోగ, వ్యాపార, వైవాహిక బంధాల మీదా పడుతుంది కాబట్టి. ఒకసారో రెండుసార్లో అయితే సారీ చెబితే క్షమిస్తారు. కానీ అదో అలవాటుగా మారిపోతే, కోపంతో విచక్షణ కోల్పోయి మాట్లాడితే సహోద్యోగులూ పై అధికారులతో సమస్యలొస్తాయి. ఇక వ్యాపార సంబంధాల్లో మంచి మాటకున్న ప్రాధాన్యం తెలిసిందే. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఈ తరహా కోపం ఉన్నా వివాహబంధంలో మానసిక దూరం పెరుగుతుంది. చీటికీ మాటికీ కోపం తెచ్చుకునే అమ్మానాన్నలకు పిల్లలూ దూర దూరంగానే తిరుగుతారు. దాంతో మొత్తంగా ఇంట్లో ప్రేమా ఆప్యాయతలతో ఆడుతూ పాడుతూ ఉండే చక్కటి వాతావరణం మాయమవుతుంది.

సరైన ఆహారంతో అడ్డుకట్ట
హ్యాంగ్రీగా ఉన్నవారు సాధారణంగా బిస్కెట్లు, చాకొలెట్లు లాంటి తీపి పదార్థాలవైపు మొగ్గుతారు. అవి తినగానే ఆకలి శాంతించినట్లు అవుతుంది. కానీ దానివల్ల బ్లడ్‌షుగర్‌ ఒక్కసారిగా పెరిగి మళ్లీ అంతే వేగంగా పడిపోతూ ప్రవర్తనపైనా ప్రభావం చూపుతుంది. అందుకని గ్లూకోజ్‌ని హఠాత్తుగా పెంచే లేదా తగ్గించే పదార్థాలు కాకుండా ఓ పండో, క్యారట్‌ టమాటా లాంటి కూరగాయ ముక్కలో, బాదంపప్పూ కిస్‌మిస్‌ లాంటివో దగ్గర ఉంచుకుని మధ్య మధ్యలో తింటూ ఉంటే ఇలా గ్లూకోజ్‌ హెచ్చుతగ్గుల సమస్య రాకుండా ఉంటుంది. తీసుకునే ఆహారాన్ని చిన్న చిన్న భాగాలు చేసి రోజు మొత్తమ్మీద సమంగా తీసుకోవడం, జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండటం, పోషకాలూ, పీచూ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చాలినంత నిద్రపోవడం, నీరు ఎక్కువగా తాగటం... ఇవన్నీ ఆకలి కోపం రాకుండా కాపాడతాయి.
ఆకలీ కోపమూ రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడానికి కారణం ఈ రెండిటినీ నియంత్రించే జన్యువులు ఒకటే కావడం. ఈ జన్యువులే లేకపోతే ఆహారం కోసం ఏ ప్రాణీ పోరాటం చేయదట. దాంతో అసలు ఉనికికే మోసం వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూడటానికి సహజమైన రక్షణ వ్యవస్థలో భాగంగా జరిగిన ఏర్పాటన్న మాట ఇది. అందుకని కోపానికి కారణం ఆకలి కాకుండా చూసుకోవటం చాలా అవసరం.

* * *

‘ఆహారం విషయంలో సలహాకోసం నా దగ్గరకు వచ్చే వ్యాపారవేత్తలూ పెద్ద పెద్ద ఉద్యోగులకు కాసిని వేరుశనగలో బాదంపప్పో దగ్గరుంచుకుని మద్యమధ్య నాలుగు పప్పులు నోట్లో వేసుకుంటుండమని చెబుతాను. లేకపోతే, గంటల తరబడి మీటింగులతో కడుపు నిండా తినక, ఆకలీ అసహనాలతో వారు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఎంత విపరీత పరిణామాలకు దారితీస్తాయో నాకు తెలుసు’ అంటారు ప్రఖ్యాత డైటీషియన్‌ రుజుతా దివేకర్‌. ఆ సలహా అందరికీ పనికొచ్చేదే కదా... వింటే పోలే!

మెదడుకి ఇంధనం గ్లూకోజ్‌

కోపాన్నీ, దుడుకుతనాన్నీ నియంత్రించుకోవడానికి మన మెదడుకి చాలా శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేది గ్లూకోజ్‌. అది తగ్గినప్పుడు ఆటోమేటిగ్గా నియంత్రణ శక్తి తగ్గిపోతుందన్నమాట. మన శరీర బరువులో 2 శాతం మాత్రమే ఉండే మన మెదడు 20 శాతం కెలొరీలను ఖర్చుచేస్తుంది. అంటే శరీరంలో శక్తి ఎక్కువగా కావలసిన భాగం మెదడే. అందుకని- ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడూ, చర్చించాల్సిన, ఆలోచించాల్సిన సమస్య ఉన్నప్పుడూ కడుపునిండా తిని కానీ సంభాషణ మొదలుపెట్టకూడదన్నది నిపుణుల సలహా. ఆహారం సరిగానే తీసుకుంటున్నా ఆకలికోపం వదలకుండా విసిగిస్తుంటే మెదడు కాస్త విశ్రాంతి కోరుతోందని గుర్తించాలి.

ఇద్దరి మధ్యా... ఆ కోపం!

‘చీటికీ మాటికీ భాగస్వామి మీద కస్సుబుస్సుమంటున్నారా? అకారణంగానే అరిచి కేకలు పెడుతున్నారా? అయితే వెంటనే మీ బ్లడ్‌ షుగర్‌ పరీక్ష చేయించుకోండి...’ అంటున్నారు పరిశోధకులు. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం దంపతుల్లో ఒకరు తరచూ భాగస్వామి మీద అకారణంగా విరుచుకుపడుతున్నట్లయితే దానికి కారణం రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గడమేనని తెలిసింది. ఈ పరిశోధన కోసం వందకు పైగా జంటలకు 21 రోజులపాటు రోజూ పొద్దున్నా రాత్రీ గ్లూకోజ్‌ స్థాయులు పరీక్షించారు. మామూలు సమయంలో భాగస్వామితో అనుబంధం విషయంలో తృప్తిగా సంతోషంగా ఉన్నవాళ్లు కూడా గ్లూకోజ్‌ స్థాయులు తక్కువగా ఉన్నప్పుడు భాగస్వామి మీద కోపాన్ని ప్రదర్శించారు. కయ్యానికి కాలుదువ్వే ధోరణిలో వ్యవహరిస్తూ గట్టిగా అరవడం ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేశారట. దంపతుల మధ్య వాగ్వాదాలకూ గొడవలకూ ఇదీ ఒక కారణం కావచ్చని గతంలో ఎప్పుడూ భావించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే- గృహహింసకు కూడా ఇదీ ఒక కారణం కావచ్చంటున్నారు ఈ అధ్యయనం తాలూకు నివేదిక రూపొందించిన ప్రొఫెసర్‌ బ్రాడ్‌ బుష్‌మన్‌.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.